కథన కుతూహలం 52

మా రామచంద్రపురం (తూ: గో: జిల్లా) నుంచి కళా సాహిత్య రంగాలలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. రామచంద్రపురం తాలూకా (అప్పట్లో ఆలమూరు కూడా రామచంద్రపురం తాలుకానే) తెలుగు వారికి గర్వకారణమైన ఎందరో సాహిత్యవేత్తలని అందించింది. అలాగే మహాకథకులు శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి స్వంత ఊరు పొలమూరు కూడా రామచంద్రపురం తాలూకా లోనిదే.

ఇక రామచంద్రపురం పేరు చెప్పగానే సాహిత్య రంగంలో అందరికీ ముందుగా జ్ఞాపకం వచ్చే పేరు శ్రీ ఇంద్రగంటి హనుమమచ్ఛాస్త్రి గారు. ఆయన చాలా ప్రతిభావంతుడైన కవి , కథకుడు, వ్యాసకర్త, అభ్యుదయ వాది. “దక్షారామము” కావ్యకర్తగా శ్రీ హనుమచ్ఛాస్త్రి గారు ప్రసిద్ధ కవుల. సరసన పేరొందేరు.

శ్రీ శాస్త్రిగారు 1911 వ సంవత్సరంలో విశాఖ జిల్లా, మాడుగులలో జన్మించారు. విజయనగరం సంస్కృత కళాశాలలోనూ, ఆ తరవాత కొవ్వూరు గీర్వాణ విద్యాపీఠంలోనూ చదివి, ‘ఉభయభాషా ప్రవీణ‘ పట్టా పొందేరు. 1934 లో రామచంద్రపురం నేషనల్ బోర్డు హైస్కూల్ లో సంస్కృతోపాధ్యాయునిగా చేరేరు. ఒకపక్క ఉద్యోగం చేస్తూ, వేరొకపక్క సాహిత్య రంగంలోనూ, రంగస్థల నాటకరంగంలోనూ విశేషమైన కృషి చేశారు. డాక్టరు. తోలేటి కనక రాజు, జమ్మి నరసింహారావు, దేవులపల్లి పద్మనాభ శాస్త్రి మొదలైన వారితో కలిసి నాటకాలలో నటించారు.

శ్రీ హనుమచ్ఛాస్త్రిగారు పద్య కావ్యాలూ, విమర్శనా వ్యాసాలూ, రేడియో నాటికలూ, గేయాలూ అనేకం రాశారు. వారి “కీర్తి తోరణం” కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్నారు. శ్రీ శాస్త్రిగారు ” గౌతమీ గాథలు” అనే పేరుతో తన గోదావరి జిల్లా జీవితానుభవాలను అద్భుతంగా రాశారు. ఇంకా వారు ‘ విజయ దశమి‘, ‘మౌన సుందరి‘ మొదలైన 28 కథలు రాశారు. ప్రముఖ సాహతీవేత్త శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ- వారి మూడవ కుమారులు. వారు 1945 లో రాసిన “వెలుగు నీడలు” కథ మీకు పరిచయం చేస్తాను.

తనో కవి. రాత్రి చాలాసేపు మేలుకుని ఊర్వశీ పురూరవుల ప్రేమ బంధం వర్ణిస్తూ రాస్తున్న పద్యకావ్యంలో ఓ ప్రణయఘట్టం ముగించాడు. నిద్దర్లో ఇంకా అతను ఆ తలపుల్లో వుండగానే తెల్లవారింది. బద్ధకంగా లేచాడు. ఇంతలో అతని భార్య వచ్చి , “రేషను షాపు తీసే వేళయింది. చప్పున కాఫీ పుచ్చుకుని వెడతారా? పాపం రాత్రి చాలాసేపు మేలుకున్నారు. ఏం చెయ్యను? తెచ్చుకునే రోజు తప్పదు” అంది. ఊహల్లో ఇంద్రసభలో ఉన్న అతను తమ చాలీచాలని అద్దె వాటాలోకి వచ్చిపడి, ఊర్వశికి బదులుగా నిత్య సంసారయాత్రలో నలిగిన పాతగళ్ల చీర కట్టుకున్న ఇల్లాలిని చూశాడు. తలవిదిల్చి గోడకేసి చూసేసరికి ఎదురుగా సిమెంటు కంపెనీ క్యాలెండరు మీద 1945 వ సంవత్సరంలో 18 వ తేదీ కనిపించేసరికి వాస్తవ జగత్తులోకి ప్రవేశించి, సరుకులు తెచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు.

