కథలు రాయడానికి రచయితలకి ప్రేరణ– ఈ సమాజమే. మన చుట్టూ ఉన్న వ్యక్తులనీ, జరిగే సంఘటనలనీ, వినిపించే సంగతులనీ తన రచనలకి ముడిసరుకుగా తీసుకుంటాడు రచయిత. అవే సంఘటనలు మాములువాళ్ళు ఏదో వార్త కింద చూసి వదిలేస్తారు. అదే కథకుడైతే, దాన్ని కథగా మలచడానికి కావలసిన సరంజామా చేర్చి, పాఠకుడికి చదివే ఆసక్తి కలిగించేలా తీర్చి దిద్దుతాడు. ఆ రచనలో సందేశముండడమే కాదు చదివినవారిలో స్ఫూర్తి కూడా నింపుతుంది. అప్పుడు అది మంచి కథగా మన్నన పొందుతుంది.
అలాంటి సామాజిక స్పృహతో గొప్ప కథలు రాసినవాళ్లు తెలుగు నేలలో అన్ని ప్రాంతాలలోనూ ఎంతోమంది ఉన్నారు. అలాంటివారిలో ఈవారం తెలంగాణాకి చెందిన కథకుడు శ్రీ చొప్పదండి సుధాకర్ కథ ఒకటి పరిచయం చేస్తాను.
శ్రీ చొప్పదండి సుధాకర్ మంచి కవి, కథకుడు. వారి స్వస్థలం మెదక్ జిల్లా సిద్ధిపేట. వృత్తి రీత్యా ఆయన ఉపాధ్యాయులు. వారి రచనలన్నీ గొప్ప చైతన్యవంతంగా ఉంటాయి. ఆయన కథలు అన్ని పత్రికల్లోనూ వచ్చాయి. ‘నీడ చెప్పిన కథ’, ‘రెండో ముఖం’, ‘గడ్డిపరక’, ‘వెన్నెలకుప్పలు’, ‘అమూల్యం‘ మొదలైన కథలెన్నో ఆయన రాశారు. గంగిరెద్దుల వారి జీవితాన్ని తీసుకుని వారు రాసిన “వారసత్వం” అనే కథ చూద్దాం.
ఉదయం ఏడు గంటలయింది. చింతచెట్టు నీడ జరిగి, ఎండ నాంపల్లి మొహం మీద చుర్రుమని పడింది. దాంతో నాంపల్లి ఆవలిస్తూ నిద్ర లేచాడు.
“చాయ్ పెట్టమంటావుటయ్యా!” అతని ఇల్లాలు రంగశాయి అడిగింది.
“ఆ…పెట్టు..” అంటూ లేచి, నోట్లో వేపపుల్ల పెట్టుకుని, ఫర్లాంగు దూరంలో ఉన్న వాగుకేసి నడిచాడు.
నాంపల్లికి సుమారు పాతికేళ్ళుంటాయి. సన్నగా ఉంటాడు. వాళ్ళది గంగిరెద్దుల కులం. అతని బ్రతుకుతెరువు కూడా గంగిరెద్దులను ఆడించడమే. అతనికి ఒక చోటంటూ లేదు. సంవత్సరం పొడవునా జిల్లా అంతటా తిరగడం, దొరికినదాంతో పొట్టపోసుకోవడం…. అంతే! ఇల్లూ లేదు, వాకిలీ లేదు! సంపాదనా లేదూ.. చట్టుబండా లేదు!! ఇప్పుడు వాళ్లున్నది ఓ మూడు రోడ్ల కూడలి. దానికి ఇరుపక్కలా చింతచెట్లూ , మామిడిచెట్లూ… వాటికిందే వాళ్ల కాపురం!
నాంపల్లి ముఖం కడుక్కుని వచ్చాడు. రంగశాయి చాయ్ పోసింది.
“ఇయ్యాల ఎక్కడికి పోతవయ్యా బిచ్చానికి?” నాంపల్లి చాయ్ తాగుతూండగా పక్కన కూచుని ఆమె అడిగింది.
నాంపల్లి నిట్టూర్చాడు. ” ఏమోనే , గట్ల ఊరుమీద పడిపోత… ఏ దరమరాజు కన్నా కనికారం కలగదా?” అన్నాడు.
“ఏమి కనికారమో ఏమో.. ఎడ్లు మేతలేక , మనం తిండిలేక సస్తున్నాం” కోపంగా అంది రంగశాయి.
