కథన కుతూహలం 60

తెలుగు కథానికా పరిచయ పరంపరలో ఇప్పుడు రాయబోయే కథతో 60 కథలు పూర్తవుతాయి. మన సంప్రదాయాన్ని అనుసరించి మానవ జీవితంలో 60 ఏళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. దాన్ని ‘షష్టిపూర్తి‘ అని పిలుచుకుంటారు. అది ఒక అకేషన్!

   ఈ ప్రస్థానంలో ఏ ఆటంకమూ లేకుండా, ఏవిధమైన అంతరాయమూ కలుగకుండా ఈ కథల పరిచయానికి 60 కథల పరిచయంతో ‘షష్టిపూర్తి‘ నిండడం సంతోషం కలిగిస్తోంది. చదివి ఆదరిస్తున్న పాఠక మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ కథ తరువాత ఒక్క నెల విరామమిచ్చి, మళ్లీ కార్తిక మాసం నుంచి ఈ పరిచయ కార్యక్రమం కొనసాగించగలనని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఈ అరవయ్యవ కథగా ఏది రాయాలి అని ఆలోచిస్తున్నప్పుడు “ఏదైనా ‘షష్టిపూర్తి’ అనే కథ ఉందేమో చూసి రాయి..” అని మా కృష్ణ సలహా ఇచ్చాడు. నిజమే అనిపించి, ” కథానిలయం. కామ్” వెదికితే ఒక అయిదు కథలు కనిపించాయి. వాటిలోంచి శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావు గారు రాసిన ” షష్టిపూర్తి” మీకు పరిచయం చేస్తాను.

   శ్రీ టేకుమళ్ళ కామేశ్వరరావుగారు 1907 వ సంవత్సరంలో విజయనగరంలో జన్మించారు. వారు చిన్ననాటి నుంచి మంచి కవి. వారి చదువంతా బళ్ళారిలో జరిగింది. రాయలసీమలో ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి, ఆ విద్యాశాఖలో అధికారిగా రిటైర్ అయ్యారు. వారు అనేకకథలూ, నాటకాలూ రాయడమే కాకుండా, మంచి విమర్శకుడిగా పేరు పొందారు. జానపద వాఙ్మయం లోనూ, బాల వాఙ్మయం లోనూ చాలా కృషి చేశారు. కామేశ్వర రావుగారు ‘రోజా‘, ‘జానకి ప్రేమ‘, ‘సాహిత్య చిత్రములు‘ అనే కథా సంపుటాలు వెలువరించారు. దాదాపు 100 కథలు రాశారు. ఆమె దుఃఖం‘, ‘నూనె మిఠాయిలు‘, ‘పళ్ళ పండగ‘, ‘జత పక్షి కోసం‘ మొదలైనవి వారికి బాగా పేరు తెచ్చిన కథలు. ఇప్పుడు పరిచయం చెయ్యబోయే వారి “షష్టిపూర్తి” అనే కథ 1952 లో ‘తెలుగు స్వతంత్ర’ అనే పత్రికలో వచ్చింది.

   గరికపురం ఒక అందమైన గ్రామం. ఆ ఊరిపెద్ద కాంచనమూర్తికి చుట్టుపక్కల మంచి పేరు ప్రతిష్ఠలున్నాయి. అతనిది దివ్యమైన రెండంతస్తుల మేడ. పెద్దపెద్ద ఆఫీసరులెవరు వచ్చినా, లేదా ఇతర పెద్దలెవరు వచ్చినా ఆయన ఇంటిలోనే మకాం. అందరి పరిచయం వల్ల ఆయన అనేక విషయాలను తెలుసుకుంటూంటాడు. అంతేకాదు… చిన్ననాడు ఇంటిదగ్గర గురువుగారు నేర్పిన విద్యని కాంచనమూర్తి తన సాధనవల్ల మరింత వృద్ధి చేసుకున్నాడు.

   కాంచనమూర్తికి గంపెడు పిల్లలు. అతను వేరే సత్రవులు పెట్టించక్కర్లేదు. ఆ బలగాన్ని పోషించడమే చాలు! ఎంత పిల్లజమిందారైనా, దానగుణం అసలు లేదని అతనికి పేరు. అతను డబ్బు గురించి తప్పించి ఎన్ని కబుర్లు చెప్పినా హాయిగా వింటాడు. ఎన్ని సంగతులు అడిగినా చెబుతాడు. అనాధ శరణాలయానికి చందా అనో, గ్రంథాలయానికి విరాళమనో, మరేదో లోకోపకార సంస్థకో ఎవరో ఒకరు ఏదో ఒకటి అడగక మానరు. ఆయన ఎప్పుడూ ఇచ్చి ఎరుగడు. చివరికి ఆయన ఊళ్ళో ప్రాథమిక పాఠశాలకేనా రూపాయి ఖర్చుపెట్టలేదు.

