కథన కుతూహలం 61

‘ కథన కుతూహలం’ లోని కథలు చదువుతోన్న సహృదయ పాఠక మిత్రులకు నమస్కారాలు. వివిధ రచయితల 60 కథల పరిచయం నిరాఘాటంగా చేసిన తరువాత కొద్ది విరామం తీసుకోవడం జరిగింది.  ఈ ఆదివారం (25-11-2018) తిరిగి మరో కథతో మీ ముందుకొస్తున్నాను.
ఇకనుంచి వారం వారం కాకుండా ప్రతి పదిహేను రోజులకొక కథ పెడదామని అనుకుంటున్నాను. అంటే పక్షానికి ఒక కథ అన్నమాట. పరిచయం చెయ్యవలసిన కథలు చాలా ఉన్నా, కొన్ని పని ఒత్తిడుల వల్ల ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది.

ఇక కథ విషయానికి వస్తే…, ఈసారి 1980 ల నుంచి అనేక కథలూ, కవితలూ, నవలలూ రాస్తున్న ఉత్తమ శ్రేణికి చెందిన కథారచయిత , గొప్ప మానవతావాది, సంస్కరణాభిలాషి అయిన సలీం రాసిన కథని పరిచయం చేస్తాను. సలీం 1961 లో ఒంగోలు దగ్గర ‘ త్రోవగుంట’ అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎమ్. ఎస్సీ. పట్టా పొందారు.
ఆయన చిన్నతనం నుంచీ, కవిత్వమూ, కథలూ రాయడం మొదలుపెట్టారు. ఇప్పటికీ నిరంతరాయంగా రాస్తూనే ఉన్నారు. వీరు ఇప్పటిదాకా 3 కవితా సంపుటిలు, 9 కథా సంపుటాలు, 18 నవలలూ వెలువరించారు. ‘ రూపాయి చెట్టు’ , స్వాతి చినుకులు’, ‘ నిశబ్ద సంగీతం’, మొదలైన కథా సంపుటాలు, ‘ నీలోకి చూసిన జ్ఞాపకం’ అనే కవితా సంపుటి ఎంతో పేరు తెచ్చుకున్నాయి.
ఈయన రాసిన ‘కాంచన మృగం’ అనే నవల ‘ ఆటా’ వారు నిర్వహించిన పోటీలో బహుమతి పొందింది. అలాగే వీరి ‘ వెండి మేఘం’ అనే నవల యూనివర్సిటీ విద్యార్థులకి పాఠ్య పుస్తకంగా పెట్టారు.
వీరి కథలు కన్నడ, హిందీ లోకి అనువాదమయ్యాయి. వీరు అనేక పురస్కారాలను అందుకున్నారు. ముస్లిం సంప్రదాయాల్లోనూ, వారి ఆచార వ్యవహరాలలోనూ ఉండే రుగ్మతలను ఖండిస్తూ సలీం కథలు రాశారు. అందులో ” మెహర్” అనే వీరి కథను ‘పెంగ్విన్’ సంస్థ వారు ఆంగ్లంలో ప్రచురించారు. ఇప్పుడు సలీం వ్రాసిన “మల్లి” అనే కథను పరిచయం చేసుకుందాం.

రాజుకి ప్రమోషన్ మీద హైదరాబాద్ నుంచి విజయవాడ బదిలీ అయింది. అయితే అతని పిల్లల చదువుల దృష్ట్యా ఫ్యామిలీని మార్చడం వీలులేక అతనొక్కడే పెట్టే బేడా సర్దుకుని — వాటితో పాటు
వంట గిన్నెలూ, పచ్చళ్ళూ , పొడులూ పెట్టుకుని విజయవాడ వచ్చాడు. అతనికి ప్రమోషన్ వచ్చిందన్న ఆనందం కన్నా, పెళ్లాం పిల్లలకు దూరంగా పరాయి ఊరు వెళ్ళాల్సినందుకు తెగ బాధ పడుతున్నాడు.
అటువంటి సమయంలో అతనికి ధైర్యం చెప్పి, అన్నివిధాలా తోడుగా నిల్చింది– స్టాలిన్ బాబు. స్టాలిన్ విజయవాడలోని లీలా మహల్ యజమాని! డబ్బున్న వాడైనా నిగర్వి , స్నేహశీలి. కొన్నేళ్లక్రితం ఏదో పనిమీద స్టాలిన్– రాజు వాళ్ల ఆఫీసుకి వచ్చినప్పుడు ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. రాజు విజయవాడ రాగానే హోటల్లో రూం తీసుకుని, రెండు రోజులు అద్దె గదుల కోసం వెతికి వెతికి, ఆ సాయంత్రం పలకరిద్దామని స్టాలిన్ దగ్గరకి వెళ్ళేడు. ఆ క్షణం నుంచీ స్టాలిన్ అతన్ని వదల్లేదు. అతని కారులోనే ఊరంతా అద్దె ఇళ్ళ కోసం తిప్పడం, తనింట్లోనే భోజనం ఏర్పాటు చేయడం….దాంతో రాజు తెగ మొహమాట పడిపోయాడు.

