కథన కుతూహలం 62

తెలుగులో హాస్య కథలు సృష్టించిన తొలితరం కథకుల్లో శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు ఒకరు. అంతకుముందు ప్రహసనాలుగానూ, పద్యాలుగానూ, లేదా పానుగంటి వారి జంఘాల శాస్త్రి వంటి పాత్రలు ద్వారానూ, చిలకమర్తి వారి గణపతి వంటి నవలల ద్వారానూ హాస్య రచనలు వెలువడినా, శ్రీయుతులు భమిడిపాటి కామేశ్వరరావు గారు, మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, మునిమాణిక్యం నరసింహారావు గార్ల కథలతో తెలుగులో హాస్య రసం కొత్త పుంతలు తొక్కింది. సునిశితమైన హాస్యాన్ని పాఠకులు ఆస్వాదించడం మొదలు పెట్టేరు.

తన కథల్లో చక్కని హాస్యంతో పాటు, భార్యాభర్తల అనుబంధం లోని మధురిమను మనోహరంగా అందించిన రచయిత– శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు.  వారు కొన్ని నవలలూ, నాటికలూ, వ్యాసాలూ రాసినా, కథలు—ముఖ్యంగా ‘కాంతం కథలు’ గా చెప్పుకొనే  వారి హాస్యకథలే తెలుగునాట ఎంతో ప్రసిద్ధి పొందాయి.  ‘కులమింటి కోతి‘ , ‘ మా ఆవిడ పతిభక్తి‘ , ‘ దొంగ పెద్దమనిషి‘ , ‘ ప్రయాణ సన్నాహం‘ , ‘ కాంతాయమ్మా రావుగారి కైఫీయతు‘ , ది పెర్ఫెక్ట్ వైఫ్‘ మొదలైన అరవై కథలదాకా మునిమాణిక్యం వారు రాశారు. వారు రాసిన “బద్ నసీహత్” అనే కథని ఇప్పుడు సరదాగా చదువుకుందాం.

          వెంకట్రావు మాష్టారు అప్పుడే స్కూలు నుంచి ఇంటికి వచ్చారు. వస్తూండగానే , ” మీ కోసం ఎవరో పెద్దమనిషి వచ్చారు. పైన ఆఫీసు గదిలో కూర్చున్నారు” అంది  ఆయన భార్య కాంతం.  “సరే” అంటూ మాష్టారు కోటూ, చొక్కా విప్పుకుని, మొహం కడుక్కుని పైకి వెళ్ళేరు.

ఆ కూర్చున్న పెద్దమనిషికి యాభై ఏళ్లు ఉండచ్చు. శరీరం ముడతలు పడి ఉంది. జుట్టు  నెెరిసిపోయింది.  చూడ్డానికి అమాయకుడిలా, సౌమ్యుడిలా ఉన్నాడు. మాష్టార్ని చూడ్డంతోటే ఆయన లేచి నమస్కారం చేశాడు.

“తమరు ఎవరో నాకు జ్ఞాపకం లేదండీ.. క్షమించాలె” అన్నారు మాష్టారు.

“అయ్యా, మీకు నేను పరిచయుడ్నీ కాను.., మీరు నన్నెప్పుడూ చూడనూ లేదు. మేము రాజుపేట లో కాపురం ఉంటున్నాము. తమ దర్శనార్ధమై వచ్చాను” అన్నాడాయన కుర్చీలో కూర్చుంటూ.

“అయ్యో..! అంత పెద్దమాట ఎందుకండీ…? నేనెంతపాటి వాణ్ణి?” అన్నారు వెంకట్రావు మాష్టారు నవ్వుతూ.

“అల్లా కాదండోయ్ , తమకు మా ప్రాంతాల్లో మా చెడ్డ పేరుందండోయ్” అన్నాడతను ఒక తమాషా యాసలో.

“చెడ్డ పేరా?” అన్నారు మాష్టారు  ఆశ్చర్యంగా.

అతను కంగారు పడుతూ,  ” చెడ్డ పేరూ అంటే మహ దొడ్డ పేరు అని మనవి చేస్తున్నాను” అన్నాడు. మాష్టారు “అల్లాగా” అని ఒక చిరునవ్వు నవ్వారు.

“తమరి కథలూ గట్రా చదివి మేము ఓ ఆనందిస్తూ ఉంటామండి. మా చెడ్డ తమాషాగా ఉంటాయి సుమండీ…, తమర్నీ , తమ కాంతాన్నీ, తమ సంతానాన్నీ చూసి పోదామని ఇలా వచ్చానండీ” అన్నాడతను.

“ఏదో…తమకు మాయందు అల్లాగ అభిమానం కలిగింది” అని మాష్టారు అటూండగా కాంతం వచ్చి కాఫీ ఇచ్చింది. ఆవిడని చూడగానే, ” అదిగో… ఆవిడేనండీ… కాంతాయమ్మారావుగారు” అన్నారాయన.

సంతోషంగా ఆ పెద్దమనిషి లేచి నిలబడి,  “ఓహో.., తమరేనా అమ్మా!సీతా,అనసూయా ఉన్నారు చూశారూ…, అల్లాంటి కోవలోని వారు తమరు” అంటూ మళ్ళీ కూర్చున్నాడు అతను.

