కథన కుతూహలం 53

క్రిందటి వారం రామచంద్రపురానికి చెందిన శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి కథ పరిచయం చేసుకున్నాం. ఈ వారం ఆ పక్కనే ఉన్న ద్రాక్షారామకి చెందిన డాక్టరు. దవులూరి శ్రీకృష్ణ మోహనరావుగారి కథ పరిచయం చేస్తాను.

శ్రీకృష్ణ మోహనరావు గారిని గురించిన వివరాలు ఎక్కువగా తెలియడం లేదు గానీ, గోదావరి జిల్లా యాసలో మంచి కథలు రాసినవారిలో ఈయన ఒకరు. ఈయన 1939 వ సంవత్సరంలో ద్రాక్షారామంలో పుట్టారు. పెరిగినది కూడా అక్కడే. వారు వైద్య విద్యనభ్యసించారు. డాక్టరుగా హైదరాబాదులో ప్రాక్టీసు చేశారు.

కోనసీమ కథలు’ , ‘తూగోజి కథలు’ , ‘ ద్రాక్షారం కథలు’ అనే కథలు కాకుండా , ‘ బ్రహ్మదేవుడూ మగాడే‘ అనే కథల సంపుటి వీరు వెలువరించారు. ఈయన కథల్లోని వర్ణనలు, సంభాషణలు చాలా సూటిగా, నిర్మొహమాటంగా ఉంటాయి. అచ్చమైన తూర్పుగోదావరి జిల్లా యాసలో వారు రాసిన “లేడిగాడు” అనే కథ ఇప్పుడు చూద్దాం.

పాతకాలంలో పుట్టిన పిల్లలు రోజుల్లోనే వరసగా పోతూవుంటే , ఆ తరువాత పుట్టినవాడికి ‘ అబద్ధం’ అనో, పెంటమీద పారేసి తిరిగి తెచ్చుకుని, ‘పెంటయ్య’ అనో పేర్లు పెట్టుకునేవారు. ఇదిగో ఈ కథానాయకుడు “లేడు” అలాంటి వాడే! వాళ్ళింటి పేరు ‘కర్రి’. వాడికంటే ముందు పుట్టినోళ్ళందరినీ యములాళ్లు తీసుకుపోయారని , వాళ్ళమ్మ — పుట్టినోడు ఇక్కడ ‘లేడు’ అనుకుని యములాళ్లు పోతారని వాడికా పేరు పెట్టింది. ద్రాక్షారం ఆకులోరి వీధిలో ఉంటాది వాళ్లిల్లు. కానీ వాడికి అయిదేళ్ళున్నప్పుడు కోటిపల్లి శివరాత్రి స్నానాలకెడితే , ‘ఆడికా పేరెట్టి మమ్మల్ని బురిడీ కొట్టిత్తారా’ అని యములాళ్లు వాడినొదిలేసి, వాళ్ళమ్మనీ నాన్ననీ గోదాట్లో ముంచేసి తీసుకుపోయారు.

లేడుగాడి వెనకాల ఎనిమిదెకరాల మాగాణి, గుడి ఎదుట పెద్ద కొట్టు ఉండటం వల్ల చుట్టాల్లో వాడ్నెవరు పెంచుకోవాలో తేల్చుకోలేక అందరూ కలిసి పెంచేరు. అందరూ వాడ్ని ‘లేడిగా’ అనిపిలిచేవారు. మొదట్లో వింతగా అనిపించినా , అందరికీ ఆ పేరు అలవాటైపోయింది. లేడిగాడికి ముగ్గురు పినతల్లులు , ముగ్గురు మేనత్తలూ ఉన్నారు. వాడింట్లో ఒకరితర్వాతొకరు రెండేసి నెలలు మకాం వేసి వాడి బాగోగులు చూసేటట్టు , వాడి ఆస్తి మీదొచ్చేది సమానంగా పంచుకొనేట్టు ఒప్పందానికొచ్చేరు. లేడి తండ్రి ఆ రోజుల్లో ఎవర్నో పట్టుకుని ఏదో కంపెనీకి హోల్ సేల్ హక్కులు సంపాదించి, గుడి దగ్గరున్న కొట్లో కొన్నాళ్ళు నడిపి , తనవల్ల కాదని ఆ కొట్టు ‘వెచ్చా’ వారైన కోమట్లకి అద్దెకిచ్చాడు. నెలనెలా అద్దె కాకుండా, ఆ కంపెనీ సరుకుల లాభాల్లో పదోవంతు లాభాలు ఇచ్చేట్టు వెచ్చావారు ఎగ్రిమెంటు రాసిచ్చారు. తండ్రి పోయాకా వెచ్చావారు లేడిగాడి బంధువులకు ఆ డబ్బివ్వకుండా నెలనెలా అద్దె, సంవత్సరాంతంలో లాభాలూ ‘లేడు’ పేర బ్యాంకులో కట్టేయడం మొదలెట్టారు.

లేడిగాడు పదో తరగతి వరకూ చదివాడు. వాడ్ని లేడిగాడని పిలుస్తుంటే లేడిలా పరిగెట్టాలనుకొని అన్నిపనులూ తొందర తొందరగా చేసేసేవాడు. వాడికి పద్దెనిమిదేళ్లు వచ్చాకా మేనత్తలు మా పిల్లని చేసుకో అంటే మా పిల్లని చేసుకో అంటూంటే, ఆ పీడ పడలేక స్నేహితుడు మాచర్రావు ద్వారా వెంకటాయపాలెం తోటవారి అమ్మాయిని చేసుకున్నాడు. వాడికి తన చుట్టాల చూపంతా తన ఆస్తి మీదే ఉందని తెలుసు. పెళ్లి అయ్యాకా చుట్టాలందరినీ తరిమేశాడు. వాడు ఓ పని అనుకుంటే చేసేయడమే కానీ వెనక్కి చూసే ప్రశ్నే లేదు. మాట తొందర– మనసు మాణిక్యం!