అసలే కరువు రోజులు. తన కావ్యంలోని ఇంద్రుడు కానీ, దేవకాంత కానీ తన ఆకలి తీర్చలేరు. ఇంట్లో బియ్యం లేవని తెలియగానే ఆకలి ఎక్కువైంది కూడాను. మాసిపోయిన కేన్వాస్ సంచీ తీసుకుని కాళ్లీడ్చుకుంటూ బయలుదేరాడు. రోడ్డు ఎక్కేసరికి జమీందారుగారి కొత్త కారు రయ్ మని కళ్ళల్లో దుమ్ముకొట్టుకుంటూ పోయింది. ‘ఒకవైపు బియ్యంకోసం తొక్కిసలాడుకునే దౌర్భాగ్యుల కోలాహలమైతే, ఇంకోవైపున సిల్కు సూట్లలో బలిసిన మనుషులు!’ తనలో తను అనుకున్నాడు. రోడ్డుమీద ఎక్కడ చూసినా జనం!

అప్పుడే రేషను షాపు తెరిచారు. జనం పెద్ద వరుస కట్టారు. చప్పున షాపులోకి చొరబడడానికి వీలులేదు. కొంతసేపు గడిచింది. ఇంతలో లోపలనుంచి ఏదో కలకలం వినపడ్డం మొదలుపెట్టింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. లోపల గుమాస్తా కీచుగొంతుకతో అరుస్తున్నాడు. అయిదు నిమిషాల తర్వాత ఆ కీచుగొంతూ, మరో ఇద్దరు నౌకర్లూ…వాళ్ల చేతుల్లో శక్తి అయిపోయేదాకా బాది, ఓ మనిషిని రోడ్డు మీదకి తెచ్చి విడిచిపెట్టేరు. ఆ మనిషి నెమ్మదిగా ఒంటినంటుకున్న దుమ్ము దులుపుకుని, ఊడిపోయిన చిరుగుల తలపాగాని సవరించుకుని, లేచి నించున్నాడు. పెరిగిన గెడ్డంతో, పీలికలైన చొక్కాతో ఉన్న అతను మూటలు మోసే కూలీ అని మన కవి గుర్తించాడు. వాడు ఏమీ జరగనట్టు , తగిలిన చోట చేతితోనైనా తడుముకోకుండా ముందుకు నడిచి, పక్కనున్న తూము మీద కూచున్నాడు.

కవి షాపులో బియ్యం తీసుకున్నాడు. స్వయంగా పట్టుకుపోగలడు. కానీ అటూ ఇటూ చూశాడు. ” బాబూ! కూలీ కావాలా?” అంటూ వాడు పరిగెత్తుకొచ్చాడు.
” ఎంత?” అన్నాడు కవి.
“బేడ…” అన్నాడు వాడు.
“పావలా ఇస్తాను పట్టుకో…” అని కవి చాలా సహజంగానే అన్నా, తిన్న దెబ్బల కన్నా వాడికి ఆ మాట బాగా సలిపింది కాబోలు….సిగ్గుతో తల దించుకుని, మూట అందుకున్నాడు.
“మంచివాడే దొరికాడు..” అంటూ వెనకనుంచి అక్కడున్న జనం మొదలెట్టారు.
“సగం బియ్యం తోవలో తినేస్తాడు”
“పచ్చి దొంగ వెధవ”
“ఊరికే తన్నేరా గుమాస్తాగారు? ఇంకా కూలి ఎందుకు?”
“ఏం బేడ అడిగితే పావలా ఇచ్చే మహానుభావులు దొరికారుగా..!”
ఇలా రకరకాలుగా వ్యాఖ్యానిస్తోండగా ఇద్దరూ ముందుకు నడిచారు. దూరమై ఇంక వినిపించలేదు.
” నీ పేరెవరమ్మా?” అడిగాడు కవి. ఏమీ తోచక, ఏదో అడగాలని కనక అడిగాడు.
“సన్నాసి అండి” అన్నాడు వాడు.
ఇల్లు చేరుకున్నాకా సన్నాసి చేతిలో పావలా పెట్టేడు కవి. వాడి మొహం ముందు మరింత పాలిపోయి, కాసేపట్లో సంతోషంతో పొంగిపోయింది.
స్వార్థంపొరలు తొలగించి, మనసు తెరిచి చూస్తే– మనుషులు ఎంతో దగ్గరకు వస్తారు కదా! కానీ జనం నమ్మరు. అదే ఈ నాటి నాగరికతలో ఉన్న విశేషం!!

