కథన కుతూహలం 55

          మహా కవులని పేరు పొందిన వారిలో కొందరు కథలూ, నవలలూ కూడా రాసి, మంచి కథా/ నవలా రచయితలుగా పేరు పొందేరు.  విశ్వనాథ, శ్రీశ్రీ, అడివి బాపిరాజు వంటివారెందరో ఈ కోవలోకి వస్తారు. అటువంటి వారిలో  ‘గౌతమీ కోకిల’ శ్రీ వేదుల సత్యనారాయణ శాస్త్రి గారిని కూడా ప్రముఖులుగా చెప్పుకోవచ్చు.  వీరికి  ‘మహాకవి’ అనే బిరుదు ఉంది.
          వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు 1900 సంవత్సరంలో పుట్టేరు. సంస్కృతాంధ్ర భాషల్లో మంచి ప్రావీణ్యమున్న వీరు ‘ఉభయ భాషాప్రవీణ’ చేశారు.  కాకినాడ , పెద్దాపురం, పేరూరు హైస్కూళ్ళల్లో ఆంధ్రోపాధ్యాయులుగా పనిచేశారు. వీరి కవితా గురువు శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారు.  దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు వేదుల వారికి మంచి మిత్రుడు.
             వీరి కవిత్వం అత్యంత రసవంతంగా ఉంటుంది.  ‘దీపావళి’,  ‘విముక్తి’, ‘ఆరాధన’  వీరి ప్రముఖ కావ్య సంపుటులు.   మరి వేదులవారి వచన రచనకొస్తే , ‘అపరాధిని’ అనే నవల చాలా ప్రసిద్ధి చెందింది.  ఇంకా  ‘కాలేజీ గర్ల్’  అనే నాటకం,  ‘రాణా ప్రతాప్’ అనే నాటిక  కాకుండా బెంగాలీ నుంచి కొన్ని నాటకాలు అనువాదం చేశారు.
              వీరు నవలలు , నాటకాలు, వ్యాసాలతో పాటు అనేక కథలూ రాశారు. ‘ఆంధ్ర పత్రిక’ , ‘భారతి’ మొదలైన పత్రికల్లో వారి కథలు వెలువడ్డాయి.  వీరి కథలు  “వేసవి మబ్బులు” అనే కథా సంపుటిగా వచ్చింది. వేదుల వారికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. 1936 లో వీరు రాసి,  ‘భారతి’ లో వచ్చిన  “ఆర్తనాదం” అనే కథ వారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ కథ ఇప్పుడు చూద్దాం.
           మాపతి  పెద్ద పేరున్న నాయుడు కుటుంబంలో పుట్టినవాడు. ఏవేవి ఉంటే  ప్రపంచంలో అదృష్టవంతుడంటారో…అతనికి అవన్నీ ఉన్నాయి. అయిదారువేలు వచ్చే పిత్రార్జితమైన భూమీ, కొన్నివేల వడ్డీ వ్యాపారమూ,  ఇవన్నీ చూసి పెట్టడానికి…తండ్రి కాలంనుంచీ ఉన్న నమ్మకమైన గుమాస్తా! ఇంకేం కావాలి? తను సంపాదిస్తేగానీ కాలం వెళ్ళదనే విచారం లేదు. ప్లీడరీ పట్టా పుచ్చుకున్నాడు కానీ ఎప్పుడూ కోర్టుకి వెళ్ళడు.
          ఉమాపతి తాతగారు సైన్యంలో సుబేదారుగా పని చేశాడు. ఆయన బర్మా యుద్ధంలో చూపించిన సాహసానికి మెచ్చి, ప్రభుత్వంవారాయనకి ‘శబరి’ ఒడ్డున బంగారం పండే లంక భూములు ఈనాంగా ఇచ్చారు. ఆయన పట్టిన కత్తీ, డాలూ ఇప్పటికీ వాళ్ళింట్లో ఉన్నాయి.