లేడి ఎక్కడుంటే అక్కడ మహా సందడి పుట్టించేవాడు. కలకత్తాలో కొన్నాళ్ళు ఉండొచ్చిన ఒక సేట్ తో స్నేహం చేసి, బెంగాలీ పంచెకట్టు నేర్చుకున్నాడు. నోట్లో సిగరెట్టు, బెంగాలీ పంచెకట్టు-లాల్చీతో ద్రాక్షారం సెంటర్లో లేడిగాడు తిరుగుతుంటే , ఫేమిలీ లేడీస్ కూడా వెనక్కి తిరిగి వాడ్ని చూసేవారు. పెళ్లయిన అయిదేళ్లలో ఇద్దరు కూతుర్లని కని, పెద్ద కూతురికి పదిహేడు వచ్చేసరికి లేడిగాడి పెళ్ళాం పిచ్చికుక్క కరిచి చచ్చిపోయింది. ఆమె సంవత్సరీకం వెళ్లే లోపలే ఒకే పందిరిలో ఇద్దరు కూతుళ్లూ– వీరమ్మ , సత్తెమ్మలకు పెళ్ళిళ్ళు చేసేసేడు. వీరమ్మను తోటపేట , సత్తెమ్మను వెలంపాలెం ఇచ్చాడు. ఇద్దరికీ రెండేసి ఎకరాలు రాసేసి, చెరో పదివేలు బేంక్ లో వేశాడు. భార్య నగలు చెరో ఇరవై కాసులు ఇచ్చేసేడు. అంతే కాదు…, వాళ్ళని కాపురాలకి పంపించే ముందు , ఆడదిక్కులేని ఇల్లు కనక తరచూ రావద్దని , చూడాలనిపిస్తే తనే వస్తానని పరోక్షంగా చెప్పేసేడు.

వాళ్ళు తమతో వచ్చి ఉండమని బలవంతం చేసినా , అదంతా తన డబ్బుమీద ప్రేమ తప్ప తనమీద కాదని అభిప్రాయంతో అతను వెళ్ళడానికి ఇష్టపడలేదు. వెచ్చా వారు బేంక్ లో వేసిన డబ్బు తీసి ఫిక్సెడ్ డిపాజిట్ చేశాడు. నెలనెలా అద్దె వస్తుంది. ఏడాదికి పది శాతం ఎలాగూ వస్తుంది. దాంతో లేడిగాడి పని దర్జాగా నడిచిపోతోంది.

లేడిగాడు రెండు పూటలకీ ప్రొద్దుటే వండేసుకుని, పదిగంటలకి ద్రాక్షారం వస్తాడు. రాగానే ముందు భీమేశ్వరుని దర్శించుకుంటాడు. పేరుపేరునా పంతుళ్ళని పలకరిస్తాడు. అక్కడినుంచీ సెంటరుకి వస్తాడు. లేడిగాడు రాగానే సెంటర్లో సందడి పెరిగిపోతుంది. వచ్చిందొక్కడే అయినా పాతికమంది వచ్చినట్టుంటుంది. బ్రాకెట్ ఆడేవాళ్ళతో ఓపినింగు, క్లోజింగు నెంబర్ల గురించి ఆరా తీస్తాడు. రాజకీయాలు ఆసక్తి ఉన్నవాళ్ళతో వాటి విషయం చర్చిస్తాడు. ఇక సినిమాల విషయానికొస్తే సాంఘికాలలో నాగేశ్వరరావు, పౌరాణికాలలో రామారావు అంటే అభిమానం. వాళ్ళమీద ఈగ వాలనివ్వడు. మధ్యాహ్నం దునే నారాయణగారి షోడాకొట్టు దగ్గర ఒక ఆర్టోస్ డ్రింకు కొని ఆనందంగా తాగుతాడు. చవక కదా అని డక్కన్ సిగరెట్లు కాలుస్తాడు.

మాఘమాసం , కార్తీకమాసాల్లో గుడి చాలా హడావుడిగా ఉంటుంది. అందువల్ల మధ్యాహ్నం రెండు గంటలవరకూ లేడిగాడు గుడిలోనే ఉండేవాడు. అందర్నీ క్యూలలో నిలబెట్టడం, భక్తుల అవసరాలేమన్నా ఉంటే సహాయం చేయడం అతని డ్యూటీ. మధ్యాహ్నం రెండు దాటగానే తన స్వంత బిజినెస్ ప్రారంభించేవాడు. అతనిది రోజువారీ వడ్డీ వ్యాపారం. అంటే వంద రూపాయలు కావాలంటే తొంభై రూపాయలిస్తాడు.