ఎన్ని ఇళ్లు చూసినా స్టాలిన్ కి ఏవీ నచ్చలేదు. “మీరు ఆఫీసర్ కదా…ఇవేమీ మీకు తగినట్లు లేవు. అన్నట్టు మా థియేటర్ వెనకాల గెస్ట్ హౌస్ ఖాళీగా ఉంది. మీకు నచ్చుతుందేమో చూడండి” అన్నాడు చివరికి. రాజు ఆ గెస్ట్ హౌస్ ని చూశాడు. అది అద్భుతంగా ఉంది.  బెడ్రూంకి అటాచ్డ్ బాత్రూం. వేడి నీళ్లకి గీజర్– పెద్ద హాలు. ఏ. సీ మెషీన్లు. హాలుని ఆనుకుని బాల్కనీ! దానిమీద వేపచెట్టు నీడ! వెంటనే అందులోకి మకాం మార్చేశాడు రాజు.
స్టాలిన్ తన పరపతినుపయోగించి గ్యాస్ సిలిండర్ ఇప్పించాడు. విజయవాడ హోటళ్లలో కారాలు తినలేక రాజు వంట వండుకోవడం మొదలు పెట్టాడు. వేడివేడిగా అన్నం ,పప్పు వండుకుని తను తెచ్చుకున్న పచ్చళ్ళు వేసుకు తింటే సుఖంగా ఉంది అతనికి.

అన్నీ బాగానే ఉన్నా ,రాజుకి అసలు సమస్య పనిమనిషి దగ్గరొచ్చింది. వంట చేసుకోవడం బాగున్నా, అంట్లు తోమడం మాత్రం ఇబ్బందిగా ఉంది. ఎంతిస్తానని బ్రతిమాలుకున్నా ఒక్క పనిపిల్లా దొరకలేదు. తనదగ్గర పనిచేసే ఓబులేసుని కారణం అడిగాడు.
” ఇళ్ళల్లో సేయటానికి ఎవురైనా వత్తారయ్యా… ఇది గెస్టు అవుసు కదా! అందులోనూ సినిమా హాలు లోపల ఉందాయే! మొగోల్లు శానామంది తిరగతా ఉంటారాయె. అందుకని పనికి రావడానికి బయపడ్తున్నారు సారూ” అన్నాడు ఓబులేసు.
“అంతేనా…? ఇంకేమైనా కారణముందా?” అనుమానం తీరక అడిగాడు రాజు. కొద్దిసేపు నీళ్లు నమిలి, చేతులు నలుపుకుంటూ , నంగినంగిగా , ” ఎవురయినా ఆడకూతురు ఇంట్లో ఉంటే ఇంత ఆలోసించరయ్యా….. తమరొక్కరే కదా ఉండేది… అందుకనీ..” అన్నాడు ఓబులేసు.
రాజుకి తన అనుమానం నిజమని తోచింది. ‘అయినా పనిపిల్ల కోసం నేను మంచివాడినేనన్న కాండక్ట్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తేగలను?’ అనుకున్నాడు.
” అయినా నాకు కుర్రపిల్లే కావాలని నేనేమైనా నీకు చెప్పానా? పని చేయడానికి ఓపికున్న ముసల్దాన్ని తెచ్చినా పర్లేదు. నాక్కావల్సింది ఇల్లు తుడిచి, అంట్లు తోమి, కిందనుంచి రెండు బిందెల మంచినీళ్లు తెచ్చివ్వగల పనిమనిషి” అన్నాడు రాజు ఉక్రోషంగా. ఆఫీసరు గారికి కోపం వచ్చిందని ఓబులేసుకి అర్థమైంది. వెంటనే,” మరో వారం గడువులో పనిమడిసిని కుదిర్సిపెడతా సారూ” అని వెళ్ళిపోయాడు.

బాల్కనీలో ఈజీ ఛైర్ వేసుకుని , వేపచెట్టు గాలిని ఆస్వాదిస్తూ కూచున్నాడు రాజు. లీలా మహల్లో తెలుగులోకి డబ్ చేసిన ఏదో ఇంగ్లీష్ సినిమా ఆడుతోంది. అప్పుడే ఇంటర్వల్ ఇచ్చారు. సిగరెట్లు కాల్చుకుంటూన్న కుర్రాళ్ళ మధ్యనుంచి దారి చేసుకుంటూ వస్తున్నాడు ఓబులేసు. వెనకాల ఒక అమ్మాయి. సుమారు ఎత్తుగా ఉండి, పుష్టిగా ఉంది. మెట్లు నింపాదిగా ఎక్కి వస్తోంది. ఓబులేసు వస్తూనే, ” సారూ! దీని పేరు మల్లి. దీనికి అమ్మ లేదు. అయ్య రిచ్చా తొక్కుతాడు. ఏమేం పనులు సేయాలో సెప్పి తీసుకొచ్చాను. మీరు ఆపీసుకెల్లే లోపల వచ్చి పనంతా సేసి ఎల్తది. మల్లా రేతిరొచ్చి మీ బోయనం అయ్యాకా పని సేసి పోద్ది. నెలకి ఐదొందలు” అని గుక్క తిప్పుకోకుండా ఏకరువు పెట్టాడు.కాటుక దిద్దిన వెడల్పాటి కళ్ళు , తీర్చి దిద్దినట్టున్న ముక్కు, చామన చాయతో ఉన్న ఆమె పొట్ట కూడా ఉబ్బెత్తుగా ఉండడం గమనించాడు రాజు.” నీ పేరేంటి?” ఏదో ఒకటి అడగాలని అడిగాడు రాజు. వెంటనే అతనికి ఓబులేసు మల్లి అని చెప్పిన సంగతి గుర్తొచ్చింది.
“మల్లీశ్వరి” అందా అమ్మాయి.
“ఎన్నో నెల?” అన్నాడు వేపచెట్టు కొమ్మలకేసి చూస్తూ.
“ఆరు” అందామె.

