ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కథకుల కథలు ఇప్పటివరకూ చాలానే చదువుకున్నాం. ఎన్ని చదువుకున్నా ఇంకా చదవవలసిన ఆ ప్రాంతపు రచయితలు చాలామందే వున్నారు. అలాంటి వారినుంచి ఈ వారం శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారిని తీసుకున్నాను.
శ్రీ సీతారామమూర్తి గారు 1947లో పొందూరులో జన్మించారు. వారు చిన్నతనం నుంచే కథలూ, కవిత్వమూ, నాటికలూ రాయడం మొదలుపెట్టారు. తెలుగునాట ఉన్న అన్ని పత్రికలలో వారి కథలు దాదాపు 200 పైనే ప్రచురితమయ్యాయి. తొమ్మిది సార్లు వారు తమ కథలకు బహుమతులు పొందారు. వారు ‘ రాగ వీచికలు’ , ‘ చైతన్య దీపాలు’ వంటి సీరియల్ నవలలూ, కొన్ని నవలికలూ, రేడియో నాటికలూ కూడా రాశారు. కానీ వారికి కథ అంటే మక్కువ ఎక్కువ! వారి కథలు హిందీలోకి , తమిళంలోకీ అనువదించబడ్డాయి. ‘అదిగో పులి’, ‘వెన్నెల్లో పావురాళ్లు’, ‘వర్ణచిత్రం’ వారి ప్రముఖ కథాసంపుటాలు. ప్రముఖ కవయిత్రి శ్రీమతి ఆదూరి సత్యవతీ దేవి వీరి ఇల్లాలే. సీతారామమూర్తిగారు రాసిన “చెర” అనే కథ ఈవారం చూద్దాం.
రెండురోజుల నుంచీ సన్నగా కురుస్తోన్న వాన ఆ రోజు మధ్యాహ్నానికి ఉధృతమైంది. అందమైన ఓ చిన్నగదిలో ఒక మూల ముడుచుకుని కూర్చుంది కాసులమ్మ. కంటిమీదికి కునుకు రావడం లేదు. మనసులో ఏదో వెలితి, గుండెల్లో బెంగ, భయం. ఒకప్పుడు కాసులమ్మ వర్షమొస్తే ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసేది. తాటాకు కప్పు మీద చినుకులు చేసే నాట్యం, చూరు నుంచి ధారలుగా జారే వర్షపు నీటిని చూస్తూ ఎంతసేపైనా అలా ఉండిపోయేది. అయితే పరిసరాలూ, పరిస్థితులూ అనుభూతుల విలువల్ని మార్చేస్తాయనే విషయం పన్నెండేళ్ళ ఆ చిన్న మనసుకి తెలీదు!
ఇంట్లో అందరూ ఎవరిగదుల్లో వాళ్ళు పడుకున్నారు. వర్షపు అలజడి తప్ప అంతా స్తబ్ధుగా ఉంది. నెమ్మదిగా లేచి, కిటికీ రెక్క తెరిచింది కాసులమ్మ. చల్లగాలి రివ్వున గదిలోకి దూసుకొచ్చింది. బయటంతా నిర్మానుష్యంగా ఉంది. వీధి దీపాల కాంతి సన్నగా ఉంది. దూరంగా రైలు కూత వినిపించింది. కాసులమ్మ గుండెలు ఒక్కమారు దడదడలాడేయి. ఆర్నెల్ల క్రితం….. ఆ రోజూ ఇలాగే ఒంటరిగా భయపడింది. ఒంటరిగానే దుఃఖించింది. చివరికి ఒంటరికాక తప్పలేదు. ఆ జ్ఞాపకాల నీడలు కాసులమ్మ కళ్ళముందు కదలాడసాగాయి. అప్పటికి నాలుగు రోజులుగా ఇంట్లో అయ్యకీ అమ్మకీ గొడవ జరుగుతోంది. అయ్య ఓపిగ్గా నచ్చచెబుతున్నాడు. అమ్మ మాత్రం ఒప్పుకోటంలేదు. కనీసం ఒక్క బిడ్డ జీవితమైనా బాగుపడ్డానికి అది తప్పదంటాడు అయ్య!