            ఇక ఉమాపతి తండ్రి కూడా మంచి దేహపుష్టి కలవాడు. తన తండ్రిలాగే కొడుకునీ సైన్యంలో చేర్పించాలని ఆయన అనుకునే వాడు. కానీ ఉమాపతి చిన్నతనంలోనే ఆయన గతించాడు. దాంతో ఉమాపతి తల్లి కొడుకుని అమిత గారాబంగా పెంచింది. అతను నాలుగురోజుల పాటు కనిపించకపోతే ఆ తల్లి ఇప్పటికీ తహతహలాడిపోతుంది.
         ఉమాపతికి అన్నివిధాలా అనుకూలురాలైన భార్య దొరికింది. ఆమె పేరు లక్ష్మి. కానీ, అత్తగారితో సహా ఆమెను ఆ ఊరంతా ‘అన్నపూర్ణ’ అని పిలుస్తారు. అంత ప్రేమగా అందర్నీ ఆదరిస్తుంది.  తన భార్య అంటే ఉమాపతికీ అమితమైన అనురాగమూ, గౌరవమూను. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు కానీ ఒక్క విషయంలో మాత్రం వారికి తరచూ జగడం వస్తూంటుంది.  అది– వేట విషయంలో.  వేట అంటే ఉమాపతికి అంతా ఇంతా సరదా కాదు.  అందులో, గోదావరిపైన పడవమీద బయలుదేరి , పక్షులను వేటాడడమంటే అతనికి ఒళ్ళు తెలియదు.  ఉమాపతి భార్యకి గానీ, తల్లికిగానీ ఈ వేటంటే సరిపడదు.  అయినా కొడుకు మనసు కష్టపెట్టడం ఇష్టంలేక తల్లి మాత్రం అతనిని ఎప్పుడూ వద్దనలేదు. లక్ష్మి మాత్రం ఎప్పుడూ వేట మానమని భర్తతో తగాదా పడేది. కొడుకుతో ఈ విషయంలో గొడవపడినా, తల్లి కోడలిని ఏమీ అనేది కాదు.
          ఉమాపతీ వాళ్ల ఊరు చిన్నదైనా, నివాసానికి ఎంతో అనుకూలమైన ఊరు.  శబరినది గోదావరిలో కలిసే చోటికి మైలు దూరంలో ఉంది. ఊరికి అరమైలు దూరం నుంచి మహారణ్యం! ఆ అడవిలో గనులున్నాయి. ఒకప్పుడు ఏదో విదేశీ కంపెనీ అక్కడ వ్యాపారం సాగించి, రాకపోకలకు వీలైన రోడ్డూ, అక్కడక్కడ గుట్టలమీద మంచి బంగళాలూ నిర్మించింది.
           ఇప్పుడా వ్యాపారం లేదు.  పాపికొండలు దాటేదాకా ఆ మహారణ్యం విస్తరించింది.  పక్షులని వేటాడడానికి ఉమాపతి పాపికొండల వరకూ పడవ మీద వెళ్తుంటాడు.  ఎప్పుడూ కొత్తకొత్త పుస్తకాలు తెప్పించి చదువుతూండడమో , లేకపోతే నదిమీద షికారు బయలుదేరడమో — ఇవే అతనికి అనందమిచ్చే పనులు.  తరచుగా కొన్ని పుస్తకాలు తీసుకొని వంటవాణ్ణి వెంటబెట్టుకుని పడవమీద బయలుదేరి మూడునాలుగు రోజులకుగానీ ఇంటికి తిరిగిరాడు.  అయితే, అతనికి అడవి మృగాలని వేటాడ్డం కన్నా, నది ఒడ్డున ఆకాశాన్ని అందుకునేంత ఎత్తున్న చెట్లమీది పక్షులని వేటాడటం సరదా!