ఓబులేసుకి రాజు మనసులో ఏముందో అర్థమైంది. వెంటనే , “ఈ పిల్లని గేటు బయట వదిలి వస్తా సారూ! రేపుదయం వస్తది. నేను మల్లొచ్చి ఇవరంగా సెప్తా” అంటూ మల్లిని తీసుకుని వెళ్ళిపోయాడు.
రాజుకి ఓబులేసు మీద పీకలదాకా కోపమొచ్చింది. ‘మరో మూడు నెలల్లో అమ్మ కాబోతున్న అమ్మాయిని తీసుకొస్తాడా? తను ఆ పిల్లచేత పనులు ఎలా చేయిస్తాడు? మెట్లపైనుంచి నీళ్లెలా మోస్తుంది? పురుడొస్తే మరో పనిమనిషిని వెతుక్కోవాలిగా…’ ఇలా ఆలోచిస్తుండగా ఓబులేసు వచ్చాడు.
“అసలేమిటీ నీ ఉద్దేశ్యం? ఆర్నెల్ల కడుపుతో ఉన్న పిల్లను తెచ్చి…” అతను మాట పూర్తి చెయ్యకుండానే ఓబులేసు అందుకుంటూ, ” శానా కోపంగా ఉందా సారూ…నాకు తెలుసు.. బానంత కడుపేసుకుని పనేం సేస్తదా అని కదా….? కూటికి లేని పేదోల్లకి పని సేయకుండా పూట గడవదు. మల్లి మంచిపిల్ల. మీరు ఉత్తినే డబ్బిస్తానన్నా తీసుకోదు.
సారూ! మీకు మడిసి అవుసరం కన్నా మల్లికి మీ అసోటి అయ్య అవుసరం ఎక్కువుందని తెచ్చినా. దానికి పురుడొచ్చేలోపల మరో మడిసిని సూసి పెడ్తా. దానికి పూటకింత తిండి దొరుకుద్ది. ఇక్కడ ఎక్కువ శముండదు. కాదనకండి…మీకు పున్నెమొస్తది. తల్లిలేని పిల్ల” అన్నాడు చేతులు జోడిస్తూ.
తను సరిగ్గా గమనించలేదు కానీ మల్లికి పదహారేళ్లకి మించి వయసుండదు. ఏదో ఓ కారణంగా వద్దనాలి అనుకుంటూ, ” మరి మంచినీళ్లు..కిందనుంచి మోయగలదా?” అన్నాడు రాజు.
“మంచినీళ్ళే కదా సారూ… రెండ్రోజులకోపాలు నేను వచ్చి మోసుకొచ్చి, ఆఫీసుకెళ్తా” అన్నాడు ఓబులేసు. అలా మల్లి అక్కడ పనిమనిషిగా కుదిరిపోయింది.

అన్నం వండినా, కూర చేసినా ఇద్దరికి సరిపడా చేయమనేవాడు రాజు. తను తినగా మిగిలింది మల్లిని తినమనేవాడు. ఇక్కడే కూచుని తినమన్నా మల్లి వినేదికాదు. ఇంటికి పట్టుకు పోయేది. ‘మొగుడంటే ప్రేమనుకుంటా’ అనుకునేవాడు. ఎక్కువ మాట్టడేది కాదు. పలకరించినా పొడిగా సమాధానం చెప్పి తప్పుకునేది. ఆ మాటే ఓసారి ఓబులేసుని అడిగాడు రాజు.
“మల్లి మాటలపుట్ట సారూ! గలగల మాటాడకుండా ఛనం ఉండ్లేదు” అన్నాడు ఓబులేసు.
“మరి….నా దగ్గర అసలు మాట్లాడదే..” అన్నాడు రాజు.
“మీరు పెద్ద ఆఫీసరు కదా సారూ….నేనే సెప్పినా…మాట పొల్లు పోతుందని నోటికి తాళంకప్ప బిగించమని” అన్నాడు ఓబులేసు.
రాజు నవ్వి, ” అడగటం మరచిపోయా…. మల్లి పెనిమిటి ఏం పని చేస్తాడు?” అన్నాడు.
ఓబులేసు మొహం మారిపోయింది. ” మల్లి మొగుడు దాన్నొగ్గేసి ఎటో ఎల్లిపోయాడు సారూ. అయినా దాని పిచ్చిగానీ.. పోలీసులకి సెప్తే కాపురాలు సక్కబడ్తాయా? నేనెంత నెత్తీ నోరూ బాదుకున్నా దాని తలకెక్కలా. సినిమాలు సూసి, అందులో ఈరోయిన్ సేసినట్టు సేయడానికి పేదోల్లకి కుదుర్తుందా సారూ.” అన్నాడు. ” అసలేం జరిగిందో వివరంగా చెప్పు” ఉత్సుకత ఆపుకోలేక అడిగాడు రాజు.