చివరికి అయ్యే గెలిచాడు. అమ్మకి ఒప్పుకోక తప్పలేదు. ఆ మర్నాడు అయ్య తనని పిల్చి గోముగా చెప్పేడు– పట్నం ఎంతో బాగుంటుందనీ, అక్కడ మేడలూ, మిద్దెలూ, కార్లూ… వాటన్నిటి గురించీ చెప్పి, చివరికి అసలు సంగతి చెప్పేడు. తను అయ్యమాటకి ఎదురు చెప్పలేక పోయింది. అయ్య మొహంలో ఉన్న ఆశ ఆమెని మాట్లాడనివ్వలేదు.
ఆ రోజు పొద్దున్నే అమ్మ తనని లేపి తలంటు పోసింది. కొత్త లంగా, జాకట్టు వేసుకోమంది. వేడివేడన్నం పెట్టింది. ఏ పండుగనాడూ తనకి అలా జరగలేదు. అయినా ఆమెకి సంతోషమనిపించలేదు. తనకి జరుగుతున్న రాజభోగాలకి తమ్ముడూ, చెల్లెలూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంకోపక్క దిగులుగానూ ఉన్నారు. తనకీ, ఏడుపు తన్నుకొస్తోంది. “మళ్ళెప్పుడొస్తావక్కా?” అని తమ్ముడూ చెల్లెలూ అడుగుతుంటే తను మాత్రం ఏం చెబుతుంది? తనకి మాత్రం ఏం తెలుసు కనక? ఆ సాయంకాలం అయ్య బయల్దేర దీశాడు. చిన్న బట్టల సంచీ అమ్మ తన చేతికందించింది. గుడిసె తలుపు జారేసి తన వెంటే బయల్దేరి పడవెక్కెవరకూ అమ్మ జాగ్రత్తలు చెబుతూనే ఉంది. పడవ ముందుకెళ్తోంది. తన మనసు మాత్రం వెనక ఒడ్డున నించున్న అమ్మ, తమ్ముడూ, చెల్లెలు…వాళ్ల మీదే ఉండిపోయింది! పడవ దిగేకా జట్కా, ఆ తర్వాత రైలు. మొదటిసారి రైలెక్కడం అయినా తనకి అస్సలు సంతోషమనిపించలేదు.
పట్నంలో అది నాలుగంతస్తుల భవనం. తండ్రి వెనకాల ఆ మేడ మెట్లు ఎక్కుతూంటే తనకి అంత పెద్ద భవనం చూసి ఆశ్చర్యం వేసింది. ఆ ఇంట్లో అందరూ భలే తెల్లగా, అందంగా ఉన్నారు! “ఏం పేరూ?” అనడిగింది అమ్మగారు. తను “కాసులమ్మ” అని చెబితే, ఆవిడ నవ్వి, “మంచి పేరే…. లక్ష్మీదేవన్నమాట” అంది. బాబుగారితో కాసేపు ఏదో మాట్లాడేడు అయ్య. ఆ సాయంకాలమే ఇంటికి బయల్దేరిపోయాడు అయ్య.
బయట పెద్ద మెరుపు మెరిసింది. అంతలోనే పెద్ద ఉరుము. క్రమంగా వర్షం పెద్దదైంది. ఉలిక్కిపడ్డ కాసులమ్మ కిటికీ తలుపులు మూసి పక్కమీద కూచుంది. మళ్ళీ ఆలోచనల తెరలు ఆమెను కప్పేసేయి. ఇంట్లో కాలు పెట్టినప్పటి నుంచీ కాసులమ్మకి ఆశ్చర్యమే! నునుపైన పాలరాతి గచ్చు! ఆవుపేడతో అలికిన నేలమీదా, కంకర రోడ్డుమీదా, పొలంగట్లమీదా నడిచిన తన పాదాలకి…ఇక్కడ అడుగు పెడితే మాసిపోతుందేమోననిపించే అందమైన గచ్చు! రంగు రంగుల గోడలు, కరెంట్ దీపాలు, రేడియో, బొమ్మలుకనిపించే టీవీ.. ఇంకా తనకు పేర్లు తెలియని ఎన్నో వస్తువులు! తనకోసం ఓ చిన్న గది. అందులోనూ మీట నొక్కితే వెలిగే దీపం. తెల్లారి ఐదింటికి నిద్రలేచి అమ్మగారికి ఇంటి పనుల్లో సాయపడ్డం, వాళ్ళతోటే కాఫీ, టిఫినూ, భోజనమూను. వంటలో సాయం చెయ్యడం, అన్ని గదులూ తడిగుడ్డతో తుడవడం, చాకలి ఉతికి ఆరేసిన బట్టలు మడత పెట్టడం, ఇస్త్రీ చేయించి తీసుకురావడం, చిన్నచిన్న బజారు పనులు చెయ్యడం, కుండీల్లో పూలమొక్కలకి రెండు పూట్లా నీళ్ళు పోయడం….. ఇలా ఇదీ అదీ అనిలేదు… ఇంట్లోవాళ్లు ఏ పని చెబితే ఆ పని నమ్మకంగా చెయ్యడమే కాసులమ్మ పని!