             ఆనాడు కార్తీక శుద్ధ చతుర్దశి. రాత్రి తొమ్మిది గంటలయింది. అంతటా వ్యాపించిన పండు వెన్నెల సృష్టికి ఒక విధమైన మైకం కలిగిస్తోంది.  ఉమాపతి భోజనం చేసి పడకగదిలోకి వచ్చి ,కిటికీలోంచి సుదూరంగా కనబడుతున్న నల్లని కొండల వరసల్ని చూస్తున్నాడు.  గౌతమీ, శబరీ నదుల మీంచి వీచే చల్లటిగాలి చేసే సన్నని ధ్వని అతనికి మధుర సంగీతంలా వినవస్తోంది.  కాసేపయ్యాకా అతను కిటికీ దగ్గరగా ఉన్న పడక్కుర్చీలో కూచుని, ఓ బొమ్మల పత్రికలోని వ్యాసం చదవడం మొదలుపెట్టేడు. ఇంతలో తమలపాకులు పట్టుకుని అతని భార్య లక్ష్మి వచ్చి పక్కన నిలబడి, “ఏమిటి చదువుతున్నారు?” అని అడిగింది.  ఉమాపతి నవ్వుతూ , ” ఇదిగో…చూడు”,  అని పత్రిక ఆమె ముఖం దగ్గరగా పెట్టి చూపించాడు.
          “మృగాలూ, పక్షులూ కనిపిస్తున్నాయి. ఇది ఏదయినా వేటను గురించి రాసిందా?” అంటూ ఆమె ఆకులూ, వక్కలూ అతనికందించింది. “అవును…ఒక దొర దక్షిణాఫ్రికాలో తన వేట అనుభవాలు రాశాడు. ఈ వ్యాసం చాలా బాగుందని చదువుతున్నాను” అన్నాడు అతను ఆకులు నముల్తూ.  ఆమాటతో కళకళలాడే ఆమె ముఖంలో ప్రసన్నత పోయి, చిన్నబోయింది. వేటను గురించి రాసిన పుస్తకాలు చదివితే, తన భర్తకి వేటమీద మనసు పుడుతుందని భయం.  లక్ష్మి హృదయం అతి కోమలమైంది.  ఆమె ప్రతిమాటలో  సౌకుమార్యమూ, పసితనమూ కనపడుతూ ఉంటుంది.  ‘ ఆమె అశోకుడి కాలంలో ఉండవలసింది గానీ, ఈనాటి హింసా ప్రపంచంలో ఉండతగింది కాదు’ అని అనుకుంటూంటాడు ఉమాపతి ఆమె గురించి.  ఏ ప్రాణి కష్టం చూసినా ఆమె మనసు బాధపడుతుంది. మాంసపు కూర ముట్టుకోవడానికి కూడా ఆమె సాహసించదు.  అటువంటి తన భార్య మనసు నొప్పించే మాటగానీ, పనిగానీ ఉమాపతి తలపెట్టడు.
ఇప్పుడు వేట మాట చెవిని పడగానే ఆమె మొహంలో కలిగిన మార్పు కనిపెట్టి, ఆమెకు ఉల్లాసం కలిగించాలని ఉమాపతి కుర్చీలోంచి లేచి, ఆమెని పట్టుకుని కిటికీ దగ్గరకు తీసుకెళ్ళి, బయటకి చూపిస్తూ
“చూడు! ఎంత అందంగా ఉందో!” అన్నాడు. బయట వెన్నెల కాంతిలో వెలిగిపోతున్న రాత్రి– సృష్టిని పరవశింప చేస్తోంది. ఆకాశంలో మబ్బులు గుంపులుగానూ , విడివిడిగానూ పరుగులు పెడుతూ చందమామను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.  ఆ దృశ్యం చూసేకా లక్ష్మి మనసు కాస్త శాంతించింది. ఇంతలో దగ్గరగా ఉన్న చెట్లలోంచి ఏదో పక్షి కూసింది. వెన్నెల్లో ఈదుకుంటూ వచ్చిన ఆ కూత వినేసరికి వాళ్ళిద్దరూ పులకరించిపోయారు.  లక్ష్మి నవ్వుతూ,  “విన్నారా?” అంది.
“అది రోజూ కూసే పక్షే ! ఈ వేళ దాని కూత ఇంత మధురంగా ఉండడానికి కారణం… నీ మహిమో, వెన్నెల మహిమో మరి!” అన్నాడు ఉమాపతి.
