కథన కుతూహలం 57

1971లో ఆంధ్రప్రభ దీపావళి కథల పోటీల్లో యం. రామకోటిగారి కథకి మొదటి బహుమతి వచ్చింది. ఆ కథ పేరు “శకటిక“.

   ప్పుడు ఆ కథ చదివి, చాలా రోజులు దాన్ని గురించి ఆలోచించాను. రచయిత ఆ కథ రాసిన పద్ధతి, అందులో వాడిన ‘తూర్పు‘ యాస నాకు బాగా జ్ఞాపకముండిపోయింది. ఆ తరవాత రామకోటి గారి కథలు కొన్ని చదివినా ఈ ‘శకటిక‘ అనే కథ మాత్రం బాగా నన్ను వెంటాడింది. మళ్ళీ ఈ ‘కథన కుతూహలం’ కోసం కథలు చూస్తోంటే ఈ కథ కనిపించింది. దీన్ని మన పాఠకులకి పరిచయం చేద్దామనిపించింది.
   యం. అంటే మట్టపల్లి రామకోటి. 1960ల నుంచి వీరి కథలు అన్ని తెలుగు వార, మాస పత్రికలలో విస్తృతంగా ప్రచురితం అయ్యాయి. ఊడల మఱ్ఱి’ , ‘కడలి ఘోష’, ‘కణ్వాశ్రమం’, ‘దెబ్బలుతిన్న దేవుడు’, ‘ఛద్మవేషి’, ‘హంసగీతం’, ‘స్లీపర్ కోచ్’ మొదలైనవి వీరి ప్రఖ్యాతి పొందిన కథలు. ‘ప్రియదర్శిని’, ‘చక్కని రాజమార్గం‘ వీరి కథా సంపుటాలు. అడుక్కు తినే వాళ్ల బతుకుల్లోని సంఘర్షణలకి అద్దం పట్టిన కథ ఈ ‘శకటిక’.
   పీర్ల కోనేరు ఊరికి నడిబొడ్డులో ఉంది. రోజు రోజుకీ ఆ కోనేరు గట్టు– మోతుబరుల కార్ఖానాగా మారిపోతోంది. గట్టు దిగువున చెరువులో చేపలూ, గట్టువార పేవుమెంటు మీద తాడూ బొంగరం లేక, దిక్కూమొక్కూ లేని జీవులూ గిలగిల తన్నుకుంటూంటాయి. బికార్లూ, ఫకీర్లూ, అవిటి వాళ్లూ, కుంటీ గుడ్డీ, కుష్ఠు కునిష్టూ– ఇలా అందరూ అక్కడే కాపురం. నడివీధిలో గోనె పరదాలు దించుకుని, పురుళ్లూ- పుణ్యాలూ, స్నానాలూ-పానాలూ, జోలలూ-గోలలూ.. అన్నీ ఆ పేవుమెంటు మీదనే! చిలక జోస్యాలూ అక్కడే, ‘చిలక’తో సరసాలూ, విరసాలూ అక్కడే! ప్రణయాలూ, ప్రళయాలూ, కుయుక్తులూ, కుతంత్రాలూ, బతుకూ చిదుగూ…అంతా… అన్నీ అక్కడే!! ఆ ఊళ్ళో దేవుడి రథోత్సవం బాగా జరుగుతుంది. తను ముచ్చటగా సృష్టించిన లోకం ఎలా ఉందో చూద్దామని గుడి నుంచి సంచారానికి బయలుదేరిన జగన్నాథుడు రథం మీద పీర్ల కోనేరుకి అవతల ఉన్న గుజ్జనగూళ్లకి చేరుకున్నాడు. అక్కడ కొన్నాళ్ళుంటాడు.
జగ్గడు కూర్చున్న నేలబండిని నాగన్న తోసుకొస్తున్నాడు.
“తోయ్యవోయన్నా..! తొయ్యి! ఎండ సిరసిరలాడతంది. ఈపు మాడిపోతంది” అంటూ తన మొండి చేతులెత్తి జగ్గడు నాగన్నని తొందర పెట్టాడు.
“గుమ్మటంనాగ కూకున్నవు….. నీకేటి అలుపా సొలుపా? తోస్తన్నానా? ఎండ మండిపోతంది.. పేనం సాలొస్తంది”. అని ఈసడించుకుంటూ, బండి పక్కకి తోసి, ఆరోజు ముష్టి ఎంత పోగైందా అని మొలలో చిల్లర తీసి లెక్కపెట్టుకుంటున్నాడు నాగన్న.
“ఇసుగెందుకులే..? సెరువుగట్టుకాడి కెళ్ళి లెక్క సూసుకుందాంలే. సాదువొచ్చి ఎల్లిపోనాడంటే ఇయ్యాలా పస్తే మనకి… పద పద” అన్నాడు జగ్గడు. నాగన్న బండి లాగుతున్నాడు. బిచ్చగాళ్ళందరూ ఎండ ముదిరేదాకా ఊళ్ళో అడుక్కుని, కోనేటి గట్టు చేరుకుని చెట్టునీడ కోసం కుమ్ములాడుకుంటూంటారు. ఆ పూట పోగేసుకున్న డబ్బులు అన్నం పెడతాయా, పెట్టవా అని దిగాలుపడి లెక్కలు పెట్టుకుంటారు.
