కథన కుతూహలం 54

యర్రంశెట్టి శాయి — ఈ పేరు వినగానే అందరికీ ఆయన రాసిన హాస్య కథలు గుర్తుకొస్తాయి. పాఠకులకి శాయి ఒక వ్యంగ్య , హాస్య రచయితగా బాగా తెలుసు. నిజానికి ఆయన ఎక్కువగా అలాంటి కథలే రాశారు కూడా. కానీ ఆయన సెంటిమెంటుతో కూడిన కథలూ, మధ్యతరగతి వారి జీవితాలను ప్రతిబింబించే కథలూ కూడా చాలానే రాశారు. వివిధ వార, మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు పైగా వీరివి ప్రచురితమయ్యాయి. వీరు రైల్వేలో ఉద్యోగం చేశారు.

‘హ్యూమరాలజీ ‘ , ‘ సినీ పంచతంత్రం’ , ‘రాంభరోసా అపార్ట్ మెంట్స్’ , ‘లవ్ ఎట్ సెకండ్ సైట్‘ మొదలైనవి శాయిగారి రచనలలో కొన్ని. వీరి ‘ప్రేమకు ఫుల్ స్టాప్ ఉందా?‘ అనే కథని ‘మా ఇంటి ప్రేమాయణం‘ సినిమాగా తీశారు. కథల విషయానికొస్తే… ‘అన్ వాంటెడ్ డాక్టర్’, ‘కాకి- తందూరీ చికెను’,’భూతం ఫోన్’, ‘వదినమ్మ’, ‘ రౌడీ పిల్ల’, ‘ కాటేసిన పగ’, ‘ మిమిక్రీ ‘ మొదలైనవెన్నో ఎంతో పేరు పొందేయి.
ఏది రాసినా వారి కథలు పాఠకుల్ని చదివింప చేస్తాయి. అలా వారు రాసిన “పల్లకి” అనే అందమైన కథని ఈ వారం పరిచయం చేస్తాను.

లపతి వాచీ చూసుకున్నాడు. టైము ఆరవుతూంది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్లో కిటికీ దగ్గర కూచున్న అతను చిన్నపిల్లాడిలా బయటికి చూస్తున్నాడు. తెలతెలవారుతోంది. ఈ పాటికి రైలు తన ఊరు దాటవలసింది… తన ఊరా? అవును. తను ఆ ఊళ్ళోనే పుట్టేడు. అక్కడే తన బాల్యం గడిచింది. థర్డ్ ఫారం వరకూ అక్కడే చదువుకున్నాడు. తరవాత నాన్నగారికి మద్రాసు బదిలీ అయిపోయింది. అందుచేత ఆ ఊరు వదిలేసి, మద్రాసు వెళ్ళడం, ఆతరవాత అక్కడే స్థిరపడిపోవడమూ జరిగింది. తను చదువు పూర్తి చేసుకుని , మద్రాసులోనే ఓ బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటినుంచో తన ఊరు ఓసారి చూడాలనీ, పాత స్నేహితుల్ని ఒకసారి కలుసుకోవాలనీ చాలా కోరికగా ఉండేది. కానీ తన కోరిక తీరనేలేదు. ఎప్పుడు బయలుదేరదామన్నా ఏదో ఒక అడ్డంకి! చివరికి ఇప్పుడు భీమవరంలో పెళ్లి చూపుల పుణ్యమా అని , ఆ ఊళ్ళో దిగకపోయినా కనీసం రైల్లోంచి చూసే అవకాశం దొరికింది.

పెళ్లి చూపులు గుర్తుకొచ్చేసరికి చలపతికి కళ్ళముందు మెదిలింది జయ. చక్కగా గులాబీ పువ్వులా ఉంది. అదే రంగు. మొగ్గలా సోఫాలో ఓ మూలకి ఒదిగి కూచుంది. ఆమెతో తనేమీ మాట్లాడలేదు. నాన్నగారు కావాలంటే అమ్మాయిని ఏదైనా అడగమన్నారు. తనకి సిగ్గనిపించి ఏమీ అడగలేదు. అమ్మాయి అందరికీ నచ్చింది. తాంబూలాలు పుచ్చుకోవడం కూడా జరిగింది. తన తల్లిదండ్రులు ఆ ఊళ్ళోనే తమ బంధువులింట్లో ఆగిపోయారు. తనకి సెలవు ఎక్కువ లేకపోవడంవల్ల తిరిగి వెంటనే మద్రాసు ప్రయాణం కట్టేశాడు.

తన ఊరు దగ్గరవుతున్నకొద్దీ చలపతిలో ఉత్సాహం పెరిగిపోతోంది. తను ఆ ఊళ్ళో గడిపిన రోజులూ, తిరిగిన ప్రదేశాలూ గుర్తుకి రాసాగాయి. పంట కాలవ ప్రవాహంలో తనూ, శీనుగాడూ , పాండూ…ఈతకొట్టడం, కాలవగట్టు వెంబడి నడిచి స్కూలుకి వెళ్ళడం, వర్షాకాలంలో గట్ల వెంబడి పరుగెత్తే బురదపాముల్ని రాళ్లతో కొట్టడం , మున్సబుగారి దొడ్లో దొంగతనంగా జామకాయలు కోసుకోవడం….. చలపతికి నవ్వొచ్చింది. ఆ దృశ్యాలన్నీ కళ్ళకి కట్టినట్టు కనిపించాయి.

