కథన కుతూహలం 64

       ఈ పరిచయ పరంపరలో ఇంతకుముందు కొందరు రచయిత్రుల కథలను చదువుకున్నాం.  అందమైన ప్రేమ కథలతో పాటు,  మానవ సంబంధాల పైనా, స్త్రీలు ఎదుర్కొనే అనేకానేక సమస్యల పైనా,  అలాగే సామాజిక అంశాలపైనా స్త్రీలు అద్భుతమైన కథలు, నవలలూ రాశారు. అయితే , తాత్వికతతోనూ, మానసిక విశ్లేషణతోనూ కూడుకొన్న విషయాలతో కథలు రాసిన రచయిత్రులు మనకి తక్కువగానే ఉన్నారు. అలాంటి రచనలు చేసి పాఠకులను ఒప్పించిన రచయిత్రి శ్రీమతి జలంధర.

మద్రాసులో డాక్టరు గాలి బాల సుందరరావు గారని– ప్రముఖ నటులు, రంగస్థల పోషకులు, రచయిత ఒకాయన ఉండేవారు. వైద్యులుగా కన్నా  నాటక రంగంలో ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించారు. అదిగో….వారి కుమార్తె ఈ లక్ష్మీ కామేశ్వరీ జలంధర.  ప్రసిద్ధ నటులు చంద్రమోహన్ ఈమె భర్త.  అలాగే తన సాహితీ సృజనతో లత సాహిత్యం‘ అని ముద్ర వేయించుకున్న  ప్రఖ్యాత రచయిత్రి  తెన్నేటి హేమలత  ఈమెకు అత్తయ్య అవుతుంది. 

           నిజజీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలను కథలుగా మలచి, తారసపడే వ్యక్తులను పాత్రలుగా చేసి ఈమె కథలు రాశారు. శ్రీమతి జలంధర తన రచనలకి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆమె నవల పున్నాగ పూలు మంచి గుర్తింపు పొందింది. ఇక కథల విషయానికి వస్తే , అగ్నిపుష్పం‘ , ‘ఉత్తరవాహిని‘ , ‘గడ్డిపూలు‘, ‘ ఎర్ర మందారాలు‘,  ‘దీప కళిక‘ , ‘ నర్తకి‘ , ‘ మిథ్యాబింబాలు‘, ‘ నల్ల బట్టలు మొదలైన అనేక కథలు  జలంధర గారు రాశారు. ఇప్పుడు వారి  “నీడ వెనుక నిజం” అనే కథను చూద్దాం. 

                సుధాకర్ కి చిన్నప్పట్నుంచీ కెమేరా అంటే పిచ్చి! కనిపించే అందాలన్నీ కెమేరాలో బంధించాలనీ, ఫోటోగ్రఫీలో మంచి పేరు తెచ్చుకోవాలనీ కోరిక. అయితే పరిస్థితులు అనుకూలించక అతను కెమేరాయే కొనుక్కోలేక పోయాడు.  ఇప్పుడు పాతికేళ్ల వాడయ్యాడు. బొంబాయిలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు.  ఈమధ్యే మంచి ఖరీదైన కెమేరా ఒకటి కొన్నాడు. నాలుగు రోజులు సెలవు చూసుకుని బొంబాయి మహానగరం నుంచి తమ ఊరైన సిరిపురం చేరాడు.  ఆరడుగుల అందమైన విగ్రహం, మంచి వర్చస్సు, ఉంగరాల జుట్టుతో ఉన్న సుధాకర్భుజాన కెమేరా తగిలించుకుని సిరిపురంలో దర్జాగా నడుస్తూ అక్కయ్య ఇంటికి నడుస్తున్నాడు.  నగర జీవితంతో విసిగిపోయిన అతనికి ఆకుపచ్చ చీరకట్టుకున్న అందగత్తెలాంటి ఆ ఊరిలో పాదం మోపగానే ఏదో తెలియని ఆనందం లోలో ఉరకలు వేసింది. 

