కథన కుతూహలం 58

ఒక కథకుడు కథను రాసేటప్పుడు తను ఏం చెప్పదలుచుకున్నాడో ఆ వస్తువు, తత్సంబంధమైన ఆలోచనలు,  భావోద్రేకాలూ అతని మనసులో ఉంటాయి.  కథ రాసి, అవే భావాలనీ, స్పందనలనీ ఆ కథను చదివిన పాఠకుల్లో తీసుకురాగలిగినప్పుడు అతడు మంచి కథకుడు అవుతాడు.  అలా తన మనసులో కదిలిన భావాలకి చక్కని చిక్కని కథనంతో అక్షరరూపం కల్పించి,  పాఠకులని తనతో తీసుకెళ్లగలిగిన శక్తిగల రచయితల్లో శ్రీకంఠమూర్తి ఒకరు.

     శ్రీకంఠమూర్తిగారిని గురించిన విషయాలు ఎక్కడా దొరకటం లేదు. ‘కథానిలయం’లో వారి కథలు చాలామటుకు దొరుకుతున్నాయి. అక్కడ లభించిన వివరాలను బట్టి వీరు అదిలాబాద్లో నివాసం ఉన్నారు. (వీరి కథలు చూస్తే,  ఆయన శైలి- కోస్తాజిల్లాల యాసని గుర్తు చేస్తుంది). వారి పేరు శ్రీకంఠం కృష్ణమూర్తి.  ‘గాంగేయ‘ అనే పేరుతో కూడా వారు కథలు రాశారు.

జాతర‘ అనే వీరి కథకి 1972 ‘ఆంధ్రజ్యోతి’ ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది.  ‘నేత్ర గవాక్షం’,  ‘వర్షంకురిసిన రాత్రి’,  ‘కల’, ‘పాడని యుగళగీతి’,  ‘సరికొత్త పాత కథ’,  ‘శ్రుతి తప్పిన మనిషి’, ‘గుర్నాథాలున్నారు జాగ్రత్త’  మొదలైన కథలెన్నో వారు రాశారు. మానవ సంబంధాల నేపథ్యంలో శ్రీకంఠమూర్తి గారు రాసిన “ఆస్తి” అనే కథని ఇప్పుడు పరిచయం చేసుకుందాం.

    య్యిమని వీస్తోన్న ఈదురుగాలి చలిపుట్టిస్తోంది. మనిషిని ఒణికించేస్తోంది.  అప్పుడే పెద్ద వానజల్లు కురిసి వెలిసింది.  మళ్ళీ కురవడానికి సిద్ధంగా మబ్బులు కమ్మి, వెలుతురునంతా మింగేస్తున్నాయి. ఆ దారంతా ఒకటే బురద. పైగా ఎగుడుదిగుడు ఎత్తుపల్లాలతో నిండి ఉంది.  కాలుపెట్టిన చోట జర్రున జారుతోంది.  ఆ దారమ్మట మంగమ్మ అడుగులు వేస్తోంది. ఎంతో జాగ్రత్తగా ఊతకర్ర సాయంతో నడిచి వెళ్తోంది. బుర్రమీద బరువు పెట్టుకుని, వెలుతురుకి చెయ్యి అడ్డం పెట్టుకుని అందినంతమేర చూస్తూ, నిదానంగా నడుస్తోంది.  దూరంలో ఒక కంచె వేసిన చేనూ,  ఆ చేను మధ్యలో ఒక పాక మసక మసగ్గా కనిపించేయి.  ఆ పాక చూడగానే ఆమెలో ఉత్సాహం తన్నుకొచ్చింది.  నెత్తిమీద ఉన్న మూటని సరిగ్గా సర్దుకుంటూ ఉల్లాసంగా నడక సాగించింది.