ఆ ఇంట్లో ఉండేది నలుగురంటే నలుగురు– అయ్యగారూ, అమ్మగారూ. అరుణమ్మా, అరవిందు బాబూ. అరవిందు బాబును చూస్తే తన తమ్ముడే గుర్తుకొస్తాడు కాసులమ్మకి. పోలికలు కుదిరి కాదు- తన తమ్ముడికి కూడా ఇలాంటి రాజాలాంటి బతుకెందుకు లేదూ అనిపించి! అన్ని బట్టలూ, అన్ని జోళ్లూ… ఇవన్నీ లేకపోవడానికి తన తమ్ముడు చేసిన తప్పేమిటీ అనిపించి! అరుణకి పథ్నాలుగేళ్ళుంటాయి. ఏపుగా పెరిగి పదహారేళ్ళ పిల్లలా ఉంటుంది. కాన్వెంటులో చదువుతోంది. స్కూల్ నుంచి వచ్చాకా కాన్వెంట్ బట్టలు మార్చుకుని, పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఆమె అందమే మారిపోతుంది. రెండు మూడు భాషలు మాట్లాడుతూ ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అటువంటి జీవితమే జీవితం అనిపిస్తుంది.. అరుణని చూస్తే! అప్పుడప్పుడు ఆమె స్నేహితులు వచ్చినప్పుడు తనని కాఫీ తెమ్మంటుంది. వాళ్లందరూ తనకి ‘థాంక్స్’ అంటారు. కొన్నాళ్ళు తనకామాటకి అర్థం తెలియలేదు.
ఆ ఇంట్లోవాళ్లందరూ ఫోను మాట్లాడతారు. ఊళ్ళో వాళ్ళతోనే కాక పై వూళ్ళో ఉన్న వాళ్ళతో కూడా అందులో మాట్లాడచ్చునని తెలిశాకా కాసులమ్మ మనసు పరిపరి విధాల పోయింది. ఒక్కసారి అమ్మతోనో, తమ్ముడితోనో, చెల్లాయితోనో మాట్లాడితేనో…అనిపించేది. కానీ ఎలా? రోజులు గడిచిపోతున్నాయి. అన్ని సౌకర్యాలున్నా, కాసులమ్మ మనసు ఎల్లవేళలా ఇంటిపైనే. బంగారు పంజరం లాంటి ఈ ఇంట్లోంచి బయటపడి తమ ఊరు వెళ్లిపోయి తమ్ముడితోనూ, చెల్లెలితోనూ ఆడుకోవాలనీ, మొక్కల్నీ కోళ్లనీ పెంచాలనీ, తల్లికి పనిలో సాయపడాలనీ, ఎండలోనూ, వెన్నెల్లోనూ పచ్చికబయళ్ళలో తిరగాలనీ… ఎంతగానో ఉండేది ఆమెకు.