” మా ఇజీవాడలో ఓ పూట కూడైనా మానుకుంటారు కానీ, సినిమాల కెళ్ళటం మానుకోరు. అలా సినీమాల పెబావమో ఏటో కానీ మల్లి పద్నాలుగేళ్లకే పేమలో పడింది. మల్లి వోల్లు కాలవ లాకుల దగ్గర గుడిసెల్లో ఉంటారు. ఆ కుర్రాడు మా ఇంటి దగ్గరోడు. ఆడు పరమ బేవార్సు గాడు.
బీడీలు కాల్సటం , జోబిలో నాల్రూపాయలుంటే సినీమా సూట్టం…అదే ఆడు సేసే పని. ఇద్దరికీ ఎలా కల్సిందో ఏమో… మల్లి ఆడి పేమలో పడింది.
దానికి ఆడంటే పిచ్చి పేమ! తీరా మల్లికి కడుపొచ్చాకా పెల్లి సేసుకోమంటే ఈడు కాదన్నాడు. మేమందరం సెప్పి సూసాం. ‘అదే సరదా పడి నా యెంట పడ్డది. నేను మగాణ్ణి. లచ్చ మందితో తిరగతా. నాకు నచ్చితేనే మనువాడతా ‘ అన్నాడు. నాకు తెలుసు…. ఆ ఎదవకి కట్నం కావాల”, ఓబులేసు క్షణం ఆగి మళ్ళీ మొదలెట్టేడు.
“మల్లి గుడిసెలో ఏడుత్తా కూసుంటుందనుకున్నా. లేదు సారూ…అది సివంగి పిల్ల. ఓ రోజు పొద్దుకూకే ఏల వచ్చింది. ఆడి సొక్కా పట్టుకుని గుంజుకుంటూ, పోలీసులకాడికి ఈడ్సుకుపోయింది. నాకు బయమేసి, ఆడ్ని వదలవే అంటూ కూడా పోయాను.
” ఈడు నన్ను మనువెలా ఆడడో సూస్తా” అంది. అక్కడ ఎస్సై ఈడ్ని నాలుగు తన్నేడు. ఆళ్ళ పెద్దోల్లని పిల్చి అందర్నీ లోపలేత్తా అని బెదిరించాడు. టేసన్ లోనే పెల్లి సేశాడు. మా పేటలో అందరం దాని గుండె దైర్యానికి ముక్కు మీద వేలేసుకున్నాం”. రాజు ఆసక్తిగా వింటున్నాడు.
“పెళ్ళయితే సేశారు కానీ సారూ…కాపురం సేయించలేరుగా. ఆడు నాలుగు నెల్లు అలా అలా ఉండి, సెప్పా పెట్టకుండా ఎటో ఎల్లిపోయాడు. ఇప్పుడది దాంతోపాటు బిడ్డని కూడా పోసించుకోవాల” అన్నాడు ఓబులేసు.

రాజుకి మల్లి పెళ్లి విషయం తెలిశాకా ఆ పిల్లంటే కుతూహలం పెరిగింది. మెల్లగా మాట్లాడ్డం మొదలుపెట్టేడు. మొదట్లో పొడి పొడిగా మాట్లాడినా తరవాత చనువుగా మాట్లాడ్డం అలవాటైంది.
“అతడెక్కడున్నాడో తెలీదు. వస్తాడో రాడో తెలీదు. మరి పిల్లనో, పిల్లాడ్నో కన్నాకా ఏం చేద్దామనుకుంటున్నావు?” అని ఓ సారి అడిగాడు.
“ఆడెక్కడికి పోతాడయ్యా…? నన్నొదిలేసి ఆడుండలేడు. ఇసాకపట్నం దగ్గరున్నాడని మావోల్లు కబురు మోసుకొచ్చారు. మా సుట్టాలందరికీ సెప్పుంచా. ఆడు కనపట్టం ఆలీసెం…తెచ్చి నాకాడ పడేస్తరు” అంది మల్లి.
మల్లిది అమాయకత్వమో, ప్రేమించిన వ్యక్తి మీదున్న అంతులేని విశ్వాసమో, లేక మూర్ఖత్వమో రాజుకి అర్థం కాలేదు.
” నువ్వు బిడ్డని కనబోతున్నావని తెలిసి కూడా నిన్నొదిలేసి పోయినాడు.. మళ్ళా వస్తాడనుకోను. అతని కోసం ఎదురుచూడ్డం కంటే నువ్వేదో దారి చూసుకోవడం మేలు” అన్నాడు రాజు.
” లేదయ్యా! నా నమ్మకం నిజమౌతది. ఆడు ఎర్రోడయ్యా! బెదురుగొడ్డు.
నేను పోలీసులకాడికి లాక్కెల్లానని అలిగి ఎటో పోయాడు కానీ…నామీద పేమ లేక కాదు. ఆడొత్తాడు.. మీ దగ్గరకి లాక్కొత్తాను కూడా..” అంది మల్లి నవ్వుతూ. వాడు రావాలనీ, మల్లి నమ్మకం వమ్ము కాకూడదని మనసులో కోరుకున్నాడు రాజు.

