కథన కుతూహలం 59

నేను బి.కామ్. చదివే రోజుల్లో మా గురువర్యులు శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారు నాకు రకరకాల పుస్తకాలు చదవమని సూచిస్తూండేవారు. కొన్ని సందర్భాల్లో పుస్తకాలు ఆయనే ఇస్తూండేవారు. అలా ఓసారి నవీన్ రాసిన ‘అంపశయ్య‘ నవల ఇచ్చి చదవమన్నారు. విశ్వవిద్యాలయంలో ఇరవైనాలుగు గంటల్లో ఒక విద్యార్థి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఆ నవల. ‘చైతన్య స్రవంతి’ (Stream of consciousness) పద్ధతిలో రాసిన నవల అది. ఆ నవలతో నవీన్ కి ఎంత పెద్దపేరు వచ్చిందంటే, ఆయన ఇంటిపేరు ఎవ్వరికీ తెలీదు, ‘అంపశయ్య నవీన్‘ గా ఆయన మహా ప్రఖ్యాతి చెందారు. అంత గొప్పగా రాశారు వారు ఆ నవలని.

   యన మొత్తంమీద 27 నవలలు రాశారు. ఆరు సంపుటాల కథలు వెలువరించారు. అనేక అవార్డులు, రివార్డులతో పాటు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం అందుకున్నారు. అంపశయ్య నవీన్ 1941 లో జన్మించారు. వరంగల్ జిల్లాలోని వావిలాల వారి స్వగ్రామం. వారు తన పదిహేడవ యేటనుంచీ కథలు రాయడం మొదలుపెట్టారు. కాలేజీలో అధ్యాపక వృత్తి నిర్వహించి, ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యారు. అటు నవలా రచయిత గానూ, ఇటు కథా రచయిత గానూ పేరు పొందారు. లైఫ్ ఇన్ ఎ కాలేజ్’, ‘నిష్కృతి’, ‘ఎనిమిదో అడుగు’, ‘ఫ్రం అనూరాధ విత్ లవ్’, ‘చేజారిన స్వర్గం’, ‘బలి’, ‘నిప్పురవ్వలు‘ మొదలైన చాలా మంచి మంచి కథలు రాశారు నవీన్ గారు. మనోవైజ్ఞానిక సిద్ధాంతానికి సంబంధించిన వస్తువుతో రాసిన “హత్య” అనే కథ ఈ వారం పరిచయం చేస్తాను.

   గురవయ్య గుడ్డలతో ఒక బొమ్మను తయారు చేశాడు. దానికి రంగురంగు కాగితాలు అంటించాడు. చిన్న కళ్ళు, పుల్లల్లాంటి పొడవైన చేతులు, పెద్ద బొజ్జతో వికృతంగా ఉంది ఆ బొమ్మ. దాన్ని అటూ ఇటూ తిప్పి చూసి, తృప్తిగా నవ్వుకున్నాడు. ఆ తర్వాత తన డ్రాయరు సొరుగులో ఉన్న కొన్ని గుండుసూదులు తెచ్చి, ఒక్కొక్క సూదినీ ఆ బొమ్మకి గుచ్చడం మొదలెట్టేడు. ఆ పని చేస్తున్నంతసేపూ అతనికి మహానందం కలుగుతోంది.
“రోజూ నీ సూదుల్లాంటి తిట్లతో, మెమోలతో నన్ను సరిగ్గా ఇలాగే హింసిస్తున్నావు కదూ.! నేనేమీ చెయ్యలేననుకున్నావు కదూ, ఇదిగో చూడు” అంటూ ఇంకో సూదిని ఆ బొమ్మకి గుచ్చాడు. తర్వాత ఆ బొమ్మని నేలమీద అటూఇటూ దొర్లించాడు. “అహహహ., బాధతో ఎలా కొట్టుకుంటున్నాడో చూడు గాడిదకొడుకు! బాగా అయింది. నన్ను రోజూ చంపుతున్నాడు. ఏడిపిస్తున్నాడు. రాచి రంపాన పెడ్తున్నాడు. ఈ రోజుతో నీకు మూడిందిరా.. ఈ రోజు నిన్ను చంపేస్తాను. మామూలుగా చంపను– హింసించి, ఏడిపించి, చిత్రవధ చేసి మరీ చంపుతాను. నీమీద ప్రతీకారం తీర్చుకోలేననుకుంటున్నావు కదూ?” ఇలా కొంతసేపు ఆ బొమ్మతో మాట్లాడేడు.