     కంచె దగ్గరకి రాగానే ఆమె అడుగులు అప్రయత్నంగా ఆగిపోయాయి. పచ్చని తివాచీ పరచినట్టున్న ఆ చేను వంక చూస్తుంటే ఎందుకో ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.  కంచెకున్న చిన్న  వెదురుబద్దల తలుపును తోసుకుంటూ లోపలికి వెళ్ళింది.  పాక దగ్గిరకి వచ్చి, లోపలికి అడుగెయ్యబోతుంటే, అడుగుల సవ్వడి విన్న పుల్లయ్య లోపలినుంచే, “ఎవరిదీ?” అన్నాడు.

“నేనేలే..” అంటూ వొంగి మంగమ్మ లోపలికి వెళ్ళింది. పుల్లయ్య ముసలి మొహం వికసించింది.  కప్పుకున్న గొంగళిని విదిల్చి పారేసి ఉత్సాహంగా చూశాడు మంగమ్మని.  మంగమ్మ కర్ర మూలకానించి, మూట కిందపెట్టి పుల్లయ్య దగ్గర కూర్చుంది.  అతన్ని ఆపాదమస్తకం పరిశీలనగా చూస్తూ, “ఏంటిలా సిక్కిపోయావు?” అంది ఆందోళనగా.   పేలవంగా నవ్వి,  “లేదులేయో…… సాలా రోజులకి సూత్తున్నావు గందా, అందుకని అట్టా అనిపిత్తంది నీకు”  అన్నాడు పుల్లయ్య. మంగమ్మ ఏమీ మాట్లాడలేదు.  కాసేపాగి, “కూడు తిన్నావా?” అంది.

“ఇంకా లేదు” అన్నాడు పుల్లయ్య.

“అదేం …?” అందామె.

“ఊళ్లొంచి ఇంకా కూడు రాలేదు” అన్నాడు పుల్లయ్య.

“ఎవురట్టుకొత్తారు కూడు నీకు?” అడిగింది మంగమ్మ.

“నా కోసమంటూ ఎవురూ పట్టుకురారు.  ఎవురైనా ఇట్టా సేలకేసి వత్తంటే, ఆళ్ళసేత పంపిత్తారు” అన్నాడు పుల్లయ్య.

“ఇటుకేసి ఎవురూ రాకపోతేనో?” మంగమ్మ గొంతులో ఆదుర్దా కనిపించింది.

“అట్టా ఎట్టాగవుతుంది?  పొలాలన్నీ మన పొలాలకి అవతలేగా ఉన్నాయి. రోజుకొక్క సారైనా ఎవరో ఒకరు రాకపోతారా..?  ఆళ్ళసేత పంపిత్తారు” అన్నాడు.

“అంటే… రోజుకొక్కసారేనా…నీకు కూడు?” అని జాలీ, దుఃఖమూ అన్నీ ఒక్కసారిగా ముంచుకురాగా అంది మంగమ్మ.

“ఒక్క పూటేం కాదుగానీ. ముప్పూటల కూడూ కలిపి ఒక్కసారే పంపిచేత్తే దాని పని అయిపోతుందికదా..!” అని నవ్వాడు పుల్లయ్య. మంగమ్మ మనసు చివుక్కుమంది.  మొగుణ్ణి వాళ్ళింతగా ఉపేక్షిస్తున్నారని ఇప్పుడే ఆమెకి అర్థమయింది. కాసేపు ఏదో ఆలోచిస్తూ కూచుంది. ఇంతలో పుల్లయ్య,”ఇట్టా ఎక్కడికొచ్చావు?” అని అడిగాడు.

“బాగానే ఉంది… ఎక్కడికో నేనెందుకొత్తా…? నిన్ను సూద్దామనిపిత్తే ఇటొచ్చా.” అంది మంగమ్మ.

“ఇంటికాడ సెప్పే వచ్చావా?” అన్నాడు పుల్లయ్య.

“అమ్మో! సెపితే ఇంకేమైనా ఉందా?  అట్టా వెళ్ళి పొలం గట్టున గడ్డి కోసుకొత్తానని సెప్పి వచ్చా….”