మరికొద్ది నిమిషాల్లో ఆ ఊరు దాటబోతోంది రైలు. నిద్రపోతే ఆ ఊరు దాటిపోతుందేమోనని రాత్రంతా నిద్ర పోకుండా మేలుకుని కూర్చున్నాడతను. ఆ ఊరు చూడాలి. రైలుస్టేషను వెనక రోడ్డూ, పక్కగా మంచినీళ్ళ చెరువూ, లెవెల్ క్రాసింగ్ గేటూ, దానిపక్కన చిన్న కిళ్లీకొట్టూ….
అవన్నీ అలాగే ఉన్నాయా? రైలు ఒక్క నిమిషం ఆగినా బాగుణ్ణు. కానీ ఇది ఎక్స్ ప్రెస్ ! అసలా స్టేషనులో ఆగదు. రైలు ఆ ఊరు దాటుతున్నప్పుడు అందినంతమేర చూడాలి. తను పొరబాటు చేశాడు. పాసింజరులో వచ్చి, ఒకరోజు ఇక్కడ గడిపి వెళ్ళాల్సింది. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో…! ఇలా సాగిపోతున్నాయి చలపతి ఆలోచనలు.

చలపతి లేచి తలుపుతీసి నించుని ఆతృతగా చూస్తున్నాడు. దూరంగా చెట్లమధ్య తెల్ల బిల్డింగ్ కనిపించింది. అదే తను చదివిన హైస్కూలు భవనం. ఆ భవనానికి అదివరకు ఒకే అంతస్తు ఉండేది. ఇప్పుడు మరో అంతస్తు వెలిసింది. చలపతికి సంతోషం పొంగి పొరలుతోంది. ఊరు వచ్చేస్తోంది. ఎర్రగా నిండుగా పంట కాలవ కనబడి, మళ్ళీ మామిడిచెట్ల మధ్య మాయమైపోయింది. దూరంగా కాలవకి అడ్డంగా లాకులు , నల్లటి గేట్లు. రోజూ అవి దాటి స్కూలుకి వెళ్ళేవాళ్ళు. రైలు ఔటర్ సిగ్నల్ దాటింది. క్రమంగా వేగం తగ్గిపోతోంది. దూరంగా రాజుగారి డాబా కనిపిస్తోంది. కీచుమంటూ బ్రేకులు పడుతున్నాయి. రైలు వేగం పూర్తిగా తగ్గిపోయింది. స్టేషను దగ్గరవుతోంది. రైలు ఈ స్టేషనులో ఆగదుకదా! ఒకవేళ క్రాసింగ్ ఉందేమో..? ఆగితే ఎంత బాగుంటుందో! ఆశ్చర్యం…రైలు ప్లాట్ ఫారం మీద ఆగిపోయింది. అంతే , వెంటనే సూటుకేసు తీసుకుని, కోటు చేతిమీద వేసుకుని , మరో ఆలోచన లేకుండా బండి దిగేశాడు చలపతి. తనవేపు ఆశ్చర్యంగా చూస్తోన్న స్టేషన్ మాష్టర్ చేతిలో టిక్కెట్టు పెట్టి బయటకి నడిచాడు.

స్టేషను బయట చాలా రిక్షాలు ఆగి ఉన్నాయి. అదివరకు రెండుమూడు ఎడ్లబళ్లు మాత్రమే ఉండేవి. చలపతిని రిక్షావాళ్లు చుట్టు ముట్టి, సూట్కేస్ లాక్కున్నంత పని చేశారు….’ ఎక్కడికి పోవాలి సార్’ అని అడుగుతూ. అతను ఆలోచనలో పడ్డాడు. తనిప్పుడు ఎక్కడికెళ్ళాలి? శీనుగాడూ, పాండూ వాళ్లూ ఉన్నారో లేదో? తనదనుకొంటున్న ఆ ఊళ్ళో బస చెయ్యడానికి తనవాళ్లనుకునే వాళ్ళెవరూ అతనికి గుర్తు రాలేదు. వెంటనే ఒక రిక్షా అతనితో “గదులు అద్దెకి దొరికే మంచి హోటలేమైనా ఉంటే తీసుకెళ్ళు” అంటూ రిక్షా ఎక్కేడు. రిక్షా వెళ్తోంటే, చలపతి కొత్తగా వేసిన సిమెంటు రోడ్లనీ , అందంగా వెలిసిన ఇళ్లనీ చూస్తున్నాడు. రిక్షా మార్కెట్టు వీధిలో ప్రవేశించింది. ఇంకా షాపులేవీ తెరవలేదు. రిక్షా ఒక రెండంతస్తుల హోటల్ ముందు ఆగింది. ఆ హోటల్ చలపతికి బాగా తెలుసు. సెకండ్ ఫారం చదివే రోజుల్లో తన క్లాస్ మేట్ సాంబగాడు ఇంట్లోంచి పది రూపాయలు కొట్టేసి తెచ్చేశాడు. ఇద్దరూ ఆ హోటల్లో స్వీట్లు బాగా మెక్కేశారు. ఆ పది రూపాయలు ఖర్చు చేయడానికి అప్పట్లో నాలుగు రోజులు చాలలేదు. ఆతరవాత ఈ సంగతి తెలిసి సాంబగాడ్ని ఇంట్లో చావతన్నేరు.