   గుడి దగ్గర దొరికిన అరటిపళ్ళు ఒకటీ ఒకటీ బండి తోస్తూ మింగుతున్నాడు నాగన్న. కోనేటిగట్టు దగ్గరవుతోంది. సమయం పన్నెండు అయినట్టు పడవల కంపెనీ సైరను మోగింది. ముష్టివాళ్లు తుళ్ళిపడి కుండలట్టుకుని అన్నం కెరడు కోసం చెరువుగట్టు చేరుకుంటున్నారు.
“నాకూ ఓ పండెట్టన్నా..!” అన్నాడు జగ్గడు నాగన్న వేపు చూస్తూ.
“ఎన్ని దొరికినాయనీ ఎట్టీడానికి?” అంటూ ఉన్న అరటిపండు గుటుక్కున మింగేసి, తొక్క జగ్గడు మొహాన కొట్టేడు నాగన్న.
“ఓర్నీ అన్నాయం కాలిపోనూ.! తొక్క పెడతావూ? నన్ను సూసే కదంటయ్యా… ఎవురు దరమం సేసినా? ” అన్నాడు జగ్గడు.
“ఆ… ఆ…నిన్ను సూసే” అంటూ చెరువుగట్టు వేపు చూశాడు నాగన్న.
   గణగణమంటూ గంటల మోత దగ్గరైంది. పాదాల దాకా కాషాయ బట్టలు వేసుకుని, మొహాన విభూతి రేఖలు దిద్దుకుని మెడలో రుద్రాక్షలు సద్దుకుంటూ, తళతళలాడే కాశీ కావిడి భుజాన్నేసుకుని, గిన్నెలనిండా అన్నంతో చెరువుగట్టు మీద ప్రత్యక్షమయ్యేడు సాధువుబాబు! అంతే.. వెంటనే బండిని అడ్డదిడ్డంగా తోసిపారేసి సాధువు దగ్గరకి పరుగెత్తిపోయాడు నాగన్న. నోట మాటరాక బండిమీద కూలబడిపోయాడు జగ్గడు.
   కూలీనాలీ చేసుకుని ఉన్న ఊళ్ళో ఒంటిగాడైనా బాగానే బతికాడు జగ్గడు. కానీ ఈ మాయదారి ‘పెద్దరోగం’ వచ్చి మూలబడిపోయాడు. ఊళ్ళో దత్తుడు జాలిపడి నాలుగు చెక్కలూ, చక్రాలూ అతికి ఓ బండి తయారు చేయించి, “ఎల్లరా జగ్గా!…. పట్నం పో….ఇక్కడ నిన్నెవరూ చేరనియ్యరు” అన్నాడు. “పున్నాత్ముడు” అనుకున్నాడు జగ్గడు ఆ పాత రోజులు గుర్తుకొచ్చి. అసలు నిన్న మొన్నటివరకూ సీతాలే తోసేది బండి. ఇద్దరూ కలిసి అడుక్కుంటూ, దారినపోయే వాళ్ల మనసు కరిగించి, పైసలు సంపాదించుకుని హాయిగా గడిపేవారు. ఆ నాగన్నగాడు చేరినతర్వాతే అంతా తారుమారైపోయింది. చెరువుగట్టు మీద సాధువు చుట్టూ గుమిగూడిన గుంపులో సీతాలు ఉందేమోనని మొండి చేతులతో నేలమీద బండి తోసుకుంటూ, మెల్లగా గట్టు చేరుకున్నాడు జగ్గడు.
“పాత బాకీలన్నీ ముందు తీర్చండి. పావలాకాసెడితేనే ముద్ద సేతికొస్తది. మొండి సేతులతో వస్తే నాబంనేదు”. జగ్గడికేసి ఓరగా చూస్తూ, చుట్టూ జేరిన వాళ్ళని చెదరగొడుతూ అంటున్నాడు సాధువు.
“బాబూ! నువ్వు దయచూడాలి. నేకపోతే చచ్చూరుకుంతాం. బాబ్బాబు!” అంటూ బతిమాలుకుంటున్నాడు ఓ ముసలాడు.
“నన్నేటి సెయ్యమంటావయ్యా? ఎంతకని తిరగనూ? ఎక్కే గుమ్మం, దిగే గుమ్మవే గానీ… ఓయమ్మా పిడికెడు మెతుకులు రాల్చదు. పైపెచ్చు నానేదో ముష్టికొచ్చినట్టు కుక్కలా తరిమి, ధడేల్మని తలుపులేసేసుకుంటారు. మా సెడ్డ సిరాగ్గుంది. సీ..! సాదువులంటే బొత్తిగా బయమూ నేదూ… బక్తీ నేదు. మాయిదారి కాలం!” అంటూ కాలాన్నీ, లోకాన్నీ ఇల్లాళ్లనీ దుమ్మెత్తి పోస్తున్నాడు సాధువు– ముసలాడికి అరువు ఇవ్వడం ఇష్టంలేక!
సీతాలు కోసం చూశాడు జగ్గడు. “సాదువు బాబూ!” అని పిలిచాడు.