సోమవారంనాడు ఆ ఊళ్ళో సంత. జోరుగా సాగుతోంది. ఇంద్రనీలాల రాసుల్లా ఉన్న నీటివంకాయలు , పచ్చల వంటి బచ్చలికూర, కెంపుల్లాంటి ఉల్లిగడ్డలూ…. సాయంకాలపు నీరెండ తగిలి మిలమిలా మెరిసిపోతున్నాయి. విజయనగర సామ్రాజ్యంలో రాజవీధిలో రత్నాలు రాసులు పోసి అమ్మేవారనే మాట ఇక్కడ సోమవారం సంతగా ప్రత్యక్షమైనట్టు అనిపించింది మన కవికి! ఇంతలో అరటికాయల దుకాణం దగ్గర చెళ్ళుమని చప్పుడైంది. తిరిగి చూశాడు కవి.

చుట్టూ చేరిన నలుగురు ‘పెద్ద మనుషుల’ మధ్య సన్నాసి కనపడ్డాడు. దవడ ఎర్రగా కందిపోయింది. ఒక కాపుపెద్ద ఓ చేత్తో కూరల మూట పట్టుకుని, రెండో చేత్తో సన్నాసిని ఒడిసి పట్టుకుని , “యెదవలు….కూలిపని సేసుకోరాదూ.., దొంగగడ్డి తినకపోతే…! మూట లాగుతున్నాడు… సవట” అంటూ కాలెత్తి తన్నబోయి ఎందుకో మళ్ళీ ఆగిపోయాడు.
“తప్పు కాదుటండీ..! లేకపోతే అడుక్కోవాలి…” ఓ పంగనామాల పెద్దమనిషి నిరుద్యోగ సమస్యకి పరిష్కారం చూపించాడు.
సన్నాసికి కాస్త ఊపిరి తిరిగింది.
“మూట తెమ్మన్నారా బాబూ? అణా డబ్బులిప్పించండి. ఇంటికాడికి తీసుకొస్తాను. అందుకోసమే మూటట్టుకొన్నాను” అన్నాడు సన్నాసి.
” ఛప్! నోర్ముయ్ దొంగ గాడిదె! నాకు నీ కూలెందుకురా? ఇలాటివి పది మూటలు పట్టికెళ్ళగలను. బుద్ధిగా బతుకు. తన్నులు తినేవు..” అని వెళ్ళిపోయాడు ఆ కాపుపెద్ద. జనప్రవాహం మళ్ళీ సంతలోకి ప్రవహిస్తోంది. అలజడి క్రమంగా తగ్గింది. సన్నాసి నెమ్మదిగా ఏదో కాలికింద గుచ్చుకున్నట్టుగా వంగి, ఇందాకటి ఘర్షణలో పెదకాపు రొంటి నుంచి జారగా ఇంతవరకూ తన ఎడమకాలి బొటనవేలితో తొక్కిపెట్టిన వస్తువును పదిలంగా తీసి, బజార్లో నల్లమందుకొట్టు వైపు చరచరా నడిచాడు.

ఆరాత్రి పదిగంటలు దాటింది. చీకటి నల్లగా అలుముకుంది. దానికి తోడు మబ్బుపట్టి , చల్లటి గాలి చెలరేగింది. సంతపాకలు తప్ప ఊరంతా బద్ధకంగా నిద్రపోతోంది. వెచ్చటి అన్నం తిని, ఇనప్పెట్టె లాంటి గదుల్లో , కాశ్మీర శాలువా కప్పుకొని పడుకోగలిగేవారికి ఆ రాత్రి ఎంత వరప్రసాదం! పగలంతా బైరాగి వేషంతో తిరిగే ముసలి జంగం , సంతపాకల దగ్గర ఒక మూల కొంత గడ్డి పోగుచేసి మంట వేసి, గంజాయిపొగ తాగుతూ దగ్గుతున్నాడు. కొంతమందెవరో చవకరకం కల్లుతాగి, బండబూతులు తిట్టుకుని, అలసిపోయి ఆ సంతపాకల నాపరాళ్ళ మీద ఒరిగిపోయారు.

అదే సమయంలో అక్కడికి కొంత దూరంలో చింతచెట్టు కింద బస చేసిన ఎరుకల కుటుంబంలోని నీలాలు అనే ఓ పడుచుపిల్ల చట్టున మెలకువ వచ్చి కూచుంది. అక్కడున్న ముష్టి కుటుంబాలన్నీ ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నాయి. ఆ కారు చీకట్లో తల విరబోసుకున్న దెయ్యంలా కనిపించింది ఆమెకా పెద్ద చింతచెట్టు! ఆమెకు భయమేసింది. తల్లిని లేపుదామనుకుంది కానీ సద్దుకు కూచుంది. ‘ఈ సీకటి రాత్రులు పడుసోళ్ళలకి ఎంత సరదాగా ఉంటాయో కదా’ అనుకుంది. సందేళ తాగిన గంజి.. అంతే..! గంజినీళ్ళ బలం ఎంతసేపు? ఆమెకి ఆకలి మండిపోతోంది. రివ్వున చలిగాలి కొట్టింది. కానీ నీలాలుకి చలిబాధ కన్నా ఆకలిమంట ఎక్కువగా ఉంది.