కాంతం ఉప్పొంగిపోయింది. “బాబు గారూ.. నన్నంతగా పెద్ద చేయడం కేవలం మీకు మాయందుండే అభిమానం తప్ప మరోటి కాదు. కాఫీ పుచ్చుకోండి”  అని గ్లాసు అందించింది. ఆ తరవాత పిల్లలు స్కూలునుంచి వచ్చే వేళయిందని ఆమె వెళ్ళిపోయింది.

కాఫీ పూర్తయ్యాకా మాష్టారు రెండు నిముషాలు చూశారు. ‘బాగా ఉక్కగా ఉంది , బయటికి వెడితే బాగుండును. ఈ పెద్దమనిషి  ఏమీ మాట్లాడ్డే’ అని అనుకుంటూ,  ” తమరేమైనా పనిమీద వచ్చారాండీ?” అన్నారు.

“ఎబ్బెబ్బే…వుట్టినే వచ్చానండీ.  మరేం పెద్ద పని లేదు…” అని ఆ వాక్యం పూర్తి చేయకుండానే ఆగిపోయాడు.

సాధారణంగా ఆయన కోసం వచ్చేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారు.“కథ ఏమైనా వ్రాసి మా పత్రికకు ఇవ్వండి” అనే పత్రికాధిపతులు ఒక రకం.అదీకాకపోతే, “మా అబ్బాయికి నాలుగు మార్కులు వేసి ప్యాసు చేయించండీ” అని వచ్చేవారు మరో రకం.‘ ఈ పెద్దమనిషి వాలకం చూస్తే, పిల్లల కోసమే అయ్యుంటుంది..అందుకే నీళ్ళు నములుతున్నాడు’ అనుకుని ,  “తమకు పిల్లలెంతమంది బాబూ” అన్నారు మాష్టారు.

“అయిదుగురండి” అన్నాడాయన.

“ఊహూ…అయితే తమ పెద్దబ్బాయి ఏం చదువుతున్నాడు?” అన్నారు మాష్టారు,  విషయం కనుక్కుని తొందరగా పంపించేద్దామని.

” నాకు మొగపిల్లలు లేరండీ…అంతా ఆడ పిల్లలే..” అన్నాడతను కొంచెం విచారంగా.

‘మరయితే ఎందుకు వచ్చినట్టు?… పిల్లల పెళ్లిళ్ల విషయంలో ఏదైనా సహాయం  కోరాడానికా?’ అని మనసులో అనుకుంటూ,  ” పిల్లల పెండ్లిళ్లు అయినాయా?” అన్నారు మాష్టారు.

“ఆ..పెద్ద పిల్లల ముగ్గురి పెండ్లిళ్లూ అయినాయి. వాళ్ళు కాపురాలకి కూడా వెళ్లారు. మిగిలిన ఇద్దరికీ సంబంధాలు సిద్ధంగానే  ఉన్నాయండి , మీ దయవల్ల” అన్నాడతను.

ఇంక మాష్టారుకి ఇలాంటి పిచ్చి ప్రశ్నలతో కాలక్షేపం చేయడం ఇష్టంలేక, కుర్చీలోంచి లేస్తూ,  ” చిత్తం… అలా వెళ్లాల్సిన పనుంది. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం” అన్నారు.

ఆ పెద్ద మనిషి తెల్లబోయి, ” చిత్తం… అలాగేనండి.  కానీ, ఒక్క చిన్న విషయంలో తమ సలహా కావాలని వచ్చాను” అన్నాడు.

“అల్లాంటిదేమయినా ఉంటే చెప్పండి మరి” అని ఆగిపోయారు మాష్టారు.

“మరేం లేదండీ…., చూశారూ , తమరు కథల్లో సంసారాన్ని స్వర్గధామంగా వర్ణించారు. ఘోటక బ్రహ్మచారులకైనా మీ కాంతం కథలు చదివిన మీదట పెళ్ళాడాలని బుద్ధి పుడుతుంది” అన్నాడతను.

తన రచనలను మెచ్చుకుంటూంటే, మాష్టారుకి కూర్చోక తప్పింది కాదు!

” అదంతా మీ అభిమానం” అన్నారాయన కూర్చుంటూ.

“ఇవి ముఖప్రీతి కోసం చెప్తూన్న మాటలు కాదండోయ్!” అన్నాడతను.

మాష్టారు సంతోషిస్తూ, ” అయితే, తమరేదో చిన్న పనిమీద వచ్చానన్నారు?” అన్నారు.

“చిత్తం…మనవి చేస్తా.  నాకు మా ఇల్లు నరక కూపంలా అనిపిస్తోందండీ.పిల్లలు చూద్దామా…. అల్లరి!  పెళ్లాం చూద్దామా… గయ్యాళి! నేనూ, ఆమె తగదా పడని రోజు లేదండీ.  ప్రతిరోజూ ఏదో ఒక విషయమై కయ్యమాడు కుంటూనే ఉంటామండీ”  అన్నాడు బాధగా.