కానీ అయ్య అమెను ఇక్కడ దిగవిడిచి వెళ్తూ చెప్పిన ఆ రెండు మాటలూ ఆమె ఆలోచనల్ని అదుపులో పెట్టేవి. మునసబు దగ్గర అయ్య తీసుకొన్న అప్పు తీరేదాకా తనకీ చెర తప్పదు. తనకిచ్చే నూటపాతికలోనూ వంద రూపాయలు మునసబుకీ, పాతిక అయ్యకీ… అదీ ఒప్పందం. రెండేళ్లు! ఎంతలో గడవాలీ? ఆ తరవాత తనూ హాయిగా … స్వేచ్ఛగా! ఇలా పోతున్నాయి ఆమె ఆలోచనలు.
చినుకులు మళ్ళీ పెద్దవయ్యాయి. గాలి జోరు తగ్గింది. ముడుచుకు కూచున్న కాసులమ్మ మళ్ళీ ఆలోచనల్లో పడింది. ఆ రోజు .. అరుణమ్మ తప్ప ఇంట్లో అందరూ సినిమాకి వెళ్ళేరు. పరీక్షలని అరుణమ్మ చదువుకుంటోంది. తను బాల్కనీలో నిలబడి రోడ్డుమీద వచ్చే పోయే వాహనాల్ని చూస్తోంది. ఇంతలో కింది అంతస్తు నుంచి అరుపులూ, ఏడుపూ వినిపించాయి. ఆ గొంతు ఎనిమిదేళ్ళ పనికుర్రాడిదని అర్థమైంది.
కాస్త వంగి కిందకి చూసింది. ఏం చేశాడో ఏమో.. పని కుర్రాడిని బెత్తంతో కొడుతున్నాడా ఇంటి యజమాని. ఆ కుర్రాడు అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ మరిన్ని దెబ్బలు. కాసులమ్మ మనసు కదిలిపోయింది. ఆ కుర్రాడు పనిలోకొచ్చి ఓ ఇరవై రోజులవుతుంది. బొద్దుగా పొట్టిగా ఉంటాడు. అంతకు నాలుగు రోజుల క్రితం ఓమూల కూచుని ఏడుస్తుండగా కాసులమ్మ వెళ్ళి పలకరించింది. కళ్ళు తుడుచుకుంటూ చెప్పేడు. వాడికి తండ్రి లేడుట. తల్లి కుండలు అమ్మి సంపాదిస్తుందిట. ఇద్దరు చెల్లెళ్ళున్నారుట. బడి మానిపించేసి, వాడి మామయ్య తెచ్చి ఇక్కడ పనిలో పెట్టేడుట. తిండీ బట్టా ఇచ్చి తల్లికి ఎనభై రూపాయలు పంపుతారుట. వాడిదీ తన లాంటి పరిస్థితే!
వాడి ఏడుపు విన్న కాసులమ్మకి ఏమీ తోచలేదు. చుట్టుపక్కల వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. అదే తమ ఊళ్ళో అయితే అలా ఉంటారా? నలుగురూ జేరి గొడవేంటో పరిష్కరించరూ? కాసేపటికి ఆ కుర్రాడిని లోపలికి లాగి తలుపేసేసేడా యజమాని. ఆవేళ తనకి అసలు నిద్రపట్టలేదు. తన తమ్ముడు పదేపదే గుర్తుకొచ్చాడు. ఆ మూడోనాడు కింది వాటా అమ్మగారు ఎవరితోనో చెబుతోంది–
“మా ఊర్నించి తెచ్చాం… పనికి సాయంగా ఉంటాడని. దేనికీ లోటు చెయ్యలేదు. ఇంటిమీద బెంగెట్టుకున్నాడేమో ఒక రోజంతా తిండి తినలేదు. వెళ్ళిపోతానని ఒకటే ఏడుపు. ఆయనా నేనూ ఎంత చెప్పినా విన్నాడు కాదు. పంపించేశాం” అని. తను ఆశ్చర్యపోయింది. అది నిజమా? ఇలా ఎన్నో ఆలోచనల్లో ములిగిపోయిన కాసులమ్మకి ఎప్పటికో కునుకు పట్టింది.