చలపతి హోటల్లో రూం తీసుకుని కాఫీ , స్నానాదులు ముగించి బయటకొచ్చేసరికి ఎనిమిదిన్నరయింది. మెల్లగా రోడ్డు వెంబడి నడవసాగేడు. కార్లు, బస్సులు, సైకిళ్ళు, రిక్షాలతో రోడ్డంతా సందడిగా ఉంది. అదివరకు సంతనాడు కూడా ఇంత రద్దీగా ఉండేది కాదు. ముందు శీనుగాడింటికి వెళ్ళాలి. గుడిపక్క సందులోనే వాడిల్లు. పంటకాలవ మించి దాటడానికి ఇదివరకూ తాటిపట్టె ఉండేది. ఇప్పుడు వంతెన కట్టేరు. వంతెన దాటి రాజుగారి డాబా చేరుకున్నాడు. ఆ కాంపౌండ్ లో నాలుగిళ్లు ఉండేవి. మొదటిల్లు తమది. పక్కన శీనుగాడి ఇల్లు. ఆ ఇంటి ముందు నిలబడి, ” శీనూ!” అని గట్టిగా పిలిచాడు. లోపలనుంచి ఓ ముసిలాయన బయటికొచ్చి ” ఎవరు కావాలి బాబూ” అన్నాడు.
” శీను…. శ్రీనివాసరావని…. ఈ ఇంట్లో ఉండేవాడు.
” మేమీ ఇంట్లోకొచ్చి అయిదేళ్ళవుతొంది బాబూ! అలాంటి పేరుగల వాళ్లెవరూ ఈ కాంపౌండ్ లో లేరు” అన్నాడు.
చలపతికి నిరాశ కలిగింది. వెనక్కితిరుగుతూ , ఎదురింటివేపు చూశాడు.
” ఆ ఇంట్లో రైల్వే ఇన్స్ పెక్టర్ ఒకాయన ఉండేవారు.. ఆయనున్నారా?” అని అడిగాడు..వాళ్ల ద్వారా శీను అడ్రస్ తెలుసుకోవచ్చని.
” మేం వచ్చిన కొత్తలోనే వాళ్ళు వెళ్ళిపోయారు” అన్నాడు ముసలాయన.
చలపతి బయటికి నడుస్తూ, ఒకసారి వాళ్లు అద్దెకున్న ఇంటికేసి చూశాడు. కళ్ళ నిండుగా నీరు నిండుకుంది. చకచకా బయటికి నడుస్తూ , ఇక పాండురంగారావుని కలుసుకోవాలి. వాడైనా ఉన్నాడో, ఎటైనా వెళ్ళిపోయాడో? వాళ్ళదో ఇస్త్రీ షాపుండాలి. అనుకుంటూ కాలవ దాటి వస్తోంటే మిల్లు కనిపించింది. అది ఇంకా అలాగే ఉంది. మిల్లు పక్కన ఊక పర్వతంలా ఎత్తుగా పడి ఉంది.

పాండురంగారావు ఇంటి దగ్గరకొచ్చాడు చలపతి. ఇంటిపక్కనే “సరస్వతి వాషింగ్ లాండ్రి” అనే బోర్డు వెళ్ళాడుతోంది. టేబుల్ మీదున్న ఇస్త్రీపెట్టెలో నిప్పు రాజుకొంటూంది. లోపల పాండు తల్లి కూర్చుని బట్టల మీద ‘ఇంకు గుర్తులు’ వేస్తోంది. చిన్నప్పుడు తను వాడికోసం వెళ్ళినప్పుడల్లా తనకి తినుబండారాలు ఎన్నో తినిపించేది.
“అమ్మా!” అని ఆప్యాయంగా పిలిచాడు చలపతి.
ఆమె తలెత్తి చూసి, ” ఏం కావాలి బాబూ?” అంది.
“నన్ను గుర్తు పట్టలేదా అమ్మా? చలపతిని. పాండూ, నేనూ చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం…” అన్నాడు.
ఆమె క్షణంపాటు అర్థం కానట్టు చూసింది. గుర్తు తెచ్చుకోవడానికి విఫల యత్నం చేసింది.
“అలాగా , నాయనా! రా! కూర్చో. ఇప్పుడెక్కడుంటున్నావ్?” అడిగిందామె.
‘తనని గుర్తించలేదు , బహుశా వృద్ధాప్యం వల్ల అయివుండాలి’ అనుకున్నాడు చలపతి.
“పాండు ఉన్నాడామ్మా?” కూర్చోకుండానే అడిగాడు చలపతి.
“ఊళ్ళో లేడు బాబూ! ఎప్పుడూ సినిమాలు తీసుకుని ఊళ్లు తిరిగి ఆడిస్తూంటాడు. ఇప్పుడు విశాఖపట్నం దగ్గర ఏదో ఊరెళ్ళాడు” అందామె. చలపతిని ఒక్కసారి నిరుత్సాహం ఆవరించేసింది.
“నేను వెళ్తానమ్మా! వాడొస్తే చలపతి వచ్చి వెళ్ళేడని చెప్పు” అని కదిలాడు. షాపు బయట ఓ నాలుగేళ్ల కుర్రాడు బట్టలు లేకుండా ఇసకలో ఆడుతున్నాడు. వాడిలో పాండురంగారావు పోలిక కనిపించి,
“వీడు పాండు కొడుకా అమ్మా?” అని అడిగాడు.
“అవునయ్యా! పెద్దది బడికెళ్ళింది” అంది ఆమె.
ఆ కుర్రాడిని నించోబెట్టి బుగ్గలమీద ముద్దు పెట్టుకున్నాడు చలపతి.
“నీ పేరేంటి? అన్నాడు వాడితో.
“లామాలావు” అన్నాడు వాడు.
“నాన్న పేరు?” నవ్వుతూ అడిగాడు
“పాందు లంగాలావు” అన్నాడు వాడు ముద్దుగా.
గట్టిగా నవ్వేసి, పాండు లేకపోయినా అతని కొడుకుని చూసిన ఆనందంతో హోటల్ కి బయలుదేరేడు.