రోజుకి పదేసి చొప్పున పది రోజులు కట్టాలి. మొత్తం బజారంతా అతని బిజినెస్ ఏరియానే. ఇబ్బందుల వలన బడ్డీకొట్టు వాళ్లూ, జంగిడీ షావుకార్లూ, షోడాబళ్ళ వాళ్లూ సరిగ్గా కట్టకపోయినా పెద్ద ఇబ్బంది పెట్టేవాడు కాదు. అందరూ కొంచెం ముందో వెనకో కట్టేవారు. అసలు కట్టలేకపోయినా రాద్ధాంతం చేసేవాడు కాదు. ఉదారంగా చూసీ చూడనట్టు వదిలేసే వాడు. అసలు ఇలాంటి చిల్లర వ్యాపారం చెయ్యవలసిన అవసరం లేడిగాడికి లేదు. అయితే.., సెంటర్లో ప్రతి ఒక్కరినీ పలకరించటానికీ , వాళ్ల బాగోగులు కనుక్కోడానికీ , అవసరమైతే వాళ్ళకి సహాయం చెయ్యటానికి ఈ వ్యాపారం ఎన్నుకున్నాడు. ఎవర్నీ పేరు పెట్టి పిలిచేవాడు కాదు. బావా , అన్నయ్యా, తమ్ముడూ, మావయ్యా, చెల్లెమ్మా అంటూ వరసలు కలిపి మాట్టాడేవాడు.

సాయంత్రం అయిదింటికి బిజినెస్ అయిపోయేది. వెంటనే లేడిగాడు హైస్కూలు గ్రౌండ్ లో ప్రత్యక్షమైపోయేవాడు. అక్కడ పిల్లలు రకరకాల ఆటలు ఆడేవారు. వయసులో పెద్దోడైనా , కుర్రోళ్ళల్లో కుర్రోడైపోయి వాళ్ళతో ఆటలాడేవాడు. వాళ్ళు కూడా లేడితో చాలా సరదాగా గడిపేవారు. చీకటిపడేవరకూ పిల్లల్తో కాలక్షేపం చేసి, వచ్చేసే ముందు వాళ్ళకి శనగలు, బిస్కత్తులు కొనిపెట్టి వాళ్ళు ఆనందంగా తింటోంటే సంతోషించేవాడు.

పిల్లలందరూ వెళ్లిపోయిన తర్వాత కాళ్లీడ్చుకుంటూ రత్తమ్మ కంపెనీకి వచ్చి, దాని చెల్లెలు సీతాలు చేత కాళ్లు పట్టించుకుని , ఓ పది రూపాయలిచ్చి సెంటరు కొచ్చేసేవాడు. అసలు ఈ సీతాలు ఎలా వచ్చిందంటే…. లేడిగాడి పక్కింట్లో ఉండే సుందరమ్మ మొగుడు గల్ఫ్ వెళ్ళిపోయాడు. వెళ్ళాడన్న మాటేగాని రూపాయి పంపే స్థితి కూడా లేదు. అందుకు సుందరమ్మ …. లేడిగాడేమైనా సద్దగలడేమో అని వాడిని ముగ్గులోకి దింపే ప్రయత్నం మొదలెట్టింది. లేడిగాడు బెసగ లేదు. ” మొగోడివి వంటేం చేసుకుంటావు…నే చేసిపెడతా” అంది. వీడు దానికీ ఒప్పుకోలేదు. దాంతో సుందరమ్మ- “లేడిగాడు ఆడంగోడు..ఆ కూతుళ్ళు ఆడిపిల్లలు కాదూ” అని పుకారు లేవదీసింది. అసలే లేడిగాడిది సొంత వంట, అంతేకాక లేడి అంటే ఇంగ్లీషులో ఆడదని అర్థం ఉంది. దాంతో ఆ పుకారు కొంత పాకిపోయింది. అప్పుడు లేడిగాడు తన స్నేహితుడు మాచర్రావుతో చెప్పి బాధ పడ్డాడు.
అతను “పెళ్లి చేసుకో” అని సలహా ఇచ్చాడు.

“ఈ వయసులో నాకు పెళ్లేటి?” అన్నాడు లేడి.
మాచర్రావు ఆలోచించి, సీతాలుని మైంటైన్ చెయ్యమని సలహా ఇచ్చాడు.
“ఛీ.. ఛీ అన్నాడు లేడి. ” నీకు డబ్బుంది. రోజుకో పది రూపాయలు దానికి పడెయ్యడం నీకో లెక్క కాదు. అదీ ముసల్దైపోయింది. సెంటర్లో అందరూ నువ్వూ ఒకదాన్ని మైంటైన్ చేస్తున్నావనుకుంటారు , సాలుగదా” అని లేడిని ఒప్పించాడు మాచర్రావు.
లేడిగాడు సీతాలుని ఎప్పుడూ తాకలేదు. కాసేపు కబుర్లు చెప్పి, బిజినెస్ తోనూ, పిల్లలతో ఆటల్లోనూ అలసిపోయిన కాళ్ళను పట్టించుకుని పది రూపాయలిచ్చేసి వచ్చేసేవాడు.

ఊరికి దగ్గర్లోనే తన కూతుళ్ళున్నా, వాళ్ళ దగ్గరకు అంతగా వెళ్ళేవాడు కాదు. పెద్దకూతురు వీరమ్మకి పిల్లలు లేరు. అందువల్ల అసలు వెళ్ళేవాడు కాదు. పైగా ఎంతసేపూ “ఆ ఎప్పుడో ఇచ్చేది ఇప్పుడే ఇచ్చేయి…వడ్డీ యాపారం చేసుకుంటాను” అని సతాయించేది. చిన్న కూతురు సత్తెమ్మ మొగుడు ఓ పనికిరాని పోరంబోకు…కనుక పిల్లలకి బట్టలూ అవీ కొనేవాడు. ఊళ్ళో లేడిగాడు లేకుండా ఏ శుభకార్యమూ అయ్యేదికాదు. గుడిలో జరిగే పెళ్ళిళ్ళన్నిటికీ పెద్ద- లేడిగాడు. పై గ్రామాలనుంచి వచ్చినవాళ్ళు ఇబ్బంది పడకుండా అన్ని విధాలా సహాయం చేసేవాడు.