పురుడింక వారం రోజులుందనగా తనే వాళ్ళింటి దగ్గరుండే మరో అమ్మాయిని పనిలోకి పెట్టింది మల్లి. వెళ్తూ.. ” పెసవం ఐనాకా ఈలైనంత తొరగా వచ్చేత్తానాయ్యా” అంది మల్లి.
మల్లి చేతిలో కొంత డబ్బు పెట్టి, ” ఆరోగ్యం జాగ్రత్త! నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ అమ్మాయి ద్వారా కబురు పెట్టు. నాకు చాతనైనంత సాయం చేస్తాను” అన్నాడు రాజు మల్లి కళ్ళల్లో నీళ్ళు. ” మా అయ్య తర్వాత అంత పేమగా సూస్కుంది మీరేనయ్యా” అంది.
వారం దాటేకా మల్లికి పురుడొచ్చిందనీ , ఆడపిల్ల పుట్టిందనీ కొత్త పనిపిల్ల కబురు మోసుకొచ్చింది.
ఓబులేసు “సారూ.. మీ లాంటోల్లు మా గుడిసెల్లోకి రాలేర”ని చెప్పినా , వినకుండా పట్టుబట్టి రాజు ఓబులేసుని తీసుకుని మల్లిని చూడ్డానికి వెళ్ళేడు. మల్లి రాజుని చూసి చాలా హడావుడి చేసింది.
“కురిసీ తెస్తానయ్యా” అంటూ చెప్పినా వినకుండా బయటికి వెళ్ళి, కుర్చీ పట్టుకొచ్చి తెగ మర్యాద చేసేసింది.

నెల తిరక్కుండానే మల్లి పనిలోకొచ్చేసింది. “మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవచ్చుగా” అని రాజు ఓబులేసుతో అన్నాడు.
“పన్లోకొస్తే దానికి కడుపునిండా కూడు దొరుకుద్ది సారూ! పిల్లదానికి పాలకి కరువుండదు. దాని కరుసుకి పదో పరకో తమరెలాగూ ఇత్తారాయె. అందుకని లగెత్తుకొచ్చింది”. అన్నాడు ఓబులేసు. పిల్లకి ఆరో నెల వచ్చేదాకా పక్కింటి అమ్మాయికి అప్పచెప్పింది మల్లి. ఆతరవాత పనిలోకొస్తూ దాన్నీ ఎత్తుకొచ్చేది. హాల్లో వదిలేస్తే దానిపాటికది కాళ్లూ, చేతులూ యదేచ్ఛగా ఆడిస్తూ హాయిగా ఆడుకునేది.
ఓరోజు ఉదయాన్నే మామూలుగా కంటే గంట ముందు పనిలోకి వచ్చేసింది మల్లి. ఉదయిస్తున్న సూర్యబింబంలా వెలిగిపోతోంది ఆమె మొహం! వస్తూనే..,
“అయ్యా! నేను సెప్పలేదా…ఆడు తప్పకుండా వొత్తాడని. నా నమ్మకం నిజమౌద్దని. ఇజీనగరంలో ఉన్నాడంట. మావోల్లు , ఓబులేసు బాబాయి ఆడిని తీసుకురాటాకి ఎళ్ళారు”. అంది.

ఆ మాటలు చెప్పేటప్పుడు ఆమె మొహం సంతోషంతో వెలిగిపోతోంది. రాజు కూడా చాలా ఆనందించాడు. ఆ మర్నాటి నుంచి మల్లి మొగుడి గురించి వసపిట్టలా వాగడమే. “ఆడికా ఇజీనగరం నీళ్ళు పడక బక్కగా, జండా కొయ్యలాగైనాడు. తిండీ తిప్పలు లేక సిక్కిపోయాడు. ఆడ్ని సూత్తే కడుపు తరుక్కుపోయిందయ్యా.
సినేమా ఈరో లాగుండేవాడు…మల్లీశ్వరి సినేమాలో ఎన్టీవోడిలా గిరజాల జుట్టు, వెడల్పాటి మొకం, కోర మీసం…. సూట్టానికి కళ్ళు సాలేవి కావు. మా అయ్య ఆడికి కూడా ఓ రిచ్చా ఇప్పిత్తానంటే అప్పుడే వొద్దన్నానయ్యా. రెండు మూడు నెల్లయినా ఆడికి మంచి తిండి పెట్టి మల్లా మడిసిని చెయ్యాల” అంది మల్లి.