“అయితే….. నన్నేమి చేయమంటారూ?” అన్నారు మాష్టారు నవ్వుతూ.

“తమరు మాకు ఏదైనా తరుణోపాయం చూపించాలి. ఎల్లాగ ప్రవర్తించాలో,  సాంసారిక జీవనం సుఖప్రదం కావటానికి రహస్యం ఏమిటో తమరు ఉపదేశిస్తే తెలుసుకొందామని కొండంత ఆశతో మీ దగ్గరకి వచ్చాను” అంటూ ఆ పెద్దమనిషి ప్రాధేయపడ్డాడు.

“ఉపదేశం చెయ్యడానికి ఇదేమన్నా వేదాంతమా,  మంత్ర శాస్త్రమా అండీ? అన్నారు మాష్టారు నవ్వుతూ.

“మీరు అల్లా అంటే కాదు బాబూ…ఏదో మార్గం చూపాలి” అంటూ అతను మాస్టార్ని ఒకటే బలవంతం చేశాడు. ఆయన తనకు తోచినదేదో చెబుదాంలే అనుకుని,  “సరే…అసలు సంగతి …..మీరు మీ భార్యని ప్రేమిస్తున్నారా?” అన్నారు.

” అయ్యో! ప్రేమించకేమండీ…అయిదుగురు పిల్లల తండ్రిని!” అన్నాడతను.

” మరైతే..పోట్లాటలు ఎందుకొస్తయ్యీ?” అన్నారు మాష్టారు.

అతను ముందు తెల్లబోయి, ఒక్క క్షణం ఆలోచించి , “బాబూ! చూశారూ , ఇదీ కారణం అంటూ చెప్పలేనండి.  ఉత్తినే , జై మంటూ లేస్తుందండీ… నేను ‘అవును’ అన్నదానికల్లా  ఆమెగారు ‘కాదు’ అంటుంది. ఎల్లాగండీ?” అంటూ ముఖం చిట్లించుకున్నాడు.

“అల్లా అయినట్టయితే మీరే ముందుగా ‘కాదు’ అనండి” అన్నారు మాష్టారు. ఆ వేళాకోళం అతన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టుంది. దీనంగా చూస్తూ,  “తమరు అల్లాగ సెలవిస్తే గాదు. సిన్సియరుగా చెపుతున్నాను. ఈ దిక్కుమాలిన పోట్లాటలకు తమరు ఏదో తరుణోపాయం చెప్పాలి” అన్నాడు.

అతన్ని చూస్తే మాస్టారికి జాలి వేసింది. కాసేపు ఆలోచించి, చివరికి– “అయితే సరే.., ఒక చిన్న రహస్యం చెబుతాను వినండి. దాంతో మీకు పోట్లాటలు లేకుండా పోతవి” అన్నారు.

అతను చేటంత మొహం చేసుకుని ” సెలవియ్యండి” అంటూ శ్రద్ధగా కుర్చీ ముందుకు లాక్కున్నాడు.

అటువంటి భక్తుడు దొరికినందుకు మాష్టారు సంతోషిస్తూ, గొప్ప స్త్రీ వశీకరణ మంత్రం ఉపదేశిస్తున్న వాడిలాగ ,  ” చూడండీ , మీ విషయంలో చెప్పదగిన రహస్యం ఏమిటంటే… ఆవిడగారు ‘అవును’ అన్నదానికి మీరెప్పుడూ కాదనబోకండి.  మీ భార్యగారు ఇది బాగుందీ అంటే మీరు బాగుంది అని తాళం వెయ్యండి. దేన్నయినా చూసి బాగుండలేదూ అంటే మీరూ ‘ ఛీ ..ఛీ , ఏమీ బాగుండలేదు అనండి. సంసార స్వర్గధామానికి ఇది తొలి మెట్టు.  తెలిసిందా?” అని అడిగారు.

అతను తలూపి, ” చిత్తం, చిత్తం…అయితే బాబూ , కొన్ని విషయాల్లో..అంటే డబ్బూ గట్రా వాడే విషయాల్లో ఆమె గారు చెప్పిందానికల్లా తలూపితే సంసారం గడవదు…ఏమంటారు?” అన్నాడు.

“అవునండీ..ఇప్పుడు పండగా పబ్బం వచ్చిందంటే , మన తాహతు తెలుసుకోకుండానే అవికావాలే , ఇవికావాలే అంటారు ఆడవాళ్ళు. వాళ్ళు చెప్పినదానికల్లా మనం సరే అంటే అప్పులపాలు కావాలి అనేకదా మీరనటం?” అన్నారు మాష్టారు.

అతను కుర్చీ మరింత దగ్గరకు లాక్కుంటూ, ” అద్గదీ బాబూ…అసలు సంగతి.  వేధించుకు తింటూన్నదంటే నమ్మండి! ఏం చేయమని సెలవు?” అన్నాడు.

“ఇప్పుడేం చేస్తున్నారూ?” అన్నారు మాష్టారు.