   కాంచనమూర్తి చాలా నిష్ఠాపరుడు. రోజూ పంతులుగారు వచ్చి ఇంట్లో దేవతార్చన చేసి పోతూంటారు. అతను స్వయంగా భారత భాగవత రామాయణాది పురాణ గ్రంథాలే కాకుండా, వేదాంత గ్రంథాలను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. భగవద్గీతను నిత్యం పారాయణ చేస్తాడు. ఆయన పిల్లలందరూ పెద్దవాళ్ళయేరు. కూతుళ్ళందరికీ పెళ్ళిళ్ళయి, వాళ్ల కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సంసారభారం కొడుకులు చూసుకుంటున్నారు. కాంచనమూర్తికి ఇంటి విషయం పట్టించుకోవలసిన అవసరం ఇంక ఏమాత్రమూ లేదు. సంసార బాధ్యతలు పూర్తిగా వదిలించుకొని ‘రామా కృష్ణా’ అనుకుంటూ గడపవలసిన కాలం సమీపించిందని అతను గాఢంగా తలపొస్తున్నాడు. ‘షష్టిపూర్తి’ అయిందనిపించుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ మరుచటి రోజునుంచే జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమౌతుంది. శాస్త్రాలలో చెప్పిన ప్రకారం రాజర్షిలాగ జీవించడానికి సిద్ధపడుతున్నాడు. అలాగని అతనికి కీర్తి మీద ఆశ ఉందని కాదు. ఈ ప్రపంచంలో కీర్తికీ డబ్బుకీ సంబంధం ఉంది. కాబట్టి అదెంతమాత్రమూ పనికిరాదు. ఆ మచ్చలేని పవిత్రమైన కీర్తి ఆయన కోరుకుంటున్నాడు.

   కాంచనమూర్తి ఎవ్వరికీ ఒక్క దమ్మిడీ ఇవ్వకపోయినా, ప్రజలు మాత్రం అతని ఎడల ఎంతో భక్తిశ్రద్ధలతో ఉంటారు. ఆయనకి షష్టిపూర్తి సమీపిస్తున్నట్టుగా ఊరివారందరికీ తెలుసు. ఆ ఉత్సవాన్ని జయప్రదంగా జరిపించాలని వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. ఒక రోజున నలుగురు పెద్దలు పదిమంది పిన్నలని వెంటేసుకుని సరాసరి కాంచనమూర్తి మేడ మీదకి వెళ్ళేరు. షష్టి పూర్తి ఉత్సవాన్ని గురించి, దాని నిర్వహణ గురించి అతనితో ముచ్చటించారు. కొందరు కాంచనమూర్తిని అభినందించారు. కాంచనమూర్తి మాత్రం తటస్థంగా ఉన్నాడు.

   ఇలా ఉండగా నవానందస్వామి అనే ఒక సాధువు దేశ సంచారం చేస్తూ గరికపురం వచ్చాడు. ఊళ్ళో పిల్ల జమిందారైన కాంచనమూర్తి గారి భవనంలోనే మకాం చేశాడు. ఊరివారంతా స్వామి దర్శనం చేసుకుని తరించేరు. కాంచనమూర్తి వేదాంతం బాగా చదువుకున్నవాడని తెలుసుకుని స్వామి చాలా సంతోషించారు. త్వరలోనే సంసార బంధం నుంచి స్వేచ్ఛను పొంద దలుచుకొన్న కాంచనమూర్తి స్వామీజీతో వేదాంత గోష్టి చేస్తూండేవాడు. తాను జీవితాన్ని అర్థం చేసుకున్న విధాన్ని స్వామికి తెలియచేసుకున్నాడు. “నా వేదాంతం ఉట్టి జ్ఞానమే కాదు, ఆచరణతో కూడుకున్నది” అన్నాడు కాంచనమూర్తి. ఆ మాటలు విని నవానందస్వామి నిజంగా ఆనందించాడు. కాంచనమూర్తి తను జీవితాన్ని ఎలా వేదాంతంతో సమన్వయ పరుచుకున్నదీ స్వామీజీకి వివరించాడు.
   “సూక్ష్మజీవుల దగ్గర్నుంచీ బ్రహ్మదేవుడి దాకా ఎవరు చేసుకున్న కర్మను వారు అనుభవిస్తారు. మరి మనుష్యుల సంగతీ అంతే! కాబట్టి ఎవరి కర్మను వారు అనుభవించేటప్పుడు మరొకరు అడ్డు పడకూడదు. అట్లా అడ్డుపడ్డారా…, అవతలి వాళ్ళని కర్మానుభవం పొందనివ్వని పాపాన్ని తాము పొందుతారు. అందుచేత… మనుష్యులు అవతలి వారి కష్టాలను చూస్తూ ఊరుకోవలసిందే కానీ, మరొకరికి సహాయపడకూడదు” అన్నాడు కాంచనమూర్తి. ఆ మాటలు విని స్వామీజీ చాలా ఆశ్చర్యపోయాడు.