నీలాలు లేచి నుంచుంది. ఎదురుగా మిఠాయి బడ్డీ కొట్లు కనపడుతున్నాయి. మూసివున్న కొట్టులోంచి మిఠాయి ఎలా వస్తుంది? ఏమో….ఆకలిగా ఉంది మరి! బడ్డీకొట్టు అడుగున ఏ బల్ల అయినా ఒదులుగా ఉండకూడదూ? “అమ్మో..దొరికితే చంపేస్తారు. ఇప్పుడు మాత్రం ఈ ఆకలి తనని బతకనిస్తోందా? అయినా అది మొగోళ్ళ పని”. అలా అనుకోగానే ఆమెకు నవ్వొచ్చింది. ఆనవ్వుకి చుక్కలులేని ఆకాశం సిగ్గు పడింది. నల్లగా నిగనిగలాడే ఆమె ముఖంలో పళ్లు మెరిశాయి.

” ఆకలికి మొగా…. ఆడా తేడా ఉందా?” ఎవడైనా ఒక మొగాడు ఎట్లాగో తంటాలుపడి కొట్టు బద్దలుకొట్టి ‘ఇదిగో మిఠాయి’ అంటే బాగుండును! అనుకుంది. ఇంతలో కొట్టుపక్క ఏదో నీడ కదిలింది. ఆమెకి గుండె జారిపోయినట్టు అయ్యింది. మనస్సు కూడదీసుకుని కొట్టుపక్క నక్కి కూచుంది. రెండు నిమిషాల నిశ్శబ్దం తరవాత కొట్టు వెనక బల్ల ఊడ లాగుతున్నట్టు వినబడి ఆమె ప్రాణం కుదుటబడింది. మెల్లగా మోకాళ్ళ మీద పాకి తల ఎత్తింది. నీడ పారిపోయింది. నీలాలు నాలిక కరుచుకుంది. నోటి దగ్గర కూడు జారిపోయిందని విచారించింది. ఆమె పరీక్షగా చూడగా వెనక ఒక బల్ల సగం ఊడివుంది కానీ ఒక్క మేకు పట్టు మాత్రం గట్టిగా ఉంది.

బలంకొద్దీ బల్లను గుంజింది. కదల్లేదు. ఒక కాలితో అడుగుభాగం తన్నిపెట్టి, చెక్క పెకిలించింది. బల్ల చప్పున ఊడి, నీలాలు తూలి వెనక్కి పడిపోయింది. గబుక్కున ఆ నీడ రెండు చేతులూ చాపి, నీలాలుని పట్టుకుని నించోపెట్టింది. ఆ స్పర్శతో ఒక విశ్వరహస్యం అర్ధమైనట్టు తోచింది ఇద్దరికీ! వెంటనే ఆ నీడ ఉత్సాహంగా కదిలింది.