“ఏం జగ్గన్నా!… ఏటిలాగొచ్చినవ్? దారి గానీ తప్పావా?” అప్పుడే జగ్గడ్ని చూసినట్టు మొహంపెట్టి అడిగాడు సాదువు.
“మా సీతాలగుపడ్డదా?” అన్నాడు జగ్గడు.
“సంసారాలెట్టినోల్లు…మా కాడికెందుకొస్తారయ్యా?…మీ గెంజి మీరే కాసుకుంటన్నారంటగా? అహ… ఇన్నాన్లే!” ఎత్తిపొడుపుగా అన్నాడు సాదువు.
“దిక్కుమాలినోల్లం బాబూ..! మాతో ఏటి మీకు? ఉన్నరోజు ఇంత ఉడకేసుకుంటం… లేన్నాడు ముద్దకోసం మీ కాడికే ఎగబడతాం” అన్నాడు చిన్న మొహం చేసుకుని. ‘సీతాలు రానేదా? అయితే గెంజి కాసుంటది.’ అనుకుంటూ నేలమీద చేత్తో తోసుకుంటూ ఎదర పేవ్ మెంటు దగ్గరకి వెళ్ళిపోయాడు జగ్గడు.
“ఇదిగో జగ్గన్నా… సెబుతున్నానినుకో… పాడైపోతావు. సంసారమేటి నీకు? ఆశ్శరమానికి అడ్డు రామోకు. మాకు కోపం తెప్పించకు. మసైపోతావు. కానీ, అద్దనా సదివించుకుని… అన్నం తిని పున్నెం సేసుకో” అని పాఠం చెప్పాడు సాధువు వెళ్ళిపోతున్న జగ్గడికి.
   అనాథల కోసం అంటూ ఊరంతా కాశీ కావిడి తిప్పి, అన్నం సేకరించి అనాథలకే అమ్ముకుంటున్నాడు సాధువు! తన మొండి బతుకునీ, అవుకు తనాన్నీ దారినపోయే నలుగురికీ చూపించి, తన దైన్యాన్ని ఎరబెట్టి, కాళ్ళకి అడ్డుపడి, గుండె కరిగించి, జోలిపట్టి దొరికిందంతా తనకేమీ పెట్టకుండా దిగమింగుతున్నాడు నాగన్న! భగ్గున మండిపోయాడు జగ్గడు. ఏమీ చెయ్యలేక తన నిస్సహాయతను తానే నిందించుకున్నాడు. పేవుమెంటు మీద ఓ వారకి బండి తోసుకుంటూ వచ్చి ఆప్యాయంగా, “సీతాలూ!” అని పిలిచాడు.
“ఏం?” అంటూ ముటముటలాడుతూ గోనె పరదా ఎత్తుకుని వచ్చింది సీతాలు.
“గెంజి కాసినావేటే?…నీకోసం ఎయ్యి కల్లెట్టి సూసినాను సాదువుకాడ” అన్నాడు జగ్గడు.
“ఏటెట్టి కాయనూ?…దొరికిన డబ్బులేయీ? ఒట్టుకురా..” అంది సీతాలు.
“డబ్బులన్నీ నాగన్న కాడున్నాయి… ముందల గెంజెయ్యే..కడుపు మండిపోతాంది” అన్నాడు జగ్గడు.
“ఎంతేటి?” అందామె.
“ఏవో… నాకేటెరిక?… ఆడే ఏరతన్నడు. ఆడే యజిమాని.
“ఏడాడు? ఎక్కడ పెత్తనాలికెల్లినాడు?” అంటూ విసుగ్గా, ఓ సీనారేకు డబ్బాలో ఇంత గెంజి పోసి, ఇంత ఉప్పుకల్లేసి జగ్గడి చేతిలో ఎత్తి కుదేసింది సీతాలు.
“కుక్క కడీసినట్టు… ఆ ఈసడింపేటే?… మిరపకాయేనా, ఉల్లిరెక్కేనా అడేయ్యి” అన్నాడు బాధగా జగ్గడు.
“మా రాజుగోరు కాదూ?.. నంజు కావాలంట… సిప్ప మొకమోడికి..” అంటూ ఓ పచ్చిమిరపకాయ తుంపి పడేసి లోపలికి పోయింది సీతాలు. గుండె కలుక్కుమంది జగ్గడికి. ఉబికిన కన్నీళ్లు జలజల రాలేయి. గంజి గుక్క దిగలేదు…..ఉప్పు కశం!
   పదేళ్ల కిందట– ఆ రోజు అడుక్కుని చెరువుగట్టు చేరుకున్నాడు జగ్గడు. అక్కడ దీనాతిదీనంగా ఏడుస్తూ కనిపించింది సీతాలు. వయసులో ఉందని లేవదీసుకొచ్చిన ఒక జేబులు కొట్టే గుంటడు.. మూడు రోజులపాటు సీతాలుతో కాపురంచేసి, తెల్లారేసరికి పక్కనున్న యానాది గుంటతో ఉడాయించేశాడు. రెక్కలు తెగిన పిట్టలా గిలగిలా తన్నుకుంటోంది సీతాలు. జగ్గడు జాలిపడి అన్నం కెరడూ, ఓ అరటిపండు ఇచ్చి వివరాలు కనుక్కున్నాడు. తనది సింహాచలం దగ్గర అడివివరమనీ, అమ్మా నాన్నా చిన్నప్పుడే పోయారనీ, తన గుడ్డి తాత- అప్పన్నబాబు కొండమీద అడుక్కుంటూ తనని పెంచాడనీ చెప్పింది సీతాలు. ఇప్పుడీడు తనని లేవతీసుకొచ్చి దగా చేసేడనీ ఏడిచింది.