ఓరోజు “అయ్యగారూ! ఆడిని మీ దగ్గరకి తీసుకొత్తా. కానీ ఆడు సిగ్గు పడతన్నాడు. మీరు తిడతారని ఆడి బయం. రేపెలాగూ ఆదివోరమే కదా. పొద్దుటేల పిల్సుకొత్తా. ఆడ్నేమీ అనమాకండయ్యా. బాదపడతాడు. అది నేను సూళ్లేను. ఆడికి ఏది మంచో ఏది సెడో తెలీదు. అందుకే ఆడిమీద నాకు కోపం రాదు. మీరూ ఆడి మనసు బాదపడేలా ఏమీ అనకండయ్యా” అంది మల్లి.
మల్లికి అతని మీదున్న ప్రేమను చూస్తే రాజుకి ముచ్చటేసింది. అంత ప్రేమను పొందిన ఆ అదృష్టవంతుడ్ని చూడాలనిపించింది రాజుకి. మర్నాడు మల్లి అతన్ని తీసుకొచ్చింది.
“అయ్య శానా మంచోరు. నువ్వు లేకుండా పోయినా, నాకూ, నా బిడ్డకూ ఇన్ని నెల్లూ ఇంత తిండి దొరికిందంటే.. ఈ అయ్య సలవే” అంటూ అతనితో కలిసి రాజు కాళ్ళకి మొక్కింది.
రాజెక్కడ అతన్ని ఏదైనా అనేస్తాడేమో అని అతన్ని తన కూడా కూడా తిప్పుకుంది. అవకాశం ఉన్నప్పుడల్లా ‘ఆడినేమీ అనకండి ‘ అన్నట్టు సైగ చెయ్యడం చూసి రాజు నవ్వుకున్నాడు.
” మల్లి మంచి పిల్ల! నువ్వంటే ప్రాణం! అంత మంచి పెళ్ళాం దొరకడం నీ అదృష్టం. మల్లిని బాగా చూస్కో” అన్నాడు రాజు. మల్లి సంతృప్తిగా హాయిగా నవ్వుకుంది.

రాజు విజయవాడ వచ్చి సంవత్సరం పూర్తి అవబోతున్న దృష్ట్యా మళ్లీ హైదరాబాద్ బదిలీకి ప్రయత్నాలు మొదలుపెట్టేడు. మల్లి మళ్లా కడుపుతోంది. “ఈసారి మగపిల్లాన్ని కనిస్తానయ్యా! ఆడికి
మగపిల్లల మీద బెమ! ఆడి కొడుకే ఆడెక్కడికీ పోకుండా కట్టడి సేసుకుంటాడు” అంది మల్లి వెన్నెల్లా నవ్వుతూ.
అయితే మల్లి అలా అన్న వారం రోజులకే ఆమె మొగుడు ఇల్లు వదిలేసి పరారయ్యాడు. మళ్లీ ఓబులేసుని తీస్కెళ్ళి పోలీసులకి కంప్లయింట్ ఇచ్చింది మల్లి.
గలగల మాట్లాడే మల్లి మూగబోయింది. రాజు మెల్లగా సముదాయించాడు.
“ఇప్పటికైనా వాడెలాంటివాడో అర్థం చేసుకో. నీకు తగిన భర్త కాడు. మీలో మారు మనువులుంటాయి కదా….మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో. నీ జీవితం బాగుపడుతుంది” అన్నాడు రాజు. “మా కులపోళ్ళలో నన్ను సేసుకుంటామని శానామంది అన్నారయ్యా! నేను ‘వూ’ అనాలే కానీ నన్ను మనువాట్టానికి సిద్దంగా ఉన్నారు. నాకు ఎవరూ వొద్దయ్యా. నాకు ఆడంటేనే ఇష్టం! ఆడు వొత్తాడు. నన్ను, పిల్లల్నీ వదిలి ఆడుండలేడు. నేనాడికోసం ఎదురు సూస్తానయ్యా” అంది మల్లి.

రాజుకి హైదరాబాద్ బదిలీ అయిపోయింది. మల్లి కన్నీళ్లు పెట్టుకుంది. రాజు స్థానంలో వచ్చిన ఆఫీసరుకి మల్లిని పరిచయం చేసి, విజయవాడ వచ్చినప్పుడల్లా తను వచ్చి మల్లిని చూస్తానని మాటిచ్చి రాజు హైదరాబాద్ వెళ్ళిపోయాడు.
కొన్నాళ్ళకి ఓబులేసు దగ్గర్నుంచి రాజుకి ఉత్తరం వచ్చింది. మల్లికి మగపిల్లాడు పుట్టేడనీ, తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారనీను. మల్లి కోరుకున్నట్లు మగపిల్లాడు పుట్టినందుకు రాజు సంతోషించినా, తను ఎవరికోసమయితే మగబిడ్డ కావాలనుకుందో, అతనే దూరమైనందుకు బాధపడ్డాడు రాజు. ఇది జరిగిన ఓ మూడు వారాలకి రాజుకి విజయవాడ వెళ్లే పని పడింది.
ఆఫీసు పని అయ్యాకా, ఓబులేసుని తీసుకుని మల్లిని చూడ్డానికి వెళ్ళేడు రాజు. మల్లి బాగా చిక్కిపోయింది. రాజుని చూడగానే ఉత్సాహంగా తిరిగింది. మొహంలో వెలుగు! అయితే ఆ వెలుగు రాజుని చూసినందుకు కాదు…ఆమె భర్త ఆచూకీ తెలిసిందట. అందుకు!
“ఆడెక్కడున్నాడో తెలిసిందయ్యా… ఐదారాబాదులో అంట. మా వోల్లు పిచ్చాల్లలా ఇశాపట్నం, ఇజీనగరం ఎతుకుతుంటే ఈడు ఐదారాబాదులో కులాసాగా ఉన్నాడట. మా అయ్య ఆడ్ని ఎతికి పట్రాడానికి పోయేడు. నేను సెప్పా గదయ్యా ఆడు వొత్తాడని” అంది మల్లి. గుడిసెలో
మల్లితోపాటు ఇప్పుడు ఇద్దరు పిల్లలున్నారు. రాజు బయలేదేరేముందు మల్లి చేతిలో కొంత డబ్బు ఉంచాడు. “ఆడు రాంగానే ఓబులేసు బాబాయి సేత మీకు కార్డు రాయిత్తానయ్యా” అంది మల్లి.