” ఏం చేద్దామే… ఆ ఏములాడ రాజన్నకి మనమీద దయలేదు.” అన్నాడు నాంపల్లి.
“ఆ ఏములాడ రాజన్న ఏం జేత్తడు…తప్పు మనది బెట్టుకుని?” అంటూ పొయ్యి దగ్గరకు పోయింది రంగశాయి. నాంపల్లి ఏం మాట్లాడలేదు.
గొంగళి భుజాన వేసుకుని కొదురుపాక ఊళ్లోకి నడిచాడు. నిజానికి అతడికి ఎవరో దానం చేస్తారని ఆశలేదు. అయినా వెళ్ళక తప్పదు. తనని నమ్ముకొని రంగశాయితో పాటు నాలుగు ఎడ్లు, ఓ ఆవూ ఉన్నవాయె! రోడ్డు మీద నడుస్తున్నాడన్న మాటేగాని అతడి మనసు మనసులో లేదు. ఛ! తనది ఏం బతుకు అనిపించింది. ఎవరిని చూసినా ఎంతో ముద్దుగా ఇల్లు, వాకిలి, సంసారంతో రోజురోజుకీ ఎదిగిపోతున్నారు. తనే ఎంతకీ బాగుపడడం లేదు. తన చుట్టాలు , తెలిసిన వాళ్ళంతా ఈ గంగిరెద్దులాట వదిలేసి పట్నాల్లో హోటళ్లలో జీతాలకుండి , రిక్షాలు తొక్కుతూ దొరబాబుల్లా బతుకుతున్నారు. ‘అంటే ఈ పని ఇడిసిపెడితే తానూ బాగుపడిపోతాడా?’ ఈ అనుమానం నాంపల్లికి. ఇప్పటికి వెయ్యిసార్లన్నా వచ్చి ఉంటుంది. కానీ అంతకన్నా ఎక్కువ ఆలోచించడు. ఎందుకంటే… ఆ వృత్తి విడవాలన్న ఆలోచన అతనికి కలలో కూడా రుచించదు.
నాంపల్లికి ఇప్పటికీ బాగా గుర్తు! గంగిరెద్దులను ఆడించడంలో , జిల్లా మొత్తంమీద వాళ్ళ అయ్య రాజన్నకున్న పేరు ప్రఖ్యాతులు. అల్లిపురం గడీల ( పెద్ద పెద్ద భూస్వాములు, మోతుబరులు ఉండే విలాస భవంతులు) దొరల ముందు , జమీందారుల ఇంట పెళ్ళిళ్ళలో, ఆ చుట్టుపక్కల ఓ పాతిక గ్రామాల్లోనూ రాజన్న గంగిరెద్దుల ఆటంటే పడి చచ్చేవారు. జాతర్లలో అయితే సరేసరి! ఒక్కొక్క ఆటకీ రెండొందలకి తగ్గేవాడు కాడు. ఆ రోజుల్లో రొన్నూరు రూపాయలంటే మాటలా! ఏడాది గ్రాసం. ఇప్పుడు తన ఆవుపాలకు హోటలు వోళ్ళు నెలకి యాభై ఇచ్చినా, ఒక్క వారం కూడా గడవడం లేదు. పైసలు, బంగారం, ధాన్యం, ఎద్దులు… ఒకటేమిటి అన్నీ పుష్కలంగా ఉండేవి. వాటికి తోడు రాజన్న రూపురేఖలు కూడా ఓ మాదిరి రాజులాగే ఉండేవి. బుర్ర మీసాలు, చెవులకు బంగారు పోగులు, అయిదు వేళ్లకూ అయిదు ఉంగరాలు! అందరికీ రాజన్న అంటే ప్రాణమే. రాజన్న కూడా అన్ని ఊళ్ళ ప్రజలతో కుటుంబసభ్యుడిలాగే మెలిగేవాడు. ఆరోజుల్లో రాజన్నకి పిల్లనివ్వడానికి పోటీలు పడ్డారు కూడా. రాజన్నకి గంగిరెద్దులాట అంటే ప్రాణం కన్నా ఎక్కువ. గంగిరెద్దులనూ రాజన్ననూ విడదీసి చూడడం వీలయ్యేది కాదు.