   గురవయ్య ఆ బొమ్మను నేలమీద దొర్లించాడు. కాళ్ళతో తొక్కాడు. కాస్సేపుపోయాకా ఆ బొమ్మ చెయ్యి పట్టుకుని, నాడి చూస్తున్నట్టు చూశాడు. వెంటనే, “చచ్చాడు.. మా ఆఫీసర్ చచ్చాడు! బాధకి తట్టుకోలేక గుండె ఆగి చచ్చిపోయాడు. వీడ్ని ఇప్పుడిక దహనం చెయ్యాలి.” అని, బొమ్మని దొడ్లోకి తీసుకుపోయాడు. కొన్ని పుల్లల్ని ఏరి చితిలా తయారు చేశాడు. దానిమీద కిరోసిన్ పోసి, అగ్గిపుల్ల గీసి అంటించాడు. గుప్పుమని మంట లేచింది. అకస్మాత్తుగా గురవయ్య ఏడవటం మొదలుపెట్టేడు.
“పాపం… మా ఆఫీసర్ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. రోజూ నన్ను తిడుతున్నాడని, పని చెయ్యడం చేతకాదని నానా మాటలూ అంటున్నాడని, నేనే చంపేశాను. అయ్యో..! అతను పెళ్లాం పిల్లలు ఎంత ఏడుస్తున్నారో..!” అంటూ ఆ మంట ఆరిపోయేదాకా గురవయ్య ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత వచ్చి పక్కమీద పడుకుని నిద్రపోయాడు.

   గురవయ్య రెవెన్యూ ఆఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. అతను చిన్ననాటి నుండీ వట్టి మొద్దబ్బాయిగా పేరు పొందాడు. ఎప్పుడూ నిద్రమత్తు మొహంతో తిరుగుతూ, ఏ పనీ చేసేవాడు కాడు. అతను పుట్టిన నాలుగైదు రోజులకే అతని తల్లి చనిపోయింది. పుట్టగానే తల్లిని మింగేశాడని అందరూ అతణ్ణి అసహ్యించుకునే వారు. గురవయ్య తండ్రి తమ కులవృత్తి అయిన వడ్రంగం చేసుకుంటూ బతికేవాడు. అతని సంపాదనతో ఏరోజుకారోజు గడవడమే కష్టంగా ఉండేది. అందుకని తన కొడుక్కి నాలుగక్షరాలు నేర్పించి, ఏదన్నా ఉద్యోగంలో చేర్పించాలని అతను కలలు కనేవాడు. కానీ గురవయ్యకి ఎనిమిదేళ్ళ వరకూ ఓనమాలే రాలేదు. బళ్ళోకెళ్ళి ఓ మూల పడుకుని చక్కగా నిద్రపోయేవాడు. ఎన్నోసార్లు గురవయ్యను తండ్రి గొడ్డును బాదినట్టు బాదేవాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక గురవయ్య , ‘మా నాన్న చచ్చిపోతే నాకీ దెబ్బలు తప్పేవి’ అనుకునేవాడు. గురవయ్యకి పదేళ్లు వచ్చేసరికి– అంటే అతను రెండవ తరగతిలో ఉండగా, అతని తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు. ‘నేను మనసులో మా నాన్న చచ్చిపోవాలని అనేకసార్లు కోరుకున్నాను కనకనే అతను చనిపోయాడు’ అని గురవయ్య నమ్మేవాడు.

   ఆ తర్వాత గురవయ్యని వాళ్ల మేనమామ తన ఊరు తీసుకెళ్ళి, స్కూల్లో చదివించాడు. ఒక్కొక్క తరగతిలో రెండేళ్లు గడుపుతూ, మొత్తానికి మెట్రిక్యులేషన్ అయిందనిపించాడు గురవయ్య! ఆ మేనమామే నానా తంటాలూపడి గురవయ్యకి గుమాస్తా ఉద్యోగం సంపాదించి, ఆనక తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. గురవయ్య రోజూ ఆఫీసుకి వెళ్లి రావడం తప్ప అక్కడ పనేమీ చేసేవాడు కాదు. ఆఫీసుకి రాగానే టేబుల్ మీద తల పెట్టుకుని, పైన ఫ్యాన్ వేసుకుని, చక్కగా నిద్ర పోయేవాడు. టైమవగానే ఎవరో లేపితే లేచి ఇంటికొచ్చేవాడు. తన సెక్షన్ కి సంబంధించిన ఫైళ్లుకానీ, మరే ఇతర వివరాలుగానీ అతనికి తెలియవు. వాటితో అవసరమున్నప్పుడు అతని పక్క క్లర్కులు వచ్చి వాటిని చూసుకునేవాళ్లు! గురవయ్య అదృష్టం బాగుండి అతను ఉద్యోగంలో చేరేకా వచ్చిన ఆఫీసర్లు అతి మంచివాళ్ళు. తమ దగ్గిరకొచ్చిన కాగితాలమీద టకటకా సంతకాలు పెట్టేసేవారు తప్ప ఆఫీసులో ఏం జరుగుతోందని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. కాకపోతే గురవయ్య సెక్షన్ సూపర్నెంట్ మొదట్లో గురవయ్యని క్రమశిక్షణలో పెట్టి, కాస్త పని చెప్పడానికి ప్రయత్నించాడు కానీ, గురవయ్య చేత పని చేయించడం స్టాలిన్లకూ, హిట్లర్లకూ కూడా సాధ్యం కాదని తెల్సుకుని ఆ ప్రయత్నం మానుకున్నాడు.