మార్కెట్టు దాటి, హోటల్ గుమ్మం దగ్గరకు వచ్చాడు. లోపలికి వెళ్ళబోతూండగా , “నువ్వు చలపతివి కదూ!” అని వినిపించింది. ఉలిక్కిపడి పక్కకి చూశాడు. ఎదురుగా ఓ పెద్దాయన నించుని ఉన్నాడు. చేతిలో గొడుగూ , ఖద్దరు చొక్కా, పంచా, కళ్ళజోడూ– సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు చలపతి.
“నమస్కారం మాస్టారూ!” అన్నాడు ఆనందంగా. ఆయన భానుమూర్తి మాస్టారు. తను నాలుగేళ్లు రాత్రులు ఆయనింట్లోనే చదువుకున్నాడు. రోజుకోసారైనా తన చెవి మెలితిప్పేవారాయన. తనని చూసి ఇన్ని సంవత్సరాలయినా , ఇట్టే గుర్తు పట్టేశారాయన. కానీ తను మాత్రం అస్సలు ఆయన గురించి ఒక్కసారీ అనుకోలేదు. ఆయనింట్లో అన్నేళ్లు చదువుకుని ఎలా మరచిపోగలిగేడో!!
“భలే గుర్తుపట్టేశారే నన్ను!” అన్నాడు చలపతి ఆనందంగా.
“మంచివాడివే! నిన్నేమిటీ? నా దగ్గర చదువుకున్న వాళ్లెవర్నయినా , ఎన్నాళ్ళయినా సరే, తేలిగ్గా గుర్తించేయగలను. భగవంతుడు నాకా వరం ఇచ్చాడు. అది సరేకానీ… ఇప్పుడెక్కడ ఉండటం?” అన్నారు మాస్టారు.
“మద్రాసులోనే సార్. బాంక్ లో అకౌంటెంట్ గా ఉంటున్నాను… భీమవరంలో పెళ్లిచూపులకొచ్చి , తిరిగి వెళుతూ ఓసారి ఈ ఊరునీ, మిమ్మల్నందర్నీ చూడాలనిపించి దిగిపోయానిక్కడ” అన్నాడు చలపతి.
“బాగుంది! వెరీగుడ్! మరి ఇంటికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావ్? సామానేమీ లేదా?” అన్నారు మాస్టారు.
“హోటల్లో ఉందండి” అన్నాడు చలపతి.
“అదేమిటి? హోటల్లో ఎందుకు దిగావు? అంటే నేనసలు నీ దృష్టిలో లేనన్న మాట!” అన్నారు మాస్టారు.
“అహ.. అదికాదు సార్! మీకు శ్రమ ఇవ్వటం ఎందుకనీ…” నసిగాడు చలపతి.
“శ్రమేమిటోయ్? అలా అనుకుంటే నీకు అన్నేళ్లు ట్యూషనెలా చెప్పేవాడిని? ఇవతల మా ఆపేక్షలు కూడా గమనించాలి మరి! ఒకవేళ శ్రమ అనుకున్నా, అందులో ఆనందం లేదూ? పద… సామానులు తీసుకురా” అని చలపతిని హోటల్ బిల్లు కట్టించేసి, రిక్షాలో తన ఇంటికి తీసుకుపోయారు మాస్టారు.