“నా తాత తల్లిదండ్రుల కాలం నుండీ ఈ గంగిరెద్దులు ఆ ఏములాడ రాజన్న రూపాలే! మా పాలిటి కులదేవతలే! ప్రాణం పోయినా, ఉన్నా వీటి నీడలోనే” అనేవాడు గర్వంగా మీసాలు దువ్వుకుంటూ.
ఆ మాటలు నాంపల్లికి ఎంతో గొప్పగా తోచేవి. అయ్య పొందే మన్ననా , మర్యాదలు తనూ పొందాలని కలలు కనేవాడు. రాజన్నకి కూడా నలుగురు కొడుకులున్నా, నాంపల్లి అంటేనే ప్రాణం!
“నా తర్వాత నా ఆటా ,పాటా కలకాలం నిలబెట్టేది నా నాంపల్లిగాడొక్కడే” అనేవాడు తోటివాళ్ళతో.
“ఒరే రాజన్నా! దీపమున్నప్పుడే ఇల్లు సక్కబెట్టుకోవాల్రా ! ఓ లంకంత ఇల్లు గట్టి, పదెకరాల పొలం గొని పారెయ్యరాదూ..! ముసలితనాన పనికొస్తది. ఏ కాలం ఎట్లుంటదో!” అనేవారు తోటివారు.
“నాకెందుకే ఇల్లు సిన్నాయనా! ఈ గడ్డంతా నాదేనాయే. ఎవలింట్లో బిచ్చమెత్తుకున్నా రోజు గడిచిపాయే. అడిగిన ఇంట అడగకుండ తిరిగినా పదేళ్లు బతుకుత” అనేవాడు విజయగర్వంతో. నిజమే ఆ రోజుల్లో బిచ్చమెత్తడం నామోషీగానూ , బిచ్చం వెయ్యడం గొప్పతనంగానూ ఎవరూ అనుకునేవారు కాదు. ఎవరి కులవృత్తి వారిది! “ఆ దినాలు ఏడ బోయినయో!” నాంపల్లి ఆవేదనగా అనుకున్నాడు.
ఆలోచనలతో నడుస్తున్న నాంపల్లికి ఆ ఊరి సర్పంచ్ ఎదురయ్యేడు.
” ఎటు బోతున్నవురా నాంపల్లీ?” అన్నాడు
“అయ్యా! బాంచను! మీ ఇంటికే బోతున్న” అన్నాడు నాంపల్లి.
“ఎందుకురా?” ఆప్యాయంగానే అడిగాడు.
నాంపల్లి కొద్దిసేపు తటపటాయించి, ” అయ్యా! ఎడ్లకు గడ్డిలేక సచ్చిపోతన్నాయ్! వాటికింత గడ్డి, మాకింత గాసం ఇస్తరేమోనని అడుగుదామని వొస్తన్న!” అని ఒదిగిపోయి వినయంగా చెప్పేడు.
సర్పంచ్ నిట్టూర్చాడు. ” గడ్డేడుందిరా… ఈ కరువుకాలంలో? సరే, పోయి అమ్మనడుగు. మల్లెసాలలో (చావడిలో లేదా పంచలో) బుడ్డెడన్ని (కొద్దిగా) మక్కలుండె (మొక్కజొన్నలు). నే బెట్టమన్ననని తెచ్చుకో” అన్నాడు.
“నీ దయ దొరా” అని గబగబా అడుగులు వేశాడు నాంపల్లి.
బస్సుకోసం కాబోలు సర్పంచ్ కూడా వేగంగా వెళ్ళిపోయాడు.
” అమ్మా! ఇంత గడ్డి ఇయ్యిండ్రి! గట్లే కాసిని మక్కలు కూడ పెట్టుమన్నాడు దొర” అంటూ సర్పంచ్ భార్య విమలమ్మని అడిగాడు నాంపల్లి. ఆమె ఒక్కసారి గయ్ మని లేచింది.
“గడ్డిలేదు… గిడ్డీలేదు. ఆయనకో తెల్వి లేదు. అక్కడ దొరల్లే ఆర్డర్ చేత్తడు. ఇక్కడ ఇయ్యకుంటే నిష్టూరం చేత్తడు” అంది కోపంగా.
నాంపల్లిలో మొలకెత్తిన ఆశ చచ్చిపోయింది.
” అట్లయితే పోయొస్తనమ్మా” అన్నాడు నాంపల్లి కళ్ళల్లో నీళ్లు అదిమిపెట్టి.