“మీ మాటలకేంగానీ, అంత అందంగా కూస్తూ ఆనందపెట్టే అమాయక పక్షులను తుపాకీతో కాల్చి చంపడానికి మీకు మనసు ఎలా పుడుతుంది చెప్పండి!”  అందామె. ఆ మాటలకి జవాబేం చెప్పాలో తోచలేదతనికి.  ‘ వేటలో ఉన్న మజా, ఆనందమూ వేటగాళ్లకి తప్ప మిగిలినవాళ్లకెలా తెలుస్తుంది? అందులో ఆడవాళ్ళకి బొత్తిగా అర్థంకాదు!’ అనుకున్నాడు తనలో తను. అసలు ఏది మరిపించడానికి ప్రయత్నం చేశాడో దాని ప్రసంగమే వచ్చింది. ఇంకేమీ మాట్లాడకుండా వెంటనే అతను “అబ్బా! నిద్ర వస్తోంది” అని ఆవలించాడు.
“పక్షులు ఎంత చక్కనివి! మీ మనసులో దయాదాక్షిణ్యాలు లేవు కాబోలు. అంత తియ్యగా కూసే ఆ అమాయకపు జీవాలపై గుళ్ళు పేల్చే వాళ్ళని…”ఆమె మాట పూర్తికాకుండానే,  “అవి నీకంటే చక్కనివా? నీ మాటలకంటే వాటి మాటలు తియ్యగా ఉంటాయా?” అన్నాడు ఉమాపతి.
ఆమె నవ్వుతూ,  “అయితే చక్కదనాన్నీ తియ్యదనాన్నీ కాల్చి  చంపితేగానీ….” అంది. అతను వెంటనే ఆమె రెండు చేతులూ పట్టుకుని, “నువ్వు నా హృదయ రాణివి లక్ష్మీ!  ఇటువంటి తలపులు నీ మనసులోకి రానీయకు. వెళ్ళి పడుకో.  చాలా పొద్దుపోయింది.  నేను పెందలకడే లేవవలసి ఉంది” అన్నాడు.  ఆమె నిట్టూర్పు విడిచి లోపలికి వెళ్ళిపోయింది.  పెందలకడే లేవాలి అని ఉమాపతి అనడానికి కారణం….. పొద్దుటే అతను వేటకి వెళ్ళడానికి బోటు సిద్ధం చెయ్యమని సరంగుతో సాయంకాలమే చెప్పేడు.
         వేట సన్నాహం పూర్తయింది.  బోటులోనే భోజనం చెయ్యడానికి ఏర్పాటయింది. కావలసిన సామగ్రితో  వంటమనిషి రామచంద్రుడు ప్రొద్దుటే బోటులోకి వెళ్ళిపోయాడు. కళాసులూ, సరంగూ కూడా రేవులోకి వెళ్ళారు.  ఉదయాన్నే ఉమాపతి స్నానం చేసి, వేటకి తగిన వేషం వేసుకుని, కాఫీ ముగించి, తన పడకగదిలోకి వచ్చాడు. చిన్నబుచ్చుకున్న మొహంతో లక్ష్మి నించుని ఉంది. అతనికి అడుగులు ముందుకు పడలేదు.
ఆమె దగ్గరకు వెళ్లి , ” ఎందుకు ఇలా ఉన్నావు?” అన్నాడు.
గుడ్లనీరు కక్కుకుంటూ,  ” మిమ్మల్ని బతిమాలుకుంటాను… ఈవేళ ఈ పాడు వేట మానేయండి. నా మనసు బాగాలేదు. రాత్రంతా పాడు కలలే” అంటూ లక్ష్మి అతని చేయి పట్టుకుంది.
ఉమాపతి చిన్నగా నవ్వి , ” ఆరోజు ఎవడో సన్నాసి వచ్చి ఏవో పాడు మాటలు చెప్పిన దగ్గర్నుంచీ నీకు భయం ఎక్కువైంది.  ఏదో ముష్టికోసం నోటికి వచ్చినట్టల్లా పేలే సన్నాసుల మాటలు విని మనసు పాడుచేసుకుంటే ఎలా చెప్పు!” అన్నాడు.
“సన్యాసి మాటలు కాదు,  భయమూ కాదు. నిజం! ఈరోజు మిమ్మల్ని విడిచిపెడితే ఇక మళ్లా మిమ్మల్ని చూడనే చూడనని నా మనసు చెబుతోంది.  కల కూడా అలాగే వచ్చింది” అందామె.