ఆయన ఇల్లు మంచినీళ్ళ చెరువు దగ్గర అప్పటిలాగే ఉన్నా, కొంచెం శిధిలావస్థకు చేరింది. ఇంటి చుట్టూ పూలమొక్కలు అందంగా ఉన్నాయి.
“కమలా! మనింటికి ఎవరొచ్చారో చూడు” అన్నారాయన లోపలికి వస్తూ.
ఆ పేరు వినగానే చటుక్కున కమల గుర్తుకొచ్చింది చలపతికి. తను వాళ్ళింట్లో చదువుకునేటప్పుడు కమల కూడా తనతో చదువుతూండేది. ఇద్దరూ లాంతరు ముందు కూచుని పాఠాలు చదువుతూనే ఏవేవో కబుర్లలోకి దిగిపోయేవాళ్ళు. లోపలనుంచి మాస్టారు గట్టిగా ఒక్క కేక వేసేసరికి ఉలిక్కిపడి గడగడ చదవడం మొదలెట్టేవారు. చాలా కొద్దిరోజుల్లోనే ఇద్దరూ ప్రాణ స్నేహితులయిపోయారు. కమల- మాస్టారు గారికి ఒకే ఒక్క కూతురు. ఆమెను స్కూల్లో చేర్పించకుండా ప్రైవేటుగా చదివించేవారు మాస్టారు. మెట్రిక్ కట్టించాలని ఆయన అభిప్రాయం.
మాస్టారుగారి భార్య ఎప్పుడూ ఏదో జబ్బుతో బాధపడుతూండేది. ఆ కారణంగా ఇంటిపనంతా కమలమీద పడింది. స్కూలుకి వెళ్లాలని కమలకి చాలా కోరికగా ఉండేది. అక్కడ ఎలా ఉంటుందో, ఎన్ని ఆటలు ఆడతారో చలపతిని అడిగి తెలుసుకుని మురిసిపోతూండేది.

మాస్టారి పిలుపు విని, కమల వంటింట్లోంచి బయటికొచ్చి, చలపతిని చూసి, ఆశ్చర్యంతోనూ, సిగ్గుతోనూ చిన్నగా నవ్వింది. కోలముఖం , విశాలమైన కళ్ళు, చిన్ని నోరు…ఆమె రూపం మనోహరంగా ఉంది. చలపతి ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. పిలక జడతో, చీమిడి ముక్కుతో తిరిగే ఆ పిల్లే… ఈ దేవత! అనుకుంటున్నాడు.
“ఎప్పుడూ నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉంటుంది” అన్నారు మాస్టారు.
తండ్రి మాటలకి కమల సిగ్గుపడి పోతూ , “బాగున్నావా చలపతీ?” అంది తల దించేసుకుంటూ.
“బాగానే ఉన్నాను..” అన్నాడు చలపతి.
“ముఖం అదీ కడుక్కుని బట్టలు మార్చుకోవోయ్! నేనీలోపల మార్కెట్టుకి వెళ్ళొస్తాను” అంటూ మాస్టారు ఓ సంచీ తీసుకుని బయల్దేరారు. కమల అలా గోడకానుకునే నిలబడిపోయింది. చలపతి పక్కనున్న కుర్చీలో కూచున్నాడు.
“నువ్వెలా ఉన్నావో చెప్పలేదు కమలా!” అన్నాడతను నవ్వుతూ.
“మీ దయవల్ల…ఏదో ఇలా ఉన్నాం..” అంది ఆమె నవ్వేస్తూ.
“మీ అమ్మగారు…” అన్నాడు చలపతి పక్కగది వేపు చూస్తూ.
“అమ్మ పోయి నాలుగేళ్లయింది” అంది కమల నెమ్మదిగా.
“సారీ… ఎక్స్ ట్రీమ్లీ సారీ కమలా…ఏమీ అనుకోకు” అన్నాడు.
“ఫర్వాలేదులే” అంది ఆమె కొద్ది క్షణాలు ఆగి, “ఇంతకూ నువ్వు మెట్రిక్ పాసయ్యావా?” అన్నాడు చలపతి.
“ఉహూ….రెండుసార్లు తప్పాను. విసుగుపుట్టి మానేశాను” అందామె.
చలపతికి ఆశ్చర్యం వేసింది. కమల తెలివైన అమ్మాయి. మాస్టారుగారి తర్ఫీదులో ఆమె మెట్రిక్ తప్పిందంటే ఆశ్చర్యమే!
“అది సరేగాని…. నేనసలు గుర్తున్నానా? ఇన్నేళ్లలో ఒక్కసారయినా గుర్తుకొచ్చానా?” అకస్మాత్తుగా ఆమె అడిగిన ప్రశ్నకి తడబడ్డాడు చలపతి.
“భలేదానివే! నువ్వు గుర్తు లేకపోవడమేమిటీ? తరచుగా నీ గురించి ఆలోచిస్తూండేవాడిని. ఇప్పుడు మా కమల ఎలా ఉందో.., ఎంత పొడుగై ఉంటుందో… అనుకునేవాడ్ని”. అబద్ధమాడేశాడు చలపతి. నిజానికి ఈ ఊరు వదిలేసిన తరువాత చాలా కొద్దిరోజులు మాత్రమే ఆమె గుర్తుంది. క్రమేణా అతను మాస్టారిని కూడా మరిచిపోయాడు.
“ధన్యురాల్ని” అంది కమల నవ్వుతూ.
“మరి నీ సంగతి? నన్నెప్పుడయినా తలచుకున్నావా?” అడిగాడు చలపతి.
“నిన్ను మరచిపోతానా చలపతీ?” మార్దవం నిండిన గొంతుతో, మెరిసే కళ్ళతో అంటూ…, ” మమ్మల్ని చూడ్డానికి ఇంతకాలానికి తీరిక దొరికిందన్నమాట” తన జడ మెలివేస్తూ అంది.
“అబ్బే! అసలెప్పట్నుంచో రావాలని అనుకోవడం , కుదరకపోవడం….. చివరకి అనుకోకుండా భీమవరం ప్రోగ్రామ్ వచ్చిపడ్డంతో ఇలా వచ్చాను” అన్నాడు.
“ఏమిటా ప్రోగ్రాం?” అందామె.
“వయసులో ఉన్న కుర్రాడికి ఇంకేముంటుంది? మా అమ్మా నాన్నా ఓ పిల్లని చూసి నిశ్చయించేశారు. నేను కూడా చూడాలని వాళ్ల ఆకాంక్ష….. ఇహ తప్పేట్టు లేదని చూసేసి….”
వాక్యం పూర్తవకుండా కమల వంటింట్లోకి వెళ్ళింది. కాసేపు పొయ్యి ఊదుతున్న శబ్దం వినిపించింది. ఇల్లంతా పొగ. చలపతికి ఆ పొగకి కళ్ళు మండుతున్నాయి. కమల తిరిగి వచ్చింది. పొగకి ఆమె కూడా ఉక్కిరిబిక్కిరవుతూంది.
“పాడు పొగ! కాసేపు పొయ్యి దగ్గర లేకపోతే ఇదే చావు!” అంది.
“ఆ అమ్మాయి ఎలా ఉంది? నచ్చిందా మరి?” మళ్ళీ ఆమే అంది.
“ఆ… నచ్చినట్టే..” అన్నాడు చలపతి.
“అట్లా అయితే త్వరలో నీ పెళ్లికి నన్ను పిలుస్తావన్నమాట” అందామె.
“తప్పకుండా…మీరు రాకుండా ఎలా?” అన్నాడతను.
కొన్ని క్షణాల మౌనం తరువాత, “మరి నీ సంగతేమిటి?” చలపతి అడిగాడు.
“ఏమిటదీ?” అంది కమల.
“నీ పెళ్లి ఎప్పుడూ..?” అడిగాడు చలపతి.
నవ్వింది కమల. కావాలని నవ్వినట్టు తెలిసిపోతోంది. ” నాకిప్పుడదే తక్కువ” అంది.
“అదేమిటి?” సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు.
“నాకా ఉద్దేశ్యం లేదు. ఇకముందు కలుగుతుందని కూడా అనుకోను” అంది కమల.
“బాగుంది! బ్రహ్మచారిణిగా గడిపేస్తావా?” అన్నాడు.
” నీ ఇష్టం…నువ్వెలా చెబితే అలా!” అందామె.
“సరే! మధ్య నా ఇష్టమేమిటీ?” అన్నాడు చలపతి నవ్వుతూ.