ఆమె నిర్దాక్షిణ్యంగా తలూపింది. ” ఓయ్ నాంపల్లీ! ఆ దిక్కుమాలిన గంగిరెద్దులు వదిలి, నీవూ, నీభార్యా మా ఇంట్లో కూలికి జేరిపోండ్రా! తిండీ, బట్టా పెట్టి ఏడాదికి రెండువేలిస్తం” వెనకనుంచి అందామె గేటు దాటుతున్న నాంపల్లితో. నాంపల్లి వెనక్కి తిరిగాడు.
” మరి నా ఎడ్ల గతి ఏందమ్మా?” అడక్కూడదనుకుంటూనే అడిగాడు.
” వాటిని మాకమ్మేయ్… అన్నిటికీ కలిపి అయిదు వేలిస్తం” అందామె.
నాంపల్లి గుండె తరుక్కుపోయింది. కన్నబిడ్డల్లా పెంచుకుంటున్న ఎద్దులను అమ్మేయడమా? అదీ పోలంపనికి! అదీగాక వాటిల్లో ఒకదానికి తన అయ్య పేరే పెట్టుకున్నడాయె!
“తొందరేం లేదురా…బాగా ఆలోచించి చెప్పు” తాపీగా అంది విమలమ్మ.
” మంచిదమ్మా” తలొంచుకుని చెప్పాడు నాంపల్లి. ఆ తర్వాత మరో నాలుగిళ్లు తిరిగాడు. అన్ని చోట్లా కొంచెం అటూ ఇటూగా అందరూ అదే బాపతు మాటలాడేరు. అతని మనసులాగే సూరీడు అస్తమిస్తుంటే , తిరిగి తిరిగి చింతచెట్టు కింది తన నివాసం చేరుకున్నాడు నాంపల్లి.
” నీ సంసారంల మన్నువడ! ఈ దిక్మాలి బతుకు బతికే కన్నా ఏడనయినా పడి సచ్చేది నయం! థూ..” ధుమధుమలాడుతూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ, ఆఖరుగా మిగిలిన జొన్నసంకటి పొయ్యిమీదేసింది రంగశాయి. నాంపల్లి నిర్వికారంగా వింటున్నాడు.
” ఆ దొరసాని చెప్పినట్టు ఆ ఎడ్లను అమ్మేసి, ఆళ్ళ దగ్గిర జీతానికుంటే , ఎంత సక్కగుంటది? వంటినిండా బట్ట, కడుపునిండా తిండన్నా దొరుకుతది. లగ్గమయి నాలుగేండ్లయినా ఒక్కనాడు బుద్ధి తీర తిన్నది లేదు. సోకయిన బట్ట కట్టింది లేదు. ఎవలయ్యా గంగెద్దులాడించి మేడలు కట్టింది? అయినా, ఈ దిక్మాలి కొలువు నీ అన్న జేత్తుండా , నీ తమ్ముడు జేత్తుండా? ఎవలికి లేని పీకులాట నీకెందుకయ్యా?” అంటూ రంగశాయి అరుస్తోంది.
నాంపల్లి నిశ్శబ్దంగా వాగుకేసి నడిచాడు. కాసేపు అక్కడ ఇసకలో పడుకున్నాడు. ఎవరికీ నచ్చని ఈ గంగెద్దులాట పట్టుకుని తను నాశనమైపోతున్నాడా? ఎడ్లన్నీ అమ్మేసి దొర దగ్గర జీతముంటే నిజంగా ఏ చింతా ఉండదా? కానీ వాటిని అమ్మేదెట్లా? తన తండ్రి, తాతల ద్వారా సంక్రమించిన ఈ అపురూపమైన విద్యని ఎలా నేలమట్టం చేయడం?
ఇప్పటికే ఈ ఆట చాలామంది వదిలేసుకున్నారు. తనకు తెలిసినంతవరకు నాలుగు జిల్లాల్లో తానొక్కడే ఈ ఆట ఆడుతున్నాడు.
తానూ వదిలేస్తే ఈ ‘కళ’ మాయమైపోతుందా? అంటే తరతరాలనుండి వస్తూన్న ఓ కళని తను చేజేతులా పూడ్చిపెట్టడమా? “ఛీ..బతుకు పాడుగానూ!” నాంపల్లికి దుఃఖం మానేరు వాగులా పొంగింది. ఎంతసేపు ఏడ్చాడో తనకే తెలియదు. చివరికి పెళ్ళాం పిలిస్తే లేచి చెట్టుకిందికి నడిచాడు.