“అంటే మనిద్దరం ఒకర్నొకరు సూసుకోడానిక్కూడా సొతంతరం లేదన్నమాట!” అంటూ విషాదంగా నవ్వేడు పుల్లయ్య.

“ఏం సేత్తాం..? మన కర్మ.  నేను నిన్నుగానీ, నువ్వు నన్నుగానీ సూడ్డానికొత్తే, ఆళ్ళకి గిట్టదు!” అంది మంగమ్మ బాధగా.

“ఆ సంగతి నీకెట్టా తెలుసు?” అడిగాడు పుల్లయ్య.

“ఆ మాత్తరం తెలీదేటీ?  నేనత్తమానం ఇంటికాడ్నే ఉంటానుగా. ఆళ్ళ మాటల్నిబట్టి తెలీదూ?  మనిద్దరం కల్సుకున్నట్టు ఆళ్లకి తెలిసిందో, ఇక నేను నీకు నూరిపోత్తున్నాననో, లేదా నువ్వు నాకు అన్నీ నేర్పుతున్నావనో ఇంకా ఏమేమో అంటారు” అంది మంగమ్మ.

పుల్లయ్య నవ్వి ,”ఇదంతా తమాసాగా ఉంది కదూ!” అన్నాడు.

“ఇందులో తమాసా ఏముంది నాబొంద?” అంది మంగమ్మ.

“తమాసా కాక మరేంటి?  మొగుడూ పెళ్ళాలు యేరు యేరు ఇళ్ళల్లో ఉండటం ఇంతవరకెక్కడైనా జరిగిందేటీ?  మొగుడూ పెళ్ళాలు ఒకరికొకరు నూరిపోయడం ఎక్కడా ఎవరూ కల్లోగూడా సూసి వుండరు” అన్నాడు పుల్లయ్య. కొద్దిసేపు మౌనం!  మంగమ్మ తేరుకుని, ఏదో గుర్తుకొచ్చినదానిలా, “సర్లే గానీ. లేచి కాళ్లూ సేతులూ కడుక్కో. కాస్త పలారం పట్టుకొచ్చా తిందూగాని…” అంది.

“ఏం తెచ్చావేటి?” అంటూ పుల్లయ్య ఆత్రంగా మూటని చూసి, కాళ్లు కడుక్కు వచ్చి కూర్చున్నాడు.   మంగమ్మ మూట విప్పి, అందులోంచి ఒక ఆకులో చుట్టిన గారెలూ, మిఠాయి ఉండలూ పైకి తీసింది.

“ఎవరూ సూడకుండా పట్టుకొచ్చిన్నట్టున్నావు గదూ..?”  భార్యనే చూస్తూ అన్నాడు పుల్లయ్య.   మంగమ్మ గతుక్కుమంది. లోతుకుపోయిన ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మాట్టాడకుండా నేలచూపులు చూస్తుండిపోయింది. తనా మాట అనడం పొరబాటేమో అనిపించింది పుల్లయ్యకి.  “ఛఛ..ఊరికే మాటవరసకన్నానే ఎర్రి మొకమా..!” అన్నాడు ఆమెను సముదాయిస్తున్నట్టు.  కొంగుతో కళ్ళు తుడుచుకుని, “నిన్న సందేల కోడలు ఇయ్యన్నీ సేసింది– దాని మొగుడు తినాలని సరదా పడినాడంట.  నాకు మాత్రం ఒక్క ముక్కైనా గొంతు దిగలేదంటే నమ్ము. నువ్వే గుర్తుకొచ్చి గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది.  అసలు పొద్దున్నే అట్టుకొద్దామనుకున్నాను. కానీ అది సూత్తుండగా అట్టుకొచ్చే ధైర్యం లేకపోయింది.  అందుకే ఇట్టా మసక సీకటేల ఎవరూ సూడకుండా అట్టుకొచ్చా. అయినా నా కర్మ కాకపోతే, నా సొంతింట్లో నేనే దొంగనయ్యే గతి పట్టింది సివరికి! అంతా నీ మూలానే”  అంది మంగమ్మ రోషంగా. చివాలున తలెత్తి,  “నేనేం పాపం చేశానే మద్దిన?” అన్నాడు పుల్లయ్య.