   గురవయ్య ఖర్మం కాలి ఈమధ్యనే కృష్ణమూర్తి అని కొత్త ఆఫీసరు ఒకాయన వచ్చాడు. అతను మహా నిరంకుశుడు. అసమర్థతనీ, సోమరి తనాన్నీ ఏమాత్రం సహించడు. అతనికి ఏ పనైనా చకచకా జరిగిపోవాలి. ఆఫీసుకు వచ్చేవాళ్ళు ఎక్కువసేపు నిల్చోకూడదు. తన ఆఫీసులో లంచగొండతనం ఉండటానికి వీల్లేదు.
“మీకు ఎన్నిరకాల సౌకర్యాలైనా కల్పిస్తాను. పని మాత్రం చక్కగా చెయ్యండి. పని అస్సలు మురగబెట్టద్దు. తొందరగా పని పూర్తిచేసుకుని, సరిగ్గా టైంకి వెళ్ళిపొండి. బద్ధకస్తుల్ని నేను సహించను” అని మీటింగు పెట్టి అందరికీ చెప్పేడు కృష్ణమూర్తి. అతను వచ్చాకా ఆఫీసు స్వరూపమే మారిపోయింది. కృష్ణమూర్తి ఎంతటి స్ట్రిక్ట్ ఆఫీసరైనా, హృదయం లేనివాడు మాత్రం కాదు. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడేవాడు. వాళ్ళ కష్టనిష్టూరాల్ని, కుటుంబ సమస్యలన్నీ తెలుసుకునేవాడు. సాధ్యమైనంత సహాయం చేసేవాడు. పనిలో లోపం జరిగితే మాత్రం క్షమించేవాడు కాదు.

   ఎంత చెప్పినా గురవయ్యకి బుర్రకెక్కలేదు. ‘నిద్రని ఆపుకోవయ్యా’ అని తోడి గుమాస్తాలు ఎన్నిసార్లు చెప్పినా అతనికి నిద్ర ఆగలేదు. చక్కగా టేబుల్ మీద తలపెట్టుకుని నిద్రపోతూ కృష్ణమూర్తికి కనిపించాడు. వెంటనే అతన్ని కృష్ణమూర్తి తన రూంకి పిలిపించాడు. “మళ్లీ నాకు ఆఫీసులో నిద్రపోతూ కనిపించావో, నువ్వింక మీ ఇంటికి పోయే నిద్రపోవచ్చు. ఇక్కడికి రావక్కర్లేదు..” అని హెచ్చరించాడు. గురవయ్యలో చలనం లేదు. మొహంలో నిద్రమత్తు వదల్లేదు. “అంటే అర్థమైందా?” అన్నాడు కృష్ణమూర్తి. గురవయ్య అడ్డంగా తలతిప్పేడు “అంటే.. నీకు ఊస్టింగ్ ఆర్డర్ చేతికిస్తాను. సరేగానీ… వెళ్ళి నీ సెక్షన్ ఫైల్స్ అన్నీ తీసుకురా.. నేనోసారి చూస్తాను” అన్నాడు కృష్ణమూర్తి. గురవయ్య వణికిపోయాడు. అతని ఫైల్స్ ఏమిటో, అతనికే తెలియదు. నిద్రలో నడిచినట్టుగా వెళ్ళి, తన టేబుల్ దగ్గరున్న ఫైల్స్ ని చూపెట్టాడు. వాటి రూపం చూసి కృష్ణమూర్తి మండిపడ్డాడు.
“నీకెవడయ్యా ఉద్యోగం ఇచ్చింది. నీ అంత పనికిమాలినవాణ్ణి నేనెక్కడా చూళ్లేదు. నీ వర్క్ గురించి నీకు ఎ బి సి డిలు కూడా తెలియనట్టుందే.. ఏం చేస్తున్నావయ్యా?” అని విసుక్కుంటూ, సూపరింటెండెంట్ ని పిలిచాడు. అతను అసలు సంగతి చెప్పేడు. “అవసరమున్నప్పుడల్లా అతని పని మేమే చూస్తున్నామండి. అతనికేమీ తెలియదండి” అన్నాడు. “ఇకనుండి అలా జరగడానికి వీల్లేదు. వెంటనే ఇతని సెక్షన్ మార్పించు. డిస్పాచ్ సెక్షన్లో ఏడవమను” అన్నాడు కృష్ణమూర్తి.