తెల్లారేకా అమ్మగారు పిలుస్తోంటే ఉలిక్కిపడి లేచింది కాసులమ్మ. గబగబా తెమిలి పనిలోకి జొరబడింది. రాత్రి కాస్త తగ్గినట్టనిపించిన వర్షం ఈ ఉదయం మరింత ఉధృతమైంది. బంగాళాఖాతంలో వాయుగుండమట. రేడియోలోనూ, టీవీలోనూ దానికి సంబంధించిన వార్తలు మాటిమాటికీ ప్రకటిస్తున్నారు. నదులూ, వాగులూ పొంగి ఊళ్లను ముంచెత్తుతున్నాయట. వంశధారా నదికి కూడా వరదలొచ్చాయని పేపర్లో చదివి చెప్పేరు బాబుగారు. అదే నిజమైతే తమ ఊరూ, తమ పాక తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. బాబుగారికి టీ అందిస్తూ కాసులమ్మఆ విషయమే అడిగింది.
“అంత భయపడక్కర్లేదు… ప్రభుత్వం వాళ్ళు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు” అన్నారాయన అతి మామూలుగా. కానీ కాసులమ్మకి ఆందోళన గంటగంటకీ పెరిగిపోతోంది. చెప్పుకుందుకు లేదు పాపం! మధ్యాహ్నం నాలుగు మెతుకులు తిని, చాప మీద మేను వాలిస్తే, మగత నిద్ర…. మొలలోతు నీళ్లలో తమ్ముడూ, చెల్లెలూ…కూలిపోయిన మట్టి ఇంటి గోడల మధ్య దీనంగా.. అమ్మా, అయ్యా నిస్సహాయంగా ఉన్నట్టు ఓ దృశ్యం కళ్ళముందు కదిలింది. గబుక్కున మెలకువ వచ్చి లేచి కూచుంది. నిజం కాదని తెలిశాకా కూడా భయం వదల్లేదు.
‘బాబుగార్ని అడిగితే..? ఏమంటారో? ‘ ఇక ఉండబట్టలేక సాయంకాలం బాబుగార్ని అడిగింది.
“నాకు భయంగా ఉంది. మా ఊరొక్కమారు వెళ్ళొస్తాను బాబుగారూ” అంది. అమ్మగారు కూడా పక్కనే ఉంది.
“ఇప్పుడా?” అన్నారు ఆయన ఆశ్చర్యంగా.
“ఇప్పుడెలా కుదురుతుందే? నాకసలే ఒంట్లో బాగుండడం లేదు. ఈ సమయంలో సాయం లేకపోతే ఎలా?” అంది అమ్మగారు.
“ఈ వర్షాలు తగ్గేకా వెళ్దువుగానిలే….” అన్నారు బాబుగారు అనునయంగా.
“ఎందుకూ? అతగాడికే ఓ కార్డు రాయండి.. ఎలా ఉన్నదీ వచ్చి చెప్పమని” అంది అమ్మగారు. కాసులమ్మ ఇంకేం మాట్లాడలేకపోయింది. ఏం చేయడానికైనా ఆమె అశక్తురాలు!
మూడు రోజుల ముసురు నాలుగోనాడు కూడా కొనసాగింది. పగటిపూట ఎలాగో మనసు ఉగ్గబట్టుకుని, పనులతో గడిపేసినా, రాత్రులు మాత్రం ఒంటరితనం, ఆలోచనలు..! కాసులమ్మ గుండెల్లోంచి దుఃఖం పొంగుకొచ్చేది. ఆ రోజు… మునిమాపువేళ….. గుమ్మానికవతల తడిసిపోయిన మేకల్లా నిలబడి ఉన్నారు ఆ నలుగురూను. తలుపు తీసిన కాసులమ్మ ఒక్క క్షణం వారివంక చూసి, నిశ్చేష్టురాలై దుఃఖం, ఆనందం కలగలిపి ఒక్క దూకుతో “అమ్మా!” అంటూ తల్లి దగ్గరకు చేరింది. అక్కని ఆశ్చర్యంగా చూస్తూనే చెల్లీ, తమ్ముడూ కాసులమ్మకి దగ్గరగా వచ్చేరు.