“మరయితే… నాతో తోడుండిపోతావేటి?” అని నసిగాడు జగ్గడు. అప్పటికి అతనికి రోగం అంతగా ముదరలేదు. ఇంకా పుష్టిగానే ఉన్నాడు. కాళ్లూ, వేళ్ళూ మొండి పడలేదు. సీతాలు దిక్కులు చూస్తోంది.
“ఏటంటవూ?” అన్నాడు జగ్గడు.
‘నన్నెవడు సేరదీస్తడూ?’ అని తనలో అనుకుని, “గెంజోస్తే సాలు… ఎక్కడైనా ఒకటే..” అంది సీతాలు.
“సెబాసు…నువ్వు నా బండి తొయ్యి…ఇద్దరం కలిసి అడుక్కుందాం. కానీయో, పరకో కూడదీసుకుని గట్టుమీదో, చెట్టు నీడనో పడుందాం” అన్నాడు జగ్గడు.
   అలాగే ఇంత కాలం హాయిగా గడిపారు ఇద్దరూ. నడివీధిలో కాపరమైనా కలిసిమెలిసి కమ్మగా, లోకం మాటుమణిగిన వేళ వెచ్చగా కాపురం చేశారు. ఏరోజు డబ్బులు ఆరోజు చూసుకుని మురిసిపోయేది సీతాలు. ఇదిగో ఇప్పుడు నాగన్నగాడు ప్రవేశించాడు. సీతాలు మారిపోయింది. ఇంక ఊరుకోకూడదు అనుకున్నాడు జగ్గడు.
“సీతాలూ!..” అని గావుకేక పెట్టాడు జగ్గడు.
“ఎందుకలా బొబ్బలెడతావూ… గొడ్డునాగ?” అంటూ బయటికి వచ్చింది సీతాలు.
“గొడ్డునాగే అగుపడతానే… నంజా!” అన్నాడు జగ్గడు కళ్లెర్రజేసి.
“నంజా గింజా అంటన్నవు….కుష్టి సచ్చినోడా! కన్నోడివా, కట్టుకున్నోడివా?” బావురుపిల్లిలా తిరగబడింది సీతాలు.
“సేర దీసినోడినే…అట్టే పేలమాక… నోరుమూసుకుని ఇను.. ఇయ్యాల్టి నుండి బండి నువ్వే తోయ్యాల!” అన్నాడు జగ్గడు.
“నాన్తొయ్యలేను….నువ్వే సూసుకో..” అంది సీతాలు.
“సూసుకుంటాను…సూసుకుంటాను. ముందల ఆ డబ్బుల డబ్బీ ఇక్కడెట్టి మరీ సెప్పు కబుర్లు” అన్నాడు
“ఏ డబ్బీ?” అంది సీతాలు.
“పదేళ్లబట్టి నా కడుపు మాడ్చి…. కూడబెడతన్న డబ్బీయే… ఎరగవేటి?” అన్నాడు గట్టిగా. ఇంతలో నాగన్న అక్కడికి వచ్చాడు.
“తిండో..? ఏటి మిగిలిపోంది?” పేచీలోకి దిగుతూ అంది సీతాలు.
“నా నెరగననుకోకు….అంతా మిగులే..” అన్నాడు జగ్గడు , నాగన్నకేసి గుర్రుగా చూస్తూ!
“ఏటి మిగులుద్దయ్యా?..ఆడకూతుర్ని సేసి సతాయిత్తన్నావు?” కలుగచేసుకుంటూ అన్నాడు నాగన్న.
“మా ఇద్దరి మద్దికీ రాక…మాట దక్కదు” అరిచాడు జగ్గడు.
ఈ గోలకి చుట్టుపక్కల ముష్టి వాళ్ళంతా చేరి , నాగన్నకి చీవాట్లు పెట్టి, అక్కడినుంచి పొమ్మన్నారు. తెల్లబోయిన నాగన్నకి కళ్ళతోనే సైగ చేసింది సీతాలు. నాగన్న దూరంగా పోయాడు. ‘ఎలాటి సీతాలెలాగైపోనాది? ఆ నాగన్నగాడ్ని సూసుకునే గుంట పెటపెట పేలిపోతాంది’ అనుకున్నాడు జగ్గడు పాతరోజులు గుర్తుకొచ్చి!
   కాసేపటికి ఒక చేతిలో ఆకులో అన్నం, మరో చేతిలో ఒక పొట్లం పెట్టుకుని ఆయాసపడుతూ, ” సీతాలూ… సీతాలూ! అన్నం ఒట్టుకొచ్చినా..” అంటూ వచ్చాడు నాగన్న.