నెమ్మదిగా లోపలికి దూరి చీకట్లో వెతికి, ఒక మిఠాయి జంగిడి పట్టుకుంది. నీలాలు సాయం చేసి ఇవతలికి లాగింది. నీలాలుకి జంగిడితో కలిపి తినెయ్యాలన్నంత ఆకలిగా ఉంది.
” కూకో తినేసి పోదాం…మళ్లా మోతెందుకు?” అంది నీలాలు.
“సాల్లే…ఎవరన్నా సూత్తే పక్కలిరుగుతాయి , ఈ రోజు వొరసే అలా ఉంది” అంది ఆ నీడ.
“మొగ సన్నాసికి ఇంత పిరికైతే …ఇక ఆడోళ్ళ మాటేటి?” అంది నీలాలు
“ఆసి…! నీవంటే.. నీలీ!” అంది నీడ.
” కనిపెట్టేశావ్ కదరా సన్నాసీ!” అంది నీలాలు.
“నువ్వూ పోల్చేశావ్” అన్నాడు సన్నాసి.
“నడూ… నాన్చక….” అని అటూ ఇటూ చూసి జంగిడీ సన్నాసి చేతిలో పెట్టింది.
” తూరుపేపు పాకకాడ ఎవరూ లేరు…అక్కడికి పోదాం” అని సన్నాసి అటు తిరిగాడు. పక్క దుకాణం బడ్డీమీద మనిషెవరో కదిలినట్టయింది.అక్కడున్న కుక్క బొంయిమంది. సన్నాసి చెంగున మురుక్కాలవ దాటి పరిగెట్టబోయాడు. గభాల్న కాలుజారి, మిఠాయి- కాలవలో పడిపోయింది. ఇద్దరూ పరుగెత్తి తూరుపువైపు సంతపాకల దగ్గరకి రొప్పుకుంటూ చేరారు. మెల్లగా సన్నాసి అరుగెక్కి నిరాశగా ఒకమూల కూర్చున్నాడు. నీలాలు వెళ్ళి అతని దగ్గరగా కూచుంది. ఏం మాట్లాడాలో ఇద్దరికీ తెలియలేదు. సన్నాసి నీరసంగా తలకి కట్టిన గుడ్డ నేలమీద పరిచి ఒరుగుతూ , “ఒట్టి అలుపు మిగిలింది” అన్నాడు. ” నీ కరమ..” అంటూ , అద్వైతసారం ఒంటబట్టిన వేదాంతిలా నవ్వి, అతని భుజంమీద కొట్టింది నీలాలు.

ఆ కటిక చీకట్లో మెరిసిన నీలాలు కళ్ళను చూస్తూ , ” ఈ యేల కింతే పెట్టిపుట్టాం..” అన్నాడు సన్నాసి.
కానీ నీలాలుకి కడుపు మండుతోంది. ” మిఠాయి పోయి ఎర్రి యేదాంతం మిగిలిందిరా మనకి..” అంటూ తను ముందుగానే దాచిన ఒక్క మిఠాయి ఉండని రెండు ముక్కలు చేసి , ఒకటి సన్నాసి చేతిలోపెట్టి, తనొకటి తిని కూచుంది.

ఇంతలో చిటపటా చినుకులు ప్రారంభమయ్యేయి. పైన రేకు గట్టిగా చప్పుడు చేస్తోంది. చలిగాలి రివ్వున కొట్టింది. వర్షం ముదిరిపోతోంది. నీలాలు ఒణుకుతోంది. సన్నాసి మూలిగి, జల్లు కొట్టనివెంపుకి జరిగి బద్ధకంగా కళ్ళు మూసుకున్నాడు. నీలాలు అతని దగ్గరగా జరిగింది. తన ఒంటిమీద గాయాలను ఒక్కటొక్కటిగా మృదువుగా తాకే ఆమె రెండుచేతులనూ తీసి, సన్నాసి మెత్తగా తన కళ్ళకి అద్దుకున్నాడు. బుద్ధి ఎరిగిన నాటినుంచీ ఈసడింపులూ , అవమానాలూ మాత్రమే చూసిన వాడి గాజుకళ్లు తలవని తలంపుగా చెమ్మగిల్లాయి. ఇంకా వాన కురుస్తూనే ఉంది. అయితే…మళ్ళీ తెల్లారిపోతుందని ఆ చల్లటి చీకటిరాత్రి దయతో వాళ్ళకి జ్ఞాపకం చెయ్యడం మానేసింది!!!

                                        ********

ఈ కథని శ్రీ హనుమచ్ఛాస్త్రి గారు 1945 లో రాశారు. ఆ కాలంలో రెండవ ప్రపంచయుద్ధం యొక్క ప్రభావం….దానివల్ల వచ్చిపడ్డ దుష్ఫలితాలు , ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రపంచంలోని అన్ని దేశాల మీదా పడింది. ప్రజలు అనేక ఇక్కట్లు పడ్డారు. నిత్యావసర వస్తువులకి తీవ్రమైన కొరత ఏర్పడిపోయింది. తిండి కోసం దొంగతనాలు, దోపిడీలు జరిగేవి.

సమాజంలో భాగమైన కవులూ, రచయితలూ, కళాకారులూ ఈ సమస్యలకి స్పందించి వాటిని ఎత్తిచూపుతూ , ప్రజలలో అవగాహన కలిగిస్తూ , వాటి పరిష్కారం కోసం తమతమ మార్గాలలో, ఎంతో కృషి చేశారు. చార్లీ చాప్లిన్ వంటివారు సినిమాలు తీశారు. ఎందరో రచయితలు కథలూ, నాటకాలూ రాశారు.