జావ తాగేకా రంగశాయి మెల్లిగా నాంపల్లి పక్కకు జేరింది.
“నా మాటినయ్యా. నీ కాళ్ళు మొక్కుత! ఈ కాలంలో ఈ దిక్మాలి విద్యనట్టుకొని ఎవడేడుస్తుండు? రేపు మనకు పోరగాండ్లు పుడతరు. సంసారం పెరుగుతది. ఎట్ట పోషించడం? మన సుట్టాలూ, పక్కాలూ అందరూ వదిలేసిన ఈ ఆట మనకెందుకయ్యా? ఈ గొడ్లని అమ్మగా వచ్చిన పైసలతో మంచిగా బట్టలు కొనుక్కుందాము. తిండికి సర్పంచి ఇంట్లో కొదువ లేదు. ఏడాదికి ఇచ్చే రెండువేలు దాసుకుందం.” అంది రంగశాయి ఎంతో శాంతంగా.
” సరెలేవే… నీ ఇష్టమే కానీ..” అన్నాడు నాంపల్లి. రంగశాయి నిశ్చింతగా నిద్రపోయింది. నాంపల్లికి మాత్రం ఆలోచనలు ముంచుకొచ్చాయి.
‘రంగశాయి చెప్పిందాంట్లో అబద్ధమేమీ లేదు. ఈ కాలంలో తన ఆటని ఎవరు పట్టించుకుంటారు? కొందరైతే తన వేషభాషలు చూసి గేలి చేస్తున్నారు. పైగా కష్టపడి పని చేసుకోక ఈ సోమరి పనేమిటని తిడుతున్నారు కూడా. తనదీ ఒక విద్యేనని గుర్తించే వారే లేరు. ఇంక మెచ్చుకుని డబ్బులిచ్చేవారేవరు? మొన్న చబ్బీస్ జనవరి వేడుకల్లో ఆటకి సర్కారోళ్లు వెతగ్గా వెతగ్గా, నాలుగు జిల్లాల్లో తనే దొరికితే సర్పంచ్ గొప్పగా కరీంనగర్ తీస్కపోయినాడు. అక్కడ నిలబడి నిలబడి కాళ్లు పచ్చి పుండ్లాయె. ఎడ్లు తాగడానికి నీళ్లు లేక నిలువు గుడ్లేసినయ్. మంత్రి వచ్చేసరికి బాగా పొద్దోయింది. చివరకి అయిందనిపించి నూట యాభై రూపాయల చెక్కు చేతిలో పెట్టిరి. అది బేెంకులకెళ్ళి విడిపించుకునే దానికన్నా నాలుగూళ్లు తిరిగి బిచ్చమెత్తుకున్నదే నయమనిపించింది.
అలాగే ఇంకోసారి జిల్లా పండుగలకు పిల్చి, అక్కడ గద్దెనెక్కి కుక్కరాగాలు తీసిన కవులకు వేలకి వేలు చెక్కులిచ్చి, ఆళ్ళకే శాలువాలు కప్పిండ్రు గానీ తన ఆటని గుర్తించిన వారే లేరు. ఛీ… ఈ ఆట వదిలేయక తప్పదు!’ ఆ నిర్ణయం తీసుకున్నాకా నాంపల్లి మనసు తేలిక పడలేదు సరికదా… మరింత దిగులుతో నిండిపోయింది. వెన్నెల్లో దూరంగా మేస్తోన్న ఎద్దులను చూశాడు. చిక్కిపోయి ఉన్నాయి. వర్షాలు లేక ఎక్కడా గడ్డి దొరకడంలేదు. ” రేపే అమ్మేయాలి. వాటికి కడుపునిండా తిండైనా దొరుకుతుంది” అనుకున్నాడు.
ఇంతలో ” ఒరేయ్ నాంపల్లీ!” అని తండ్రి రాజన్న గొంతుక విని ఉలిక్కిపడ్డాడు. ” అయ్యా! నువ్వా!” అన్నాడు ఆశ్చర్యంగా.
“నేనేరా… ఈ ఆట ఇడిసి , ఎడ్లను అమ్మేద్దామనుకుంటున్నావట్రా?” అని ఆపైన మాటరాక వెక్కి వెక్కి ఏడవసాగాడు రాజన్న.