“సేతులో ఆ పొట్లమేటి?” అని ఇంత మొహం చేసుకుని గోనె పక్కకి తీస్తూ బయటికి వచ్చింది సీతాలు.
“ఒట్టి కూడు ఏటి తింటావని…, సింగు హొటేలు కెళ్ళి ఏడిఏడి పకోడీ కట్టించినా..” అన్నాడు నాగన్న.
ఓయ్యారంగా మూతి తిప్పుతూ, ” అమ్మ నా రాజే!” అంటూ గభాల్న అందుకుంది సీతాలు. నాగన్నకి రెండు పెట్టి, తనూ అతనితో కలిసి నవ్వుకుంటూ తింటున్నారు. జగ్గడి మనసు చివుక్కుమంది. ఉండబట్టలేక, “సొమ్మొకడిదీ… సోకొకరిదీనంట…నాకూ ఎట్టండి..” అన్నాడు.
“ఇప్పుడే కదా…డొక్కుడు గెంజి తాగినావు…నాను సరదాగా ఇంత తింటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంతన్నవు…” అంది సీతాలు.
“నా నెందుకు తినకూడదు?.. డబ్బుల్నాయీ…” అన్నాడు జగ్గడు.
“అసలే ఒల్లంతా మచ్చలేసి రోజురోజుకీ పొడపామునాగ అయిపోతన్నవు. ఇయన్నీ తింటే… పుచ్చి సత్తవు..” అంది ఉక్రోషంగా సీతాలు.
“ఒసినీ… ఎంత మాటన్నవూ..? మరయితే నా డబ్బుల్నాకిచ్చీ…” అని తిరగబడి సీతాలు చేతిలో పొట్లం లాక్కోబోయాడు జగ్గడు.
“ఎవలి డబ్బులయ్యా..? పోనీకదా అని ఊరుకుంటే మితిమీరిపోతన్నవు” అంటూ జగ్గడిని పేవుమెంటు మీదనుండి తోసేశాడు నాగన్న.
“డబ్బుల్నాయీ…నన్నుసూసే అందరూ దర్మం సేసేరు గానీ నిన్ను సూశా? దుక్కనాగున్నావు” అన్నాడు జగ్గడు గొంతు పెద్దది చేసి, లేవడానికి ప్రయత్నిస్తూ.
“అరవమాక…నాకూ ఉంది గొంతు! నిన్ను సూసి ఏత్తే మాత్రం..ఊరంతా తిప్పింది ఎవుడూ..? నానేకదా….అట్టే మాట్టాడక..” అన్నాడు నాగన్న.
“ఊరుకో జగ్గన్నా..! పెద్దపెద్దోల్లంతా దేశాన్ని మింగుతున్నరు.. ఈడు మింగటానికేటి? ఎవుడికి దక్కింది ఆడు మింగుతున్నడు.. మన్లో మనకి తగువులేటి?” అని సముదాయించి లేవదీశాడు పక్కనున్న మరో ముష్టాడు.
‘ఇస్వాసం లేనోడు…ఏకు మేకై కూచున్నాడు’ అనుకున్నాడు జగ్గడు. మూడ్నెల్ల క్రితం…గట్టుమీద ఎండలో సొమ్మసిల్లి పడుంటే, మొహమ్మీద నీళ్ళు జల్లి, గంజి పట్టేరు… సీతాలూ, జగ్గడూ కలిసి.
“కండగలోడు మావా…! నీ బండి తొయ్యడానికి పనికొస్తాడు. నాను ఇంటికాడుండి గెంజి కాస్తాను” అంది సీతాలు. సరేనన్నాడు జగ్గడు. అలా ‘సూదిలాగొచ్చి గునపంలా గుండెల్లో దిగిపోయాడు నాగన్న’ అనుకుంటున్నాడు జగ్గడు.
   ఆ సాయంకాలం నాగన్న బయటికి పొయాకా, జగ్గడు మెల్లగా సీతాలు పక్కకి చేరేెడు. “ఏటనుకోకే సీతాలూ..కోపంలో ఏటేటో అనేశాను” అని బుజ్జగించాడు.
“దానికేటిలే, మావా… ఒకటనుకుంటం… పడతాం.. మనం మనం ఒకటీ! మద్దిలో ఆడొచ్చి గొడవ పెట్టాడు.. పోయేడులే.. శని ఇరగడైంది..” అంది సీతాలు జగ్గడి తల నిమురుతూ.. పొంగిపోయాడు జగ్గడు.
“ఉండు.. పూర్ణా మార్కెట్టు సంతకెల్లి, ఉప్పురవ్వా, ఒంజరం సేపముక్కా అట్టుకొత్తాను. కూకుని తిందాం” అంది..
“అట్టాగే… సాలా కాలమైంది మనం ఇలా ఎచ్చగా తిని..” అన్నాడు జగ్గడు.
సీతాలు వెళ్ళింది. రాత్రంతా జాగరం చేశాడు జగ్గడు. సీతాలు జాడలేదు.
తెల్లారింది. నాగన్న కూడా చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు. గుడారం లోకి వెళ్ళి చూశాడు. డబ్బీలో డబ్బులు, నోట్లూ మాయమయ్యాయి!