“అయితే… నువ్వు కూడా నా వెంట రా.  అమ్మతో నేను చెప్పి ఒప్పిస్తాను” అన్నాడతను.
” ఆవిడ అస్సలు ఒప్పుకోరు. పైగా నెలలు నిండేకా పడవ ప్రయాణం పనికిరాదు” అందామె నేలకేసి చూస్తూ.
ఉమాపతి ఉలిక్కిపడ్డట్టయి నవ్వుతూ ఆమెను పట్టుకుని నడిపిస్తూ, “నిజమే.  నువ్వు పడవమీద రావడానికి నేను మాత్రం ఎలా ఒప్పుకుంటాను?  చూడు…దీపాలు పెట్టకముందే నీదగ్గర వచ్చి వాలుతాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు” అని ఆమె కళ్ళు తుడిచాడు.  ఆమెకి ఇంక మాట్టాడ్డానికి అవకాశం లేకపోయింది.  అతను బయలుదేరి బోటున్న రేవుకి వెళ్ళేడు.
      గోదావరీ మహా ప్రవాహం మీద పడవ బయల్దేరింది.  తెరచాప ఎత్తారు. కళాసులు కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు.  కార్తీకమాసం మూలాని గోదావరి చిన్నచిన్న తరంగాలతో శాంతమూర్తిలా ఉంది. ఒడ్డున బండరాళ్ల మీద మహామునుల్లా కొంగలు  దొంగజపం చేస్తున్నాయి.  గట్టుమీద జొన్నచేలు గాలికి తలలాడిస్తున్నాయి. వెదురుపొదల నుంచి వచ్చే కీచుమనే నాదాలకి ఈలకోళ్లు శ్రుతి వేస్తున్నాయి.  అయితే, ప్రతిసారీ వేటకి నదిమీద బయలుదేరినప్పుడు అనుభవించే పారవశ్యం– ఉమాపతి ఈసారి అనుభవించలేక పోతున్నాడు. అతని మనస్సులో ఏదో తెలియని ఆందోళన కలుగుతోంది. సమయం పది అయింది. ఎండ చుర్రుమంటోంది. ఉమాపతి వంట మనిషి రామచంద్రుణ్ణి పిలిచి,  “వంటయిందా?” అని అడిగాడు.
“అయింది బాబూ!  పోచారం రావడంతోనే పడవ ఆపి భోజనం కానిచ్చుకుని మనం గట్టు చేరుకోవచ్చు” అన్నాడు వంటవాడు.
“సరే..! మధ్యాహ్నం గాలి సరిగ్గా ఉండకపోవచ్చు.  పైగా ఎదురుగాలి కూడా! ఎలాగైనా ఆరు దాటకుండా ఇంటికి చేరాలి.  మధ్యాహ్నానికి కావలసిన టిఫిన్ కూడా ఇప్పుడే తయారుచేసుకో” అని ఉమాపతి పెట్టె తీసి తుపాకీ చేతిలోకి తీసుకున్నాడు.  ఓసారి తుపాకీ సరిచేసి, తుడిచి, దాని గుర్రము (మీట) ఓసారి నొక్కిచూసి మళ్ళీ పెట్టెలో పెట్టాడు. తూటాల సంచీ బయటికి తీసి పెట్టేడు.  పోచారం రాగానే ఉమాపతి భోజనం ముగించి,  తుపాకీ, తూటాల సంచీ తీసుకుని, రామచంద్రుడిని తనకుడా రమ్మని పడవదిగి గట్టువెంట బయలుదేరేడు.
ఇదివరకూ ఎండవేళలో పక్షులు గుంపులు గుంపులుగా చెట్లమీద ఉండేవి.
కొన్ని పిట్టలు ఈ గట్టునుంచి ఆ గట్టుకు పైన ఎగిరిపోతూండేవి.  కానీ ఆశ్చర్యం! ఆ రోజు వేటకి తగిన పక్షి ఒకటైనా కనిపించడం లేదు. ఉమాపతికి అనుకున్న పని జరగకపోతే విసుగు పుడుతుంది. అతనిలో పట్టుదల పెరిగింది. వేట కూడా జూదం వంటిదే కదా! ఎలాగైనా కొన్ని పక్షులని కొట్టకుండా వెనక్కి తిరిగి వెళ్ళడానికి అతని మనసు అంగీకరించడం లేదు.