ఓరోజు రాత్రి పదిగంటలకి అన్ని పనులూ ముగించుకొచ్చి బోసు సెంటర్లో కొప్పిసెట్టి స్వామినాయుడు షాపు దగ్గర కూర్చున్నాడు. మాచర్రావు కూడా అక్కడికి వచ్చాడు. సప్త గోదారి మీదనుంచి వచ్చిన గాలిని రావిచెట్లు చల్లగా విసురుతున్నాయి. ‘ భీమేశ్వర’ టాకీసులోనుంచి ఏదో పాట వినిపిస్తోంది. అందులో ‘ముత్యాలముగ్గు’ సినిమా ఆడుతోంది.
“సినిమా కెడదారేట్రా..” అన్నాడు మాచర్రావు.

” హీరో ఎవరు?” అనడిగాడు లేడిగాడు.
“శ్రీధర్ అనే వోడులే..” అన్నాడు మాచర్రావు.
” నేను ఎన్టీఆర్ , ఏఎన్ ఆర్ సినిమాలు తప్ప వేరేయి చూడను కదా!” అన్నాడు లేడి.
” అదికాదు… అందులో రావు గోపాలరావు గొప్పగా చేసేడని అందరూ చెప్పుకుంటున్నారు” అన్నాడు మాచర్రావు.
” అసలాడిదేవూరేంటి?” అడిగాడు లేడిగాడు.
“మన పిఠాపురం దగ్గిర ఓ పల్లెటూర్లే , పైగా ఆ సినిమాకి డైరెక్టర్ బాపు గారు.
” ఏటి.. అక్కినేనితో బుద్ధిమంతుడు సినిమా తీసినాయనే? అయితే సరే..
బాపుగారు తీశారు కనకా, ఆ గోపాలరావుది మన జిల్లా కనక ఎల్దాం పద” అన్నాడు లేడి. ఆ సినిమాలో ‘ మనిషన్నాక కాస్త కలాపోసన ఉండాలి.. లేకపోతే మడిసికి , గొడ్డుకి తేడా ఏటుంటది?’ అన్న డైలాగు లేడిగాడికి బాగా వంటబట్టింది. అందుకే , “తక్కువ ఖర్చుతో నేను కూడా ఏదో కొంత కలాపోసన చెయ్యాలని డిసైడయ్యాను” అన్నాడు మాచర్రావుతో.
“కలాపోసన చేసినోళ్ళంతా గుళ్ల దగ్గిర అడుక్కుంటున్నారు! ఆటి జోలికి పోవద్దురా” అన్నాడు మాచర్రావు.
“డిసైడై పోయాకా మడం తిప్పటం మగతనం కాదు” అన్నాడు లేడిగాడు.
“అయితే ఈలపాట రఘురామయ్యగారి కురుక్షేత్రం రప్పించమంటావా?” అన్నాడు మాచర్రావు.
“చవితి పందిర్లలోనూ, కార్తీక దీపారాధనకీ చాలాసార్లు ఏసేసేరు. అయినా పౌరాణికాలోద్దు. రామారావుగార్ని కృష్ణుడుగా చూసిన కళ్ళతో ఈ సన్నాసుల్ని చూడలేను. మరోటి ఆలోచించు” అన్నాడు లేడిగాడు.
“బొబ్బిలియుద్ధం , పల్నాటియుద్ధం లాంటివైతే ఎలాగుంటాయి?” అన్నాడు మాచర్రావు.
“ఛీ ఛీ.. కోడిపందేలు గురించి మనుషుల్ని చంపుకునేవాళ్ళంటే నాకు చిరాకు….ఏదైనా సాంఘిక నాటకం చూడు” అన్నాడు లేడి.
” అయితే దుర్గా ఆర్టు వాళ్ళ చేత వేయిద్దామా?” అడిగాడు మాచర్రావు.
” ఆళ్లెప్పుడూ “గాలివాన” నాటకమే ఆడతారు. టిక్కట్టెట్టి ఆ పాతదెవడు చూస్తాడు?” అన్నాడు లేడిగాడు.
“ఏటీ? టిక్కెట్టు నాటకమా? సాంఘిక నాటకాన్ని టిక్కెట్టు కొనుక్కుని ఎవడూ చూడ్డు…ఇదేం ‘రక్తకన్నీరు’ కాదుగా” అన్నాడు మాచర్రావు.
“మనం అలవాటు చెయ్యాలన్నయ్యా..” అన్నాడు లేడి ” ఈలోపల మనం ఆరిపోతాం” అన్నాడు మాచర్రావు.
“మంచిపని చేసేటప్పుడు ఎంకరేజ్ చెయ్యాలి కానీ, నీరు కార్చకూడదు” అని లేడిగాడు అతన్ని బతిమాలేడు.
సరే అన్నాడు మాచర్రావు. కానీ ఇద్దరికీ దాన్ని గురించి ఏమీ తెలీదు. అందుకని నాటకరంగంలో చేయి తిరిగిన ఈశ్వర్రావు అనే ఈశుబాబుని పట్టుకున్నారు. వాడు ఈమధ్యే దుర్గా ఆర్ట్స్ నుంచి విడిపోయాడు. వాళ్ళ నాన్న పోయాకా, ఈశుబాబు కళాపోసన పేరిట ఉన్న ఆస్తి నాటకాలకీ , నటీమణులకీ తగలేసి ఏబ్రాసిలా తిరుగుతున్నాడు.
“ముందో బేనర్ పెట్టుకోవాలి..” అన్నాడు ఈశుబాబు.