రాజు హైదరాబాద్ వెళ్ళిన నెలకి ఓబులేసు నుంచి ఉత్తరం వచ్చింది. ఎన్నిరోజులు వెతికినా మల్లి మొగుడు దొరకలేదనీ, కానీ ఆ హైదరాబాద్ లోనే ఉన్నాడని రూఢీగా తెలిసిందని, మల్లి చాలా దిగులు పెట్టుకుందనీ, ఆమె ఆరోగ్యం బాగుండలేదనీ దాని సారాంశం. రాజుకి బాధేసింది.
‘అతను దొరికితే బాగుండు… మల్లి కళ్ళల్లో మళ్ళీ వెలుగొస్తుంది’ అనుకున్నాడు రాజు.
ఓరోజు ఏదో పనుండి రాజు హయత్ నగర్ వెళ్ళేడు. తిరిగి వచ్చేటప్పుడు ఇడ్లీలు, దోసెలూ అమ్ముతున్న బండి దగ్గర ప్లేట్లు కడుగుతూ మల్లి మొగుడు కనిపించాడు. అవునా కాదా అని అనుమానమొచ్చి పరిశీలించి మళ్ళీ చూశాడు రాజు. అవును అతనే…! గడ్డం మాసిపోయి, కళ్ళు లోతుకుపోయి దీనంగా ఉన్నాడు. తనని చూస్తే మళ్లీ గుడారం మార్చేస్తాడని రాజు అతనికి కనిపించకుండా జాగ్రత్త పడి ఇంటికి వచ్చేసి , ఓబులేసుకు ఉత్తరం రాద్దామని కూచున్నాడు. దివ్యంగా వెలిగిపోతున్న మల్లి మొహం అతనికి కనిపించింది. మల్లి చాలా సంతోషపడుతుంది.
అతన్ని ఆ అమ్మాయికి పట్టివ్వడంలో తన వంతు సహకారం ఉన్నందుకు పొంగిపోతుంది. కానీ వెంటనే రాజు కళ్ళముందు గుడిసెలో దీనంగా కూర్చున్న మల్లి, ఆమె చుట్టూ చేరి ఆకలంటూ ఏడుస్తున్న ముగ్గురు పిల్లలు… ఏ మద్రాసుకో పారిపోయిన ఆమె భర్త….మరలా అతనికోసం మల్లి వెతుకులాట……అంతా ఓ వలయంలా తిరిగింది. రాజుకి భయం వేసింది.
రాసిన ఉత్తరాన్ని చింపేశాడు. మల్లి భర్త కనిపించినా తెలియపరచనందుకు ఆమె తనని క్షమిస్తుందో లేదో తెలియదు కానీ.., మల్లికి అతని ఆచూకీ తెలిపితే తనని తాను క్షమించుకొలేడు అనుకున్నాడు రాజు.

                                          ——-******——–

సలీం కథని సూటిగా చెప్తారు. ఎక్కడా అతిగా వర్ణనలు కానీ, అనవసరపు సంభాషణలు కానీ ఉండవు. కథ ప్రారంభం నుంచి చివరి వరకూ ఏకబిగిన చదివిస్తుంది.
ఈ కథలో ఆయన మల్లి పాత్రని మలిచిన తీరు అమోఘం. సాధారణంగా పనులు చేసుకునే క్రింది తరగతి మనుషుల మీద చాలామందికి ఒక దురభిప్రాయం ఉంటుంది– వాళ్ళకి ప్రేమ, విరహం వంటి సున్నితమైన భావాలు ఉండవనీ, అలాగే నైతిక విలువల పట్ల వాళ్ళకి అంతగా పట్టింపులు ఉండవనీ వాళ్ల అభిప్రాయం. కానీ రచయిత మల్లి పాత్ర ద్వారా ఆ అభిప్రాయాలు తప్పని చెప్పేరు.

పద్నాలుగేళ్ల వయసులో వ్యామోహం తప్ప ప్రేమ ఏమిటీ అంటాడు ఓబులేసు. నిజమే…. ఆ వయసులో ఉండేది వ్యామోహమే (infatuation) కానీ మల్లి ఆ వయసుకే ఎంతో మానసిక పరిపక్వత (mental maturity) సాధించింది. అతణ్ణి మనసారా ప్రేమించింది. ఆ ప్రేమని కడదాకా కొనసాగిస్తూ వచ్చింది. ఆ ప్రేమను పొందడం కోసం అవసరమైతే అతణ్ణి పోలీసుల చేత బెదిరించ డానికి కూడా వెనుదీయలేదు. అతడి చంచల స్వభావాన్ని, బాధ్యతారాహిత్యాన్ని అతని బలహీనతగా అనుకుని క్షమించింది కానీ, కోరివచ్చిన వాళ్ళని మారు మనువు చేసుకోవడానికి అంగీకరించ లేదు. అతడు వస్తాడని ఎదురు చూడ్డానికే నిర్ణయించుకుంది.