“బాగున్నావా అమ్మా?” అన్నాడు తండ్రి. కలో నిజమో అర్థంకాని స్థితిలో ఉండిపోయి, మెల్లగా తెరుకున్నా పెదవి విప్పి ఏమీ అడగలేకపోయింది కాసులమ్మ. ఆ తరవాత అయ్య బాబుగారితో చెబుతూండగా వింది. తుపానుకీ, వంశధారా నదికి వచ్చిన వరదలకీ ఊరు శ్మశానమే అయిందిట. ఇళ్లు నేలమట్టమయ్యాయట. గొడ్డూ గోదా కొట్టుకుపోయాయట. పంట భూములన్నీ ఇసుకతోనూ, నీటితోనూ నిండిపోయాయట. ప్రాణాలు కాపాడుకోడానికి ప్రజలు తలో దిక్కూ తరలిపోతున్నారట.
“అక్కడింకేటీ మిగల్లేదు బాబూ! ఆ ఊరితో ఋణం తీరిపోనాది. కడుపు చేత్తో పట్టుకుని మా అత్తారూరు పోతన్నాం. బిడ్డని ఓసారి చూసిపోదామని ఇటొచ్చినాం” అన్నాడు చివరికి. తను పుట్టి పెరిగిన ఊరితో ఋణం తీరిపోయిందంటే…? ఆ ఊరితో ఇంక సంబంధం లేదన్నమాట. ఆ ఊరు ఇంక ఎప్పటికీ వదిలేసి వెళ్లిపోతారా? కాసులమ్మకి దుఃఖం పొంగుకొచ్చింది. ఆ రాత్రి తల్లి పక్కనే ఆమెను కరుచుకు పడుకుంది. తన పక్కనే తమ్ముడు.
“ఇక్కడెంతో బాగుంది కదే!” అంటున్నాడు తమ్ముడు చెల్లితో. తల్లి ఎన్నో ప్రశ్నలడిగింది. ‘పని కష్టమైంది కాదు కదా?’ అంది. వేళపట్టున తిండీ, అవసరానికి మించిన బట్టలూ ఉన్నందుకు సంతోషించింది. ఈ కొద్ది నెలలకే కూతురి ముఖంలో వచ్చిన నిగారింపుకి అబ్బురపడింది. “మరొక్క ఏడాదున్నావంటే చాలు. తర్వాత వచ్చేద్దూగాని” అని కూతుర్ని బుజ్జగించింది. నోటిలో మాట నోటిలోనే ఉండిపోయింది కాసులమ్మకి. ఏడాదే? ఏడాదంటే ఎన్ని నెలలు? ఎన్ని రోజులు? ఎన్ని గంటలు? అన్నవాళ్లు తను ఇలా బందికానాలో గడపగలదా? డబ్బు ఇంత పాపిష్టిదా? అనుకుంది. మునసబు బాకీ చాలా వరకూ తీరినట్టేట…మరి ఇంకా ఎందుకు? కాసులమ్మకి ఆలోచనలు తెగడంలేదు.
“అక్కా! నేనూ నీతో ఉండిపోతానే..” అన్నాడు తమ్ముడు నెమ్మదిగా కాసులు చెవిలో. “అక్కా! ఓ కథ చెప్పవే” అంది చెల్లెలు. ఏదో పాత కథ టూకీగా చెప్పింది కాసులు. వాళ్ళు నిద్రపోయారు. చాలా కాలం తర్వాత తనూ సంతృప్తిగా నిద్రపోయింది.
తెల్లారి తెరిపిచ్చింది వర్షం. మబ్బువిడి, వెలుగు బాగా వచ్చింది. రోడ్లమీద జనసంచారం మొదలైంది. తన పనిలో తనుందేమో. తండ్రితో మనసులో మాట చెప్పడానికి వీలవలేదు కాసులుకి. అరవిందుబాబుకి బట్టలు వేసి, బూట్లు తుడిచి స్కూలుకి తయారు చేస్తుంటే తన వంక ఆశ్చర్యంగా చూశాడు తమ్ముడు. అరుణకొచ్చిన ఫోను అందుకుని మాట్లాడుతుంటే , అమాయకంగా తన వంక చూసింది చెల్లెలు. బాబుగారు వెళ్తుంటే తను బ్రీఫ్ కేసు కారులో పెడుతూంటే, అక్కడే ఉన్న తండ్రి అచేతనంగా చూస్తూ నిలబడ్డాడు. బాబుగారేదో తండ్రితో చెప్పడం చూసింది కాసులమ్మ. జీతం మరికాస్త పెంచుతామని కాబోలు! తలూపి, దండాలు పెట్టేడు తండ్రి. మరి కాసేపట్లోనే బయల్దేరేరు. అయ్య, అమ్మ, చెల్లీ, తమ్ముడూ. అమ్మగారికి దండం పెట్టింది తల్లి.