” లేదు నాయినా లేదు! నా పాణముండగా అమ్మను” అంటూండగా చప్పున మెలకువ వచ్చింది నాంపల్లికి. మళ్ళీ ఎప్పటికో నిద్రోయాడు.
మర్నాడు పొద్దున్నే అక్కడికి నాంపల్లి తమ్ముడు యాదగిరి వచ్చాడు. నాలుగేళ్ల తరవాత చూస్తోన్న తమ్ముణ్ణి పోల్చుకోలేక పోయాడు నాంపల్లి. ఇస్త్రీ పాంటు,చొక్కాలో , కత్తిరించిన జుట్టుతో , మారిపోయిన భాషతో , ఒకటేమిటి- గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు తన తమ్ముడు. హైదరాబాదులో ఏదో ఆఫీసులో చప్రాసీగా ఉంటున్నాడట. భోజనం పెట్టి , నెలకి వెయ్యి రూపాయల జీతం! రంగశాయి మురిసిపోయింది. అతను వదినకి నాలుగొందల రూపాయలిచ్చి దావత్ (విందు) చెయ్యమన్నాడు. ఆమె ఆ డబ్బుని పట్టి పట్టి మరీ చూసింది. తన జీవితకాలంలో నాంపల్లే అంత డబ్బు చూడలేదు.
భోజనాలయ్యాకా, ” భలే బాగుందన్నయ్యా… వనభోజనంలా!” అన్నాడు యాదగిరి తృప్తిగా. నాంపల్లి బాధగా నవ్వేడు.
“నాకు రోజూ వనభోజనమేరా” ఎంత మామూలుగా అన్నా, నాంపల్లి గొంతులో వణుకు యాదగిరి పసిగట్టాడు.
“అన్నయ్యా! ఎందుకు ఈ దరిద్రాన్ని పట్టుకుని వేళ్ళాడుతావ్? చక్కగా నాతో పట్నం రా! నీకూ నాలాంటి ఉద్యోగం ఇప్పిస్తాను. దొరలా బతకొచ్చు. అక్కడ మన కులం, గోత్రం ఎవరూ పట్టించుకోరు. అక్కడ మనల్ని ఎవరూ ఏరా అనికూడా పిలవరు” ధీమాగా చెప్పాడు యాదగిరి. రంగశాయి మురిపెంగా చూసింది మరిదిని. నాంపల్లి ఏమీ మాట్లాడలేదు.
” అన్నయ్యా! తొందరగా తయారవు. కరీంనగర్ పోయి, సినిమా చూసి వద్దాం. ఒదినా నువ్వుకూడా” హుషారుగా అన్నాడు యాదగిరి.
“ఎలారా..? మనకో ఇల్లా, పాడా! ఈ సామానూ, గొడ్లూ గాలికొదిలేసి ఎలా వెళ్లగలము? ” మెల్లగా అన్నాడు నాంపల్లి. రంగశాయి గయ్ మని లేచింది.
“దిక్కుమాలిన ఎడ్లు , చిప్పలు, నులకమంచం– ఈటికి కావలి కాస్తూ ఈ చింతచెట్టుకు ఉరేసుకోవయ్యా… పీడా వదిలిపోతుంది” అంది కోపంగా ముక్కుపుటాలను ఎగరేస్తూ. ఓ అరగంట కష్టపడి ఇద్దరినీ శాంతింప చేశాడు యాదగిరి.
“ఒరే… నువ్వూ, వదినా పోయిరాండ్రి. నాకు సినిమా చూడాలని లేదు” అన్నాడు నాంపల్లి నిరాసక్తంగా. కాసేపు బతిమాలినా ఫలితం లేక, వదినని తీసుకుని కరీంనగర్ పోయాడు యాదగిరి. నాంపల్లి నులకమంచం మీద పడుకుని తీవ్ర ఆలోచనల్లో ములిగిపోయాడు. రాత్రి అయ్య ఆత్మ కలలోకి వచ్చి ఎంతగా ఏడ్చింది? ఛీ.. చచ్చినా ఈ విద్యను వదిలిపెట్టొద్దు. అట్లా చేస్తే తండ్రి ఆత్మ ఎంత రంధి పడుతుందో. అందుకే తను వదలడు. ఆ నిర్ణయంతో నాంపల్లికి నిద్ర పట్టేసింది.