మూడుగంటలయింది. పొద్దు వాలుతోంది. ఉమాపతి తుపాకీ భుజం మీద పెట్టుకుని చెట్ల పైభాగాలనీ, పొదలనీ పరికించి చూస్తూ ముందుకు వెళ్తున్నాడు. దూరంగా విప్పపువ్వు లేరుతున్న కోయపడుచుల ‘రేల’ పాటలు సన్నగా వినపిస్తున్నాయి. వాచీ చూసుకున్నాడు ఉమాపతి. నాలుగవుతోంది. ఇంక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. నాలుగు దిక్కులా వెదుకుతున్నాడు.  గట్టుకు కొంచెం దూరంలో అంత ఎత్తుగా లేని చెట్టుకొమ్మ మీద కలిసి కూర్చున్న రెండు పక్షులు ఉమాపతి కంట పడ్డాయి.
అవి చక్రవాక పక్షులు (వాటిని జక్కవ పక్షులంటారు. వాటిని ప్రేమకీ, దాంపత్య ప్రణయానికి  ఉదాహరణగా చెప్తారు) వంటవాడు రామచంద్రుడు ఇంకా వెనకే ఉన్నాడు.  ఉమాపతి మెల్లిగా పొద చాటుచేసుకుని ఆ పిట్టలని గురి చూశాడు. తుపాకీ పేలింది. గొట్టంలోంచి సన్నని పొగ వచ్చింది.  పిట్ట నేలమీద పడిన చప్పుడు!  రెండో పిట్ట గట్టిగా అరుస్తూ కొండపైకి ఎగిరింది. ఆ ఆర్తనాదానికి ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోయింది! అటువంటి జాలిగొలిపే కూత ఉమాపతి మునుపెన్నడూ వినలేదు. ఎందుకో అతని హృదయం కలుక్కుమంది!
ఇంతలో రామచంద్రుడు వచ్చి “పక్షి పడ్డది పక్షి పడ్డది”  అంటూ ఆ చెట్టు కిందికి పరుగెత్తి, నెత్తురోడుతున్న పక్షిని పట్టుకొని పైకెత్తేడు.  తన ప్రియురాలిని కోల్పోయిన మగపక్షి ఆర్తనాదం అతన్ని దహించివేస్తోంది. అంతటి శోకం అతనెప్పుడూ వినలేదు.  నాడు వాల్మీకి హృదయాన్ని ద్రవింపచేసిన క్రౌంచ పక్షి శోకం హఠాత్తుగా అతని మనసులో మెదిలింది.
వెంటనే రామచంద్రుడితో,  “ఆ పిట్టని అక్కడే ఉంచు… ముట్టుకోవద్దు” అని చెప్పి తుపాకీ వీపున తగిలించుకుని , పక్షి ఏడుపు వినలేక చెవులు మూసుకుని గబగబా పడవ వైపు బయలుదేరాడు. ఉమాపతి వాలకం రామచంద్రుడికి అర్థం కాలేదు. ఓ మామూలు పిట్ట చావు ఉమాపతిని ఎందుకు అంత కలవర పెడుతోందో వాడికి తెలియడం లేదు. పక్షిని అక్కడే వదిలేసి ఉమాపతి వెనకాల నడిచాడు.
     పడవ ఇంటి మొహం పట్టింది.  ఇల్లు చేరడానికి ఉమాపతి తెగ ఆరాటపడుతున్నాడు.  కళాసులు శ్రమని లెక్కచేయకుండా తెడ్లు వేస్తున్నారు.  పొద్దుకూకింది. పున్నమి వెన్నెల మిలమిలలాడుతూ లోకమంతా సన్నని తెల్లని తెరలా కప్పేసింది.  ఉమాపతికి ఆ పక్షి మరుపుకి రావడంలేదు.  ఆ ఏడుపే మాటిమాటికీ అతని తలలో గిర్రుమని తిరుగుతోంది.  పొద్దున్న బయలుదేరేటప్పుడు తన భార్య లక్ష్మి చిన్నబోయిన మొహం అతని కళ్ళల్లో తిరుగుతోంది.