“అమ్మ నాగుపామూ..! కానుకోలేకపోనాను… ఎంతపని సేసినావురా దురమార్గుడా! సీతాలూ! ఆ ఇసం పురుగుతో సేరి, ఎంతపని సేసినావే!”
అని లబోదిబోమని నెత్తీ నోరూ బాదుకుని ఏడ్చాడు జగ్గడు. పది రోజులపాటు చెరువుగట్టు విడిచి బయటకి రాకుండా సీతాలు కోసం ఎదురుచూశాడు. అక్కడే ఉండిపోయి దొరికింది తింటూ సీతాలుని తలుచుకుని కుమిలిపోయాడు జగ్గడు.
ఓరోజు మిట్టమధ్యాహ్నం..”జగ్గన్నా!.. లీలామహలు జంక్సను కాడ సీతాలు కిల్లీ కొట్టెట్టినాది!” అని ఊళ్ళో తిరిగొచ్చిన మరో ముష్టివాడు జగ్గడి చెవిలో ఊదేడు. పక్కవీధిలోనే జంక్షను. ఉండలేక వెంటనే బండి తోసుకుంటూ బయలుదేరేడు జగ్గడు. కాలవ ఒడ్డున బల్లమీద బీడీ కట్టలు, సిగరెట్టు పెట్టెలూ, అరటిపళ్ళగెల, కిళ్ళీ సామాను పెట్టుకుని. వెనక బెంచీమీద బొమ్మలాగ కూచునుంది సీతాలు. బీటు పోలీసుజవాను ఏదో తమాషా కబురు చెప్పి సీతాలుని నవ్విస్తున్నాడు. అప్పుడే సోడాలు మోసుకొస్తున్నాడు నాగన్న. మొండిచేత్తో తోసుకుంటూ అక్కడకి చేరుకున్న జగ్గడు ఈ తతంగమంతా చూశాడు.
“ఇంత మోసం చేస్తావంటే సీతాలూ? ఆ ఎదవతో సేరి నన్ను ఇంత దగా సేత్తావా? నీకు పుట్టగతులుంటయ్యే” అని తిట్లు లంకించుకున్నాడు జగ్గడు.
“ఎవుడ్రా నువ్వు? బికారి సచ్చినోడా..! ముష్టెత్తుకోక కొట్టుముందుకొచ్చి మరీ తిడతన్నావూ? అని పోలీసుతో…” సూడండి జవానుగోరూ… ఎవడో ముష్టెదవ…ఎలా పేల్తన్నడో ” అంటూ జవాను నోటికి సిగరెట్టు అందించి, అగ్గిపుల్ల వెలిగించింది సీతాలు.
“ఏట్రా ముష్టెదవా.. ముష్టికొచ్చి డాబు సేస్తన్నవేటి? ఆడకూతుర్ని అదమాయిస్తాన్నవేటీ? ఎల్లెల్లు..ముందు దార్లో బండి తియ్యి” అని కాలితో బండిని ఒక్క తన్ను తన్నేడు పోలీసు జవాను.
“అదికాదు బాబూ… జవానుగోరూ.. కాసింత నామాటినండి. నా సీమూ రత్తమూ దారపోసి దాసిన డబ్బు ఈ ముండ కాజేసి, నన్నిలా ఈదిన పడేసింది.. నా మాట నమ్మండి” అని గొల్లుమన్నాడు జగ్గడు.
“నోరుముయ్యరా… బెగ్గరెదవా… కతలు నాకాడ సెప్పకు… లాకప్పులో ఎట్టి కుమ్మీగల్ను” అని, సీతాలుతో. “ఇదిగో సీతాలూ..నువ్వు బేరాలు సూసుకో, నానుండగా నీకు అడ్డునేదు” అని భరోసా ఇచ్చాడు.
“తమరి దయుండాలిగానీ…నా బిజినెస్సుకేటి బాబూ” అంది ఓరగా జవాను మొహంలోకి చూస్తూ. జగ్గడి కళ్ళల్లోంచి రక్తం చుక్కలు రాలేయి. ఏమీ చెయ్యలేక, కోపం పట్టలేక అందర్నీ తిట్టుకుంటూ, శాపనార్థాలు పెడుతూ చెరువుగట్టు చేరుకున్నాడు జగ్గడు.
   గుజ్జనగూళ్ల నుండి గుడివేపు జగన్నాథుని రథం మళ్లీ తిరుగు యాత్ర ప్రారంభించింది. జనం తండోపతండాలుగా తరలి వచ్చారు. ‘గుడికాడి కెళ్తే ఆ దేవుడి గుండేనా కరుగుద్ది. నా బతుకు సూసి పండో, పరకో దొరక్కపోదు.. ఎన్నాళ్ళిలా కూకోడం?’ అనుకుని బండి తోసుకుంటూ బయలుదేరేడు జగ్గడు. ఎటు చూసినా జనం. పోలీసులు లాఠీలతో జనాల్ని అదుపు చేస్తూ, రథానికి దారి చేస్తున్నారు.