“కాసులమ్మ గురించి మీకేం దిగులక్కరలేదు. అది మా ఇంటి మనిషి” అని కొత్త చీరలూ, బట్టలూ మూటగట్టి ఇచ్చిందామె. వాళ్ళు వెళ్తూంటే గేటు వరకూ సాగనంపి అక్కడ నిలబడిపోయింది కాసులమ్మ. అమ్మ జాగ్రత్తలు చెప్పింది. అయ్య ధైర్యం చెప్పేడు. రోడ్డు మలుపు తిరిగేవరకూ వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూనే ఉన్నారు తమ్ముడూ, చెల్లెలూ.
బరువెక్కిన గుండెలతో గబగబా మూడంతస్తులూ ఎక్కి, కిటికీలోంచి చూసింది కాసులమ్మ. దూరంగా.. చిన్నగా.. వెళ్లిపోతున్నారు తనవాళ్లు! కళ్ళలో నీటిపొర జేరింది కాసులమ్మకి. ఆకాశంలో పూర్తిగా మబ్బులు విడిపోయాయి. ఎండ భూమ్మీద పరుచుకుంటోంది. ఆ వెలుగులో ప్రకృతి పరవశించిపోతోంది. గూళ్ళలో మగ్గిన పక్షులు ఆకాశవీధిలో బారులు కట్టి ఎగురుతున్నాయి.
రైలు వేగాన్ని పుంజుకుంటూంటే, వెనక్కి పోయే చెట్లవంక ఆశ్చర్యంగా చూస్తున్న ఆ పిల్లలిద్దరూ ఒక్కసారి వెనక్కి తిరిగి, అదే పెట్టెలో ఆ మూల బెంచీ వైపు చూసి అనందాశ్చర్యాలతో నోట మాట రాక తల్లికీ తండ్రికీ చూపించారు.! అక్కడ… ఆ మూల… బెంచీ మీద చేతిలో చిన్న మూటతో, చెప్పలేని ఆనందంతో ముడుచుకుని కూర్చొంది కాసులమ్మ.!
* * * * * *
బాలకార్మిక వ్యవస్థను ప్రభుత్వం వారు ఎంతగా నిషేధించినా, చాలా చట్టాల్లాగే అదీ నీరుగారిపోయింది. కారణాలేమైనా ఎందరో పసిపిల్లలు ఆ ‘చెర’లో మగ్గిపోతున్నారు. ఇలాంటి కథలు వ్యవస్థలో మార్పు తీసుకురావడం కోసం ఎంతో అవసరం.
ప్రాథమికంగా ఏ జీవి అయినా స్వేచ్ఛని కోరుతుంది. తమ వాటితో, తమ గుంపులో ఒకటిగా హాయిగా బతకాలని కోరుకుంటాయి. ఒక చిలుకని తెచ్చి, అందమైన బంగారు పంజరంలో పెట్టి, దానికి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా, అది ‘బందీ’ యే ఔతుంది కానీ స్వేచ్ఛాజీవి కాదు. ఆ బంగారు పంజరం దానికి ‘ చెర’ మాత్రమే కాగలదు. ఏ మాత్రం అవకాశమొచ్చినా అది పంజరం వదిలేసి ఎగిరిపోయి తమ జాతి పక్షులతో కలిసిపోతుంది.
‘చెర’ అనే ఈ కథలో శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు ఈ విషయాన్నే హృదయానికి హత్తుకునేలా చెప్పేరు. తనది కానిచోట… మనిషికి ఆహారం కంటే, విలాసాల కంటే, సుఖవంతమైన జీవితం కంటే, తన వారితో కలిసి కలో గంజో తాగుతూ, పాకలోనైనా నేల మీద పడుకోవడం సంతోషంగా ఉంటుంది అని కాసులమ్మ ద్వారా చెప్పేరు.