ఆమె మాటలు చలపతికి అర్థం కాలేదు. మరోసారి ఆమె వంక పరీక్షగా చూశాడు. చక్కటి ఆకారం , ఆకర్షణీయమయిన కళ్ళు…ఇంత అందమైన అమ్మాయికి పెళ్లెందుకిష్టం లేదు? కమల లేచి వంటింట్లోకి వెళ్ళింది. అసలు కమల ఉద్దేశం ఏమిటో తెలుసుకోవాలనిపించింది చలపతికి. పది నిమిషాలు గడిచాయి.
“బయట చుట్టాన్ని కూర్చోబెట్టి నువ్వు వంటింట్లో కూర్చోవడం ఏమయినా బాగుందా?” అంటూ వంటింటి గడప వరకూ వెళ్ళి లోపలకి చూస్తూ అన్నాడు చలపతి. కానీ లోపలి దృశ్యం చూసి స్తంభించిపోయాడు. కమల నిశ్శబ్దంగా వెక్కి వెక్కి ఏడుస్తోంది.
“కమలా.. ఏమిటిది?” అన్నాడు చలపతి కంగారుగా.
గభాల్నలేచి చీరకొంగుతో కన్నీళ్లు తుడిచేసుకుని, “కారణం నువ్వే చలపతీ!
మా అమ్మని ఇప్పుడిప్పుడే మరచిపోతున్నాను. నువ్వు వచ్చి అమ్మ గురించి అడిగి గుర్తుచేశావు. అమ్మ గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు దుఖం ఆగదు” అంది.
ఇంతలో సంచీలో ఏవో వస్తువులతో మాస్టారు వచ్చారు. మధ్యాహ్నం దాకా మాష్టారితో ఏవేవో మాట్లాడుతూ కూర్చున్నాడు చలపతి. ఇద్దరికీ భోజనాలు వడ్డించింది కమల. ఆమెకూడా ఏదో ఒకటి సరదాగా మాట్లాడుతూనే ఉంది.
“సాయంత్రం నాలుగు గంటలకి రైలుంది మాష్టారూ! అందులో వెళ్ళిపోతాను” అన్నాడు చలపతి. మాష్టారు ఆరోజుకి ఉండమని అడిగినా సెలవు లేదనీ, వెళ్ళక తప్పదనీ చెప్పాడు చలపతి.
సాయంత్రం స్టేషనుకి బయలుదేరేడు చలపతి. కమల బయటివరకూ వచ్చింది. ” వెళతాను కమలా!” అన్నాడతను.
“మంచిది” అందామె. మాష్టారు స్టేషను వరకూ వచ్చారు.
“మా కమలదే నాకు దిగులోయ్! ససేమిరా పెళ్లి వద్దంటోంది. ఎందుకనో చెప్పదు. ఏమీ అర్థం కావడంలేదు నాకు” అన్నారాయన విచారంగా.
రైలు కూత వేసుకుంటూ వచ్చింది. ఫస్ట్ క్లాస్ కుపేలో ఎక్కేడు చలపతి.
“వెళతాను సార్! మద్రాసు వస్తే మా ఇంటికి తప్పకుండా రండి” అన్నాడు మాష్టారితో. అలాగే అన్నారాయన. రైలు కదిలింది.