“అవుకు బతుకు నాయిన్లారా!… కాయకష్టం సేసుకుని బతకలేనోణ్ణి… దరమం సెయ్యండి తండ్రీ… మూన్నాళ్ళనుంచి ముద్ద లేదు..” అంటూ కెరటాల్లా వస్తోన్న జనాల్ని ఒడుపుగా తప్పించుకుంటూ, బండి తోసుకుంటూ దీనంగా అడుక్కుంటున్నాడు జగ్గడు. కొంతమంది విసుక్కుంటూ, దూరంగా తప్పుకుంటున్నారు. “మీదమీదకి వస్తున్నావేంట్రా… కుష్టోడా.. ఎదవబండీ నువ్వూను. తప్పుకో.. ఛీ ఛీ..” అని కొందరు కసిరితే, కొందరు పైసలు వేస్తున్నారు. పోలీసులు పొమ్మని బండిని వెనక్కి నెట్టేస్తున్నారు. ఇంతలో గంట వాయిస్తూ, శంఖం పూరిస్తూ అనాథల కోసం కాశీ కావిడి భుజాన వేసుకుని, “దిక్కూ మొక్కూ లేని దీనులు… అనాథలు.. బికార్లకి మీకు తోచింది దానం సేసుకోండి బాబూ! పున్నెం వస్తది” అంటూ.. అన్నమూ, ధనమూ సేకరిస్తూ రథంతో ముందుకి సాగిపోతున్నాడు సాధువు! అతన్ని చూడగానే జగ్గడు.. “సాదువు బాబూ! నువ్వా! సూసినావా..? సీతాలు దగాసేసి ఎగిరిపొనాది” అంటూ అయినవాణ్ణి చూసినట్టు తన కష్టం మొరబెట్టుకున్నాడు.
“నువ్వా… జగ్గన్నా!” అని పైకి చనువుగా నవ్వి, ‘ఇక్కడా దాపురించావా? నీ గోల మండా…నాకు పోటీగా మళ్లీ నువ్వొకడివా?’ అని జగ్గడు కూడా వస్తోన్నందుకు లోపల కుతకుత లాడిపోయి, మొహం జేవురించుకుని, భుజం మీద కావిడి విసురుగా తిప్పి గిరుక్కున తిరిగిపోయాడు సాధువు. దిమిశాగుండులా బరువైన కావిడిలోని ఇత్తడి గుండిగ గిర్రున తిరిగి విసురుగా ఫెడీల్మని పిడుగులా జగ్గడి తలమీద మోదుకుని వెళ్లిపోయింది. ఆ దెబ్బకి గిలగిలలాడి, కళ్ళు చీకట్లుకమ్మి బండిమీద నుండి రోడ్డు మీదకి తుప్పున తూలిపోయాడు జగ్గడు. రోడ్డుకి అడ్డదిడ్డంగా పడిపోయింది బండి.
“అరెరే.. ముష్టోడు.. కుష్టోడు.. పడిపోయేడు.. అయ్యో.. రథం.. రథం” ఆ గందరగోళంలో ప్రజలు నిర్ఘాంతపోయి, చూస్తూ నిలబడిపోయారు. వేగం పుంజుకున్న జగన్నాథ రథం మొండి జగ్గడి మొండెం తుంపిపారేసి ముందుకు సాగిపోయింది. “అమ్మో” అని వెయ్యి గొంతుకలెత్తి నింగీ నేలా కంపించేలా ఆఖరి అరుపు అరిచాడు జగ్గడు! అయితే జగ్గడి మరణరోదన గానీ, అనాథ జీవుడి ఆర్తనాదంగానీ ఆ సంబరం సందడిలో జగజ్జనులు పట్టించుకోలేదు. తరలివస్తోన్న జనాలు మాత్రం ఒక్కసారి నోటమాట రాక ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు.
“ఎంత పుణ్యాత్ముడో!.. ముష్టి వెధవకి ఇంత భాగ్యం పట్టింది….అందరికీ రాదు ఇలాంటి చావు!” ఇలా రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.
“నరకమంతా ఇక్కడే అనుభవించేసేడు.. కర్మ పరిపక్వమైంది.. మరిహ జన్మ లేదు.. వైకుంఠద్వారాలు వాడికోసం తెరుచుకుంటాయి.” అని చదువుకున్న పండితులూ తీర్మానం చేశారు.
“పండుగనాడు కూడా శవం కాపలా తప్పలేదురా నాయనా.., ఈ ముష్టి గాడిదకొడుకు ఇవాళే చచ్చాడు. ఛ…పోలీసు బతుకూ ఒక బతుకే..?” అంటూ జగ్గడి శవానికి కాపలా కాస్తున్న పోలీసులు అనుకుంటున్నారు.
“దరిద్రం వదిలిపోయింది… శని ఇరగడై పోయింది” అని సీతాలు నాగన్న చెవిలో గుసగుసలాడింది. అవిటి బతుకు నలిగింది! బడుగుబండి విరిగింది!! గాలి మోసుకెళ్ళిన ఈ కబురు విని పీర్ల కోనేటిలో చేపలు గిలగిల తన్నుకున్నాయి. లోకం మామూలుగా నడుస్తోంది. సాధువు అన్నం అమ్ముకుంటున్నాడు. బీటు పోలీసుల దయవల్ల సీతాలు కిళ్ళీకొట్టు పెద్ద బడ్డీగా ఎదిగిపోయింది.