ఓరాత్రి వేళ ఎవరో నిద్రలేపుతుంటే మెలకువొచ్చింది నాంపల్లికి. చూస్తే సర్పంచ్. “ఒరేయ్ నాంపల్లీ! కరీంనగర్ నుంచి ఆఖరి బస్సుకు వస్తున్నానురా. అక్కడ నీ పెళ్ళాం , తమ్ముడూ కలిశారు.
“ఆ..” నిద్రమత్తుతో ఆవులించి వింటున్నాడు నాంపల్లి.
“నిన్ను రేప్పొద్దున్నే ఈ పెంటంతా వొదిలించుకుని రమ్మన్నారు. అటునుంచి అటే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చునట. అలా రావడం నచ్చకపోతే ఇక్కడే చావమన్నారు. నీ భార్య నీ తమ్ముడ్నే ఉంచుకొని సంసారం చేస్తుందట తప్ప నీతో ఇకమీదట ఇక్కడ కాపురం చేయదట.
బాగా ఆలోచించుకొని పొద్దున్నే రమ్మని చెప్పింది. రేపు మధ్యాహ్నం రెండు దాకా చూసి హైదరాబాదుకి వెళ్ళిపోతారట” బాధగా చెప్పాడు సర్పంచ్.
నాంపల్లి నిద్రమత్తు తటాలున ఎగిరిపోయింది. ‘అంటే…రంగశాయి మరిదితో లేచిపోయిందా?’ కొంచెం అటూ ఇటూగా అంతే!
సర్పంచ్ వెళ్ళిపోయాడు. నాంపల్లి మాత్రం రాత్రంతా కంటిమీద కునుకులేకుండా గడిపాడు.
తెల్లవారి లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకుని, గంగిరెద్దుని అలంకరించుకొని ఊళ్లోకి బయలుదేరేడు. ఇప్పుడు అతడి మనసు స్వేచ్ఛగా ఉంది. ఇన్నాళ్లూ తన ఇష్టానికి అనవసరంగా భార్యను కూడా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఆమె ఇష్టానికి ఆమె వెళ్ళిపోయింది. ఇక ఎవరినీ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టనవసరం లేదు. తాను బతికి ఉన్నంతకాలం గంగిరెద్దులను ఆడించుకునే బతుకుతాడు. తాను బతికినన్నాళ్లూ ఈ అరుదైన విద్యని రెండు చేతులూ అడ్డుపెట్టి దీపాన్ని కాపాడినట్టు కాపాడతాడు. సర్కారు పట్టించుకోవడానికి ఇదేమన్నా కూచిపూడి నాట్యమా? గురజాడ ఇల్లా? కోణార్క్ శిల్పసంపదా?…. ఆ క్షణాన అతడి గురించి అతనికి తెలియదుగానీ , నాంపల్లి కూడా ఒక త్యాగమూర్తే! మహానుభావుడే!!
*******
పగటివేషగాళ్లూ, కొమ్మదాసరులూ, తోలుబొమ్మ లాడించేవాళ్లూ, జముకులకథలు చెప్పేవాళ్ళు, తప్పెటగుళ్ళు, కోలాటం ఆడేవాళ్లూ…అలాగే గంగిరెద్దులనాడించే వాళ్లూ— వీళ్ళందరూ సమాజంలో ఒకానొకప్పుడు చాలా బాగా బ్రతికినవాళ్లే. ప్రజలందరూ వీటిని కళలుగా గుర్తించి, పోషించి కాపాడుకునేవారు. అలాగే ఆ కళాకారుల కుటుంబాలవారు అవి తమ వారసత్వ సంపదగా భావించి వంశపారంపర్యంగా నిలబెడుతూ వచ్చేరు.
కానీ కాలం మారిపోయింది. ప్రజలు మారిపోయారు. క్రమేణా ప్రజల అభిరుచులూ మారిపోయాయి. దాంతో కళారూపాలూ మారిపోయాయి….కొన్ని మరుగున పడిపోయాయి. పట్టణ జీవితాలకి ప్రజలు వలసపోవడంతో ఈ గొప్ప గ్రామీణ కళలు మెల్లమెల్లగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
ఆర్థిక సూత్రాలు మనిషి జీవితాన్ని శాసించడం మొదలుపెట్టేకా, అతడి జీవితావసరాలు మారిపోయాయి. సంపాదన వెంట పరుగులు తప్ప, కళా సాహిత్యాదులని పరిరక్షించుకోవాలనే తపన, ఆసక్తీ కరువైపోయాయి. ప్రభుత్వానికి ముందే చిత్తశుద్ధి లేదు!