   “ప్రతివాడూ కష్టపడి ధనం సంపాదించుకొంటూ బాగుపడాలి. లేకపోతే మనిషి సోమరిపోతు అయిపోతాడు” గంభీరంగా కాంచనమూర్తి తన ఉపన్యాసం కొనసాగించాడు. స్వామీజీ అంతవరకూ బాగానేఉంది అనుకుంటున్నాడు. “ఆ కారణంవల్ల మనం ఎవ్వరికీ దమ్మిడీ కూడా దానం చెయ్యకూడదు. చేశామా…. సోమరితనాన్ని ప్రోత్సహించిన వాళ్ళమవుతాము! మనం జ్ఞాన మార్గంలో పోవాలి కానీ కర్మ మార్గం అనుసరించ కూడదు. ఎందుకంటే జ్ఞానమార్గంలో డబ్బు, దస్కంతో నిమిత్తం లేదు. మోక్షానికి జ్ఞానమార్గమే దారి! మీ అభిప్రాయం ఏమిటి?” అని స్వామీజీ ప్రశంసల కోసం ఎదురుచూస్తూ ఆగేడు కాంచనమూర్తి. ఇదంతా అసందర్భంగా తోచింది స్వామీజీకి.

   “కర్మ వాదంలో మీకు నమ్మకం లేదు. మీ వాదనలో నాకు నమ్మకం లేదు. అయితే మొదట్లోనే మీరు ‘ఎవడి కర్మ వాడు అనుభవిస్తాడు’ అని చెప్పేరు” అని పలికి స్వామీజీ ఊరుకున్నాడు. అవే పొగడ్తలుగా అనుకున్నాడు కాంచనమూర్తి. ఆ మరునాడు స్వామీజీ బయలుదేరేరు. తన షష్టి పూర్తి ఉత్సవానికి ఉండమని స్వయంగా కాంచనమూర్తి ఆయనని కోరాడు. “ఏ వేళకి ఎక్కడుంటానో నాకే తెలియదు ” అని స్వామీజీ సూక్ష్మంగా చెప్పి ఊరుకున్నారు.

   షష్టిపూర్తి ఉత్సవానికి అనేకమందికి ఆహ్వానాలు వెళ్ళేయి. పందిళ్ళు, పాకలు వేస్తున్నారు. అలంకరణలు చేస్తున్నారు. అప్పుడే వారం రోజులనుంచి కావలసినంత సందడిగా ఉంది. ఉత్సవాల్లో సభలు, మేళతాళాలు, భజనలు, పద్యపఠనం, పాట కచ్చేరీలు, హరికథ, వినోదాలు, విందులు మొదలైన వాటితో సభ్యులను ముంచెత్త దలుచు కొన్నారు. ఆ ఉత్సవం కోసం అనేకమంది అనేక ప్రాంతాలనుంచి వచ్చేరు. పెద్దపెద్ద ఉద్యోగస్తులంతా ఆ క్రిందటి రాత్రే వచ్చేశారు. రానివారు రాలేకపోయినందుకు విచారిస్తూ బారెడు ఉత్తరాలు రాసేరు. ప్రజలకోసం తాత్కాలికంగా చిన్న చిన్న దుకాణాలు, కాఫీ హోటళ్ళు వెలిశాయి. ఉత్సవం జరిగే రోజున ఊళ్ళో బడికి సెలవు! దేవాలయంలో దేవుణ్ణి ముస్తాబు చేస్తున్నారు. ఆరోజు కాంచనమూర్తిని సతీసమేతంగా సన్మానించ దలుచుకొన్నారు. ఆయన స్వంతదైన నీలి పువ్వుల బండికి పన్నెండు జతల ఎడ్లను కట్టి అందులో ఆయన్ని ఊరేగించ దలచుకొన్నారు. రాత్రంతా మనుష్యుల సందడితోనూ, గ్యాస్ లైట్ల వెలుగులోనూ పట్టపగలులాగే ఉంది. పడుకునేవాళ్లు పడుకున్నారు. తిరిగేవాళ్లు తిరుగుతున్నారు.