‘అయ్యో! నా లక్ష్మి చెప్పిన మాట విని నేను వేటకి వెళ్లకుండా ఉంటే నాకీ ఆవేదన లేకపోను’. అనుకున్నాడు.
“అరగంటలో చేరచ్చు బాబూ! వడ్డిగూడెం దగ్గిరకి వచ్చాం” అన్నాడు రామచంద్రుడు.  రాత్రి తొమ్మిది కావొచ్చింది. గత రాత్రి ఈ సమయానికే పిట్టకూత విని , లక్ష్మి అన్నమాట అతనికి జ్ఞాపకం వచ్చింది.  పడవ ఒడ్డుకి చేరింది.  ఉమాపతి ఒక్క దూకు దూకి , సామాను వెనకాల తీసుకురమ్మని రామచంద్రుడికి చెప్పి, ఇంటివైపు గబగబా అడుగులు వేస్తున్నాడు.
ఇల్లు దగ్గరవుతున్న కొద్దీ అతనిలో ఆరాటం పెరిగిపోతోంది. ‘లక్ష్మి ఏం చేస్తోందో?  తన మాట వినకుండా వేటకి వెళ్లేనని ఎంత బాధపడుతోందో!  ఇకముందు అమెకిష్టం లేని పని చెయ్యకూడదు. తనూ  ఈ వేటమీద మోజు తగ్గించుకోవాలి’ అని ఉమాపతి నిశ్చయించుకున్నాడు.
ఇంటి దగ్గరకొచ్చేశాడు. ‘అదేమిటి?ఇంటిముందు జనం మూగి ఉన్నారు?’ ఉమాపతి గుండె దడదడలాడింది. ‘వేళగాని వేళ తన ఇంటికి ఈ జనమంతా ఎందుకొచ్చారు?’  అనుకుంటున్నాడు. అతన్ని చూడగానే జనం పక్కకి తప్పుకున్నారు. సావడిలోకి వెళ్ళగానే గుమాస్తా కనిపించాడు. అతని మొహం పాలిపోయి ఉంది.  ఉమాపతిని చూడగానే, ” వచ్చారా! త్వరగా లోపలికి వెళ్ళండి.  కూనవరం నుంచి డాక్టరుగారు వచ్చి లోపలున్నారు” అన్నాడు.   కంగారుగా ఉమాపతి లోపలికెళ్ళేడు. గది బయటే డాక్టరు నిలబడి ఉన్నాడు. “వచ్చారా… కానీ..” అని ఇంక అతను మాట్లాడలేకపోయాడు.
ఉమాపతి ఆయన చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు.  లోపల గదిలోంచి భద్రాచలం డాక్టరు , మంత్రసాని బయటికి వస్తున్నారు.  ఉమాపతి గది లోపలికి వెళ్లి చూశాడు.  అతని ‘ప్రాణశక్తి’ ,  ‘జీవితలక్ష్మి’..కింద పడుకుని ఉంది!  డాక్టరు నెమ్మదిగా దగ్గిరకి వచ్చి, ఉమాపతి చెయ్యి పట్టుకుని ,
“మధ్యాహ్నం ఒంటిగంట నుంచీ ప్రయత్నించినా లోపల పోయిన పిండాన్ని బయటికి తియ్యడానికి వీలు కాలేదు” అన్నాడు. పక్క గదిలోంచి తల్లి ఏడుపు వినిపిస్తోంది.  ఇంతలో మంత్రసాని, “ఎంత కష్టపడితే ఏం లాభం? ఎనిమిదింటికి నెప్పులు వచ్చాయి. శిశువు లోపలే పోయింది.  బయటికి తీయగలిగితే తల్లి బతికి ఉండునేమో. కానీ పాపం– ఆవిడ అంత బాధలోనూ , “వారు వచ్చారా? అని ఎన్నోసార్లు అడిగారు. చివరిసారి వారిని చూడడానికి నోచుకోలేదు అన్నారు” అని చెప్పింది.