   గురవయ్యను డిస్పాచ్ సెక్షనుకి మార్చేశారు. అక్కడికొచ్చాకా గురవయ్య కష్టాలు ఎక్కువైపోయాయి. గుట్టలకి గుట్టలు లెటర్స్ పడి ఉండడంతో, అతనికి ఏ రోజుకారోజు డిస్పాచ్ చెయ్యడం సాధ్యమయ్యేదికాదు. ఒకరోజున కృష్ణమూర్తి ఆ గుట్టలు చూడనే చూశాడు. గురవయ్యను ఎడాపెడా తిట్టి, ఓ వారం సస్పెండ్ చేశాడు. గురవయ్యకి ఆ ఆఫీసులో ఆత్మీయులంటూ ఎవరూ లేరు చెప్పుకుందామన్నా…! అప్పటినుంచీ గురవయ్య మనసులో చిన్న సంచలనం మొదలైంది. తన తండ్రి కొట్టిన దెబ్బలు జ్ఞాపకానికొచ్చాయి. తన తండ్రిలాగే ఈ ఆఫీసర్ కూడా వెంటనే చనిపోతే బాగుండును అన్న కోరిక అతనిలో కలిగింది. ఇలా ఉండగా, మరో సంఘటన జరిగింది. తమ జిల్లాలో ఆ సంవత్సరం వర్షాలు ఏమాత్రమూ కురవని కారణంగా తలెత్తిన కరువు పరిస్థితుల్ని గూర్చిన ఓ స్పెషల్ రిపోర్టు అత్యవసరంగా పంపవలసి వచ్చింది. కృష్ణమూర్తి తానే స్వయంగా తయారుచేసి, దాన్ని వెంటనే పంపేయాలని డిస్పాచ్ సెక్షన్ కి నోట్ పెట్టాడు. గురవయ్య అది గమనించ లేదు. ఆ రిపోర్టు ఎక్కడో అడుగున పడిపోయింది.
‘మీదగ్గర్నుంచి మాకింకా రిపోర్టు రాలేదు. వెంటనే పంపించాల్సింది’ అని పైనుండి కాగితం రావడంతో, కృష్ణమూర్తి గురవయ్యని పిలిచి ఆ రిపోర్టు గురించి అడిగాడు. గురవయ్య తెల్లమొహం వేశాడు. కృష్ణమూర్తి తనే వెళ్ళి డిస్పాచ్ సెక్షన్ లో వెతికితే, అడుగునెక్కడో అది దొరికింది. కృష్ణమూర్తి కోపానికి హద్దులేకపోయింది. “రోగ్….స్టుపిడ్! ఇడియట్…యూస్ లెస్ ఫెలో… నిన్ను వెంటనే డిస్మిస్ చేసేయ్యాలి. పో…నీ నిద్రమత్తు మొహాన్ని నాకు చూపించకు” అని తిట్టి, ఈ సారి గురవయ్యని పదిహేను రోజులపాటు సస్పెండ్ చేశాడు.

   అప్పట్నుంచీ గురవయ్యకి తన ఆఫీసరు చచ్చిపోతే బాగుండుననే కోరిక విజృంభించసాగింది. అతను చావకపోతే తనైనా చంపేయాలని రకరకాల పథకాలు వెయ్యడం మొదలుపెట్టేడు. చివరకి ఈ పథకాన్ని ఇవాళ అమలు పరిచాడు. ఆఫీసరు బొమ్మను చేసి, దాన్ని చిత్రవధ చేసి, చంపి… అంత్యక్రియలు కూడా చేసేసేడు. ఆ రోజు నిద్రలో అతనికి ఓ కలవచ్చింది. పోలీసులు వచ్చి కృష్ణమూర్తిని చంపినందుకు అతన్ని అరెస్టు చేసినట్టు, కోర్టులో జడ్జిగారు అతనికి ఉరిశిక్ష వేసినట్టు వచ్చింది! భయంతో లేచి కూచున్నాడు. ఆ మర్నాడు ఉదయం ఆఫీసుకి వెళ్లాలంటే గురవయ్యకి భయం వేసింది. తనని పోలీసులు పట్టుకుని జైల్లో పెడతారేమో అని! కానీ అప్పుడే ఈ విషయం ఎవరికీ తెలిసుండదులే అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

   కృష్ణమూర్తి మామూలుగానే ఆఫీసుకి వచ్చాడు. అయితే తను చూస్తున్నది అసలు కృష్ణమూర్తిని కాదు. దయ్యం రూపంలో అతను ఇలా వచ్చాడు! అని అనుకుంటున్నాడు గురవయ్య. సమయం గడుస్తోంది… మధ్యాహ్నమైంది. ఇంతలో ఆఫీసులో పెద్ద కలకలం..!
“ఏమైంది?” అని ఓ బంట్రోతుని అడిగాడు గురవయ్య. “ఆఫీసరుగారికి గుండెపోటు వచ్చిందట!” అన్నాడు బంట్రోతు.
అందరూ ఆఫీసరుగారి గది దగ్గిరకి పరిగెడుతున్నారు గురవయ్య కూడా నెమ్మదిగా అక్కడికి చేరుకున్నాడు. కృష్ణమూర్తి విపరీతంగా బాధపడిపోతున్నాడు. అతన్నెవరో సూదులతో గుచ్చుతున్నట్టుగా విలవిలలాడిపోతున్నాడు. గురవయ్య కళ్ళు వెలిగాయి. ఈ దృశ్యం తను ఇదివరకే చూసినట్టు సంతోషించాడు. ఇంతలో డాక్టరు వచ్చాడు.
కృష్ణమూర్తిని పరీక్ష చేసి, ” ఈయన్ని వెంటనే హాస్పిటల్లో చేర్చాలి” అన్నాడు. కానీ కృష్ణమూర్తిని ఆసుపత్రిలో చేర్చేలోపే అతను ఆఖరి శ్వాస వదిలాడు. ఆఫీసులో అందరూ పసిపిల్లల్లా ఏడుస్తున్నారు. గురవయ్యలో మాత్రం చలనం లేదు.