” ఏం జేస్తున్నానూ..? నా దగ్గర డబ్బు లేదు…నేను తీసుకురాలేనూ అని బుర్ర పట్టుకుంటాను బాబూ..మరేం చేసేదీ?” అని జవాబిచ్చాడు.

” అదే తప్పు పని!” అన్నారు మాష్టారు.  ” భార్యా వశీకరణ సూత్రాన్ని చెబుతా వినండి”  అన్నారు  ఠీవిగా.  “అల్లాంటి సమయాల్లో , భార్య కావాలన్న వస్తువును తీసుకురాను అని మరెప్పుడూ అనకండి.  అంటే తెస్తానూ అంటూనే మనం ఆడవాళ్ళను బురిడీ కొట్టించాలె. తమకు బోధ పడిందనుకుంటా” అన్నారు మాష్టారు గర్వంగా.

అతను ఆ మాటలు శ్రద్ధగా విని తన జన్మ తరించిందన్నంత సంతోషం పొందాడు.

” అంతేకాదు…ఆమెను లొంగదీసుకుంటే ఆమె ఎప్పుడూ మీ ఇష్టానికి వ్యతిరేకమైన కోరికలు అసలు కోరనే కోరదు”  అంటూ మరొక మహత్తరమైన గుప్త రహస్యాన్ని కూడా ఉపదేశించారు మాష్టారు.

“అదేనండి..అదే.. ఆ లొంగదీసుకొనేది ఎల్లాగో తెలియకే..! దానికేదైనా మార్గం సెలవివ్వండి” అంటూ మళ్ళీ ప్రాధేయపడ్డాడతను.

ఒక్క నిముషం కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచించారు మాష్టారు. చటుక్కున ఆయన కళ్ళముందు ఏదో మెరిసినట్టయింది. తపస్సు చేసిన తర్వాత జ్ఞాన సంపన్నుడైన తథాగతునిలాగ చూస్తూ అన్నారాయన.

“అల్లా అయితే నేను చెప్పినట్టు చేయండి. రోజుకు మూడుసార్లు….అంటే అధమపక్షం మూడు సార్లయినా ముద్దు పెట్టుకోవాలి” అన్నారు.

ఆ మాటలు విని అతను అర ఔన్సు ఆముదం మింగిన వాడిలాగా వికారంగా చూస్తూ,  ” నాకు నలభై ఎనిమిదో ఏడండి. మా ఆవిడకు నలభై దాటి ఉంటాయి.  చికిత్సకు ఇల్లాంటిది కాక మరోరకంగా ఏదీ లేదా?” అని అంటూండగా మధ్యలోనే మాష్టారు అందుకుని , “ఇటువంటి విషయాల్లో , చూశారూ…వయస్సుతో నిమిత్తం లేదు” అన్నారు.

” చిత్తం , సరే అల్లాగే అనుకోండి.  అయితే మా ముసలిదాన్ని త్రికాలముల యందూ ముద్దు పెట్టుకోమని సెలవాండీ?” అన్నాడతను.

తప్పదన్నట్టుగా తల ఊపారు మాష్టారు.

“చిత్తం…ఇంకా ఏమేమి చేయాలో చెప్పండి” అన్నాడు అతను నిస్పృహతో.

” ఇక రెండోది… అథమపక్షం రోజుకి నాలుగైదు సార్లయినా నిన్ను ప్రేమిస్తున్నాను…నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ భర్త భార్యకు తెలియజెప్పాలి” అన్నారు మాష్టారు.

” నేనెప్పుడూ నా జన్మలో అల్లాంటి మాటలు ఎరగనండీ” అంటూ దీనంగా మాస్టారికేసి చూశాడు ఆ పెద్దమనిషి.

కానీ కఠిన పథ్యం చెప్పే వైద్యుడిలాగ  “తప్పదండీ…నిష్కామ కర్మ చెయ్యాలి. పోనీ ఓ పాఠం లాగ అప్పచెప్పసేయండి” అన్నారు మాష్టారు.

పాపం అతను కళ్ళు మూసుకుని, ధ్యానం చేసుకుని ,” అల్లాగే”  అన్నాడు.

మాష్టారుకి తనంటే అతనికి పూర్తి విశ్వాసం కలిగిందని నమ్మకం కలిగింది. అందుకే ఇంకా ఇలా చెప్పారు.

“ఇంకా ఏమిటీ అంటే , ఆమెను ఎక్కువగా పొగడండి , ఇల్లాంటిదీ… అల్లాంటిదీ అంటూ.  ఇంకా దేముడు మేలు చేస్తే ఆమె సౌందర్యాన్ని గురించి కూడా ఎక్కువగా మెచ్చుకోండి…. అంతే… మరేం లేదు” అన్నారు.

ఆ మాటలు విని, అతను ఓ నిట్టూర్పు విడిచి,  ” నాకు పొగడటం అలవాటు లేదు , తెలియదు. మరి ఏవిటీ దారి?” అని అడిగాడు.

“తెలియడానికే ముందండీ? చూడండి…ఆవిడ  పేరేమన్నారూ? ” అన్నారు మాష్టారు.

“చంద్రమ్మ” అని చెప్పాడతను.