   రాత్రి కాంచనమూర్తి పరుపుమీద పడుకున్నాడు. ఏవో కొన్ని ఆలోచనలు అతనిలో రేగేయి. “బ్రతుకు ఎంత చిత్రమైనది? అరవై ఏళ్ళ బతుకు కలలా గడిచిపోయినట్టే కదా! అయితే ఇది వేడుకకి సమయమా, కాదా? అనేదే ప్రశ్న! ఈ కలికాలంలో అరవై ఏళ్లు బతికినందుకు ఆనందించవలసిందే , ఇతరులు అభినందించవలసిందే! కానీ మరొక వైపునుంచి మృత్యువు సమీపిస్తూందని విచారించనవసరం లేదా? ఈ జీవితంలో నేను సాధించిన కొన్ని మహత్తర విషయాలు లేకపోలేదు. నా ఆస్తిపాస్తులను పాడుచెయ్యక జాగ్రత్తగా కాపాడుకొన్నాను. నేననుకున్న ఉన్నతాదర్శాలను తు.చ. తప్పకుండా పాలించేను. నాకు ఎలారాసి పెట్టి ఉందో అలా నా జీవితం గడిచింది. భగవంతుడు దయామయుడు. జగద్రక్షకుడు. నాకు ఇకముందు ఆయన జపతపాదులలోనే ములిగిపోయే అవకాశం కల్పిస్తున్నాడు. ఆయన మహిమను ఏమని పొగడను? జీవితం మరెంతకాలమో ఉండకపోవచ్చు!” అని ఆలోచించుకొంటూండగా ఎప్పుడో నిద్ర పట్టేసింది.

   తెల్లవారింది. కాంచనమూర్తి మేడలో ఒకటే గోల! ఇల్లు కొల్లగొట్టేరన్న వార్త ఒకటి బయలుదేరింది. అందరూ ఆశ్చర్యపోతున్నారు. గుమిగూడి మాట్లాడుకుంటున్నారు. ఎలా జరిగిందో ఎవరికీ తెలియదు. ఇంటిలో నగదు, జావాహరీ మొత్తం అంతా ఖాళీ అయింది! నానా గందరగోళంగానూ ఉంది. వచ్చిన జనాలకి ఆశ్చర్యం తప్పితే మరొక భావం తోచలేదు. ఎవరికీ ఎవరిమీదా అనుమానం లేదు. ఈ స్థితిలో కొందరు కాంచనమూర్తికి ఎదురు పడకుండా తప్పించుకుంటున్నారు. ఆయనే కొందరి మొహాలు చూసి, పలకరించలేక సిగ్గుతో తల వంచుకొన్నాడు. వచ్చిన చుట్టాలూ, పెద్దలూ, పిన్నలు వచ్చినట్టే నెమ్మదిగా జారుకుంటున్నారు. క్రమంగా ఊరు ఎప్పటిలాగే ప్రశాంతత పొందింది! అంతకుమించి ఎవ్వరికీ ఏమీ తెలియదు!

                                               –**—**–

ఈ కథ నిడివిలో చాలా చిన్నది. కానీ పెద్దగా ఆలోచింప చేస్తుంది. శ్రీ టేకుమళ్ళ వారు దీనిని చిత్రంగా నడిపించారు. డబ్బున్న పిల్లజమిందారుకి తగ్గట్టుగానే కాంచనమూర్తి అని పేరు పెట్టారు. కాంచనమూర్తి చిన్ననాటి నుంచే వేదాంత పురాణాదులు క్షుణ్ణంగా చదువుకున్నాడు. వంటబట్టించుకున్నాడు. అందువల్ల తను ఒక “జ్ఞాని” అని భావించాడు. తనకెంత ధనమున్నా కాంచనమూర్తి ఎన్నడూ దానధర్మాలు చేసి ఎరుగడు. పైగా , ధనసహాయం లేదా దానధర్మాలు కానీ చెయ్యడం వల్ల జనాలు సోమరులుగా తయారవుతారని అతని సిద్ధాంతం! (అయినా ఆ ప్రాంతపు ప్రజలకి అతనంటే అత్యంత గౌరవం) అంత జ్ఞాని అయిన కాంచనమూర్తికి ‘పరోపకారార్థ మిదం శరీరం’ అని తెలియకపోవడం ఆశ్చర్యమే!