కాకినాడలో యంగ్మెన్స్ క్లబ్ నుంచి ఎస్వీ రంగారావు, రేలంగి, అంజలి లాంటివారు వచ్చేరు కనక , ద్రాక్షారంలో లేడిగాడి పేరు కలిసొచ్చేలా లౌక్యంగా ‘ యంగ్ లేడీస్ క్లబ్’ అనే పేరు బేనర్ గా నిర్ణయించారు. తర్వాత చాలా నాటకాలు పరిశీలించి, ఆడోళ్ళ సెంటిమెంటు అదురుతుందని ‘ అదిరిందిరా ఆడదాని దెబ్బ’ అనే నాటకాన్ని ఖాయం చేశారు. డైరెక్టరు ఈశుబాబే. కొందరు ఏక్టర్లు దుర్గా ఆర్ట్స్ లోని వాళ్లే. అయితే హీరోగా సెలక్టు చేసుకున్న వోడంటే , దుర్గా ఆర్ట్స్ హీరోయిన్ బేబికి పడదు. ఆడేంటి హీరో? నా లెవెల్ కి సరిపోడు పొమ్మంది. దాంతో కాకినాడ, రాజమండ్రిలు వెతికి చివరికి రాజమండ్రి నుంచి రాణి ని పట్టుకొచ్చేరు. దానికి ఆరునెలల కూతురుంది. ఈళ్ళిద్దర్నీ చూడటానికి రాణి తల్లి మంగమ్మ ఉంది. ఈ పటాలమంతటినీ మేపడానికి బోళ్లంత ఖర్చు. రిహార్సల్స్ మొదలు పెట్టేరు. నాటకం డేటు నిర్ణయించి టిక్కెట్లు కొట్టించాడు లేడిగాడు. బండితిప్పి మంచి ఎడ్వర్టయిజుమెంటు చేయించాడు. తన కస్టమర్స్ అందరికీ టిక్కెట్లు ఇచ్చాడు. వంద, యాభై, పాతిక..మూడు క్లాసులుగా విభజించారు. అడిగిన వాళ్ళందరూ టిక్కెట్లు తీసుకున్నారు…అయితే , “ఆ రోజు రావడం వీలుపడదేమో… వస్తే అక్కడే ఇస్తాను డబ్బులు” అని అన్నారు చాలామంది.

నాటకం రోజున కాకినాడ నాగార్జున సప్లై కంపెనీ నుంచి కుర్చీలు లారీ మీద తెప్పించారు. నాటకాలంటే పిచ్చి ఉన్న వాసంసెట్టి వీర్రాజు ఫ్రీగా దూడల సంతలో స్టేజి కట్టించాడు. అన్ని క్లాసుల కుర్చీలూ నిండిపోయాయి. నాటకం బానే ఉందన్నారు. కానీ రూపాయి వసూలు కాలేదు. పెద్ద క్లాసు టిక్కెట్లిచ్చుకున్న పెద్దమనుషులు… కొడుకునో, పెళ్ళాన్నో పంపేరు…. టిక్కెట్టు వేస్టవకుండా! డబ్బులివ్వాలని మాత్రం చెప్పలేదు. మర్నాడు లేడిగాడు లెక్కలేసుకున్నాడు. పదివేలు లాస్ అని తేలింది. అప్పుడు జ్ఞానోదయమైంది లేడిగాడికి… కలాపోసన చేసిన వాళ్ళు గుడి దగ్గర ఎందుకడుక్కుంటున్నారో! మర్నాడు ఉదయమే భీమేశ్వరుని దర్శించుకుని, తూర్పుగోపురం దగ్గరకెళ్ళి, సప్తగోదారి మెట్లమీద నిలబడి దండంపెట్టి, తన కలాపోసన ఎకౌంట్ పుస్తకాలూ, మిగిలిన టికెట్లూ సప్త గోదాట్లోకి విసిరేశాడు. లేడిగాడు కష్టమొచ్చినా, నష్టమొచ్చినా తనే భరించాడు. ముఖం మీద నవ్వు మాయం కానివ్వలేదు.

నెలలు గడుస్తున్నాయి. ఆరోజు ద్రాక్షారం భీమేశ్వరాలయం చాలా హడావుడిగా ఉంది. నిలబట్టానికి కూడా చోటు లేదు. గుడి ఆవరణలోనే దాదాపు యాభై పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. పెళ్ళికొచ్చినవాళ్లు తమని పిలిచినవాళ్ళు కనబడక, వెతుక్కుంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆ రోజు ద్రాక్షారంకి పెద్ద భూస్వాములైన దామిసెట్టోరి అమ్మాయి పెళ్ళి కూడా గుళ్లోనే జరుగుతోంది. మోతుబర్లు కనక సగం గుడి ఆవరణ వారి జనంతోనే నిండిపోయింది. పెళ్ళికొడుకు వైజాగ్ లో నేవీ ఆఫీసరు.
లేడిగాడు అటూ ఇటూ పరుగులు పెడుతున్నాడు. రాత్రి పది గంటలయింది. ఇంతలో ఎవరో వచ్చి సప్తగోదార్లో ఎవడో దూకేసేడని చెప్పేడు. వెంటనే లేడిగాడు తూర్పు గోపురం గుండా అటు దూకేడు.