” అయితే…మీరు ఆమెను ‘చంద్రా’ అని పిలుస్తారా?” అడిగారు మాష్టారు.

” అబ్బే…అసలు పేరు పెట్టి పిలవనండి” అన్నాడతను.

“అవునులెండి. పేరుతో పిలవకూడదు కాబట్టి , రకరకాల వర్ణనలతో  పొగుడుతూ పిలవండి. ‘ఓ జటాజూట శిరోమణి’ అని పిలుస్తూ, ‘నీ శరీరం పదారు వన్నె పసిమితో మిసమిస లాడుతోంది.  నీ నాసికా పుటాలు పువ్వులను పోలియున్నవి’ ఈ ధోరణిలో వెళ్ళిపోండి. ఏమంటారు?” అని సలహా ఇచ్చారు మాష్టారు.ఆ మాటలన్నీ విని బిక్క మొహం వేసుకుని,  సరే నని సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ వచ్చిన పెద్దమనిషి.

                 అతను వెళ్ళిపోగానే కాంతం వచ్చి , మాష్టారు గార్ని చురచురా చూస్తూ,  ” పాపం పెద్దవాడ్ని పట్టుకుని ఏమిటా వేళాకోళం?” అంది.” లేదు కాంతం! నేను వెక్కిరింతకూ, వేళాకోళానికీ  అన్న మాటలు కావవి.   అలా ప్రవర్తిస్తే గృహ కలహాలు ఎప్పుడూ ఉండవని నా నమ్మకం. నేను అలా చేయడం లేదూ? అదే అతన్నీ చెయ్యమన్నాను” అన్నారు మాష్టారు.

“అయితే, మీరుచేసే పిచ్చి చేష్టలన్నింటినీ అందరినీ చెయ్యమంటారేం ఖర్మం! నేనైతే భరించాను కానీ ఏ ఇల్లాలు ఊరుకొంటుందండీ?” అంటూ ఆమె నవ్వసాగింది.

” చూస్తావుగా…ఇంకో వారం రోజులకు ఆయన మళ్లీ నా దగ్గరకొచ్చి ‘ బాబూ! మీ దయవల్ల నా కష్టాలు గట్టెక్కినై.  మా భార్యాభర్తల మధ్య పోట్లాటలు పోయినాయి’ అంటూ చెప్పకపోతే చూడు! నీకు తెలియదు. వీటిని సైకలాజికల్ ఎక్స్ పెరిమెంట్స్ అంటారు” అన్నారు మాష్టారు. కాంతం చెయ్యి తిప్పుతూ, ” అయ్యో!” అని మూతివిరిచి వెళ్ళిపోయింది.

ఆ పెద్దమనిషి మళ్ళీ వచ్చి తన జీవితంలో అద్భుతమైన మార్పు  వచ్చిందని తప్పకుండా చెబుతాడని మాష్టారి నమ్మకం. అందుకే రోజూ స్కూలు నుంచి ఇంటికి రాగానే , “కాంతం! అయనేమన్నా వచ్చాడా?” అని అడిగేవారు.

కాంతం ముక్కు విరిచి, ” ఇంక రావలసిందే!” అంటూ వెక్కిరించేది.

       అలా ఓ నాలుగు రోజులు గడిచాయి.  అయిదో రోజున ప్రొద్దున్నే కాంతం మాష్టారుగారి దగ్గరకొచ్చి  “మీకోసం ఎవరో ఒక ముసలావిడ వచ్చా” రని నిద్ర లేపింది.  ఆయన కళ్ళు నులుపుకుంటూ హాల్లో కొచ్చేసరికి ఒకావిడ నించుని ఉంది.  ఓ యాభై ఏళ్ల వయసులో ఉన్న మనిషిలా కనిపించింది.  ముఖాన రూపాయ కాసంత బొట్టు. జరీ చీర కట్టుకున్న ఆమెను చూస్తే, మాస్టారికి ఆయన తల్లి గుర్తుకొచ్చింది.

“ఈ ముసలమ్మగారేనండీ మీ కోసం వచ్చింది” అంది కాంతం.

“ఏం నాయనా…,నువ్వేనా కాంతం మొగుడివీ?” అందా వచ్చినావిడ.

“నేనేనండీ” అన్నారు మాష్టారు నవ్వుతూ.

“ఏం నాయనా! మా ఆయనకేదో ఉపదేశం చేశావుట?” అందామె.

“నేనేమిటి…?ఉపదేశం చేయటమేమిటీ? మీరు నన్ను ఎవరని భ్రమ పడుతున్నారో..? నేను ఇంగ్లీషు చదువు చదువుకున్నాను. నాకు మంత్రాలూ – ఉపదేశాలూ రావు ” అన్నారు.

“ఆ ఇంగిలీషు మంత్రాలే ఉపదేశించావుట. లేదంటావేమిటీ? కాంతమ్మ మొగుడని ఆయన చెప్పారు కూడానూ” అందామె.

” మొన్న మీదగ్గరకు రాలేదూ…. ఆయనండీ..” అంటూ కాంతం మాస్టారికి వివరించింది.