అయినా ఇప్పటికీ ఎక్కడో అక్కడ నాంపల్లి లాంటివాళ్ళు వదలకుండా ఆ కళల పరిరక్షణ కోసం జీవితాల్ని త్యాగం చేస్తూనే ఉన్నారు. తాత తండ్రులనుంచి “వారసత్వం” గా వస్తోన్న గంగిరెద్దులాటని ఎలాగైనా కాపాడాలని అతను సర్వం వదులుకున్నాడు. అతనికి తిండిలేదు, నిలువ నీడ లేదు, సర్కారువారి సహాయం లేదు, ప్రజల గుర్తింపు లేదు , చుట్టాలే కాదు…తోడబుట్టిన వాళ్ళ అండ లేదు….చివరికి తోడుగా ఉంటానన్న భార్య కూడా తోసేసిపోయింది. కానీ ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొని తన కులవృత్తిని… ఆ వారసత్వ కళని వదులుకోకూడదనే, నాంపల్లి ఆ కష్టాలన్నీ భరించడానికి సిద్ధపడ్డాడు. అందరూ తనని వదిలేసి పోయిన తరువాత ‘స్వేచ్ఛ’ గా భావించాడు తప్ప దుఃఖించ లేదు. అందుకే అతని వ్యక్తిత్వానికి జోహారు పలుకుదాం.
–సి. యస్
A very heart touching story which portrays the character of a real hero un seen and unheard in today’s world. Inspite of the toughest circumstances, to such a degrading life without bare necessities Nampally chose to stay back to his ancestral profession to that extent of leaving his wife and happy of his new freedom makes the readers emotional and the hearts filled with joy and pride. Your introduction and conclusion to the story is superb and we can taste the expertise of your presentation of the theme with ease and richness of the original.
LikeLike
Powerful story..
LikeLike
వృత్తులు కోటి ఉన్న కులవృత్తికి సాటిరావు . ఇప్పటి కి గంగిరెద్దు ను వెంకన్నబాబుగా కొలుస్తాము. రాజన్న వేములవాడ దేముడే .తండ్రి రాజన్న దేమునికంటే అనూనం.అందుకే తండ్రిమాటను,వేదనకు విలువని ఇచ్చాడు నాంపల్లి. భార్య రంగశాయి,యదగిరితో లేచిపోయింది. అయినా తనవృత్తి దైవంగా భావించినవాడు నాంపల్లి. గడ్డి ఉన్నంత భూమి తనదే. ప్రతిరోజు గంజి దొరికితే పరమాన్నం గా భావించే రాజయ్య నాంపల్లికి కులవృత్తిపట్ల,మూగజీవా పట్ల కారు ణ్యం, అందించాడు. అదే అసలైన మానవత,. మహానీయత. ఇవాళ జాతి నేర్చుకోవాలి. తాళికట్టినది మోజుకోసం మరిడితో వెళ్లిపోయినప్పటికి కించిత్ బాధలేదు సరికదా అడ్డుకొనేబంధం తొలగపోయిందన్న తాత్త్వికుడు,సాత్వికుడు,ప్రేరకుడు. పిచ్చుక గుండ్ల వారు,దొమ్మరులు,వీరముష్టివారు జంగం వారు,బుడబుక్కలువారు,కొమ్మదాసరులు,పిట్టలదొరలు,మాయమైపోతు న్నారు.గురజాడ ఇల్లు,కూచిపూడినాట్యం,కోణార్క శిల్పసంపడ కాపాడే ప్రభుత్వం అవసరంలేదు. తనవృత్తి మూగజీవికి పిడికెడు దాణా పెట్టె నాంపల్లికంటే ప్రభువు ఎక్కడ దొరకడు. సుధాకర్ గారి కళా దృష్టి,సి.ఎస్. గారి విశ్లేషణ దృష్టికి ఇది ఈ కధ తార్కాణం.
LikeLike
గంగిరెద్దులాట, కళయు, భుక్తికి దారి,
ప్రజలె కూర్చవలయు బ్రతుకుతెరువు!
అట్లుకానియెడల అంతరించునదియు,
కాలగతిలొ, ఇతర కళలవలెనె!
LikeLike