శ్రీ శాస్త్రిగారు సంప్రదాయ పద్ధతిలో సంస్కృతం చదువుకున్న పండితులైనా, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. ఆ రోజుల్లో కొత్తగా స్థాపించబడిన ‘అభ్యుదయ రచయితల సంఘం’, ‘నవ్య సాహిత్య పరషత్తు’ ల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆ నేపథ్యంలో వారు రాసిన కథ ఈ ” వెలుగు నీడలు”.

ఉత్తమపురుష (First Person ) లో రాసిన ఈ కథలో , కవి పాత్రని సమాజం పట్ల బాధ్యత కలిగినవానిగా సృష్టించారు. కలలోంచి బయటికొచ్చిన అతను సమాజంలోని బడుగుజీవుల బతుకులను చూసి స్పందించాడు. తనకి కూలీ అవసరం లేకపోయినా సన్నాసికి పావలా డబ్బులిచ్చి ఆదుకున్నాడు. సన్నాసికి ఏరోజుకారోజు అణా డబ్బులు సంపాదిస్తే కానీ తిండి దొరకదు. కానీ రోజూ పనీ దొరకదు. అందుచేత చిన్నచిన్న దొంగతనాలు కూడా ప్రారంభించాడు. ఆ ప్రయత్నంలో అతను దెబ్బలు తిన్నాడు.., అవమానాల పాలయ్యేడు. అయితే , దొంగతనం అతని వృత్తి కాదు.

అలాగే అర్థరాత్రి ఆకలితో అలమటించే నీలాలు– అందరూ పడుకున్నాకా, మిఠాయి కొట్లో దొంగతనానికి పూనుకుంది. అక్కడ కలిసిన సన్నాసి ఆమెకు సహాయం చేశాడు. మిఠాయి నోటికి అందకపోయినా, అతని చీకటి బతుకులో వెలుగులా నీలాలు దొరికింది.

ఊర్వశీ పురూరవుల ప్రణయంతో కథని ప్రారంభించిన శాస్త్రిగారు…. నీలాలు, సన్నాసిల కలయికతో ముగించారు. మా రామచంద్రపురానికి గర్వకారణమైన శ్రీ హనుమచ్ఛాస్త్రి గారి కథని పరిచయం చెయ్యడం ఆనందంగా ఉంది.

–సి. యస్ .

7 Comments Add yours

 1. సి.యస్ says:

  పాటను పాఠకుల కోసం పంపిన కృష్ణకి కృతజ్ఞతలు.

  Like

 2. సి.యస్ says:

  “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ!
  వ్యష్టిజీవము చేదుపానీయమోయీ!
  కలువరాణిని విడిచి ౘలువరేడే లేడు
  సోలు పూలను విడడు గాలిరాజేరోజు ॥సృష్టిలో॥

  వెలుగు నీలపుమేడ విడిచి రానేరారు
  మెరపుమబ్బుల ౙంట చిరకాలమునకేని ॥సృష్టిలో॥

  అల దూరతీరాల ఆకాశమే వంగి
  పెదవి కలిపినచోట పృథివి పులకించినది ॥సృష్టిలో॥

  రచన:— శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి|
  సంగీతం/కూర్పు:— శ్రీ పెండ్యాల నాగేశ్వరరావు|
  గానం:— శ్రీమతి రావు బాలసరస్వతీదేవి|

  1948—1949లో HMV వారి పాటలపోటీలో
  స్వర్ణపతకం సాధించిన ఉత్తమ భావగీతం||

  Like

 3. V.V.Krishna Rao says:

  ఇంద్రగంటి వరుల ఇంద్రనీలమువంటి,
  కథను యెంచి మాకు కమ్మనైన
  పరిచయమున కథల పాల అబ్ధి చిలికి
  పంచిపెట్టినావు భవ్యసుధలు.

  Like

 4. V.V.Krishna Rao says:

  “కథన కుతూహలం” 52 వారాలు పూర్తిచేసుకుంటోంది. అంటే వారాల లెక్కలో సంవత్సరం అవ్వబోతోందన్నమాట!

  ఈ శుభతరుణంలో మా రామచంద్రపురం జాతీయోన్నత పాఠశాల సంస్కృతోపాధ్యాయులు
  శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ఆచార్యవర్యుల
  కథానిక, “వెలుగు-నీడలు” సి.యస్ ., కథాపరిచయానికి ఎంచుకోవడం నాకు చెప్పలేనంత
  సంతోషం కలిగించిన అంశం.