“మరి నువ్వుగాక ఇంకెవరు జేసారేటి?  నా కడుపున పుట్టిన ఆ ఎదవలిద్దరూ నన్నూ, నిన్నూ అట్టా పంచుకుంటూంటే నువ్వు ఎందుకలా నోరుమూసుక్కూచున్నావు?  నువ్వప్పుడే పట్టించుకుంటే మనకీ గతి పట్టుండేది కాదు గందా..!” అంది మంగమ్మ.

“నేను నోరు మూసుక్కూసున్నానా? అంతగా సెప్పినాను గందే!  ఆళ్లు ఇనకపోతే నన్నేంసేయమంటావు సెప్పు…” అన్నాడు పుల్లయ్య దీనంగా.

“సెప్పిన మాటినకపోతే పట్టుబట్టుక్కూసోవల్సింది.  మాకిద్దరికీ ఒక వాటా పడేయండని నిలదీసి అడగాల్సింది” ఆవేశంగా అంది మంగమ్మ.

“అదికూడా అయిందిగా!  కానీ ఆ ఉద్దేశం ఆళ్ళ మనసుల్లోనే లేకపోతే నేను మాత్తరం ఏం సేయను సెప్పు.  ఆళ్లు నిన్నొకడూ, నన్నొకడూ తమకాడ ఉంచుకుంటామంటే వూళ్లోవాళ్లు ఆళ్ళకే వత్తాసు పలికినారాయె! ముసలి వయసులో మీకంతకంటే కావాల్సిందేమిటీ. అని నన్నే దబాయించినారయ్యే…” అన్నాడు పుల్లయ్య.

“ఊళ్ళో వాళ్లదేం పోయిందనీ?  పగలూ, రాతిరీ సెవటోడ్చి సంపాదించింది మనం.  సివరికేం మిగిలిందేటి?  మనింట్లో మనమే పరాయివోళ్ళమయిపోయాం!” అంటూ ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక మొహాన్ని చేతులతో కప్పేసుకుంది మంగమ్మ.

“పోన్లేయే. ఆళ్లు సల్లగా ఉంటే అంతే సాలు.  అయినా మనం మాత్తరం ఇంకెన్నాళ్ళుంటామని?” అన్నాడు పుల్లయ్య భార్యను సముదాయిస్తూ.

“నీదేం పోయింది? నువ్విక్కడ పొలంలో ఒక్కడివీ హాయిగా వుంటావు. ఇంటికాడ జరిగేవన్నీ నీకేం తెలుస్తాయి?  కోడలి సేత నానామాటలూ పడుతూ, ఇంటెడు సాకిరీ సేత్తూ, సావలేక బతుకుతున్నాన్నేను” కళ్ళల్లో నీళ్లతో అంది మంగమ్మ.

“పని సేత్తే సేసేవు గానీ, కొడుకునీ, కొడల్నీ, పిల్లల్నీ కళ్ళతో సూసుకుంటున్నావు.  నేను పొద్దస్తమానం ఒక్కడ్నీ బిక్కుబిక్కుమంటూ ఇక్కడ పొద్దు గడపాలి!  గట్టుమీదున్న ఆ సెట్టుకీ, నాకూ తేడా ఏం తెలీడం లేదు”  అన్నాడు పుల్లయ్య.

“మరి ఇంటికాడుండకుండా, ఈడ ఈ పాకలో ఎందుకుంటున్నావు?” అని అడిగింది మంగమ్మ.