కాసులమ్మకి సరియైన ఇల్లు లేదు, తిండీ, బట్టా లాంటి కనీస అవసరాలు తీర్చడానికి కూడా తల్లిదండ్రులకి స్తోమత లేదు. అటువంటి తను ఒక పూరిగుడిసె లోంచి మహా భవంతిలోకి వచ్చింది. తన కుటుంబంలోని వాళ్ళెవరూ ఎరగని, కనీసం చూడని సౌఖ్యాలు అనుభవించగలుగుతోంది. కానీ అవేమీ ఆమెని ఆకర్షించలేదు. కేవలం తండ్రి అప్పుతీర్చడం కోసం ఆ ఇంట్లో అజ్ఞాతవాసం చేసినట్లుగానే, మనసు తనవారిమీదే పెట్టుకుని కాలం గడిపింది. అయితే రెండేళ్లు ఇంచుమించుగా గడిచిపోయినా కాసులమ్మ కుటుంబ పరిస్థితులలో మార్పు రాలేదు సరికదా…ఉన్న ఇల్లూ వాకిలీ కూడా పోయాయి.
నిజానికి ఇప్పుడు తనకి భద్రత ఉంది, మంచి ఆహారం దొరుకుతోంది, తనకో గది ఉంది. తను అనుభవిస్తోన్న జీవితం చూసి తన వాళ్ళు మురిసిపోతున్నారు. ఇవన్నీ వదిలేసిపోతే, ఎక్కడో కొత్తచోట తను ఎన్నో అగచాట్లు పడాలి! అయినా సరే..తనకి ఈ బందీ బతుకు వద్దనుకుంది. తన అమ్మా, అయ్యా, తమ్ముడూ, చెల్లీ ఉన్నచోటే తనకి స్వర్గం అనుకుంది. తన మూట పట్టుకుని వాళ్ళతో ప్రయాణమైంది. “సాహిత్య సేవా సమితి ట్రస్టు” విశాఖపట్టణం వారు వేసిన ‘కథామంజరి’లో ఈ కథ లభించింది. ఆ పుస్తకమూ, అలాగే ఇంకా వేరువేరు కథా సంకలనాలు అందచేసిన మా ‘ఆంధ్రాబ్యాంక్ నారాయణ’గారికి నా కృతజ్ఞతలు.
__ సి.యస్.
బ్లాగులో చిన్న చిన్న మార్పులు జరిగాయి. గుర్తించగలరు.
LikeLike
స్వేచ్ఛ కంటె మిన్న జీవితమ్మున లేదు
క్రిమికి కూడ స్వేచ్ఛ ప్రీతికరము;
మనసుకలుగు మనిషి మనుగడ కదిచూడ
ప్రాణవాయువగును బ్రతుకునందు!
LikeLike
బాల కార్మిక వ్యవస్థ పాడుగాను,
ఆగవయ్యెను బీదల ఆత్మఘోష,
చట్టములుమాత్రమేయుండుచట్టసభను,
బాల్యమందరకొకటనుబాధ లేదు.
అదృష్టం ఈకథ సాంతం కాకున్నా కొంత సుఖాంతమైంది. బాల కా ర్మికవ్యవ స్థ రూపుమాపాలని బాలబాలికల కు డబ్బిచ్చి ఊరేగింపులు,ఆయా సంస్థలో పనిచేసేవారు 10,12 సంవత్సరాలుంటాయి. బాలసదనాల వాఁర్డెన్స్ ఇళ్లల్లో వీళ్ళే. ఇంకానయం కాసులమ్మ నిఖార్సయిన బంగారుకాసులా వాళ్ళ అయ్యను, అమ్మను చేరింది. ఆకాసులమ్మకు మకిలి అంట లేదు.రచయితకు ధన్యవాదాలు. సామాజిక అంశాలు స్పృశిస్తూ కధలు ఎర్చడం సి.ఎస్. కు అబ్బిన గొప్ప విద్య.
LikeLike