  రామచంద్రపురంలో ఉన్నప్పుడు మా కుటుంబాలలో
  రెండుతరాల విద్యార్థులకి వారు ఆచార్యకం నిర్వహించేరు. మా మేనమామగారు, డా.B.S.R.రావు
  గారు, మా అన్నయ్య దివంగత శ్రీ ఎ.వి.సుబ్బారావు
  గారు, నేను మా మేష్టారి ప్రత్యేక శిష్యవాత్సల్యానికి
  పాత్రులుకావడం శ్రీశారదామాత అనుగ్రహం తప్ప
  తదితరమేమీ కాదు.

  వారు కావలి-జవహర్ భారతికి వెళ్ళేముందు, మూడు
  దశాబ్దాలు రామచంద్రపురంలోనేవున్నారు. స్వంత
  ఇల్లు కట్టుకుని అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.

  ఉద్యోగరీత్యా కావలి వెళ్ళినా వేసవి సెలవులకి ప్రతి సంవత్సరమూ రామచంద్రపురం వచ్చేవారు. నేను అక్కడ బి.కాం. చదువుకునేరోజులవి. అప్పుడు కనీసం నెలరోజులైనా వారితో నేను గడిపేవాడిని.
  నాతో C.S., మా చెల్లెళ్ళు, ఎవరో ఒకరు వచ్చేవారు.
  మేష్టారి ఆత్మీయ వాత్సల్యం, అమ్మగారి అభిమానం
  నేను ఎప్పటికీ మరవలేను. సాయంకాలాలు పకోడీల
  వంటి వేడి-వేడి అల్పాహారం, ౘక్కని తేనీరు
  అయ్యవారు-అమ్మగారు ఆప్యాయంగా అందించే ప్రసాదంగా నేను తీసుకునేవాడిని.

  సాయంత్రం ముచ్చుమిల్లి కాలవ ఒడ్డుకో, పెద్దకాలవ
  ఒడ్డుకో వెళ్ళేవాళ్ళం. మేష్టారు గొప్ప సంభాషణాచతురులు. గిరీశంమాట నాకు తెలియదు
  కాని మా మేష్టారితో మాట్లాడడంమాత్రం ఎడ్యుకేషనే!
  వారి సరస సంభాషణా చాతుర్యం తెలియజేసే
  ఒకటి-రెండు ముచ్చట్లు మీతో పంచుకుంటాను.
  ఒకసారి మా మిత్రుడొకడుకూడా వచ్చి సంభాషణలో
  పాలుపంచుకున్నాడు. నేను స్వాభావికంగా
  వినేలక్షణంమాత్రమే కలవాడిని. సంభాషించడం
  ౘాలా అరుదు. కాని మా మిత్రుడు అలాగకాదు.
  మేష్టారితో సమానంగా మాట్లాడడమేకాక సౌమ్యమైన వాదోపవాదాలు చేసేవాడు. ఒకసారి ప్రస్తావవశంగా ఒక గ్రంథరచయితగురించి అతడు “ఆయన గొప్ప కవి” అన్నాడు. వెంటనే మేష్టారు “అలాగ ఎలా చెప్పగలవు?” అన్నారు. “ఆయన రామాయణం అవి
  పద్యాలలో రాసేరండి” అన్నాడు మిత్రుడు. మేష్టారు
  నవ్వుతూ, “ఔను! రామాయణం రాసేడు, భారతం
  రాసేడు. భాగవతం రాసేడు. రాయించుకున్నవాడికి
  ఆముదం రాసేడు. పద్యాలలో వ్రాసినంతమాత్రాన
  కవిత్వంకాదు. మన నిఘంటువులు, గణితశాస్త్రం,
  జ్యౌతిషం మొదలైనవన్నీ శ్లోక-పద్యరూపాలలోనే
  ఉన్నాయి. అయినంత మాత్రాన వారందరూ కవులూ
  కారు, అవన్నీ కావ్యాలూ కావు. నీవు చెప్పినాయన
  పద్యకారుడు – versifier, అంతేకాని కవికాడు”
  అన్నారు.

  “తరగతి గది అంటే నలభై-ఏభై తలలు కలిగిన
  ఒక వెర్రి జంతువు” అంటూ మా క్లాస్ లో ఒకసారి
  ఒక నిర్వచనం చెప్పేరు. అలాగ అంటూనే, మరొకసారి
  నాతో వ్యక్తిగతంగా “ఆ అమాయకపు అల్లరి పిల్లల
  మొహాలు చూడకుండా ఎక్కువకాలం ఉండలేనయ్యా!
  కృష్ణా!” అంటూ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యేరు.