“ఏం జేయనుమరి?  ఇంట్లో కూసుంటేనేమో నీ రెండో కోడలు ఒకటే సణుగుడు. ‘కూసుని తింటాడో’ అని ఊరంతా గోలెడుతుంది.  ఈడికొచ్చి కూసుంటే, కూడు పంపడానికి సత్తుంది” అన్నాడు పుల్లయ్య. కాసేపు తనలో తనే ఆలోచించుకుంది మంగమ్మ.  చివరికి ఏదో స్ఫురించి, ” పోనీ…మనిద్దరమే ఏరే కాపురం పెడదాం!” అంది.

పుల్లయ్య ఆమె మాటకి నవ్వేసి,  “యేరే కాపురం పెట్టుకోవచ్చుగానీ మన కొడుకులిద్దరూ ఒప్పుకోవద్దూ?” అన్నాడు.

“ఆళ్లొప్పుకోకపొతే ఏమవుద్ది?  మనమే ఉందాం.” అంది మంగమ్మ.

“ఆళ్ళు మనకేమీ ఇయ్యకపోతేనో?” అన్నాడు పుల్లయ్య

“ఇయ్యకపోతే పోనీ. ఏదన్నా కూలో నాలో సేసుకుని బతుకుదాం” అంది మంగమ్మ.

“ఏంటీ?. ఈ వయసులో కూలిపని సేద్దామా?  నీ పిచ్చిగానీ  పండుటాకులమైపోయిన మనకి పనెవడిత్తాడే?” అన్నాడు పుల్లయ్య.

“అయితే ఎంతకాలం ఇట్టాగ ఉందామంటావు?” మంగమ్మ అడిగింది.

“ఉండక సేసేదేముందే? అయ్యన్నీ జరిగేయికాదు..” అన్నాడు పుల్లయ్య. మంగమ్మకి మొగుడిమీద కోపమూ, చిరాకూ కలిగేయి.  మౌనంగా ఉండిపోయింది. భార్యకి కోపం వచ్చిందని గ్రహించిన పుల్లయ్య లేని నవ్వు మొహంమీదకి తెచ్చుకుంటూ, “ఇంతకీ నాకు పలారం పెట్టేదేమైనా ఉందా లేదా?” అని అడిగాడు. నిజానికి అక్కడికి వచ్చినప్పుడున్న ఉత్సాహం మంగమ్మలో ఇప్పుడు లేదు. మెల్లగా గారెలు తీసి మొగుడి ముందుంచింది.

ఒక గారెముక్క తుంచుతూ  “నువ్వు తినవా?” అని అడిగాడు పుల్లయ్య.

“నాకొద్దు..” అంది మంగమ్మ.

“ఎందుకు?” అన్నాడు పుల్లయ్య.

“నేను రాతిరే తిన్నాను గందా..!” అందామె

“తింటే ఏంలే… రాతిరి తింటే ఇప్పుడు తినకూడదని లేదుగా..” అన్నాడు పుల్లయ్య, గారెముక్క అలాగే పట్టుకుని భార్య మొహంలోకి చూస్తూ.

“నాకొద్దని సెప్పేగా…” అంది మంగమ్మ

“నువ్వు తింటేనే నేను తినేది” అని పట్టుపట్టేడు పుల్లయ్య.  మంగమ్మ మొహంలో నవ్వు మెరిసింది.

“ఏంటి మరీ సిన్న పిల్లాడిలా సేత్తున్నావు?” అంటూ చిరుకోపంతో కసిరింది.

“సిన్న పిల్లాడే అనుకో.. ఇంకోటే అనుకోగానీ నువ్వు నాతో తినందే నేను మాత్తరం తినను గాక తినను” అంటూ పుల్లయ్య మొండికేశాడు.