          తను ఇచ్చిన చిక్కటి కాఫీ తాగుతూండగా , ” ఇన్ని వేలు పోసి ఇప్పుడిది కొనకపోతే ఏమిటిరా?” అని మెల్లిగా మందలించింది అక్కయ్య. సుధాకర్ నవ్వుతూ,   తనకి చిన్నప్పటినుంచీ ఉన్న కెమేరా , ఫోటోగ్రఫీ పిచ్చి గురించి మరోసారి చెప్పేడు.  స్వతంత్రుడు, సంపాదనాపరుడూ అయిన తమ్ముడ్ని మరేమీ అనలేకపోయిందామె. కాసేపయ్యాకా , ” సరే…మా ఫోటోలు తీయరా!  నాదీ బావగారిదీ కలిపి ఒక్క ఫోటో కూడా లేదు” అంది అక్కయ్య. “తప్పకుండా అక్కయ్యా!”  అని అక్కకీ, అలా అడిగిన చాలామందికి ప్రామిస్ లు చేశాడు సుధాకర్.  ఇంతలో అతని మామయ్య కూతురు అనూరాధ వచ్చింది. “నీ ఫోటోలు తీద్దామనే తెచ్చాను కెమేరా!” అన్నాడామెతో సుధాకర్.అనూరాధ ఏమీ మాట్లాడకుండా హాయిగా నవ్వేసింది. నీరెండలో తళుక్కున మెరిసిన ఆ నవ్వు, ఆమె ఎర్రరాయి ముక్కుపుడక  అతణ్ణి ముగ్ధుణ్ణి చేశాయి.  ‘ ఎలాగైనా ఈ అందం వేరు!’ అనుకున్నాడతను– బొంబాయిలో నీతా మెహతా గుర్తుకొచ్చి.   జడలో కనకాంబరాలు,ఏ మాత్రం మాచింగ్ లేకుండా కట్టుకున్న ఆకుపచ్చ పరికిణీ, నీలం రంగు ఓణీ, ఎర్రరంగు జాకెట్టు వేసుకుని నూతి దగ్గర్నుంచి నీళ్లు తీసుకువస్తున్న అనూను అలాగే ఫోటో తీశాడు సుధాకర్.  అలా అందంగా కనిపించిన ప్రతి మనిషినీ, దృశ్యాన్నీ ఫోటో తీస్తూ, ‘ తను ప్రతి ఏడూ చూసే ఈ ఊరిలో ఇన్ని అందాలున్నాయని కెమేరా పట్టుకుంటే కానీ అర్థం కాలేదే! ‘ అనుకున్నాడు.  పాలు తీసే పల్లెపడుచులు, రంగవల్లుల మధ్య బంతిపూల గొబ్బెమ్మలు,  తాటాకులతో చేసిన దేముడి రథం అన్నీ అందంగానే కనిపించాయి సుధాకర్ కి! 

          సుధాకర్ ఊరంతా తిరుగుతూ రకరకాల ఫోటోలు తీస్తున్నాడు. కొబ్బరిచెట్ల చాటున సూర్యాస్తమయం దగ్గరనుంచీ, చిన్నారిపాపల బోసినవ్వుల వరకూ ఎన్నో ఫోటోలు తీశాడు.  ‘ఫోటోగ్రఫీలో ప్రైజు వచ్చే దృశ్యాలు ఇక్కడెన్నో ఉన్నాయి’ అనుకుంటూ ఇల్లు జేరేసరికి, సగం నెరిసిన జుట్టుతో అడ్డదిడ్డంగా అలంకరించుకు వచ్చిన మునసబుగారి భార్య  “నా ఫోటోలు తీయవూ బాబూ!” అని వయ్యారంగా అడిగేసరికి మతిపోయి చూశాడతను.  “తప్పదు… మునసబుగారి భార్య!” అన్నట్టు సౌంజ్ఞ చేసిన అక్కయ్యని చూసి ,  “హతవిధీ” అనుకున్నాడు సుధాకర్. 