ఒకడెవడో నీళ్లలో ములుగుతూ, తేల్తూ ఉన్నాడు. అందరూ పైకి రమ్మని కేకలేస్తున్నారు కానీ, సాహసించి గోదాట్లో దూకటం లేదు. లేడిగాడు ఒక్క ఉదుటున దూకేసి, వాడి జుట్టు లంకించుకుని ఒడ్డుకు లాక్కొచ్చాడు. మెట్ల మీద పడుకోబెట్టి, కడుపు మీద నొక్కి నీళ్ళు కక్కించాడు. చూస్తే వాడెవడో కాదు…. కటారోళ్ళ సూరిబాబు. ఆళ్ళ నాన్న అప్పారావుకి యానాం రోడ్డులో కిళ్లీ బడ్డీ ఉంది. తన కస్టమరే.

పది నిమిషాల్లో సూరిబాబు లేచాడు. కాస్త స్థిమితపడ్డాకా ఆడి చొక్కా ఇప్పించి, తన తువాలు ఆడికి కప్పి, రెండు టీలు తెప్పించి ఒకటాడికిచ్చి తనోటి తీసుకున్నాడు. అంతలో ఆదరాబాదరాగా అప్పారావు లగెత్తుకొచ్చి, సూరిబాబుని చూసి ‘అమ్మయ్య’ అనుకుని, ” లేడిబావా , ఫర్వాలేదా?” అన్నాడు. చుట్టూ చేరినాళ్ళందరినీ “మీరెళ్ళి మీ పన్లు చూసుకోండి…నేను ఈడితో మాట్లాడాలి” అని అందర్నీ పంపించేసి, ” బావా! ఈడి యవహారం నేను కనుక్కుంటాను. నువ్వెళ్లు” అని అప్పారావుని పంపించేసేడు లేడిగాడు.

అంతా వెళ్ళిపోయాకా , ” ఎందుకు బాబా..ఇలా చేసేవు?” అనడిగాడు సూరిబాబుని.
“దామిసెట్టోరి అమ్మాయికి పెళ్లయిపోతోంది కదా..” నసిగాడు సూరిబాబు.
“అయితే నీకేటి?” అన్నాడు లేడి
“నేను ఆ అమ్మాయిని ప్రేమించాను” అన్నాడు సూరిబాబు.
” ఆహా… అలాగా! ఆ అమ్మాయి నిన్ను ప్రేమించిందా?” అన్నాడు లేడి.
“నేను ఉత్తరం రాస్తే, సమాధానం రాయలేదు. మౌనం అర్థాంగీకారం కదా” లాజిక్ లాగేడు సూరిబాబు.
“ఆ ఉత్తరం ఆ అమ్మాయి చదివిందన్న గేరంటీ ఏటి? పోనీ నువ్వెప్పుడన్నా ఆ అమ్మాయితో మాట్లాడేవా ?” అడిగాడు లేడిగాడు.
“కాలేజీ బస్సు దిగుతుంటే ఓసారి అడిగాను. కానీ వినబడనట్టెల్లి పోయింది. ఏమీ అనలేదంటే ఇష్టమే కదా” అన్నాడు సూరిబాబు.
“బస్సు దిగే హడావుడిలో వినబడలేదేమో. వినబడితే అప్పుడే చెప్పు తెగేదేమో” అన్నాడు లేడి.
సూరిబాబు సమాధానం చెప్పలేదు.
“పోనీ మీ నాన్నకి చెప్పావా? కష్టపడి నిన్ను కాలేజీలో చదివిస్తున్నాడు” అన్నాడు లేడిగాడు.
“చెప్పేను…ఆళ్లకీ మనకీ సాపచ్చికం ఏమిటీ? ఆ మాటంటే చంపేస్తానన్నాడు. ఆ అమ్మాయికి పెళ్లయిపోతోందని విరక్తి వచ్చి గోదాట్లో దూకేసేను” అన్నాడు సూరిబాబు.
“మంచిపని చేసేవురా బాబా! ఆ అమ్మాయి పెళ్లయిపోయి , పూలదండేసుకుని పెనిమిటితో హాయిగా అత్తారింటికెళ్ళిపోతుంది. నీ కోసం ఇంత కష్టపడుతున్న తండ్రినొదిలేసి, పోస్టుమార్టం అయిన తర్వాత నువ్వు పూలదండేసుకుని స్మశానానికెళ్లిపోతావు. చాలా బాగుంది. పోస్టుమార్టం అంటే ఏటో తెలుసా? రాంచంద్రపురం గవర్నమెంటు హాస్పిటల్ లో చేస్తారు. బుర్రని బరబరా రంపంతో కోసేస్తారు. కత్తితో గుండె, పొట్ట పరపరా చీరేసి అందులో ఉన్న లివరూ గట్రా బయటికి తీసి, తూకం వేసి , మళ్ళీ లోపలేసి కుట్టేస్తారు. ఆ కంపు భరించలేక డాక్టర్లు తోటీగాళ్ళకి మందోయించి ఆ పనులన్నీ చేయిస్తారు” సూరిబాబు తల దించుకున్నాడు. లేడిగాడు వర్ణించిన పోస్టుమార్టం తలుచుకుంటే అతనికి వళ్ళు జలదరించింది.

“ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరూ వెళ్ళిపోయారుగా. వెంటనే దూకేయ్. నేను చూడనట్టూరుకుంటాను. మీ నాన్నకి ఏదో సర్ది చెపుతానులే. అలాంటి వెధవ ఉంటేనే పోతేనే అని చెప్పి అప్పారావుకి బెంగ లేకుండా చేస్తాను… సరేనా? లే మరి..” అన్నాడు లేడిగాడు గంభీరంగా. సూరిబాబు మాట్లాడలేదు… కదల్లేదు.