“ఎవరైనా సూత్తే ముసలోళ్ళ సరదా బాగుందిలే అనుకుంటారు” అని నవ్వుతూ తనూ ఒక ముక్క తుంచి నోట్లో వేసుకుంది.  తృప్తిగా నవ్వి, పుల్లయ్య తిండం మొదలెట్టేడు.

“ఎన్నాళ్ళయిందో మనిద్దరం ఇట్టా ఒకసోట కూసుని తిని! ఎప్పుడు తిన్నామో గుర్తుందా నీకు?” ఏవో పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటున్న వాడిలా అన్నాడు పుల్లయ్య.

“ఏమో… నాకైతే గుర్తులేదు..” అంది మంగమ్మ

“నాకు బాగా గుర్తుంది.  మన పెద్దోడు పుట్టిన ఏడాదికి నేనేదో పనిమీద  పొరుగూరెళ్ళి పొద్దోయిన తర్వాత తిరిగొచ్చాను. నేను రాగానే నాకు అన్నం పెడుతుంటే, నిన్నూ నాతో తినమన్నాను.  సాలాసేపు బతిమాలితే గానీ నువ్వు నాతో కూసుని తిన్లేదు. అప్పుడు నీకు నేను ఓ ముద్ద తినిపించాను కూడా..” అన్నాడు ముచ్చటగా.

“సాల్లేవయ్యా. ఇట్టాంటివన్నీ సెప్పుకుంటారేటీ?” అని సిగ్గుపడిపోయింది మంగమ్మ.

“ఇప్పుడు సిగ్గేటే నీకు? అయినా గుర్తులేదన్నావని గుర్తు చేశానంతే” అన్నాడు పుల్లయ్య.

“నాకు గుర్తులేక కాదు… ఇట్టాంటివన్నీ మనసులో దాసుకోవాలిగానీ పైకి సెప్పుకుంటారేటి?” అంటూ మరింత సిగ్గుపడింది మంగమ్మ.

“అమ్మో! నువ్వు బలేదానివే..! ఏటో అనుకున్నాను…” మెచ్చుకుంటూ అన్నాడు పుల్లయ్య. మంగమ్మ మొహం పక్కకి తిప్పుకుని నవ్వసాగింది. పుల్లయ్య రెప్పవెయ్యకుండా ఆమెనే చూస్తూ తింటున్నాడు. తినడం పూర్తికాగానే మంచినీళ్లు తాగి తృప్తిగా త్రేన్చాడు పుల్లయ్య.

“ఇట్టాంటివన్నీ తిని శాన్నాళ్ళయిందే మంగా…” అన్నాడు పుల్లయ్య. మంగమ్మ మాట్లాడలేదు. కాస్సేపు అలాగే కూర్చుండిపోయింది. ఆ తర్వాత తను తెచ్చిన గుడ్డలమూట సర్దుకుంటూ, “నేనెళ్ళనా మరి?” అంది.

“అప్పుడే…?” అన్నాడు పుల్లయ్య. అతని మొహం దిగులుగా మారిపోయింది.  “ఎల్దువు గాని..ఇంకాసేపు కూసోవే!” అన్నాడు.

“అట్టా కుదరదు.  మరీ ఎక్కువసేపయితే మళ్లా లేనిపోని గొడవలన్నీ వచ్చిపడతాయి” అంది మంగమ్మ బాధగా.

“మళ్ళీ ఎప్పుడొత్తావ్?” ఆశగా అడిగాడు పుల్లయ్య. మంగమ్మ గొంతు జీరబోయింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. మూట పట్టుకుని, మొహం అటు తిప్పుకుని  “వస్తాలే…. ఇట్టాగే ఎప్పుడైనా..” అని లేచి నిలబడింది. మూలపెట్టిన కర్ర తీసుకుని వచ్చిన దారినే వెనక్కి బయలుదేరింది. మంగమ్మ తననుంచి అలా దూరంగా వెళ్ళిపోతుంటే ఒంటరిగా మిగిలిపోయిన పుల్లయ్య దిగులుగా చూస్తూ ఉండిపోయాడు.