          ఊళ్ళో చాలామంది ఆడపిల్లలు సుధాకర్ ని అడిగి ఫోటోలు  తీయించుకున్నారు.  కానీ అతన్ని అడక్కుండా అతనిచేత ఫోటో తీయించుకోవాలని , సుధాకర్ కెమేరాతో మేడ మీదకు వచ్చినప్పుడల్లా అలంకరించుకుని,  అవతల మేడమీద బట్టలారేసే నెపంతోనో, ఒడియాలు తీసే నెపంతోనో వచ్చి , చూపుల బాణాలు విసిరే కరణంగారి కొత్తకోడల్ని చూస్తే నవ్వొచ్చేది సుధాకర్ కి.  “అబ్బ! ఏమిటో ఈ ఆడవాళ్ళు …..” అనుకునేవాడు .ఆరోజు సాయంత్రం సుధాకర్ ఏదో పనిలో ఉండగా వాకిలికి కట్టిన తెర సందులోంచి తొంగిచూస్తూ , “ఏమండీ?” అంటూ ఓ బొంగురు గొంతు వినపడింది.” ఎవరదీ?” అన్నాడు సుధాకర్ గుమ్మంవైపు చూస్తూ. “నేనేనండి ! శ్యామలని , నా ఫొటో  తీస్తారేమో అని అడుగుదామని వచ్చాను…..” అంటూ ఎదురుగా వచ్చి నిలబడింది ఆ వ్యక్తి. ఆ ఆకారాన్ని, ఆ గొంతుకను విని ఉలిక్కిపడ్డాడు సుధాకర్. నల్లటి చాయ, బక్కచిక్కిన శరీరం , లోతు బుగ్గలు , మెల్లకన్ను , బిగించి కట్టిన ఉంగరాల జుట్టు…. కరణంగారి అమ్మాయి శ్యామల.  “ఖర్మరా బాబూ!” అనుకున్నాడు సుధాకర్. ఇలాంటి పిల్ల కూడా ఫోటో తీయించుకుంటుందని అతని ఊహకి తట్టలేదు. “మాట్టాడరేమండీ….? నేను ఫోటోకి బావుండననేగా!  అందరూ అందంగా ఉంటారా ఎంటీ? నాకెన్నాళ్ళబట్టో ఫోటో తీయించుకోవాలని ఉంది. ‘నీ ముఖానికి అదొకటే తక్కువ’ అంటుంది మా అమ్మ.  ఏమండీ నేను బావుండనా?” అంది.  వెలిసిపోయిన వాయిలు ఓణీ వేలుకు ముడిపెడుతూ, మెల్లకన్నుతోనూ,భయంకరమైన గొంతుతోనూ మాట్లాడే శ్యామలని చూసి దడుసుకున్నంత పనైంది సుధాకర్ కి.  “అబ్బెబ్బే…. అదేంలేదు….తప్పకుండా తీస్తాను” అన్నాడతను తడబడుతూ. “ఎప్పుడు తీస్తారూ?” అంది సాగదీస్తూ. “ఎప్పుడేమిటి? ఎప్పుడైనా తీద్దాం…రేపు…లేకపోతే…” ఎవరైనా తనను చూస్తారేమో, నవ్వుతారేమో అనిపించి తత్తరపడ్డాడు సుధాకర్. “అయితే ఎల్లుండి తీయండి.  సాయంత్రం వస్తానేం…ఎల్లుండి మంచిరోజు. ఏం?”  అని అంటూన్న శ్యామలని చూసి నవ్వాలో ఏడవాలో అర్థంకాక, “అలాగే… అలాగే…” అంటూండగా అతని అక్క లోపలికి వచ్చింది. ‘హమ్మయ్య’ అనుకున్నాడు. “ఏమిటే శ్యామలా ఇలా వచ్చావు?”  అంది సుధాకర్ అక్క నవ్వుతూ. ఆ పిల్లని చూడగానే ఎవరికైనా నవ్వూ, వేళాకోళం అన్నీ అనిపిస్తాయి. “ఏంలేదు పిన్నిగారూ!  మీ సుధాకర్ ఫొటో తీస్తాడేమోనని..” అంటూ ఆపకుండా ఏదేదో శ్యామల మాట్లాడుతుంటే అక్కడినుంచి సుధాకర్ మెల్లగా దాటుకున్నాడు.  