   అందరూ కలిసి కృష్ణమూర్తి శవాన్ని వాళ్ల ఇంటికి చేర్చారు. అందరితో పాటు గురవయ్య కూడా అక్కడికి వెళ్ళేడు. కృష్ణమూర్తి భార్య ఈ వార్త వినగానే మూర్ఛపడిపోయింది. అతని ముగ్గురు కొడుకులూ, ఇద్దరు కూతుళ్లూ తండ్రిమీద పడి, గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. గురవయ్య కదిలిపోయాడు. కృష్ణమూర్తి భార్యా పిల్లల్ని చూడగానే హృదయం ద్రవించిపోయింది. ‘కృష్ణమూర్తి మంచివాడు, సమర్థుడు.. తనే చేతకానివాడు! అందుకే తనని మందలించాడు. అంతమాత్రాన తను అతన్ని హత్య చెయ్యాలా?’ ఇలా ఆలోచించడం మొదలుపెట్టాడు గురవయ్య. దహనకాండ అదీ ముగిశాకా బాగా పొద్దుపోయాకా ఇల్లు చేరుకున్నాడు గురవయ్య. ‘ఈరోజో రేపో తనకోసం పోలీసులు వచ్చేస్తారు. తప్పదు’ అని ఏ మాత్రం ఏ చప్పుడైనా భయంతో వణికి పోతున్నాడు. ‘తనని అరెస్టు చేస్తారు…ఉరిశిక్ష వేస్తారు! తను చనిపోతే తనకోసం ఏడ్చే వాళ్ళెవ్వరూ లేరు. తనలాంటి ఎందుకూ కొరగానివాడితో వేెగలేనని తనని వదిలేసి తన భార్య ఎప్పుడో ఆమె దారి ఆమె చూసుకుంది. పిల్లా జెల్లా ఎవ్వరూ లేరు. పాపం, కృష్ణమూర్తి..! పదికాలాల పాటు బతకవలసినవాడు. అతనిమీద ఆధారపడి పెద్ద కుటుంబం ఉంది. భార్యకి ముప్ఫై ఏళ్ళు దాటి ఉండవు. తను చాలా ఘోరమే చేశాడు. క్షమించరాని నేరం చేశాడు’ ఇలా సాగిపోతున్నాయి గురవయ్య ఆలోచనలు. ఎప్పుడూ నిద్రపోయే అతనికి రాత్రుళ్లు కూడా నిద్ర పట్టడం లేదు. కష్టంమీద నిద్రపట్టినా భయంకరమైన కలలొచ్చేవి. కృష్ణమూర్తి, పోలీసులు, లాయర్లు, కోర్టులు, ఉరితాడు ఇలా.!

   వారం రోజులు గడిచాయి. రోజురోజుకీ గురవయ్య క్రుంగి కృశించి పోసాగాడు. అతనికి అన్నం రుచించడంలేదు, నిద్రపట్టడం లేదు. ఓ రోజు ఆఫీసులో తన పక్కనే కూర్చున్న క్లర్కు సత్యనారాయణతో, “మీకో రహస్యం చెప్పాలి.. అలా క్యాంటీన్ కి వెళ్దాం వస్తారా?” అన్నాడు గురవయ్య. రెండేళ్ళుగా తన పక్కనే కూర్చుని పనిచేస్తున్నా, ఎప్పుడూ మాట్లాడని గురవయ్య తనకి ఏదో రహస్యం చెబుతాననడం వింతగా అనిపించింది సత్యనారాయణకి. “పదండి” అంటూ లేచాడతను. ఇద్దరూ క్యాంటీన్ కి వెళ్ళేరు. నిద్రలేక పీక్కుపోయిన కళ్ళతో, తైల సంస్కారం లేని జుట్టుతో భయంకరంగా ఉన్న గురవయ్య మెల్లగా సత్యనారాయణ చెయ్యి పట్టుకుని, “మన ఆఫీసర్ కృష్ణమూర్తిని నేనే చంపేశాను…హత్య చేశాను!” అన్నాడు గుసగుసగా. క్షణంసేపు సత్యనారాయణ టీ తాగడం మానేసి, గురవయ్యకేసి నోరు తెరుచుకుని చూశాడు.