                                              ——- ***** ——-
   ‘శకటిక’ అంటే చిన్నబండి… అంటే తోపుడు బండి లాంటిది అన్న మాట. జగ్గడు తనకున్న వ్యాధివల్ల నడవలేక ఆ తోపుడు బండిని ఆధారంగా చేసుకుని తన జీవన యాత్ర సాగించాడు. ఆ బండితో పాటు తన ‘బతుకుబండి’ని లాగడానికి జగ్గడు పడ్డ పాట్లు ఈ శకటిక కథలో యం. రామకోటి గారు చాలా నిష్కర్షగా చెప్పేరు. ‘ఎంత చెట్టుకి అంత గాలి’ అన్నట్టు… ఎవరి జీవితాలకి తగ్గట్టు వారికి సమస్యలూ-సంఘర్షణలూ, బాధలూ- బరువులూ, బంధాలూ-బాధ్యతలూ ఉంటాయి. అలాగే ఎవరికి తగ్గట్టు వారికి తమ జీవితాల్లో కుట్రలూ- కుతంత్రాలూ, మోసాలూ- దగాలూ, దోపిడీలు- దొంగతనాలు, అసూయా ద్వేషాలు అన్నీ నిండి ఉంటాయి.
   కుష్ఠు, ముష్టి, అవిటి వారి బ్రతుకుల్లోని ఆ కోణాలన్నీ వెదికి, వెలికితీసి, ఏ రకమైన మొహమాటమూ లేకుండా, సూటిగా, వారి యాస, భాషల్లో శక్తిమంతంగా చెప్పేరు రచయిత రామకోటి గారు. ఈ కాలం వారికి అంతగా తెలియదు కానీ, పాతరోజుల్లో అన్నపూర్ణా కావిడి వేసుకుని సాధువు వచ్చాడంటే, గృహస్థులందరూ అన్నమూ, కూరలతో ఆ కావిడి నింపేవారు. దాన్నే కాశీ కావిడి అంటారు. దిక్కూమొక్కూ లేని అనాధలకి ఆ అన్నాన్ని పంచిపెట్టాలి – దాన్ని తెచ్చిన సాధువు. కానీ అతడు పావలాకీ పరక్కీ ఆ అన్నం అమ్ముకునే దుర్వ్యవస్థ ఈ కథలో ఖచ్చితంగా చెప్పేరు రచయిత. అలాగే సీతాలు, నాగన్న లాంటి వ్యక్తులు తమ బతుకుకోసం ఎంతటి మోసానికైనా సిద్ధపడతారని చెప్తుంది ఈ కథ.
–సి. యస్. 

4 Comments Add yours

 1. bolloju baba says:

  Wonderful work sir.
  Thank you.!

  Liked by 1 person

 2. V.V.Krishnarao says:

  మొండి చేతి జగ్గడుండె జగన్నాథ
  దేవుడై రథమున తిరుగు ఊర!
  మొండి చేతిబండి ముష్టిజగ్గడొకడు
  వీధులన్ని తిరిగి బిచ్చమెత్తె!
  కుష్ఠుజగ్గని కని గుడిలోని జగ్గడు
  కష్టములనుబాపి కనికరించె!
  సాటిమనిషి వలన సర్వమ్ము కోల్పోయి
  సకలవిభుని పథిని శాంతి పొందె!

  Liked by 1 person

 3. DLSastry says:

  Good story

  Liked by 1 person

 4. ఆకొండి సూర్యనారాయణమూర్తి says:

  బాగుంది.
  ఇలా అలాకాదు.
  మంచి మాండలికం. జంటపదాలు.
  ఊతపదాలు వ్యర్ధపదాలు అనే వ్యాసం ఒకటి ఇదివరలో వచ్చింది.
  డిగ్రీలా బొగ్రీలా, మందు-మాకు, కధ కమామిషు, పెళ్లిలేదు గిల్లిలేదు, రెండు జంటగా పలికితేనే అందం.
  ఎంత కుష్ఠు అయిన, కామదాసత్వం, దానికోసం అగచాట్లు తప్పవు.
  నడి వీధిన కాపురమైన కమ్మగా, లోకం మాటుమనిగినవేల వెచ్చగా అనే రెండువాక్యాలు మట్టి పూసల దండలో మంచిముత్యాలు నిలిచినట్లున్నాయి.
  యాస మాండలికాలమధ్య అందంగా అమర్చడం రచయిత కవితాత్మకు మచ్చు తునక.
  మెచ్చుతునక.సి.ఎస్ గారి వ్యాఖ్యలు జంట పదాల వెల్లువలైనాయి.
  అదేమిటో విషాదంతాలే గుండె పెన్డ్యూలాలవుతాయి.
  జగ్గని ఆర్తనాదం ఒక్కక్కరికిఒక్కొక్కలా అనిపించింది. అది సృష్టి భేదం కాదు. దృష్టి బేధం.
  ఈకొసమెరుపు రామకోటి గారి కధలో స్పష్టంగా కనిపించింది.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s