           ఆ రాత్రి భోజనాల దగ్గర మెల్లగా , ” ఏమిటక్కయ్యా ! ఆ అమ్మాయి..?” అన్నాడు సుధాకర్. ఎంత మర్చిపోదామన్నా ఆ అమ్మాయే గుర్తుకొస్తోందతనికి. “అది ముదివయసులో పుట్టిన పిల్లరా!  ఎదుగూ బొదుగూ లేదు.  పైగా అనాకారి.  పోనీ కాస్త శుభ్రంగా ఉంటుందా అంటే…. ఆ తల్లికే లేదు శ్రద్ధ! వచ్చిన కొత్త కోడల్ని చూసి మురిసిపోవడమే సరిపోతుంది. సాయంత్రం అయ్యేసరికి అందరూ శుభ్రంగా తయారవుతారు కానీ ఈ పిల్లకి తలైనా దువ్వరు.  పోనీ ఏ టానిక్కన్నా ఇవ్వరాదా వదినా అని చాలాసార్లు చెప్పేను. వినిపించుకోరు. ఆస్తి ఉందిగా చాలు అనుకుంటున్నారు. పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టుంటుంది.  ఏం రాత రాసుందో ఆ పిల్లకి..” అంటూ అక్కయ్య చెప్పిన మాటలకి జాలేసింది సుధాకర్ కి. ఇక శ్యామల ఫోటో కోసం మావయ్య దగ్గరకొచ్చిందని తెలిసికొని అక్కయ్య పిల్లలు ఫకాల్న నవ్వేరు.  “ఆ!  దాని మొహానికి ఫొటో ఒకటే తక్కువ!” అంది అక్కయ్య కంచాలెత్తుతూ. 

          మర్నాడు మామిడితోటలో సుధాకర్ని కలిసిన అనూ , “అయితే బావా! శ్యామల నిన్ను ఫోటో తియ్యమని అడిగిందా?” అంది నవ్వాపుకుంటూ.  ఆమె వెనకాలున్న స్నేహ బృందం ఆశ్చర్యం ప్రకటించారు.  అంతమంది ఆడపిల్లలు తనని అలా చూసేసరికి సుధాకర్ రెచ్చిపోయి,  ఆ సంఘటనని వివరిస్తూ వాళ్ళని తెగ నవ్వించాడు. ఇంక అనూరాధ ఆ మర్నాడు శ్యామలని  ప్రత్యేకంగా పిలిచి కూచోబెట్టి, “మా బావ నిన్ను ఫోటో తీస్తానన్నాడటగా…” అంటూ మొదలుపెట్టి, శ్యామలని వాగించి, వాగించి స్నేహితురాళ్ళతో కలిసి ఆనందించింది. ఆ తర్వాత తోటలో సుధాకర్ని కలిసి,  “బావోయ్..! నీకో విషయం తెలుసా? నీకొక ఆరాధకురాలుంది ఈ ఊళ్ళో….” అంటూ ఫక్కుమని నవ్వింది.  “ఎవరబ్బా..!” అని ఆలోచిస్తూ మెల్లగా  ” నువ్వా?” అన్నాడు కొంటెగా సుధాకర్. “ఆశ..! నిన్నెవరు నమ్మార్లే? నవ్వులాట కాదు… నిజం!  ఎవరో తెలుసా? ఊర్వశి శ్యామల!” అంది అనూ.  ఉలిక్కిపడ్డాడు సుధాకర్. “అవును బావా! మేము నిన్ను గురించి ఉన్నవీ లేనివీ కల్పించి బాగా నమ్మేట్టు చెప్పేశాం.  పిచ్చిది కదా..! నిజం అనుకుంది. ఇంక చూడు… నువ్వు రోజూ తననే చూస్తున్నావట! అసలు నువ్వే ఫోటో తీస్తాను శ్యామలా అని అడిగావట. తెగ చెప్పింది. నిజమా బావా?” అంది అనూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ. “ఛా.. నోర్ముయ్.  అసలు ఆ అమ్మాయితో నేను..”  అని అతను అంటుండగా, “నాకు తెలుసులే బావా..నిన్ను ఆట పట్టిద్దామని అన్నాను. జరిగింది మాకు తెలుసుగా…దాని మాటలు వినివిని ఒళ్ళు మండి, పూజారిగారి రాధ– శ్యామల నిన్ను ఫోటో తీయమని అడిగిన ఫార్సంతా నువ్వు నిన్న వర్ణించిన భాషలోనే దానికి చెప్పాం. ఇంక చూడు….దాని నల్లటి మొహం మరీ మాడిపోయింది! అక్కడినుంచీ పారిపోయిందనుకో! ” అంది అనూ. విషయం విన్న సుధాకర్ మనస్సు ఎందుకో కలుక్కుమంది.  ‘పాపం ఏమనుకుందో..? పిచ్చిపిల్ల! తన గొప్ప ఉందని తృప్తి పరచుకోడానికి ఊహించుకున్న ఊహాలన్నీ అమాయకంగా బయటికి చెప్పేసింది కాబోలు ‘ అనుకున్నాడు. “అసలా పిల్లకి ఎన్నెళ్లుంటాయి అనూ…? నాలుగడుగులు కూడా ఉండదు” అన్నాడు సుధాకర్. “నా వయసే బావా…పద్దెనిమిది సంవత్సరాలు” అంది అనూ. 