   “మీరు నమ్మటం లేదు కదూ! నిజం మన ఆఫీసరు గార్ని నేనే చంపేశాను. చాలా రహస్యంగా చేసేశాను. పోలీసులక్కూడా ఇంకా తెలియదు” అన్నాడు గురవయ్య.
“గురవయ్యా! నీకు పిచ్చెక్కలేదు కదా! యేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా?” అన్నాడు సత్యనారాయణ. “మన ఆఫీసర్ని ఎవరూ చంపలేదు. గుండెపోటుతో ఆయనే సహజంగా చనిపోయారు. ఆయన చాలాకాలంగా గుండెపోటుతో బాధ పడుతున్నారు. నువ్వు చంపటం ఏమిటీ? నాన్సెన్స్…. నాతో అన్నావుగానీ, ఇంకెవరితోనూ అనకు. నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు” అని గట్టిగా చెప్పి, టీ తాగి వెళ్ళిపోయాడు సత్యనారాయణ. గురవయ్య చాలాసేపు అలాగే కూర్చున్నాడు. ‘పూర్ ఫెలో…. సత్యనారాయణ! అందరిలాగే తనూ మోసపోయాడు’ అనుకున్నాడు గురవయ్య.

   గురవయ్యలో రగులుతున్న అశాంతి అంతకంతకూ దావానలంలా మండుతూ, అతన్ని దహించివేయసాగింది. నిరంతరం అతనికి గుండెల్లో ఎవరో సూదులతో గుచ్చుతున్నంత బాధ, తిండి, నిద్ర అతని దరిదాపులకు రాకుండా పోయాయి. ఇలా ఓ పదిహేను రోజులు గడిచాయి. ఓ రోజు రాత్రి బాగా పొద్దుపోయాకా అతను అకస్మాత్తుగా పక్కమీంచి లేచి, నిద్రలో నడుస్తున్నవాడిలా పోయి, పోలీసు స్టేషన్ చేరుకున్నాడు. ఎస్. ఐ. తో మాట్లాడాలన్నాడు. కానిస్టేబుల్ అతన్ని ఎస్. ఐ. దగ్గరకి తీసుకెళ్లాడు. ఎస్. ఐ. అతన్ని ఎగాదిగా చూసి, “చెప్పండి” అన్నాడు. గురవయ్య వాలకం భయంకరంగా ఉంది!
“మీరైనా నేను చెప్పేది నమ్మాలి సార్. అందరిలాగే మీరూ నన్ను తీసిపారేసి ఓ పిచ్చి వాడికింద జమకట్టకండి సార్!” అన్నాడు గురవయ్య ఎస్. ఐ. తో దీనంగా.
“ముందు విషయమేమిటో చెప్పవయ్యా” అన్నాడు ఎస్. ఐ.
“సార్! నేనో వ్యక్తిని హత్య చేశాను. మీరు నన్ను వెంటనే అరెస్టు చెయ్యకపోతే నేను బతకలేను” అన్నాడు గురవయ్య.
ఎస్. ఐ. కి దెబ్బకి నిద్రమత్తు వదిలిపోయింది. సద్దుకుని కూర్చుంటూ, ” ఏమిటీ? ఎవర్ని నువ్వు హత్య చేశావు?” అన్నాడు.
“నేను….నేను…మా ఆఫీసర్ కృష్ణమూర్తి గార్ని చంపేశాను సార్! ఇంతకాలం దొరక్కుండా తప్పించుకున్నాను. కానీ నా అంతట నేనే పోలీసులకు లొంగిపోవటం మంచిదని ఇలా వచ్చేశాను సార్!” అన్నాడు గురవయ్య.
“ఎక్కడ హత్య చేశావు? ఎప్పుడు చేశావు? ఈ మధ్య ఈ ఊళ్ళో హత్యలేవీ జరగలేదే!” అన్నాడు ఎస్. ఐ. గురవయ్యని పిచ్చివాడిలా చూస్తూ.
“జరక్కపోవటమేమిటి? పదిహేను రోజుల క్రితం మా రెవెన్యూ అధికారి కృష్ణమూర్తిగార్ని నేను హత్య చెయ్యలేదూ?” అన్నాడు గురవయ్య.
“రెవెన్యూ ఆఫీసర్ కృష్ణమూర్తా? అతను హార్ట్ఎటాక్ తో చనిపోయాడు గదయ్యా?” అన్నాడు ఇన్స్పెక్టర్.
“అక్కడే మీరు పొరబడుతున్నారు సార్! అతన్ని నేను నా చేతులతో చంపేశాను. అతనిమీద కిరోసిన్ పోసి అంటించేశాను. పాపం..! చాలా ఘోరంగా చచ్చాడు. ఈ విషయం ఎవరికీ తెలీదు. ఓ పోలీసు ఆఫీసరై యుండి మీరుకూడా ఈమాత్రం తెలుసుకోపోతే ఎలా సార్?” అన్నాడు గురవయ్య ఎస్. ఐ. అమాయకత్వానికి జాలి పడుతున్నవాడిలా. ఇన్సపెక్టర్ కి ఒళ్ళు మండిపోయింది. “ఏయ్..మిస్టర్! నువ్వేం చేస్తున్నావు? వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్?” అన్నాడు గట్టిగా.
“నేను రెవెన్యూ ఆఫీసులో క్లర్కుగా….” అని గురవయ్య అంటూండగానే, “ఆర్ యూ మెంటల్లీ ఆల్ రైట్..? నీ బుర్ర సరిగ్గా పనిచేస్తోందా అసలు?.. లేకపోతే ఇదంతా ఫన్ కోసమా?” అరిచాడు ఎస్. ఐ.
“అదేమిటి సార్.. అలా అంటారు?” అని ఏదో నసుగుతున్నాడు గురవయ్య.
“నువ్వు మళ్ళీ ఇలా వాగేవంటే , నిన్ను పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తాను. జాగ్రత్త! ఇది పోలీసు స్టేషన్ అనుకుంటున్నావా..! లేక నీ ఇల్లనుకున్నావా? మాతోనే వెటకారాలా? వెళ్లింక. ఏయ్.. కానిస్టేబుల్, ఇతన్ని బయటకి పంపించెయ్” అన్నాడు ఎస్. ఐ. గురవయ్య మాట్లాడకుండా బయటికొచ్చేశాడు.