” బాబా! ఈ జగన్నాటకంలో జరగవలసింది జరిగి తీరుతుంది. అది మంచి కావచ్చు..చెడ్డా కావచ్చు. మంచిలో నీ పాత్ర ఉండేలా ప్రయత్నించు. కృష్ణుడు కావాలంటే కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఆపలేడా? లేక తనొక్కడే చిటికెన వేలుతో కౌరవులందర్నీ చంపలేడా? జరగవలసింది జరగనిచ్చాడంతే. తన వంశం కళ్ళముందు నాశనమవుతుంటే ఆపాడా? చిద్విలాసంగా చూస్తూ అవతారం ముగించాడు” అని కాసేపాగి మళ్ళీ అన్నాడు. “ఆ అమ్మాయికి నువ్వు పోయావని తెలిసిందనుకో..ఇక ఆ దరిద్రుడ్ని చూడాల్సిన అవసరం లేదని సంతోషించవచ్చు…అయ్యో పాపం పనికిరాని వెధవ అని జాలి పడావచ్చు. నీ బతుకు ఎవడిక్కావాలి? అందువల్ల…. ఈ విషయం ఇంతటితో మర్చిపో…” అని ముగించాడు. సూరిబాబు అంగీకారంగా తలూపి లేచాడు.

కాలం సాగిపోతూనే ఉంది. లేడిగాడి వయసయిపోవస్తోంది. తనకెన్నాళ్లో లేదని గ్రహింపు కలిగింది. ద్రాక్షారం సెంటర్ని అంగుళంగుళం తనివి తీరా చూసుకొనేవాడు. తనకి క్రమం తప్పకుండా అద్దె, కమీషన్ ఇస్తున్న వెచ్చావారి దగ్గరకెళ్ళి, తనకొట్టు, తనపేరు మీదున్న హోల్సేల్ బిజినెస్ వారికే పదిహేను లక్షలకి అమ్మేశాడు. ఆ రోజు కార్తీకమాసానికి వీడ్కోలుగా సప్తగోదాట్లో ఆడవాళ్ళందరూ దీపాలోదిలే రోజు. లేడిగాడు రాత్రి పదిగంటల వరకూ హడావుడిగా అక్కడే ఉన్నాడు. కొంచెం అలసటగా ఉంటే ఇంటికొచ్చి పడుకున్నాడు. ఆ నిద్దట్లోనే తుది శ్వాస వదిలాడు. ద్రాక్షారం సెంటర్లో గాలిలో గాలై, ధూళిలో ధూళై కలిసిపోయిన లేడిగాడి ప్రాణాలు అనంతంలో కలిసిపోయాయి. వీరమ్మ, సత్తెమ్మలు దొంగేడ్పులేడుస్తూ , ఎవరన్నా వచ్చినప్పుడు శోకండాలు పెడుతూ బీరువాలు , పెట్టెలూ వెతుకుతూనే ఉన్నారు.

                                     ——–*** ——–

ఏదైనా ఒక సంఘటనని కానీ, ఒక అనుభవాన్ని కానీ లేదా ఒక అంశాన్ని కానీ తీసుకుని , దాన్ని పాఠకులకి చెప్పడానికి కావలసిన రసాన్ని జోడించి అందిస్తే అది కథ ఔతుందని విమర్శకులు చెప్తారు. కథని నిర్వచిస్తూ… ” ఏకాంశ వ్యగ్రమై , స్వయం సమగ్రమైన కథాత్మక వచనమే కథానిక” అని చెప్పేరు.

ఆ రకంగా చూస్తే ఈ “లేడిగాడు” కథ…..కథ పరిధిని దాటి ఒక నవల రాయగలిగినంత సంగతులతో నిండి ఉంది. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. లేడిగాడి పుట్టుకనుంచి పోయేవరకూ వాడి జీవితమంతా చర్చించబడింది. అతని దినచర్య, కుటుంబం, భక్తి ,వ్యాపారం, ప్రజాసేవ కళాపోషణ–ఇవి కాకుండా ఇంకా చెప్పకుండా వదిలేసిన ఒక ఆచార్యుల వారి కథ….ఇన్ని అంశాలున్నాయి ఈ కథలో. అయితే వస్తువు విస్తారంగా ఉన్నా, నిడివి మాత్రం కథానిక పరిధిని దాటలేదు. అలా రాయగలిగిన రచయిత ప్రతిభకి జోహార్లు.

‘ లేడిగాడి’ లాంటి పరోపకారి పాపన్నలు మనకి అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటారు. పాత రోజుల్లో…ముఖ్యంగా చిన్న చిన్న ఊళ్లలో ఇలాంటివాళ్లు కాస్త ఎక్కువగానే కనిపించేవారు. అడక్కుండానే ఉపకారం చెయ్యడం వాళ్ల నైజం. లోకుల సమస్యలు తమ సొంత సమస్యల కింద వాళ్ళు భావిస్తారు. అందరూ తన వారనుకోవడం , తను అందరివాడ్నీ అనుకోవడం వాళ్ళ స్వభావం. లేడిగాడి గురించి రచయిత అన్న మాటలు చెప్పి ముగిస్తాను.
* లేడిగాడు లేకిగాడని ఎవరన్నా అన్నా లౌక్యంగా , నొప్పించకుండా మెప్పించాడు.
* ఊరిలో ఎవరికి ఏ అవసరమొచ్చినా మొదట జ్ఞాపకమొచ్చే పేరు ‘లేడిగాడు’.
* తనకు తోచినది ఎవరేమన్నా లెక్కచేయక చేసేసే విలక్షణ లక్షణ సమన్వితుడు లేడిగాడు.
* సామాన్యంగా కనబడే అసామాన్యుడు లేడిగాడు.