         తరువాత రోజు మధ్యాహ్నం భోజనం చేసి,  ముందురోజు సగం చదివిన నవల తెచ్చుకుందామని సుధాకర్ మేడ మీదకు వెళ్ళేడు.  అవతలి మేడమీద ఎర్రటి ఎండలో , గోడకానుకుని కూర్చుని మోకాళ్ళలో తల దాచుకుని ఏడుస్తోంది శ్యామల.  ఆశ్చర్యపోయి , “శ్యామలా!” అని పిలిచాడతను. తలెత్తి చూసి, “మీరా..? పొండి! నాతో మాట్లాడకండి” అంది బెక్కుతూ. “ఏం.. ఎందుకని? ఏమైందీ?” మెల్లిగా అడిగాడు. అతనికి తెలియకుండానే అతని గొంతు మృదువుగా మారిపోయింది.  కాసేపు బ్రతిమాలించుకుని అసలు విషయం చెప్పింది శ్యామల.  “నిన్న అనూ, దాని స్నేహితురాళ్ళు నన్ను గుళ్ళో ఎలా ఏడిపించారో తెలుసా?  మీరు నాగురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేరట కదా!  నేను ఫొటో తీయించుకుంటానని దానికెందుకు చెప్పేరు?  ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పాల్సింది.  మా అమ్మ ‘ సిగ్గులేనిదానా….నీ మొహానికి ఫొటో ఒకటే తక్కువ.  సిగ్గూ ఎగ్గూ లేకుండా పరాయి మొగాడ్ని అడుగుతావా?’ అని కొట్టింది.  నేను ఫోటోకి అంత పనికిరాని దాన్నా?” అంటూ దుఃఖంతో అడుగుతున్న ఆ పిల్లని చూడగానే అతనికి ఆ అమ్మాయి అందవికారం కానీ, బొంగురుగొంతు కానీ కనపడలేదు. గుండె తరుక్కుపోయింది. వెంటనే” ఛీ! ఛీ.. అదేంలేదు శ్యామలా! అలా ఎవరన్నారు?  ఇంకా ఇవాళ నువ్వు ఫోటో తీయించుకోడానికి రెడీ అవుతావనుకుంటున్నాను.  వాళ్ల మొహం… వాళ్ల మాటలు పట్టించుకోకు. రేపు నీ ఫోటో చూడు…ఎంత బాగుంటుందో” అన్నాడు. శ్యామల నమ్మనట్టుగా తలెత్తి చూసింది.  ” నిజం! సాయంత్రం మరి రెడీగా ఉంటావా? పోయి మొహం కడుక్కుని అన్నం తిను.. వెళ్లు” సుధాకర్ మళ్ళీ అన్నాడు  అనునయంగా.  మెల్లగా లేచి, పరికిణీతో ముఖం తుడుచుకుని వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోయింది శ్యామల. ఆమె వెళ్ళిపోయాకా సుధాకర్ మేడదిగి వెళ్తూ , ” అక్కరలేని జంజాటం కానీ పెట్టుకోలేదు కదా” అనుకున్నాడు. 

  ఆ సాయంత్రం ” ఏవండోయ్..” అంటూ వచ్చింది శ్యామల. ఉలిక్కిపడి లేచాడు సుధాకర్. ” నేనేనండీ! మా ఇంట్లో అందరూ పనుల్లో ఉన్నారు.  ఇక్కడ మీ అక్కా వాళ్ళూ మామయ్యగారింటికి వెళ్ళేరు. మరి నేను తయారవ్వనా? నా ఫోటో తీస్తారా?” అంది. ఆ గొంతులో ఆశ, ఆ వికృతమైన ఆకారం  చూసి ఏమీ అనలేక “ఊ..” అని ‘ఖర్మరా బాబూ’ అనుకుంటూ కెమేరా తీసుకునిమేడెక్కాడు సుధాకర్. అంత ఖరీదైన కలర్ ఫిల్మ్ శ్యామల మీద దండగ చెయ్యడం అతనికి ఏమాత్రమూ ఇష్టం లేదు.  ‘ ఊరికే క్లిక్ మనిపిస్తే సరి! నమ్మేస్తుంది…. పిచ్చిది’ అనుకున్నాడు.  ఆ ఫోటో తీసేదాకా అనూ బృందం రాకుండా చూడమని దేముడ్ని ప్రార్థించాడు.