   రెండుమూడు రోజుల తర్వాత తనింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గురవయ్య శవాన్ని చూసి, ఇదే సబ్ ఇన్ స్పెక్టర్ షాక్ తిన్నాడు! గురవయ్య చెప్పిన విషయాన్ని కొంచెం సీరియస్ గా తీసుకుని, అతణ్ణి ఒక కంట కనిపెట్టి ఉంటే.., ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో అనుకున్నారు – ఆ సబ్ ఇన్ స్పెక్టరూ, గుమాస్తా సత్యనారాయణాను.

 –**–**–

   మానసిక విశ్లేషణతో కూడిన కథలు రాయడంలో అంపశయ్య నవీన్ ది అందెవేసిన చెయ్యి. స్వతహాగా అధ్యాపకుడు అయినందువల్ల మనుషుల సైకాలజీ చదవడం ఆయన వృత్తిలో ఒక భాగమైపోయింది. అంతేకాకుండా రచయితకూడా అవడంచేత జనులని పరిశీలించడం, వారి మనస్తత్వాలను విశ్లేషించడం నవీన్ కి ఒక అలవాటుగా మారింది. మనకి బైటికి కనిపించే మనుషులందర్నీ, వాళ్ల బాహ్య రూపాల్ని బట్టి వారి వారి అంతరంగాల్ని అంచనా వెయ్యడం సాధ్యంకాదు. మానసిక దృఢత్వం అందరికీ ఒకేలా ఉండదు. అనేక రకాల సంశయాల తోటి, భయసందేహాల తోటి, శంకలతోటి, అర్థంకాని మానసిక సంక్లిష్టతల తోటీ ఎంతోమంది సతమతమౌతూంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోకుండా, తప్పించుకుందామని ప్రయత్నించడం, లేదా ఎవరివల్ల ఆ సమస్య వచ్చిందో వాళ్ళకేదైనా ప్రమాదం జరగాలని కోరుకోవడం సాధారణంగా వాళ్ళు చేసే పని.!

   ఇక్కడ గురవయ్య చిత్రమైన మనిషి! చిన్నప్పుడే తల్లి పోయింది. ఆ ప్రేమ భావం లేకుండా పెరిగాడు. తండ్రి ఇతన్ని చదివించి తనలా కష్టపడకుండా చేద్దామని ప్రయత్నించాడు. కానీ గురవయ్యకి చదువబ్బలేదు సరికదా. పరమ బద్ధకస్తుడు, సోమరిపోతులా తయారయ్యేడు. ఆ కారణంగా తండ్రిచేత దెబ్బలు తినేవాడు. దెబ్బలు తట్టుకోలేని గురవయ్య తండ్రి చచ్చిపోతే.. తనకీ దెబ్బలు తప్పుతాయని తండ్రి చావుని కోరుకున్నాడు. తండ్రి పోయినందుకు అతను ఏమీ విచారించలేదు. ఇక పెద్దయ్యాక ఆఫీసులోనూ అదే సోమరితనం, ఒకటే నిద్ర! ప్రభుత్వోద్యోగం కాబట్టి అలా కొన్నాళ్ళు సాగిపోయింది. అయితే స్ట్రిక్ట్ ఆఫీసరు అయిన కృష్ణమూర్తి ఊరుకోలేదు. గురవయ్యని సస్పెండ్ చేశాడు.. ఉద్యోగం తీసేస్తామని హెచ్చరించాడు. దాంతో గురవయ్య ఆఫీసరు చచ్చిపోవాలని కోరుకున్నాడు. అతని బొమ్మనిచేసి, దాన్ని సూదులతో గుచ్చి “హత్య” చేశాడు.