“ఓహో! అదా సంగతి? పెద్ద ఉపదేశం ఏముంది లెండి. ఏదో ఇంట్లో పోట్లాటలు లేకుండా  ఉండడానికి కొన్ని మంచి సంగతులు చెప్పాను. ఇప్పుడు అంతా బాగుందిగా” అన్నారాయన ఆవిడ తనని మెచ్చుకొడానికే వచ్చిందనుకుంటూ.

“నువ్వు ఉపదేశించిన ఆ మంత్రమే బెడిసికొట్టింది నాయనా..” అందామె దగ్గరగా వస్తూ.

” బెడిసి కొట్టడానికి , నేనే మంత్రం ఉపదేశించ లేదు. నాకే మంత్రాలూ రావు” అన్నారు మాష్టారు ఆశ్చర్యంగా.

ఆమె కాంతంకేసి తిరిగి , ” మంత్రాలు రావంటాడేమిటీ నీ మొగుడు? నేను ఇల్లా ఉంటే పిచ్చిది అనుకుంటున్నారు కామోసు.   నాకు అన్నీ తెలుసు నాయనా! కోయ మంత్రాలు లేవూ..? అలాగే ఇంగిలీషు మంత్రాలూ ఉంటాయి. ఏమంటావమ్మా కాంతం ?” అంది.

కాంతం ఆవిడ పక్షం జేరి, ” ఎందుకు ఉండవండి పిన్నిగారూ! ఉంటాయి.

అబ్బో…ఆయనకి వచ్చునండి. బోలెడు ఇంగ్లీషు మంత్రాలు వచ్చాయనకి.” అంటూ కళ్ళు ఎగరేసింది.

“ఇదెక్కడి ఖర్మ…నాకేం మంత్రాలు రావు. నన్ను తగలెయ్యా…నాకన్ని మంత్రాలు ఎలా వచ్చునో నాకే ఆశ్చర్యంగా ఉంది!” అన్నారు మాష్టారు విచారంగా.

“ఆయనో పిచ్చి బ్రాహ్మడు..! ఇంక నీకూ నాకూ పోట్లాటలుండవు. కాంతం మొగుడుగారి వల్ల నేను ఉపదేశం పొందేను అన్నారాయన. ఏమిటో అనుకున్నాను..ఇక కృష్ణా రామా అనుకుంటారు కామోలు అనుకున్నాను. వట్టి అమాయకుడు” అంది ఆమె.

” అయితే ఇప్పుడు ఏం జరిగిందేమిటండీ?” అన్నారు మాష్టారు.

“పోయిన శుక్రవారం రాత్రి నుంచే మొదలయ్యింది నాయనా….పిచ్చి చూపులూ, పిచ్చి మాటలూను” అన్నదామె ఇబ్బందిగా.

“ఏమిటండీ పిన్నిగారూ ఆ పిచ్చి మాటలు?” అన్నారు మాష్టారు కంగారుగా.

ఆమె కాంతంకేసి తిరిగి,  ” కాంతమ్మ తల్లీ…చెప్పటానికి వీల్లేదు.  అల్లాంటి మాటలు మనం ఎప్పుడూ వినము. నీవైనా చెప్పు తల్లీ నీ మొగుడికి… ఆ మంత్రానికి విరుగుడు ఏమైనా చెయ్యమని” అని కాంతం చేతులు పట్టుకుంది.

“ఊరుకోండి పిన్నిగారూ! ఊరుకోక ఈయన ఆ ఉపదేశం చెయ్యడం ఏమిటి చెప్పండి”  అంటూ సానుభూతి చూపించడం మొదలెట్టింది.

కాంతం కొంటెతనానికి మాష్టారుకి కోపం వచ్చింది. ఆ ముసలావిడని చూస్తే జాలీ కలిగింది.  అయితే అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలని, “ఆయన ఏమంటారూ..? ఎవరినైనా తిడతారా..? ఏమిటీ సంగతి?” అని అడిగారు.

” ఒక్కటేమిటి నాయినా…, చిత్ర చిత్రాలుగా మాట్లాడతున్నారు. ఉత్తి పిచ్చి మాటలు… మనబోటి సంసారుల కొంపల్లో అనుకునే మాటలు కావు” అంటూ ఆవిడ పమిట చెంగుతో కళ్ళను అద్దుకుంది.

“చెప్పండి పిన్నిగారూ…ఆయన విరుగుడు మంత్రం వెయ్యడానికైనా అవేమిటో తెలియాలికదా!” అంది కాంతం.

“ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చినట్టయ్యింది నా బతుకు.

నా కర్మం…నా నోటితోనే అనాలీ..ఆ మాటలు?” అని కళ్ళు తుడుచుకుంది.

మాస్టారికి జాలి వేసింది.

మళ్లా ఆవిడే అంది. ” నా బతుకంతా కడిగి పోస్తున్నారు నాయనా! నా ముఖం చంద్రుడిలాగ ఉందిట!  నా గొంతు పట్టుకుని….. నీ గళం శంఖం లాగ ఉన్నదంటారు. నా గొంతు కొయ్య! ఇదీ వరస. ఇలా అయ్యింది  నాబతుకు” అందామె దుఃఖం ఆపుకుంటూ.