    శ్యామల వచ్చింది. ఆమె అలంకరణని చూసి సుధాకర్ అవాక్కయ్యాడు.  ముదురు ఎరుపు రంగు పరికిణీ,  కనకాంబరం రంగు ఓణీ, లూజుగా ఉన్న పట్టు జాకెట్టు…. వాళ్ళమ్మది కాబోలు!  మెళ్ళో పిచ్చి నగలు, చేతికి నానా రంగుల గాజులు,  ముఖానికి అరంగుళం ఎత్తున పౌడరు, కళ్ళు మూసుకుపోయేలా కాటుక. ఎర్రటి అమ్మవారి బొట్టు!” బావున్నానా అండీ?” అంటూ నవ్వేసరికి, సుధాకర్ కి కెమేరా కింద కొట్టి పారిపోవాలనిపించింది.  “ఏం… మాట్లాడరేం?… బాగాలేనాండీ…ఫోటో తీయరా?” అంది జాలిగా.సుధాకర్ కి మధ్యాహ్నం ఏడుస్తున్న శ్యామల గుర్తుకొచ్చింది. సుధాకర్ అటూ ఇటూ చూశాడు. “నేనెవరికీ చెప్పను లెండి…ఒట్టు” ఆశగా అంటూన్న శ్యామల గొంతు వినగానే… ” ఛా..ఛా.. అదేంలేదు.  అదిగో ఆ పిట్టగోడనానుకుని నించో..” అని తనకి తోచిన ఐడియా చెప్పి ఫోటో తీశాడు సుధాకర్.  ఆ తర్వాత కెమేరాలో రీలు తిప్పుతున్న అతన్ని చూస్తూ…”ఏదండీ ఫొటో!” అంది ఆశగా.”ఇప్పుడే రాదు. మా ఊరు వెళ్ళేకా కడిగించి తరవాత పంపుతాలే. సరే.. నువ్వెళ్లు ఇంక..” అన్నాడు వెనక్కి తిరుగుతూ. అంతలో ” ఏమండీ…” అంది శ్యామల.  అతను ఏమిటన్నట్టు వెనక్కి చూశాడు. ” అందర్నీ ఫొటో తీస్తారు…మీరు తీయించుకోరా?  మీరు ఆ ఫోటోలో ఎంత అందంగా ఉంటారో తెలుసా!” ఆ మాటలకు అదిరిపోయాడు సుధాకర్. ఇంతవరకూ కెమేరా కొన్న తర్వాత ఫోటోలు తీయించుకునే వాళ్ళే కానీ , తన గురించి ఆలోచించిన వాళ్ళు లేరు. ఏదో చెప్పాలనుకున్నాడు. ఇంతలో “శ్యామలా!” అని ఆమె తల్లి పిలవడంతో ఒక్కసారిగా పరుగెత్తింది. ఆమె పట్టీల చప్పుడు వింటూకాసేపు అలాగే నిలబడి, మెల్లగా కిందకు వచ్చేశాడు సుధాకర్. ఆ తరువాత రెండు రోజులు పోయాకా అక్కయ్య వాళ్ళతోటీ, అనూ వాళ్ళతోటీ కలిసి వనభోజనాలూ వగైరా చేస్తూ సరదాగా గడిపేకా, మూడో రోజు బండెక్కి స్టేషనుకి వెడుతున్న సుధాకర్ కి, కరణంగారి వాకిట్లో తారాడుతున్న శ్యామల నీడ స్పష్టంగా కనిపించింది!