ఇక రాజు… అతనిలా పనివాళ్లని ప్రేమగా, ఆదరణతో చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వాళ్ల మనసుల లోతుల్ని పరిశీలించి, అర్థం చేసుకునే వాళ్ళు తక్కువగానే ఉంటారు. ఇతను మల్లిని ఓ కుతూరిలాగా, ఓ మిత్రురాలిలాగా చూశాడు. చివర్న అతను తీసుకున్న నిర్ణయం కథకి హైలైట్. భర్త కోసం మల్లి ఎంతలా ఎదురు చూస్తుందో అతనికి తెలుసు. అతనే జీవితం అనుకుంటూ, అతను ఎక్కడున్నాడని తెలిస్తే అక్కడికి మనుషుల్ని పంపిస్తోందనీ తెలుసు. అలాంటి స్థితిలో మల్లి భర్త జాడ తెలిసినా, రాజు ఆమెకి చెప్పడానికి ఇష్టపడలేదు.  ఏదో…ఇప్పుడు అతను ఎక్కడికో పోయాడనీ, ఎప్పటికో అప్పటికి దొరుకుతాడనీ అనుకుని, ఎదురు చూస్తూ, ఉన్న పరిస్థితులకి తగ్గట్టుగా తన జీవితాన్ని మలచుకుంటోంది. అతను లేకపోయినా పిల్లల్ని పెంచుకుంటూ, బతుకు నెట్టుకొస్తోంది. ఇలాంటప్పుడు అతను మళ్లీ ఆమె జీవితంలో ప్రవేశిస్తే, ఇంకో బిడ్డని కనడం, కొన్నాళ్ళుండి పారిపోవడం…తిరిగి మల్లి జీవితం ప్రశ్నార్థకంగా మారడం! అంతేకదా..? అందుకే రాజు ఆ నిర్ణయం తీసుకున్నాడు.

3 Comments Add yours

 1. గురువుగారు చాలా రోజుల తర్వాత మరలా ఇలా పలకరించడం సంతోషాన్ని కలిగిస్తుంది.!
  వారం రోజులకొకసారి విలువైన కథల్ని చదివేవాళ్ళం.!
  కానిప్పుడు పక్షం రోజుల వరకు అలాంటి విలువైన కథల కోసం ఎదురుచూడాలంటే కొంచం కష్టమే.!
  అయినా అంత విలువైన కథలను మనకు అందించాలంటే ఈ మాత్రం ఎదురుచూడడంలో తప్పు లేదనిపిస్తుంది.!

  కథ గురించి చెప్పుకోవాలంటే, ఇంతకుముందు చెప్పినట్లు ఇదీ విలువైనదే.!
  రచయిత ఓ సామాజిక వర్గానికి చెందినవాడైనా, ఆ ఛాయలెక్కడా కథలో కనిపించవు.!
  అంత లోతుగా జనజీవనాన్ని అర్ధం చేసుకున్న వాడు కాబట్టే పాత్రలను అద్భుతంగా మలచగలిగారు సలీం గారు.!
  తొందరపాటు నిర్ణయాలు, ఆకర్షణలు జీవితాల్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో తెలుస్తుంది.!

  Like

 2. DLSastry says:

  మంచి కథ.. వస్త గాథ ఆధారంగా రూపొందించిన కథ..

  Like

 3. ఆకొండి సూర్యనారాయణమూర్తి says:

  మల్లీశ్వరి పరిణితి తన నమ్మకం మీద.పాత్రచిత్రణ రాజుది మానవతామూర్తిగా చిత్రించడం. మొదట గర్భవతి తరువాత ఆడపిల్ల పుట్టడం మొగుడిపై సడలని నమ్మకం. తరువాత మళ్ళీ కాపురం ఇపుడు అబ్బాయి.ఆడికోరిక తీరింది. తరువాత మళ్ళీ పారిపోయాడు.మల్లికి విశ్వాసమ్ తనాప్రేమమీద. కానీ వాడికే దీనిమీద విశ్వాసమలేదు. అందుకే రాజు ఉత్తరం వ్రాస్తే వాళ్ళు తీసుకు వెళతారు. బలవంతపు కాపురం. ముగ్గురు పిల్లలతల్లిగామల్లి మారుతుందని రాజు దూరదృష్టి కాబోలు. మల్లిలా అందమైన పనిమనిషికి అందమైన,నమ్మకమైన మనసు సృష్టించిన రచయిత ఉదాత్తమైన, కల్మషమంటాని పాత్ర సృష్టి చేశారు. సి.ఎస్.మళ్ళీ తన అభిరుచి ప్రకటన చేశారు. నాలాంటి వాళ్లకు పని పెంచారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s