   కాకతాళీయంగా కృష్ణమూర్తి గుండెపోటుతో మరణించాడు. తనే అతన్ని చంపేశానని గురవయ్య గట్టిగా నమ్మేడు. ముందు సంతోషించాడు. కానీ కృష్ణమూర్తి ఇంటి పరిస్థితి చూసి గురవయ్య చలించిపోయాడు. అతనిలో తీవ్ర ఆందోళన మొదలైంది. అంతులేని అంతర్మథనంతో నిద్రా, తిండీ లేకుండా అయిపోయి, తనకి శిక్ష పడాలని కోరుకున్నాడు. కానీ తనే కృష్ణమూర్తిని ‘హత్య’ చేసినట్టు ఎవరికి చెప్పినా నమ్మలేదు సరికదా.. ఇతణ్ణి పిచ్చివాడికింద జమకట్టేరు. చివరికి. తట్టుకోలేని ఆత్మసంఘర్షణకీ, ఆత్మన్యూనతాభావానికీ లోనై, ఆ అపరాధభావం నుంచి బయటపడలేక.. గురవయ్య తను చేశాననుకుంటున్న ‘హత్య’ అనే నేరానికి ఉరిశిక్ష విధించుకున్నాడు.

–సి.యస్.

5 Comments Add yours

  1. V.V.Subba Raju says:

    మీప్రయత్నానికి అభినందనలు.
    పత్రికలు మంచి కధలు అందజేయడంలేదు.
    చదవలనేకోరిక చచ్చిపోతున్న తరుణంలో
    మీరు ఆదుకున్నారు.ఈకథలు యిక చదువుతాను.
    ధన్యవాదాలు
    వి.వి.సుబ్బరాజు ,కోలంక

    Like

  2. “బాణామతి” గురించి తెలియదు కాని, విన్నాను.!
    మా ప్రాంతంలో దీనినే “చేతబడి” అని కూడా అంటారు.!
    కాని ఇది చాలా ప్రమాదకరమైన ప్రక్రియ.!
    దీని గురించి తెలుసుకున్నా, విన్నా, జరిగినవి చూసినా ఒళ్ళు గగుర్పొడుస్తుంది.!
    మనలోని ఆలోచనలే మన మంచి, చెడులకు కారణాలు.!
    అవే మనల్ని మార్చే సాధనాలు.!
    గురవయ్య ఆలోచనా పరిధి మారింది కాబట్టే ప్రతిఫలం కూడా మారింది.!
    మంచి కథను పరిచయం చేసినందుకు గురువుగారికి ధన్యవాదములు..!!

    Like

  3. V.V.Krishnarao says:

    మాయదారి మనసు చేయు మాయలెరుగ
    నరుని వశమె? స్వర్గ-నరకములకు
    వంతెనలను కట్టు భావనాశక్తికి
    మనసె మూలమౌను జనులు కనగ!

    Like

  4. ఆకొండి సూర్యనారాయణమూర్తి says:

    అంపశయ్య చదివాను. నవీన్ 55,60ఏళ్ళ వారు అనుకున్నా. ఫోటో చూసి ఆశ్చర్యపోయా. మానసిక విశ్లేషనకధ. డిస్ఆర్డర్ సైకిక్.రాత్రి కల గని ఉదయం ఆత్మహత్య చేసుకొంటారు. బాణమతిపై విశ్వనాధవారు నవల వ్రాసారు. ఇదికూడా బాణమతిపై సంబందించి నదే.కృష్ణమూర్తి ని హత్య చేయడం గురవయ్యకు కావాలి. దాన్ని,దాని పర్యవసాన్ని జీర్ణించుకోలేక మానసిక వత్తిడికి లోనైన వాడు ఇదే పనిచేసుకుంటాడు. ఈ పరిస్థితికి ఇంతకన్నా మార్గం లేదు.మార్పుకోసం రచయితలు ఎదో తపన పడతారు. కానీ ఈ జబ్బు,వారికి చిన్నప్పుడే తల్లితండ్రులు పోవడం వల్ల వస్తుంది. గమనించండి పిల్లలు పెన్ రీఫైల్స్,రబ్బర్లు పైన సూది గుచ్చి నవ్వుతుంటారు.తలవెంట్రుకపీకి సూదికి చూడతారు. తూనీగలను పట్టి గుచ్చి వంట రిగా పైశాచిక,వికృత ఆనందం పొందుతారు. అలాంటి పిల్లల్ని జాగ్రత్తగా మార్చాలి. ఇలాంటికధలు ఉన్నతస్థాయి పాఠకులు కోసం. కధ సగం చదవగానే గురవయ్య చచ్చిపోతాడాని తెలిసిపోతుంది. కానీ ఎలానేది ఉత్కంఠ. సి.ఎస్ వివిధ రచయితలతో పాటు వైవిధ్య రచనలను పరిచయం లేదా జ్ఞాపకం చేస్తున్నారు. నవీనమైన కధ నిచ్చి నందుకు ధన్యవాదాలు

    Like

  5. DLSastry says:

    కొన్ని క్షుద్ర విద్యలు తో ఆ విధంగా చేయవచ్చు అనే మూఢనమ్మకం ఉంది… గురవయ్య అనుకో కుండా తాను చేసిన ది బాణామతి అయింది అనుకున్నా డేమో.. good story…thanks to CS Garu for providing this nice story..

    Like

Leave a reply to V.V.Subba Raju Cancel reply