చలపతి కోటు తీసి హేంగర్ కి తగిలించాడు. కమల ఆ కోటు చూసి, మధ్యాహ్నం – “చాలా బాగుంది కోటు” అంది. ఇంతలో కోటు జేబులో ఓ తెల్లటి కవరు కనిపించింది చలపతికి. ‘అదేమిటి… నేనే కవరూ జేబులో పెట్టుకోలేదే…’ అనుకుంటూ ఆ కవరు తీసి చూశాడు చలపతి. లోపల ఓ పాత రూళ్ళ కాగితం మీద వంకర టింకరగా ఏవో అక్షరాలున్నాయి. కాగితం మురికిగా కూడా ఉంది. చదువుతున్నాడు చలపతి. “కమలా! నేను బాగా పెద్దాడినయిన తరువాత నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మనం కూడా పల్లకీలో ఊరేగుదాము. ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకు– చలపతి.”

రైలు బ్రిడ్జి మీదుగా వెళ్తోంది. పెద్దగా శబ్దాలు. చలపతికి కళ్ళు తిరిగిపోయి, చీకట్లు కమ్ముకున్నాయి. కిటికీ చువ్వలు గట్టిగా పట్టుకున్నాడు.
అవును… ఆ ఉత్తరం కమలకి తనే రాశాడు. అప్పుడు రోజూ రాత్రుళ్ళు తనూ, కమలా గొల్లలింటికి వెళ్ళి జబ్బుగా ఉన్న మాష్టారుగారి భార్యకి పాలు తీసుకొచ్చేవాళ్లు. ఓరోజు బయలుదేరేసరికి కొంచెం ఆలస్యమయింది. రోడ్డు మీద ఓ పెళ్ళి ఊరేగింపు తమకు ఎదురొచ్చింది. బోలెడు పెట్రోమాక్స్ దీపాల మధ్య పల్లకీ , అందులో పెళ్ళికొడుకూ , పెళ్ళికూతురూ చెమ్కీ దండలతో మెరిసిపోతున్నారు. బ్యాండ్ వాళ్ళు సినిమా పాటలు వాయిస్తున్నారు. చాలాసేపు ఇద్దరూ పల్లకీ వంకే చూస్తూ ఉండిపోయారు.
“మనంకూడా పల్లకీలో అలా ఊరేగితే బాగుంటుంది కదూ?” అంది కమల.
“అవును…! మనం పెళ్లి చేసుకుని అలా ఊరేగచ్చు” అన్నాడు తను.
“ఛీ…మనకి పెళ్లెలా అవుతుంది? పెద్దాళ్ళకే పెళ్ళవుతుంది” అంది కమల.
తను బాగా ఆలోచించాడు. ఆ సమస్యకి పరిష్కారం దొరకలేదు. తను ఆ ఊరు వదిలేసే రోజు దగ్గర పడిన తరవాత ఓ ఆలోచన వచ్చింది. వెంటనే తన నోట్సు పుస్తకంలోని కాగితం చించి ఆ వాక్యాలు రాసి కమలకిచ్చాడు. పెళ్లంటే ఏమిటో తెలియని వయసు ఇద్దరిదీనూ! అంటే….? కమల….నిజంగానే…తనకోసం వేచి ఉందా?? భగవాన్! చలపతికి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. మనసు బండబారిపోయినట్టయింది. నిస్సత్తువగా, నిస్సహాయంగా సీట్లో ఒరిగి పోయాడతను.
* * * * * *
కథ ఎంతో ఆహ్లాదంగా మొదలవుతుంది. బాల్యంలోని మధురానుభూతులని , మనోహరమైన జ్ఞాపకాల్ని పాఠకులు– అవి తమవేనేమో అనుకునేట్టుగా కథతోపాటు నడిపించారు రచయిత శాయి. బాల్యస్మృతులను తలచుకుని పరవశించని వారెవరు…? కానీ కథ ముగిసేసరికి హృదయం భారమైపోతుంది. మూగగా మూలుగుతుంది. ప్రేమకథలు..ముఖ్యంగా ‘ఫలించని ప్రేమ’ కథలు పాఠకుల మనసుల్లో ఏదో ఉద్విగ్నతని నింపుతాయి. ఆ పాత్రలతో సహానుభూతి చెందడం వల్ల బాగా జ్ఞాపకముండిపోతాయి. ఈ కథలో ఇంకో ప్రత్యేకత ఏమంటే….’ప్రేమ’ గురించిన ఆలోచనల్లో పురుషుడి మనస్తత్వానికీ, స్త్రీ భావనకీ ఉన్న భేదం స్పష్టంగా తెలియ చెప్తుందీ కథ. పురుషుడు ప్రేమని ఒక ఆటవిడుపుగా అనుకుంటే.. స్త్రీ అదే తన జీవితంలా భావిస్తుంది (ఈ కథ శాయిగారు 1971 లో రాశారు. ‘ ఆంధ్రప్రభ’ లో వచ్చింది.)
ఏది ఏమిటో తెలిసీ తెలియని వయసులో , కన్నులకి పండుగలా కనిపించిన పెళ్లి పల్లకీలో ఊరేగింపుని ఒక వినోదంలా భావించి , అలా తామూ ఊరేగితే బాగుండును అనుకుంటుంది కమల. అలా ఊరేగాలంటే పెళ్లి చేసుకోవాలి….కనక పెద్దయ్యాకా పెళ్లి చేసుకుంటాను…అని రాసి మరీ యిచ్చాడు చలపతి. ఆడపిల్ల కోరిక తీర్చే ‘పెద్దమగాడి’గా అనేసేడు కానీ దాన్ని గురించిన ఆలోచన అతనిలో లేదు , ఎప్పుడూ మళ్ళీ తలుచుకోనూ లేదు. కానీ కమల అలాకాదు..తనతోపాటు ఆ మాటనీ, ఆ భావననీ పెంచి పెద్దచేసింది. తనలాగే చలపతి కూడా అవే జ్ఞాపకాల్లో ఉంటాడనే నమ్మకంలో ఉంది. అసలు చలపతి అన్నేళ్ళ తరవాత తమ ఇంటికి రావడం తనకోసమే అని కూడా అనుకుంది. అయితే, తనకి ఎదురైన నిరాశని అంత హుందాగానూ స్వీకరించింది.
చలపతి పెద్దయ్యాకా తనని పెళ్లి చేసుకుంటాడని ఎంత గాఢంగా నమ్మిందో , ‘ ఎవరికీ చెప్పొద్దు’ అని అతను రాసిన మాటను కూడా అంత గాఢంగానూ ఆచరించింది. తండ్రికి కూడా చెప్పలేదు. చివరికి చలపతికి కూడా నోటితో చెప్పకుండా అతని కాగితం అతనికే అందచేసింది…. బహుశా తనలో అతనిపట్లగల ఆలోచనలకి అది విడాకుల పత్రమేమో!