                                         ***

     ఈ కథని శ్రీ కంఠమూర్తి గారు 1977 లో రాశారు.  నానాటికీ నీరసించిపోతున్న మానవ సంబంధాల గురించి,  తల్లిదండ్రులపట్ల తమ బాధ్యతలని విస్మరిస్తూన్న పిల్లల గురించీ అనాడే రాసి అందర్నీ ఆలోచనల్లో పడేశారు రచయిత.   కేవలం రెండే రెండు పాత్రలతో నడిపించిన ఈ కథలో, వారు ఒక వ్యవస్థని ప్రస్ఫుటంగా ప్రతిబింబించారు.

    వయసు ప్రభావానికి ఎంతటివారైనా దాసోహమనవలసిందే. శారీరక, మానసిక బలహీనత ఏర్పడుతుంది. కాబట్టి పరాధీనులు కాక తప్పదు. పిల్లలమీద ఆధారపడవలసిందే. దానిని అవకాశంగా తీసుకుని పిల్లలు వారిని చిన్నచూపు చూడ్డం, వదుల్చుకొలేని ఒక అడ్డంకిగా భావించడం మనం చూస్తుంటాం. వాళ్ల అనుభవానికి, జ్ఞానానికీ కించిత్ విలువైనా ఇవ్వకుండా వారిని కాలం చెల్లిన మారని పావలాకాసులా పరిగణిస్తారు.

     ఈ ‘ఆస్తి’ కథలో కొడుకులిద్దరూ  ప్రాణమున్న తల్లిదండ్రులని, ప్రాణంలేని ఆస్తిని పంచుకున్నట్టే చెరి సగం పంచుకున్నారు. ఒకరి దగ్గరే ఉంటే ఇద్దర్నీ తామే ఎందుకు భరించాలి అని కావచ్చు. లేదా ఇద్దరూ ఒకరికే చాకిరీ చేస్తే రెండోవాడు ఏమైపోవాలి? అనే స్వార్థంతో కావచ్చు. పెద్దవాడు తల్లినీ, చిన్నవాడు తండ్రినీ పంచుకున్నారు.  పెద్దవాడింట్లో, మంగమ్మ వంటపని చేస్తే, పుల్లయ్య చిన్నవాడింట్లో పొలం పని చేస్తున్నాడు. అలా వాళ్ల ‘శ్రమశక్తి’ని కూడా సమానంగా పంచుకున్నారు కొడుకులు. ఆ పంచుకోవడంలో పిల్లలిద్దరికీ మంచి అవగాహన ఉందికానీ. అసలు ఆ వయసులోనే తల్లిదండ్రులిద్దరికీ ఒకరి తోడు మరొకరికి అవసరం. వాళ్ళని విడదియ్యకూడదు అనే కనీస అవగాహన లేకుండాపోయింది.

తప్పనిసరిగా తలొగ్గిన పరిస్థితులలో భర్తను చూడ్డానికి దొంగతనంగా వచ్చిన భార్య లోని ప్రేమానురాగాలు,  భార్యని చూసిన భర్త మనఃస్థితి ఎంతో ఆర్ద్రంగా రాశారు రచయిత శ్రీకంఠమూర్తి గారు.

–సి.యస్.

One Comment Add yours

 1. V.V.Krishnarao says:

  భాష యాస వేరు, బ్రతుకు స్థాయిలు వేరు,
  ఒడలు శిథిలమయ్యి, సడలిపోవు,
  ఎదలొ ముదిమిలేని ముదముకూర్చు సొదలు
  కాపురమ్ముచేయు కమ్మగాను!

  మానవీయమైన మానమర్యాదలు
  సొంత సంతతి కడ సుంతయైన
  అందుకొనగలేని అమ్మ-నాన్న బ్రతుకు
  అలవిలేని బాధ కలుగజేయు!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s