తెలుగు సాహిత్యంలో కొన్ని శతాబ్దాలపాటు పద్యప్రక్రియ నిరాఘాటంగా రాజ్యమేలింది. ఎందరో కవులు తమ కవితాకేదారాల్లో సువర్ణాలు పండించారు. కాలంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సాహిత్యంలోకూడా పెనుమార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి.ఆ ప్రభావం మన తెలుగు సాహిత్యంమీద కూడా పడింది.
పద్య ప్రక్రియ తో బాటు గద్య ప్రక్రియ కూడా పోటీ పడింది. సాహిత్యంలో సముచిత స్థాయి పొందింది. క్రమేణా వచన ప్రక్రియలో అత్యంత ఆధునిక మైనదిగా పేర్కొనబడే కథాసాహిత్యం పుట్టుకొచ్చింది. తెలుగులో తొలి కథారచన ఎవరు చేసారు అనే అంశంపై చర్చ పక్కన పెడితే, 1910లో గురజాడ వారు రాసిన “దిద్దుబాటు” కథతో ఆధునిక కథాసాహిత్యం ఒక్కసారిగా పరుగు అందుకుంది.
‘కథ‘, ‘కథానిక‘, ‘చిన్నకథ‘ అని పిలవబడే ఈకథా ప్రక్రియను ఎందరో రచయితలు సుసంపన్నం చేసారు. తమ తమ కథామందారాలతో ఆ శారదా దేవిని అలంకరించి అర్చించారు. ఆ అర్చన జరిపించడంలో ‘ఆంధ్రపత్రిక‘ , ‘భారతి‘ , ‘సాహితి‘ , ‘కృష్ణాపత్రిక‘ వంటి ఎన్నో పత్రికలు ఆరోజుల్లో పౌరోహిత్యం వహించాయి.
అయితే ఒక్కమాట…..అందరం అన్ని కథలూ చదవలేము..కొందరు ఇష్టమైన రచయితల కథలన్నీ చదివే అవకాశం ఉండొచ్చు. అలాగే అనేకమంది రచయితల కథల్లో కొన్ని నచ్చిన కథలుండవచ్చు. ఈమాధ్యమం ద్వారా నాకు నచ్చిన కథలలో కొన్నింటిని తీసుకుని వాటి సారాంశాన్ని (gist) వీలువెంబడి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.