–సి. యస్.

4 Comments Add yours

 1. DL SASTRY says:

  చాలా మంచి కధ అందించారు సియస్ గారు.

  Like

 2. ఆకొండి సూర్యనారాయణ మూర్తి says:

  కమల తన తలపులకు విడాకులిచ్చింది అనే సి.ఎస్.గారి వాక్యం కథ కంటేకూడా కట్టి పడేసింది. సాయి గారు హాస్య కథలే కాదు హృదయాలు పట్టివేసే ఆర్ద్రత పూరితంగా కధలు వ్రాసారని ఈ కధ చెప్పింది. ఇది నిజానికి కధ అనడం కంటే చాలామంది నిత్యజీవితంలో జరిగిన సంఘటన. కొంతమంది తేలికగా మ ర్చిపోయే
  సంఘటనలు మరికొంతమంది కి ఎడలోతుల్లో నిలిచిపోతాయి. వాటికోసం ఎదురుచూస్తాయి. కమల జీవితంలో ఎదురుచూసిన కళ్ళల్లో కన్నీరు దట్టమైన పొగలా నిలిచింది. మనకు అలాంటి జ్ఞాపక్కాలు ఎదలో పొరలు పొరలు కదిలాయి. మంచి అనుభూతి పూర్వకం మయిన, కధ ఇది సి.ఎస్. గారూ. సాయి గారు మంచికధ అందించారు

  Like

 3. SreeRam says:

  అధ్యక్షా ఈరోజు జంధ్యాల పౌర్ణమి కదా .తెల్లవారుజామున 5 గంటలకి యజ్ఞోపవీతం మార్చుకుని సంధ్యావందనం, గాయత్రి జపం చేసుకున్న నన్ను ఈ మౌన , భగ్న ప్రేమికురాలి కథ చదివించి పొద్దున పొద్దుటే గుండెలు పిండేసే అధికారం
  ఈ CS కి ఎవరిచ్చారు అని ఘాట్టిగా బల్ల గుద్ది మరీ కొశ్చెన్ చేస్తున్నాను..

  Like

 4. V.V.Krishna Rao says:

  శాయిగారికథలొ పాయని బాల్యంపు
  అమల మైన చెలిమి ఆర్ద్రమైన
  రీతి మనము కుమిలె, హృదయము బరువాయె
  విధికి యిట్టి పనులు వింతకాదు!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s