గోదావరి జిల్లా యాసలో పాఠకులని అలరిస్తుంది ఈ కథ..

–సి. యస్.

4 Comments Add yours

 1. DL SASTRY says:

  లేడి గాడి కధ చాలా బాగుంది. ద్రాక్షారం లో తిరు
  గుతున్న ట్లు వుంది

  Like

 2. V.V.Krishna Rao says:

  దక్షారామ గ్రామ మ
  హాక్షేత్ర ధరా తలమున ఆవాసుల ప్ర
  త్యక్షానుభవ వివిధతను
  సాక్షాత్తుగ రచయితెంతొ ౘక్కగ చెప్పెన్ ||

  Like

 3. ఆకొండి సూర్యనారాయణ మూర్తి says:

  మానవత మృగ్యమై పోతున్న ఈ రోజులలో కథల్లో తప్ప లేడిగాడి లాంటివాళ్ళు లేరు.నిక్కచ్చిగా, నిఖార్సుగా ఉన్నలేడి గాడు,ఇప్పుడుమంతోబాటుంటే ఎంతబాగుంటాది.1975కాలంనాటి కథే. డబ్బుకోసం ప్రాణంపోతే బాగుండునుకొనే కూతుళ్లు అన్ని చోట్లా ఉన్నారు. ,ప్రేమించిన దానికోసం ప్రాణంతీసుకొనే సూరికి గీతసారం బోధన చేయడం, నాటకం ఒక్కటితోనే జ్ఞానోదయం కావడం తత్వవేత్త గా లేడిగాడు కళ్లముందుంటాడు. ఈ ఊర్లు,ఆ ఇంటిపేర్లు,ఆ మనుషులు ద్రాక్షరామ్ ప్రక్కనే ఇంకా ఇప్పటి కున్నాయి. రోజువారి వడ్డీకి అప్పిచ్చినా కారుణ్యభావం హృదయమంతా నింపుకున్న సోక్రటీస్ లా కనుపించుతాడు.దీంట్లో సమకాలీనవిషయాలు,ముందు తరానికిఆదర్శప్రాయమైన ఆలోచనలు, వదిలివెళ్లిన మహాత్వ శీ లసంపద ,మనిషి తన మనసుకు నిదానత్వం నేర్పేందుకు తనకు తానే ప్రశ్నించుకొందుకు వీలుగా మిత్రులను మాచరావు లాంటివాళ్ళను సృష్టి చేయడంలో రచయిత నేర్పు కనిపించింది. హాయిగా తనువు చాలించి వెళ్లిపోయిన మహర్షి లా ఉన్నాడు. అసలు చాలా పెద్ద కధ అయి ఉంటుంది ఈకథ. సంక్షిప్తంగా చెప్పబడింది సి.ఎస్. చేత. ఈ కధలో సినిమాలునటీనట్లులు,నాటకాలు, వివాహితలు వెనక్కితిరిగి మరొమోగాడి అందం చూద డం బడిపిల్లలు ,పెళ్లిళ్లు ,ఎదుగుతున్న పల్లెలు, వారి, జీవన దర్పణం ఈ కధ.

  Like

 4. ఆకొండి సూర్యనారాయణ మూర్తి says:

  మానవత మృగ్యమై పోతున్న ఈ రోజులలో కథల్లో తప్ప లేడిగాడి లాంటివాళ్ళు లేరు.నిక్కచ్చిగా, నిఖార్సుగా ఉన్నలేడి గాడు,ఇప్పుడుమంతోబాటుంటే ఎంతబాగుంటాది.1975కాలంనాటి కథే. డబ్బుకోసం ప్రాణంపోతే బాగుండునుకొనే కూతుళ్లు అన్ని చోట్లా ఉన్నారు. ,ప్రేమించిన దానికోసం ప్రాణంతీసుకొనే సూరికు గీతసారం బోధన చేయడం, ఒక్కటితోనే జ్ఞానోదయం కావడం తత్వవేత్త గా లేడిగాడు కళ్లముందుంటాడు. ఈ ఊర్లు,ఆ ఇంటిపేర్లు,ఆ మనుషులు ద్రాక్షరామ్ ప్రక్కనే ఉన్నాయి. రోజువారి వడ్డీకి అప్పిచ్చినా కారుణ్యభావం హృదయమంతా నింపుకున్న సోక్రటీస్ లా కనుపించుతాడు.దీంట్లో సమకాలీనవిషయాలు,ముందు తరానికిఆదర్శప్రాయమైన ఆలోచనలు వదిలివెళ్లిన మహాత్వ శీ లసంపద ,మనిషి తన మనసుకు నిదానత్వం నేర్పేందుకు తనకు తానే ప్రశ్నించుకొందుకు వీలుగా మిత్రులను మాచరావు లాంటివాళ్ళను సృష్టి చేయడంలో రచయిత నేర్పు కనిపించింది. హాయిగా తనువు చాలించి వెళ్లిపోయిన మహర్షి లా ఉన్నాడు. అసలు చాలా పెద్ద కధ అయి ఉంటుంది ఈకథ. సంక్షిప్తంగా చెప్పబడింది సి.ఎస్. చేత.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s