“నేను చెప్పిన నసీహత్ (ఉపదేశం) కి ఫలితం ఇదా?” అనుకుంటున్నారు మాష్టారు.

“ఇంకా.. ఛండాలపు మాటలు నాయినా!  కొడుకు లాంటివాడివి కనక చెబుతున్నాను.  నా జుట్టు చమరీ వాలంలా ఉందట. ఏమిటో నన్ను ఎగాదిగా చూస్తారు.  పోనీ అని ఊరుకుంటానా…. మడి కట్టుకున్నా వచ్చి ముట్టుకుంటారు. నీ శరీరం శిరీష కుసుమ కోమలం అంటారు….నన్ను తగలెయ్య!” అని ఒక నిమిషం ఊరుకొని,  ” అయితే నాయనా…రోజల్లా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడరు. బానే ఉంటారు. మధ్య మధ్యలో ఏం వస్తుందో..ఏమో… రోజుకు నాలుగైదు సార్లు ఇలా అంటూ ఉంటారు. ముసలిదాన్ని పట్టుకుని ముద్దు ముద్దు అంటారు” అని వివరించింది ఆమె.

ఆవిడ మాటలు విని మాష్టారు నాలుక కొరుక్కున్నారు. కాంతం మటుకు నవ్వు ఆపుకోలేక పోయింది.

చివరకి ఆమె మాష్టారితో , ” బాబూ! నువ్వే చేశావు ఇదంతాను. నువ్వే విరుగుడు మంత్రం ఏదైనా చెప్పు బాబూ.  మా తండ్రివి కదూ!” అంటూ బ్రతిమాలాడ సాగింది.

ఆవిడ కాస్త సర్దుకున్నదని గమనించి, ” అది పిచ్చి కాదండీ.. ఆయన మీయందు ప్రేమ కనబరుస్తున్నారు” అంది కాంతం.

“పోనీ నీ మాటే నిజమనుకో…. ముప్ఫై ఏళ్ళనుంచీ లేనిది…ఇప్పుడు ఇలా వికారం కలగటం మంచే అంటావా? అది పిచ్చే!” అంది ఆవిడ.

ఆ మాటలకి మాష్టారూ, కాంతం…ఇద్దరూ నవ్వుకున్నారు.

“మీరు ఇల్లాగ నవ్వితే నా బ్రతుకు ఏం కావాలి చెప్పండి.  పోనీ ఏ భూతవైద్యుడి దగ్గరకైనా పోయి ఇంత విభూతి పట్టుకొద్దామంటే , నువ్వు చెప్పిన ఇంగిలీషు మంత్రానికి అది పని చేస్తుందో చెయ్యదో?? నా బాబు కదూ…నువ్వే ఎలాగైనా దీనికి మళ్ళీ ఇంగిలీషులోనే మంత్రం ఉచ్ఛాటణ చేసి , నన్ను బయట పడేయాలి” అందావిడ దీనంగా.

మాష్టారుకి ఆవిడని తృప్తి పరచాలంటే “సరే” అనడం ఒకటే మార్గంగా తోచింది. అందుకనే , ” పిన్ని గారూ..పొరబాటే జరిగింది. నేను మళ్లీ ఇంగ్లీషులో విరుగుడు మంత్రం చెప్పి, ఇదంతా పోగొడతాను. మీరేమీ భయపడకండి” అన్నారు.

ఆవిడ చాలా సంతోషించి,  “మా నాయనే…నీకు తప్పకుండా ఆడపిల్ల పుడుతుంది. తప్పకుండా చెయ్యి!” అని కాంతాన్నీ, మాష్టార్నీ దీవించి వెళ్ళిపోయింది.

ఆవిడ వెళ్ళిపోయాకా కాంతం నవ్వు ఆపుకుని,  ” మీరు పొరబాటు చేశారు. ఈమె గారికి కూడా ఉపదేశం చేయాల్సింది” అంది ” ఏమని?” అన్నారు మాష్టారు.

“ఆయనకు చెప్పినట్టుగానే ఈమెని కూడా మొగుడి గుణసంపదనూ , సౌందర్యాన్నీ మెచ్చుకోమని!” అంది కాంతం.

” చాలించు” అన్నారు మాష్టారు.

“ఏం” అంది కాంతం నవ్వుతూ.

“ఇప్పటికే చాలా విచారపడుతున్నాను.  ఇల్లాగ అవుతుందని అసలు అనుకోలేదు” అంటూ గబగబా మేడమీదికి వెళ్లిపోయారు మాష్టారు.