         సుధాకర్ బొంబాయి వెళ్ళి నెల రోజులు గడిచాయి. ఆరోజే ఫోటోలు ప్రింటయి వచ్చాయి. కవరు తీసి చూద్దామనుకుంటూ, ఆ రోజు వచ్చిన పోస్టు ముందు చూశాడు. అనూ దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది..విప్పి చదువుతున్నాడు.  ” బావా! నీకీ సంగతి తెలిసిందా..?కరణంగారి శ్యామల చచ్చిపోయింది!  ఏదో డిఫ్టీరియాట పాపం! ఇరవై నాలుగు గంటల్లో ప్రాణం పోయింది. అది పోయినందుకు వాళ్ళింట్లో ఎవరికీ విచారం లేదనుకో… అన్నట్టు పోయేముందు నన్ను పిలిచి, ” మీ బావను నా ఫొటో అడుగు” అని రాసి చూపించింది. దానికి నువ్వు ఫోటో తీశావా? మాకెవరికీ చెప్పలేదేం బావా? పాపం అమాయకురాలు…” ఇలా సాగిపోయింది ఆ ఉత్తరం. ఆ ఉత్తరం చూడగానే అతనికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఫొటోల కవరు విప్పి ఒక్కొక్కటీ చూడసాగాడు.  చూస్తూ, శ్యామల ఫోటో దగ్గర ఆగిపోయాడు.  చాలా క్లియర్ గా వచ్చింది ఆ ఫోటో.  “ఏమండీ..నా ఫొటో బాగుందా?” అని ఎవరో అడిగినట్టు అనిపించిందతనికి. అలా ఆ ఫోటో చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు.

        కొన్నాళ్ళు గడిచాయి. అది ఒక ఫోటో ఎగ్జిబిషన్!  అక్కడ కొద్ది దూరంలో ఒక స్తంభానికి ఆనుకుని చేతులు కట్టుకుని నిలబడి , అక్కడివాళ్ళ మాటలు వింటున్నాడు సుధాకర్. “ఇంత అందవికారమైన అమ్మాయి ఫోటోకి  ప్రైజ్ ఎలా వచ్చిందా అని చూస్తున్నావా?  ఆ ఫోటో పరిశీలించి చూడు.  అందులో ఏం కనబడుతోంది?– లైఫ్…. జీవితం!  జీవితం మీద ఆశ!  ఆ అలంకరణ , ఆ శ్రద్ధ చూడు….అదొక విచిత్రమైన అనుభూతి.  ఆ కళ్ళు…..ముఖ్యంగా ఆ కళ్ళు చూడు.  ఎంత స్త్రీత్వం?  వాటి నిండా ఎంత కోరిక?  ఎంతో ఇష్టమైన వ్యక్తినెవర్నో  ఎంత ఆరాధనతో చూస్తోందో చూడు ఆ పిల్ల! అందుకే అన్నారు  ‘ కెమేరా ఐ’ అని”.  అన్నాడు ఒకాయన. ” అవును..జీవితంలో మామూలుగా ఉండే వాటిని కెమేరా అద్భుతంగా కనిపెడుతుంది.  ఏం ఫోటో అండీ!  ఊరికే ఇచ్చారుటండీ..బహుమతి?!” అంటూ రెండో అతను వ్యాఖ్యానించాడు.ఆ మాటలు వింటూ,  తదేకంగా ఆ శ్యామల ఫోటో వంకే చూస్తూ ఉండిపోయాడు సుధాకర్.

                                           ———-*****———-

        ఈవేళ సాంకేతికత విపరీతంగా అభివృద్ధిచెంది  ఫోటోలు తీయడము, తీసుకోవడమూ మంచినీళ్లు తాగడం అంత సులువైపోయింది. ఇక సెల్ ఫోన్లు వచ్చేసేకా సెల్ఫీలు గట్రా తీసుకోవడం సాధారణమైపోయి కెమేరాలు కూడా తమ గొప్పతనాన్ని కోల్పోయాయి కానీ…… ఒకానొక కాలంలో కెమేరా ఉన్నవాడు..రాజాధిరాజు!  భుజాన కెమేరా వేలాడదీసుకున్న అతన్ని ఒక హీరోలా చూసేవారు.  కొంతమంది ఫోటోగ్రఫీని ఒక గొప్ప హాబీగా చేసుకునేవారు.  చాలా పట్టణాలలో ‘ఫోటో ఎగ్జిబిషన్’ ఒక ఉత్సవంలా జరిగేది.  డబ్బా కెమేరా దగ్గర్నుంచి , యాషికా కెమేరా వరకూ అన్ని కెమేరాలకూ గొప్ప క్రేజ్ ఉండేది.  వాటిద్వారా ఫోటోలు  తీయించుకోవడానికి జనం మహసరదా పడిపోయేవారు.  తీసిన ఫోటో మళ్ళీ డెవలప్ చేసి చూపిస్తాడో లేదో కూడా  వాళ్ళకి తెలియదు. కొందరు ఈ గోల నుంచి బయటపడడానికి కెమేరా క్లిక్ కనిపించడం లేదా ఫ్లాష్ నొక్కడం వంటి మాయ చేసేవారు కూడాను.   