తన ‘సిద్ధాంతాన్ని’ కాంచనమూర్తి స్వామీ నవానందకి తెలియబరుస్తాడు. స్వామీజీ ఆ వాదనని అంగీకరించడు. అయితే నవానందస్వామి రాక కాంచన మూర్తిలో ఏదో తెలియని మార్పు తీసుకొచ్చింది. అతని సిద్ధాంతపు పునాదులని కుదిపేసింది. మరునాడు షష్టిపూర్తి ఉత్సవం ఉందనగా, అందుకోసం అన్ని ఏర్పాట్లూ జరుగుతుండగా ఆ రోజు రాత్రి అతనిలో తీవ్ర సంచలనం, ఆలోచనల్లో పెను మార్పూ వచ్చింది. రచయిత కథలో ఇదమిత్థంగా ఇదీ అని చెప్పలేదు కానీ, కాంచనమూర్తి తను కూడబెట్టిన డబ్బు, బంగారు ఆభరణాలు అన్నీ తెల్లారేటప్పటికి ‘వదిలేసుకున్నాడు’. ఇన్నాళ్ళుగా తను సంపాదించిన ‘జ్ఞానం’ ఈ ‘కర్మ’ కి పురికొల్పిందేమో!!

అందరిదగ్గరా కొద్ది రోజులపాటు సెలవు తీసుకుని, మళ్ళీ త్వరలోనే కథతో కలుస్తాను.

–సి.యస్.

4 Comments Add yours

 1. DLSastry says:

  కధలో చాలా మలుపులు ఉన్నాయి. కాంచన మూర్తి నిజంగా పూర్తి పిసినారి అయితే ఇంటిలో అంతమందికి ఆతిధ్యం ఇస్తాడనుకోను.
  అతని ఇల్లు దోచు కోబడడం లో స్వామీజీ పాత్ర ఉం దే మో నన్న అను మానం కలుగుతుంది.
  మంచి కధ ..సియస్ కి ధన్య వాదాలు..

  Like

 2. జయంతి సత్యనారాయణ శాస్త్రి says:

  సీఎస్ గారూ, మీ షష్టమ కథాపరిచయం ఎంతో ఇష్టంగా చదివాను. మీరిస్తున్న నెల్లాళ్లు రెస్టు భరించడం మాకు కష్టమే.

  Like

 3. V.V.Krishnarao says:

  జ్ఞాన-కర్మ భేద శాస్త్రవాదరతులు
  మానవీయదుఃఖదీన గతుల
  విస్మరించి తాము విజ్ఞాన దీధితు
  లరయలేరు, దైవకరుణ ఉడుగ!

  Like

 4. ఆకొండి సూర్యనారాయణమూర్తి says:

  శ్రీటకుమాళ్ళ కామేశ్వరరావుగారి పుస్తకం ఎం. ఏ తెలుగు కోసం చదివా. కధ సి.ఎస్. వజ్రోత్సవ కానుకగా వజ్రం అందివ్వడం వల్ల చదివా. కాంచనమూర్తిసన్మానం పెద్ద ఎత్తున జరిపి ఆనందిద్దామని ఊరు అనుకున్నా సూక్ష్మంగా మోక్షం అని సూక్ష్మరూపంగా కధ ముగిసింది. స్థూలశరీరము కంటే సూక్ష్మశరీరం వేల రెట్లు పెద్దది. సూక్ష్మం అయేకొద్ది జ్ఞానసముపార్జన పెరిగినట్లు. నవానందస్వామి వల్ల కాంచనమూర్తి జీవునికి నవ ఆనందం వచ్చింది. నేను జ్ఞానిని అనే అహం,ఇంకా మో హం,లోభంలాంటి షట్ గుణాలు పోయి షష్టి పూర్తి జరిగినట్లే. ఉన్న ధనంపై అనురాగం,మమకారం పోతే, మనసు తేలికపాటి ది అవుతుంది. ఆస్తి తృణప్రాయం. అది చాలామందికి అనుభవం. అదే అందరికి వస్తే భవబంధ విమోచనం. మంచి సూక్ష్మతరమైన తరించేసూక్ష్మం గల వజ్రోత్సవ కధ. దీనికి ప్రత్యేకంగా ధన్యవాదములు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s