                             ———*****———

ఈ కథని మునిమాణిక్యం వారు 1941 లో రాశారు. అప్పటికే వారి కాంతం కథలు తెలుగు పాఠకులకి చిరపరిచితం.  చాలామంది పాఠకులు కాంతం మునిమాణిక్యం వారి భార్యేనేమో అనుకున్నారు తప్ప, ఆమె ఒక కల్పిత పాత్ర అని అనుకోలేదు. ఎందువల్లనంటే…వారి కథలన్నీ ఇంచుమించు  కథకుడు స్వీయానుభవాల్ని చెప్పినట్టు ఉత్తమపురుష లో ఉంటాయి.  తన కథల్లో ‘నేను’ అని రాసిన చోటల్లా , వెంకట్రావు అనుకోండి… ఈ కథలన్నీ వెంకట్రావు అనే అతను చెబుతున్నాడు–మునిమాణిక్యం అనుకునేరు కొంపదీసి..అని ఆయనే ఓ సందర్భంలో చెప్పుకున్నారట.

          మునిమాణిక్యం వారు కథలు రాసేనాటికి భావకవితోద్యమం ఉధృతంగా నడుస్తూన్న కాలం. కవులందరూ ఊహాప్రేయసిని సృష్టించుకుని, కలల్లో తేలిపోయేవారు. ఆ ప్రభావం కథకుల మీద కూడా ఉండేది. మరోపక్క వివాహవ్యవస్థ మీద తన రచనల ద్వారా చలం గారి తిరుగుబాటు ధోరణి.  అటువంటి పరిస్థతుల్లో మునిమాణిక్యం వారు దాంపత్యజీవితం లోని అందాలను, సుఖ సంతోషాలనూ కథావస్తువుగా తీసుకుని, తనదైన హాస్య చతురతని జోడించి సంభాషణలు నడుపుతూ కథలు రాశారు.  అవి పాఠకులను ఎంతో అలరించేవి.  

            ఈ కథలో తన కథలు చదివి, ఓ పెద్దమనిషి తన జీవితంలో వచ్చిన సమస్యలని పరిష్కరించడం కోసం ఆ కథకుడి ఇంటికి వస్తాడు. (నిజ జీవితంలో కూడా కాంతమూ, కథకుడూ కథల్లో లాగే ఉంటారనుకుని. మునిమాణిక్యం వారికి ఈ అనుభవం చాలాసార్లు ఎదురై ఉంటుంది. అంత సహజంగా వారా పాత్రలకి ప్రాణం పోశారు) అతన్ని ఏదో రకంగా వదిలించుకోవాలని ఈయన తనకు తోచిన సలహా ఇస్తారు. అది వికటించేసరికి , మళ్ళీ ఎదో విరుగుడు ఈయనే ఇవ్వాల్సి వస్తుంది.  ఈ విషయాన్ని ఎంతో హాస్యస్ఫోరకంగా చెప్తారు రచయిత.

2 Comments Add yours

 1. DLSastry says:

  చక్కటి కథ. ఈ రోజుల్లో watspp లో వస్తున్న విషయాలు ఆరోజుల్లోనే వెంకట్రావు ద్వారా M.N గారు చే చెప్పించారు. చంద్రమ్మ గారు చాలా traditional మనిషి కావడం తో భర్త వేసే పొగడ్తలు అర్థం చేసుకోలేక పోయింది. అత ను పోకిరి లా ప్రవర్తిస్తున్నాడని అనుకుంది. పెద్దమనిషి అయిన తన భర్త ఎలా ప్రవర్తిస్తే అతనికి పిచ్చి పట్టిన దని అనుకుంది. ఆవిడకు అది ప్రేమ వ్యక్తం చేయ డమని తెలియలేదు. ఒకరకంగా చూస్తే I love you చెప్పడాలు mana culture lo తక్కువ. Arranged marriages lo Mari తక్కువ. ఈ మధ్య సినిమాల వలన ఈ culture baga perigindhi.
  ఇంత మంచి కథ ఇచ్చిన CS గారికి ధన్యవాదాలు.

  Like

 2. ఆకొండి సూర్యనారాయణమూర్తి says:

  ఇదా కధ అనుకునే రోజుల్లో పుట్టి . అబ్బా ఇదేకథ ఎంత బాగుందిసుమీ అనుకునే కథలను మునిమాణిక్యం వారు వ్రాసారు. పుచ్చా,మునిమాణిక్యం,భమిడిపాటి. పానుగంటి,చిలకమర్ధి, మొదలు గాగల హాస్యరచయితల వ్యాసాలు కథలు 1983లో ఆంధ్రాయూనివర్సిటీ ఎం.ఏ తెలుగు సిలబస్ లో పెట్టారు. ఆప్పుడు ఈ కథ చదివాను. తెలియకుండానే వీరికధల ప్రభావ ము ఆరోజుల్లో దంపతుల మధ్య సయోధ్యాలు కలిగించాయి. అసలు చిన్న విషయాలకు విడాకుల వరకు వచ్చేవారికి కోర్ట్ ఈకధలు చదివి,వినిపిస్తేనో,చదివిస్తేని ఆలుమగలను కలపడం బహు తేలిక. మన దౌర్భాగ్యం ఈకధలు మరుగునపడ్డాయి. వెలికితీస్తున్నసి.ఎస్. కి కృతజ్ఞతలు. చమత్కరిస్తే అపార్ధం చేసుకొనే మనుషులు పెరిపోతున్నారు. ఎందుకంటే. రసన్ఫ్యూర్తి లేదెక్కడా. తెద్దాం మనం

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s