        కెమెరాకు అంతటి గ్లామరున్న కాలంలో, సుధాకర్ లాంటి అందమైన యువకుడు వేలాది రూపాయలు ఖర్చుపెట్టి ఒక కెమేరా కొని,  దాన్ని ఒక పల్లెటూరు తీసుకెళ్ళి , ఫోటోలు తీయడంలో అక్కడ పొందిన ఒక గొప్ప అనుభవాన్ని హృదయానికి హత్తుకునేలా రాశారు శ్రీమతి జలంధర.  

ఈ కథలో శ్యామల తెలివి తక్కువది కాదు.  మాయామర్మం, కల్లాకపటం తెలియని ఒక ముగ్ధ.  కాకపోతే  ఆ మర్మాలూ, కపటాలూ తెలిసిఉండడమే  తెలివితేటలు అనుకునే ఈ సమాజంలో–అవి లేని అమాయకురాలు.  తన బాహ్యరూపాన్ని, అందవిహీనతనీ ఇంట్లోవాళ్ళూ, వీధిలోవాళ్ళూ కూడా గేలి చేస్తూంటే… ఆత్మన్యూనతా భావంతో అలిసిపోయిన పిల్ల!  తనూ అందరిలాంటిదేనని , తనకీ ఫోటో  తీయించుకోవాలనుంటుందని సుధాకర్ కి  చెప్పిన ఆమె హృదయం ఎంత నిష్కల్మషమైనది? అందరికీ ఫోటోలు తీస్తావు…మరి నువ్వు కూడా తీయించుకో అని మనసు పెట్టి మాట్లాడగలిగిన ఆమె — సుధాకర్ ఆలోచనల్ని తల్లకిందులు చేసేసింది. 

       సుధాకర్ మంచి మనసున్న మనిషే కానీ…. అతని మంచితనం కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. శ్యామలతో మాట్లాడితే మరదలూ, ఆమె స్నేహబృందం ఏమనుకుంటారో అని అతనికి భయం. అందుకే ఆమె దగ్గర ఉన్నంతసేపూ ఇబ్బందిగా ఉండేవాడు. ” నా ఫోటో తీసినట్టు ఎవరికీ చెప్పనులే” అని శ్యామల అన్న మాట అతన్ని తట్టి కుదిపింది. ఫోటో తీసినట్టు నటిద్దామనుకున్న అతను నిజంగానే ఫోటో తీశాడు… పుట్టి బుద్ధి ఎరిగాకా, సుధాకర్ మాట్లాడినంత ఆప్యాయంగా శ్యామలతో ఎవరూ మాట్లాడలేదు.  దానికి ఆమె కరిగిపోయింది. ఒక స్త్రీగా తన కృతజ్ఞతాపూర్వక స్నేహభావాన్ని ఆమె కళ్ళల్లో ప్రతిబింబించింది.  అందుకే అతను వెళ్లే రోజున  ఆమె నీడ వాకిట్లో తారాడింది. ఆ నిజాన్ని అతను గుర్తించాడు.  ఆ ఫోటోలో ఉన్న జీవం, ఆమె కళ్ళల్లో నింపుకున్న ఆశ అతను చూడగలిగాడు.  అందుకే దాన్ని ఎగ్జిబిషన్ లో పెట్టాడు.  ఆ ఫోటోయే అతనికి ప్రైజ్ , కీర్తి తెచ్చిపెట్టింది.

–సి. యస్

One Comment Add yours

  1. DLSastry says:

    Very good story…heart touching..in those days photography was an expensive hobby…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s