  ఒకసారి వారి “దక్షారామం” కావ్య సమ్మానసభకి
  వేంకటపార్వతీశ్వరకవులు అధ్యక్షత వహించేరట.
  సమ్మానం తరవాత కావ్యంలోని ఒక ఘట్టం మేష్టారు
  మైకులో సభకి ౘదివి వినిపిస్తున్నారట! అది వ్యాసులవారు కాశీని విడిచి వెళ్ళవలసిన సందర్భం.
  ఆ సమయంలో, కావ్యంలో, వ్యాసులవారు చెప్పిన
  పద్యం యిది:—

  “ఉన్న గంటమ్మునకు చేవ ఉడుగలేదు,
  ఈ శిరస్సున ధిషణ ఇర్రింకలేదు,
  అంజలి ఘటింప అతడు ఫాలాక్షుడేని,
  తెగువ నన్నక్రమమ్ముగా ధిక్కరింప!”

  ఈ పద్యం వినగానే ఓలేటి పార్వతీశంగారు తమ
  ఆసనంనుంచి లేచి వచ్చి గభాలున ఒక్కసారి
  మా మేష్టారిని కౌగలించుకుని
  “కవిగాడికి ఈ మాత్రం ఆత్మాభిమానం ఉండాలోయ్ ,
  శాస్త్రీ! అద్భుతమైన పద్యం చెప్పేవు” అన్నారట!

  మా అయ్యగారికి+అమ్మగారికి దండవత్ ప్రణామాలు!
  మన C.S.కి బిగ్ హగ్ !

  Like

 5. జయంతి సత్యనారాయణ శాస్త్రి says:

  ‘సృష్టిలో తీయనిది స్నేహమేనోయి’ – ఈ quotation చాలా మంది సందర్భోచితంగా వాడుతూ ఉంటారు, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి ఒక గేయంలోని మొదటి పాదం అదని తెలియకుండానే. అంతటి గొప్ప సాహితీవేత్త కలంనుండి వెలువడిన ‘వెలుగునీడలు’ కథ సీయస్ గారి కథనంతో అద్భుతంగా ఆవిష్కరించబడింది. ఇప్పటికి 52 వారాలు (సంవత్సరం పాటు) నిరంతరాయంగా ఈ కథాయజ్ఞాన్ని నిర్వహిస్తున్న సీయస్ గారికి అభినందనలు.

  Like

 6. DL SASTRY says:

  స్వార్థంపొరలు తొలగించి, మనసు తెరిచి చూస్తే– మనుషులు ఎంతో దగ్గరకు వస్తారు …A very good story..thanks to CS

  Like

 7. ఆకొండి సూర్యనారాయణ మూర్తి says:

  ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారి పద్యాలు పాఠ్యఅంశంగా ఉన్నబంగారు కాలం వెళ్ళిపోయింది. ఆ సాహితిరథంలోని కథని వాళ్ల రామచంద్రపురం నుంచి మనహృదయవీధులలో విహరింపచేశారు మా సి.ఎస్. ముఖ్యమైన పాత్రలు 2లేక3 కంటే ఉండకుండా కథను చెప్పి,హృదయాన్ని,కళ్ళను ఆర్ద్రత నింపడమే ఉత్తమ కథకుని నైపుణ్యం. అది పుష్కలంగా ఉన్న కవి,రచయిత ఇంద్రగంటివారు. నేను75లో ఉద్యోగంలో చేరిన కొత్తలో వారి గురించి సాటి తెలుగు పండితులు సదా మెచ్చుకునేవారు. అవి నా చెవులలో పన్నీరు చిలికి వారి గౌతమి గాధలు చదివి అమృతసేవనం చేసుకున్నాను. ఇపుడు ఆ పండితులు లేరు.తెలుగు చెప్పాలని పోస్ట్ నింపుకున్న తెలుగు స్కూలసిస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. వారందరు తెలుగు చదువుకొంటే బాగుంటుంది. ప్రాచీన సంప్రదాయాలు తెలుగు పండితులవి అనుకునే రోజుల్లో వెలుగునీడలు కధ అభ్యుదయమే. అచ్చ మైన సాహితిపరునికి ఇజంతో పనిలేదు.నిజంతో తప్ప.అదే ఈ కథ. సన్నాసి,నీలి ముగింపు అమలిన శృంగారం.దేవ వేశ్య ఊర్వశి, చక్రవర్తి పురూరావుడు శృంగారం కంటే ఉన్నతం,ఔన్నత్యం. ఆనాటి దారిద్ర్యము కన్నులముందు కనపడింది. కడుపు నింపే దొంగతనం దొంగతనం కాదు. దొరతనం. అందుకే చౌర్యం 64కళల లో ఒకటి. మీ ఊరి మహా రచయిత కధను ప్రేమతో ఆత్మీయంగా అందించిన సి.ఎస్. గారు అభినందనలు

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s