ఉమాపతికి జగత్తంతా అంధకారమైపోయింది.  సర్వమూ శూన్యమైపోయింది. దూరం నుంచి ఏదో ఆర్తనాదం వినపడుతూ అతని హృదయంలోనూ , ఆ గదిలోనూ నిండిపోయింది. కింద పడి ఉన్న లక్ష్మి కన్నులూ, అక్కడ తను వేటకి తెగిపడిన చక్రవాక పక్షి కన్నులూ అతనికి ఒకే విధంగా కనపడి అతని జీవశక్తిని కుదిపేశాయి.  రెండు చేతులతోమొహం మూసుకుని ఆ చక్రవాకం లాగానే ఉమాపతి ఆర్తనాదం చేశాడు.
* * * * * *
       అడవిలో ఆడపక్షి నేల కూలగానే , అంతులేని ఆవేదనతో మొదలైన మగపక్షి ఆర్తనాదం — ఉమాపతి హృదయమంతా నిండి, పొంగిపోయి అతన్ని నిలువునా ముంచెత్తి, వదలకుండా వెంటాడి ‘వేటాడి’ అతని ఇంటిని ముట్టడించి చివరికి అదే తీరని వ్యధ అతనికి మిగిల్చింది.  వేట అతనికి సరదా కావచ్చు! కానీ వేటలో హింస ఉంది. హింస సరదాగా ఉంటుందా? అదొక బలహీనత. ఒక వ్యసనం. అందుకే అతను ప్రాణంగా ప్రేమించే భార్య మాటను కూడా కాదని వెళ్ళిపోగలిగేడు. ఆ తరువాత ఎంత దుఃఖిస్తే మాత్రం ఏం ప్రయోజనం? ఆ మగపక్షి పడే బాధ నువ్వు కూడా పడు అని అతని పట్ల శాపమై మిగిలింది.
        వేదుల సత్యనారాయణశాస్త్రి గారు ఈ కథని 1936 లో రాశారు. కథంతా సరళ గ్రాంథికంలోనూ,  శిష్ట వ్యవహారికంలోనూ నడుస్తుంది. ఈ తరం వారు సులువుగా చదువుకోవడం కోసం కొంత స్వేచ్ఛ తీసుకుని
సులభశైలిలోకి మార్చడం జరిగింది. గోదావరి నది అందాలూ, దాని చుట్టూ ఉన్న ప్రకృతి సోయగాలనూ అద్భుతంగా వర్ణిస్తూ,  వాటితో సమాంతరంగా కథని అంతే ధీటుగా నడిపించారు వేదులవారు.  కథలో కరుణ రసం చిప్పిల్లుతుంది! శోక రసం గుండెని కోస్తుంది.
       వాల్మీకి మహర్షి ఓరోజు తమసా నది ఒడ్డున ఉండగా, ఒక బోయవాడు అక్కడ చెట్టుమీదున్న క్రౌంచ పక్షుల జంటలో ఒకటైన మగపక్షిని బాణంతో నేల కులేసేసాడు.  రక్తసిక్తమైన ఆ పక్షిని, అప్పుడు ఆడపక్షి చేసిన విలాపాన్ని చూసిన వాల్మీకి మనసు తీవ్రంగా కలవరపడింది. ఆ శోకం శ్లోక రూపమై బయటికి వచ్చింది…..అది రామాయణ మహాకావ్య నిర్మాణానికి మూలమైంది.  వేదుల వారు అదే స్ఫూర్తితో ఈ కథని రాశారు.  విషాదాంతమైన ఈ కథ పాఠకుల హృదయాల్ని బరువెక్కిస్తుంది.
__ సి.యస్.

One Comment Add yours

  1. Padma ayyagari says:

    చాలా బావుంది. చాలా కాలం పరాయి దేశంలో రణగొణ ధ్వనులు మధ్య ఉండి ప్రశాంతమైన పల్లెటూరు వేస్తే ఎంత ఆనందం గా ఉంటుందో అలా ఉంది ఈ కథలు చదువుతుంటే.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s